Menu Close
Radhika Nori
రాధికారుచిరం
రాధిక నోరి

మౌనం

శరీరం అలిసిపోతే విశ్రాంతి తీసుకుంటే ఆ అలసట తీరుతుంది. అవునా? మరి మనసు? మెదడు? అవి అలిసిపోతే? వాటికి విశ్రాంతి ఎలా వస్తుంది? అసలు వాటికి విశ్రాంతి కావాలా? ఎందుకు వద్దు? మనసు కూడా శరీరం లాగానే కదా! మరి విశ్రాంతి అవసరం శరీరానికి వున్నప్పుడు మనసుకి, మెదడుకి కూడా ఎందుకు వుండదు? తప్పకుండా వుంటుంది. అవునా? అయితే మరి ఈ విశ్రాంతి వాటికి ఎలా లభ్యం అవుతాయి?

ఇంకెలా? మౌనంతోనే కదా!
అవునా? మౌనంతోనా?
అవును, మౌనంతోనే!

మరి అందుకే కదా, మనసుని సేదదీర్చే, అంటే relax చేసే సంగీతం కంటే కూడా రెండు నిముషాల మౌనం ఎక్కువ విశ్రాంతిని ఇస్తుందని గుండెకు సంబంధించిన ఒక మెడికల్ జర్నల్ లో రీసర్చ్ ఫలితాలను ప్రచురించారు! అంతేకాదు, జర్మనీకి సంబంధించిన Imke Kirste అనే ఒక జీవశాస్త్రవేత్త, అంటే Biologist, మెదడు మీద శబ్దాల ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశం మీద అనేక ప్రయోగాలు చేసి, దినానికి ఒక్క రెండు గంటలపాటు మౌనం వహిస్తే దాని వలన మెదడులో మన జ్ఞాపక శక్తిని ఎక్కువ చేసే అనేక కొత్త కణాలు, అంటే cells పుట్టుకొస్తాయని తీర్మానించారు.

అనేక అంతులేని హోరులతో నిండివున్న ఈనాటి ప్రపంచంలో మౌనం దొరకటం అన్నది ఇంచుమించు అసాధ్యమైన విషయమే! అందుకే నార్వే కి సంబంధించిన Erding Kagge అనే ఒక తత్వవేత్త, అంటే Philosopher, మనందరం అంతులేని అనేక శబ్దాల హోరు, గోలల యుగంలో బతుకుతున్నాం, మౌనమన్నది ఇంచుమించు అదృశ్యమైపోయింది అని, పాపం, వాపోయారు.

అయితే అసలు మాటలే లేని ఈ మౌనానికి అంత ప్రాధాన్యతని మనం ఎందుకు ఇవ్వాలి? శబ్దరహితమైన ఆ మౌనం లేకపోతే ఏమవుతుంది? సృష్టి ఆగిపోతుందా? లేక ఆ ఆకాశం విరిగి మనమీద విరుచుకుపడుతుందా? ఏమి అపాయం ముంచుకు వస్తుంది?

కొంతమంది విజ్ఞానవేత్తలు, రచయితలు, కవులు లాంటి గొప్పవాళ్ళు మౌనంలో ఏమి అపాయం లేదన్నారు. అసలు ఆమాటకొస్తే ఒక్కొక్కసారి మౌనం మౌనమే కాదన్నారు. మాటలలో అర్థాలు వెదకవద్దని, మౌనంలోనే అవన్నీ దొరుకుతాయని Samuel Beckett అనే Ireland కు చెందిన ఒక రచయిత, కవి అన్నారు. అసలు మౌనాన్ని అర్థం చేసుకోలేనివారు మాటల్ని కూడా అర్థం చేసుకోలేరు అని Elbert Hubbard అనే ఒక అమెరికన్ రచయిత అన్నారు. ఒక భక్తుడి మౌనం అందరికీ వినిపించేలాగా పెద్ద గొంతుతో చేసే ఒక ప్రార్థన లాంటిది అని స్వామి వివేకానంద అన్నారు. Thomas Keating అనే ఇంకో అమెరికన్ రచయిత అయితే వీళ్ళందరి కంటే ఇంకో రెండాకులు ఎక్కువ చదివాడనుకుంటాను. ఆయనేమన్నాడంటే, అసలు మౌనమన్నది ఆ భగవంతుని 1st language అట, దాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు ముందు మనం మౌనంగా వుండాలట.

బాగుంది వీళ్ళందరి వరస. అయితే ఇంతమంది మేధావులు మౌనం గురించి ఇంత గొప్పగా చెపుతున్నారంటే ఖచ్చితంగా అదేదో చాలా మంచి విషయమే అయి వుండాలి అనిపిస్తోంది. అవునా?

అసలు వాళ్ళు, వీళ్ళు అన్నారని కాదు కానీ ఆలోచిస్తే నాకు కూడా మౌనం చాలా మంచిదనిపిస్తోంది సుమా! ఎందుకంటే ప్రతి పనికీ కూడా కొన్ని నియమాలు వుంటాయి. ఉదాహరణకి, పరీక్షలకి చదువుకోవాలనుకుంటున్నామనుకోండి. పక్కమీద పడుకునో, లేక recliner లో వాలో చదవటం మొదలెడితే ఎలా వుంటుంది? లేక చక్కగా ఒక కుర్చీలో తిన్నగా కూర్చుని చదివితే ఎలా వుంటుంది? అలాగే ఏదన్నా సీరియస్ గా నేర్చుకోవాలనుకుంటే గోల, గడబిడలలో కాకుండా నిశ్శబ్దం, మౌనంలో నేర్చుకుని, అభ్యాసం చేస్తే బాగుంటుంది కదూ! మనకి ఏకాగ్రత చక్కగా కుదురుతుంది. చదివింది బుర్రలోకి కూడా ఎక్కుతుంది. ఎందుకంటే ఏకాగ్రతకి చుట్టూ మౌనంగా వుండే పరిసరాలు చాలా అవసరం.

Tom Ford అనే ఒక అమెరికన్ చలనచిత్ర దర్శకుడు ఏమన్నారంటే సమయం, మౌనం ఈ రెండూ కూడా ఈ రోజుల్లో విలాసపూరితమైన వస్తువులైపోయాయట, అంటే luxuries అన్నమాట. మరి రకరకాల శబ్దాల హోరులలో పూర్తిగా మునిగిపోయిన ఈ యుగంలో మనల్ని మనం పరిరక్షించుకోవాలనుకున్నా, మన అంతర్గత శక్తిని పెంచుకోవాలనుకున్నా, అసలు మన ఉనికిని కొనసాగించాలనుకున్నా, కాస్తైనా మౌనం మనందరికీ చాలా అవసరం. అనుక్షణం రంగులు మార్చే ఈ ప్రపంచాన్ని దూరం నుంచైనా సరే, సరిగ్గా గమనించాలన్నా, అంచనా వేయాలన్నా కూడా మౌనం మనందరికీ చాలా అవసరం. ఒక్క ప్రపంచమే కాదు, అసలు మనల్ని మనం తెలుసుకోవాలన్నా, మన అంతరంగాల అగాధాల్లోకి సునిశితంగా తొంగి చూడాలన్నా కూడా మనకి మౌనం సహాయాన్ని తీసుకోక తప్పదు. అలా సునిశితంగా ఆత్మపరిశీలన చేసుకోగలిగినప్పుడే ఆత్మనిర్ధారణ సాధ్యం. అప్పుడే స్వీయసవరణ కూడా సాధ్యం. అంటే వీటన్నిటికీ మూలకారణం మౌనమేనన్నమాట. అవునా?

మనం మనంగా ఎదగడంతో పాటు ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకుని వారిపట్ల సరైన అవగాహన పెంచుకోవటానికి ఈ మౌనమొక సహాయక పరికరం లాగా పని చేస్తుంది. అంటే, తగినంత సమయం తీసుకుని ఎదుటివారి అంతరాంతరాల లోతులలోకి గాఢంగా దిగి అక్కడ శాశ్వతంగా తిష్ఠ వేయటానికి మౌనం సరైన నిచ్చెన. ఏ బంధానికైనా ఈ పరస్పర అవగాహనే కదా పునాది. మరి ఆ పునాదికి వేయాల్సిన మొట్టమొదటి రాయి ఈ మౌనం. ఎందుకంటే ఈ మౌనంలోనే మనం ఎదుటివారు చెప్పేదంతా సరిగ్గా, నెమ్మదిగా, ఆసాంతం వింటాం. ఆ తర్వాత అదే మౌనంలో ఆ విన్నదాన్ని బాగా ఆకళింపు చేసుకుంటాం. దానివలన ఇరువైపులా అవగాహన పెరిగి వారి తీపి బంధాలు ఇంకా గట్టిపడతాయి. అందుకే కాబోలు, Marcus Tullius Cicero అనే ఒక రోమన్ తత్వవేత్త, విజ్ఞానవేత్త, వక్త, మౌనం అన్నది సంభాషణకు అసలైన అలంకారం అన్నాడు. ఏదన్నా interview జరిగేటప్పుడు చూడండి, interview చేసేవారు, చేయబడేవారు కూడా మధ్యమధ్యలో కొన్నిసెకన్ల పాటు మౌనం వహిస్తూవుంటారు. ఇది ఎదుటివారికి ఏదన్నా ప్రశ్నలు అడగటానికి కానీ, లేక సమాధానం ఇవ్వటానికి కానీ అవకాశమివ్వటానికి కావచ్చు. అలాగే వారి సమాధానాలను పూర్తిగా అర్థం చేసుకోవటానికి కొంత విరామం కావచ్చు. అలాగే  ఏదన్నా సమస్యా పరిష్కారాల కోసం ఏవన్నా చర్చలు జరుపుతున్నప్పుడు కూడా ఈ మౌనం, సంయమనం చాలా అవసరం. లేకపోతే ఆ చర్చలు భంగమయే దురవకాశంతో పాటు కొత్త సమస్యలు పుట్టుకొచ్చే అపాయాలు కూడా వున్నాయి. ఎందుకంటే ఇలాంటి చర్చలలో ప్రతిస్పందన, అంటే reaction కంటే ప్రత్యుత్తరం, అంటే response ముఖ్యం. ఇది మౌనం, ఆత్మసంయమనం తో మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఒక్కొక్కసారి మాటలు చేయలేని గొప్ప పనులు మౌనాలు చేస్తాయి.అందుకే Leo Tzu అనే చైనాకు సంబంధించిన ఒక తత్వవేత్త. ప్రతిచర్యలు, అంటే actions కంటే స్తబ్దత, అంటే stillness మంచిదని, అలాగే మాటల కంటే మౌనమే లాభదాయకమని అన్నారు.

ఇద్దరి మధ్య ఏదైనా అసమ్మతి వస్తే ఆ చిట్టిపొట్టి తగవును చిలికి చిలికి గాలివానగా మారకుండా ఈ మౌనమే రక్షిస్తుంది. ఎదుటివారు తాడు తెగేదాకా లాగుతుంటే మనం మౌనంగా దాన్ని అక్కడే వదిలేసామనుకోండి. అప్పుడా తాడు తెగదు. వారి దగ్గరే వుండిపోతుంది. అవునా? అంతేకాదు, అసలు ముందుగా ఆ వాదులాట  తీవ్రతను తగ్గించి ఆ రగులుతున్న వాతావరణాన్ని మౌనం కాస్త చల్లబరుస్తుంది. అంతేకాదు, ఎదుటివారి వాదనలోని గూడార్థాన్ని, అసలు వారి అభిమతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటానికి తగినంత సమయాన్ని, ఓపికని కూడా ఈ మౌనమే వారికి ఇస్తుంది. ఎదుటివారిపై సరైన అవగాహన ఏర్పడటానికి ఇది ఒక మంచి అవకాశం. అంతేకాదు, ఒకరు మౌనంగా వున్నారు అని అంటే దాని అర్థం ఇంకొకరికి మాట్లాడటానికి ఎక్కువ అవకాశం, సమయం ఇస్తున్నారనే కదా!

దానితో పాటుగా మౌనం ఆత్మపరిశీలనకి కూడా మనకి మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఏకాగ్రత, అవగాహనలతో మన మనసు అట్టడుగుల్లోకి మనం తొంగి చూసుకుని మన వ్యక్తిగత అభివృద్ధికి మన మనసులను, మెదడులను కొత్త ఇంధనాలతో మళ్ళీ నింపుకోగల అపురూపమైన సదవకాశాన్ని ఈ మౌనమే మనకి ఇస్తుంది. Steven Aitchison అనే ఒక స్కాటిష్ రచయిత, కవి ఏమన్నాడంటే మౌనం మన అహాన్ని అణచి వుంచుతుందిట, దాని వలన మనం 'నేను, నాది' అన్న అహంభావాన్ని వదిలి, 'నా' ప్రపంచంలోంచి బయటకు వచ్చి మన చుట్టూ వున్న 'ఈ' ప్రపంచాన్ని కాస్తైనా చూస్తామట. ఊపిరి సలపని పనులలో పూర్తిగా మునిగిపోయిన మన బిజీ జీవితాలలో మౌనం మనల్ని మనలతో కలుపుతుంది. అందుకే Tony Cuckson అనే ఇంకో Irish రచయిత ఏమన్నాడంటే మన అంతర్వాణిని వినటానికి మౌనం బాగా సహాయపడుతుందిట. ఇది ఆత్మపరిశీలనకి మొదటి మెట్టు. మనల్ని మనం తెలుసుకొని, మన శక్తులను, బలహీనతలను సరిగ్గా తూకం వేసుకుని, విశ్లేషించుకోవటానికి, మన మీద మనమే నియంత్రణ పొందటానికి మౌనం మంచి అవకాశాన్ని ఇస్తుంది. దీనివలన మన గమ్యాలను మనం నిర్ణయించుకోవటంలోనూ, వాటిల్ని పొందటానికి అనువైన పధకాలను ఎంచుకోవటంలోనూ కూడా ఈ మౌనం మనకు చాలా తోడ్పడుతుంది అని ఆయన అన్నాడు. అందుకే Confucius అనే ఒక Chinese తత్వవేత్త, మౌనం మనలను ఎన్నటికీ వీడని, ఒక నిజమైన స్నేహితుడు అని అన్నారు. మౌనం మన తెలివికి పదును పెట్టె మంచి కత్తి. అందుకే Francis Bacon అనే ఒక ఆంగ్ల సాహితీపరుడు, తత్వవేత్త, మౌనం మన తెలివితేటలను పోషించి, పెంచే మంచి నిద్ర అన్నారు.

Albert Einstein అనే German Physicist, మనందరం అనేక సార్లు విన్నాం కదూ ఈయన పేరు, మహా మేధావి, మౌనం, ఏకాంతం సృజనాత్మక శక్తిని ప్రేరేపిస్తాయని అన్నారు. అంటే, సృజనాత్మక శక్తికి మౌనం ఒక నిలయంలాంటిది అన్నమాట. అందుకే కవులు, రచయితలు, చిత్రకారులు లాంటి అనేక కళాకారులు తమకు ఎటువంటి ఆటంకం కలగకుండా, నిశ్శబ్దంలో, మౌనంలో తమ కళల మీద పని చేస్తారు. అంటే ఒక కళాకారుడికి మౌనం, ఏకాగ్రత మొక్కలకి ఎరువులాంటివి. అవునా? అలాగే విద్యార్థులకు కూడా. ఏకాగ్రత కుదరాలంటే మౌనం, నిశ్శబ్దం చాలా అవసరం. నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు పరీక్షల సమయంలో మా ఇంట్లో రేడియో, టివి ఏవీ నడిచేవి కాదు. ఏ చిన్న విషయమైనా సరే, మా ఏకాగ్రతకి భంగం కలిగించవచ్చు అని మా నాన్నగారు ఆ విషయంలో చాలా strict గా వుండేవారు. సాయంత్రం సమయంలో మాత్రం కాస్సేపు వార్తలు చూసిన తర్వాత మళ్ళీ చదువు మొదలు. పరీక్షలు పూర్తయేదాకా ఇంట్లో ఎక్కడ చూసినా మౌనమే రాజ్యమేలేది. అప్పుడు దాని ప్రభావం మాకు అంతగా తెలీలేదు కానీ ఇప్పుడు తెలుస్తోంది, అప్పటి మౌనం మా పిల్లలందరికీ ఎంత సహాయం చేసిందో!

ఎదుటివారు ఏదైనా కష్టాల్లో వున్నప్పుడు వారి బాధలు మనం ఏమీ తీర్చలేకపోయినా, మౌనంగా వారి చేతిని గట్టిగా పట్టుకున్నా, ప్రేమగా వారిని దగ్గరికి తీసుకున్నా వారికి ఎంతో వుపశమనం కలుగుతుంది. మన మౌనంలోనే వారికి ఎన్నో మాటలు వినిపిస్తాయి. వారి బాధ కొంచెమన్నా తగ్గి, కాస్త మనసు కుదుటపడుతుంది. మన మౌనమే వారికి మన సానుభూతిని, సపోర్టుని ప్రకటిస్తుంది. వారితో మన బంధాలను ఇంకా గట్టిపరుస్తుంది.

ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తాను. వినటానికి నమ్మశక్యంగా వుండదేమో కానీ ఎదుటివారి మీద మన ఆధిపత్యాన్ని చూపాలంటే మౌనాన్ని మించిన పరికరమేదీ లేదు. మాటలతో కానిదాన్ని మౌనంతో సాధించవచ్చును. అందుకే Leonardo Da Vinci అనే ఒక ఇటాలియన్ శిల్పి, చిత్రకారుడు, ఇంజనీర్, మన అధికారాన్ని మౌనం కంటే ఎక్కువగా వేరే  ఏదీ బలపరచలేదు అని అన్నారు. అందుకే చూడండి, కొంచెం తక్కువ మాట్లాడేవారంటే అందరూ జడుస్తారు. ఇంక వారి మౌనాన్ని చూసి నిజంగానే భయపడతారు. దానికి ప్రత్యేకించి కారణమేదీ లేకపోవచ్చు. అలాంటివారు ఏదన్నా అన్నారంటే ఇంక అది శిలాశాసనమే! ఎందుకంటే తాము చెప్పదలచుకున్నది ఒకే ఒక్కసారి చెప్పేసి మళ్ళీ వారు తమ మౌనముద్రలోకి వెళ్ళిపోతారు. ఇంక అలాంటివారితో లేదు, కాదు అని ఏం వాదించగలం? వాదించటం మాట దేవుడెరుగు, అసలు ఏదన్నా ఎదురు చెప్పే అవకాశం అన్నా ఎక్కడ? ఏం చెప్పాలన్నా, ఏం చెయ్యాలన్నా కాస్త సందన్నా ఏమన్నా వారు ఇస్తే కదా! అంటే ఏమిటి? తమ మౌనంతో తమ మాటని ఒక శిలాశాసనంలాగా వారు చేసేశారనే కదా దాని అర్థం? అందుకే అన్నాను, ఒక్కొక్కసారి మాటలకంటే మౌనమే శక్తివంతమైనది అని. అందుకే Martin Luther King Jr. మనకి చివరలో మన శత్రువుల మాటలు గుర్తుండవు, కానీ మన మిత్రుల మౌనం మాత్రం గుర్తుండిపోతుంది అని అన్నారు.

అలాగే ఒక్కొక్కసారి మౌనం వలన ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభిస్తుంది. అందుకే మౌనం ఇచ్చే ఇంకో బహుమతి ప్రత్యేకమైన గుర్తింపు అని చెప్పచ్చు. మీరు గమనించారో లేదో కానీ కొన్ని కొన్ని సినిమాల్లో credits చూపిస్తున్నపుడు చివరగా దర్శకుడి పేరు చూపించేటప్పుడు వెనకాల ఎటువంటి music లేకుండా పూర్తి మౌనంలో చూపిస్తారు. దీనివలన ఎటువంటివారికైనా వారి దృష్టి దానిమీద పడక మానదు. ఏమరిపాటుగా వున్నవారు కూడా  హఠాత్తుగా అంతా నిశ్శబ్దం అయిపోయేసరికి వులిక్కిపడి శ్రద్ధగా చూస్తారు, వింటారు. అలాగే సంభాషణల మధ్యలో కూడా కొంచెం విరామం కోసం, కాస్త వూపిరి తీసుకోవటం కోసం, గుట్టుచప్పుడు కాకుండా మన లేక ఎదుటివారి మాటల పునరావలోచనం కోసం, దేనికైనాసరే, మౌనాన్ని వాడుకోవచ్చు.

ఎప్పుడైనా ఎవరైనా అర్థం, పర్థం లేకుండా మొండిగా వాదిస్తున్నపుడు కూడా మాటలతో కాదు, మౌనంతో వారిని జయించవచ్చు. అందుకే మూర్ఖపు ప్రశ్నలకు మౌనమే మంచి సమాధానం అన్నారు కదూ! మౌనం మన బలహీనత కాదు, ఒక బలమైన శక్తి అని ఒక మేధావి అన్నారు. అంతేకాదు, మౌనం మన తెలివిని బాగా బిగ్గరగా చెపుతుంది అని కూడా అన్నారు. మూర్ఖుడు తన పిచ్చి వాగుడుతోనూ, తెలివైనవాడు తన మౌనంతోనూ గుర్తింపబడతారు అని Pythagoras అనే గ్రీకు తత్వవేత్త, గణితశాస్త్ర నిపుణుడు అన్నాడు. అందుకే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నమాట. అంతేకాదు, వినటానికి కొంచెం కటువుగా వుందేమో కానీ, ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తే మూర్ఖుడు కూడా తెలివైనవాడుగా గుర్తింపబడటానికి చాలా అవకాశం వుంది కాబోలు.

ఇలాగే మౌనం వలన కలిగే లాభాలు అనేకం. అసలు ఎలాంటి సృజనాత్మక శక్తి అయినా సరే, ఏ కొత్తదనాన్నయినా సరే, ఏకాగ్రతతో సృష్టించాలంటే మౌనం తల్లిలాగా తన ఒడినిస్తుంది. అలాగే మన స్వీయ శక్తిని గుర్తించి, మన లోపలి ఆరాటాన్ని ఇంధనంగా మళ్ళీ మార్చటానికి కూడా ఈ మౌనమే తోడ్పడుతుంది. వ్యక్తిగత విజయాలకు, meditation లకు అంతర్జాలంలో మార్గదర్శనమిచ్చే Steven Aitchison అనే ఒక Scottish మేధావి ఏమన్నారంటే మౌనంగా వున్నప్పుడు మన అహం కొంచెం అణగబడి వుంటుందిట. అప్పుడు మన చుట్టూ వున్న ప్రపంచాన్ని చూడటానికి, చూసి కొంచెమన్నా సరే, ఏదైనా నేర్చుకోవటానికి కాస్త ఆస్కారం వుంటుందిట.Tony Cuckson అనే ఇంకో Irish రచయిత మన స్వీయశక్తులను గుర్తించటానికి, వాటితో సరైన అవగాహన ఏర్పరుచుకోవటానికి మౌనం చాలా సహాయపడుతుంది అని అన్నారు. దీనికి తోడు మౌనం మన శరీరానికి, మనసుకి, మెదడుకి విశ్రాంతిని ఇస్తుంది. ఆ సమయంలో మనకు కావాల్సినవన్నీ మనం నేర్చుకోవచ్చు. అలాగే మనసులోని అలజడులను, అతి  భయాలను కూడా  తగ్గిస్తుంది. కానీ ఇవన్నీ పొందాలంటే మరి మనం ప్రతిరోజూ మౌనానికి కాస్తయినా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే బయటి ప్రపంచంలోని శబ్దాల మీద మన నియంత్రణ లేదు. కానీ మన వ్యక్తిగత మౌనం మీద మనకి పూర్తిగా నియంత్రణ వుంది. అవునా?

అప్పుడప్పుడు మౌనాన్ని మనం స్తబ్దత, అంటే passivity గా, అసాధారణం, అంటే abnormal గా, అసాంఘికం, అంటే anti-social గా, రసహీనం, అంటే boring గా, అపాయకరంగా కూడా అంచనా వేస్తాం. దానికి భయపడతాం కూడా. అందుకే అవసరం వున్నా, లేకపోయినా మౌనాన్ని అర్థం, పర్థం లేని హోరులతో కప్పటానికి ప్రయత్నం చేస్తాం. అందుకే కదా మనుషులు వున్నా, లేకపోయినా కూడా ఇళ్ళల్లో TV లు మోగుతూ వుంటాయి. చెవులు చిల్లులు పడేలాగా రేడియోలు మోగుతూవుంటాయి. అసలు ఇలాంటప్పుడే నిశ్శబ్దంగా వుండే మౌనం బాహ్యాంగా వుండే గోలలన్నింటి నోరు మూసేసి, మన లోపల దాగి వున్న శక్తులను,  స్వీయ ప్రతిబింబాలను, మన భావోద్వేగాలలోని, అంటే emotions లోని స్పష్టతను బాగా బయటకు లాగుతుంది.

ఈ జీవరాసులన్నిటిలోను వాక్కు ఒక్క మనిషి జాతికే ఇచ్చాడు ఆ దేవుడు. కానీ మౌనం కూడా ఆ దేవుడిచ్చిన ఇంకో అతి ముఖ్యమైన వరమే సుమా! కాకపొతే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంత పాళ్ళల్లో వాడాలో మనకి తెలిసివుండాలి. అందుకే పెద్దలు ‘speech is silver, but silence is golden’ అని అన్నారు. అవునా?

అసలు నాకు ఏం అనిపిస్తుందంటే, ఈ పధ్నాలుగు లోకాలలో ఆ ప్రణవ నాదం తొలిసారిగా మారుమ్రోగేముందు అసలు ఆ బంగారు మౌనంలోనే ముందుగా మునిగిందేమో! అవునా?

మరి మీరు నాతొ ఏకీభవిస్తారు కదూ? మీరు ఆలోచిస్తూ వుండండి.. ఈలోపల నేను మీ అందరి దగ్గర నుండి సెలవు తీసుకుంటూ, మళ్ళీ వచ్చే నెల ఇంకో మంచి విషయం గురించి మీతో ముచ్చటించడానికి మళ్ళీ వస్తాను. అంతదాకా సెలవు.

********

Posted in December 2025, వ్యాసాలు

1 Comment

  1. Manonmani Srinivas

    👏👏👏👏👌👌చాలా బాగా చెప్పారు, మౌనం యొక్క ప్రాముఖ్యత, మనకి ఎంత ముఖ్యం & అవసరం అనే అంశాలు బోలెడు references తో బాగా వివరించావు.

    మేధా దక్షిణామూర్తి స్తోత్రంలో స్వామి వారి మౌనం ఎంత ప్రభావమంతమైనదో సూచిస్తూ చెప్పే ధ్యాన శ్లోకం గుర్తొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *