రాజా రామమోహన్ రాయ్
రాజా రామమోహన్ రాయ్ ఆధునిక భారత సమాజానికి పితామహులు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతీయ సమాజాన్ని సంస్కరించడానికి పూనుకున్న తొలి వైతాళికుడు. సతీసహగమన పిశాచం నుండి భారతీయ మహిళలను విముక్తులను చేసిన మహానుభావుడు. ఈ వ్యాసం యొక్క ఉద్దేశం క్లుప్తంగా వారి గురించి తెలియజేయడమే గాక, ఒక విప్లవానికి/మార్పుకి వ్యతిరేకంగా ప్రతి విప్లవం/చర్య ఎలా జరుగుతుందో ఆంధ్ర దేశంలోని ఓ సంఘటన ఆధారంగా చెప్పడం. అలానే పాలక వర్గాలు తీసుకునే కొన్ని మంచి చర్యల వెనుక కూడా సంకుచిత రాజకీయ కోణాలు ఉంటాయి అని తెలియజెప్పడం.
వంగదేశములో బద్వాన్ జిల్లాలో రఘునాధపురమున మే 22,1772న తారణి రమాకాంతరాయ దంపతులకు రామమోహన్ రాయ్ జన్మించారు. రామమోహన్ రాయ్ బెంగాలీ, సంస్కృతం, అరబ్బీ, పారసీక, ఇంగ్లీషు భాషల్లో ప్రవీణుడు. పదహారేళ్ళ ప్రాయంలో విగ్రహారాధన - పూర్వాచారములను ఖండించుతూ రాసిన ప్రతులను చూసి తండ్రి రామమోహన్ రాయ్ ని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. రామమోహన్ రాయ్ తండ్రి ఆజ్ఞకు జంకక వందల మైల్లు ప్రయాణం చేసి హిమాలయ పర్వత శ్రేణులు దాటి, టిబెట్ చేరి, బౌద్ధ మతాన్ని అధ్యయనం చేశారు. ఇరవైవ ఏట స్వదేశముకు తిరిగి వచ్చారు. మరణించే ముందు తండ్రి ఆస్తి రాసిచ్చినా సనాతన ధర్మాల విషయంపై తల్లితో ఉన్న విబేధాల మూలంగా ఆస్తి తీసుకోక స్వార్జితంపైనే బ్రతికారు.
మత విషయకంగా “ఏకమేవాద్వితీయం” అనగా పరమేశ్వరుడు ఒక్కడే అని నిరూపించడమే రామమోహనుడి ముఖ్య ఉద్దేశం.
1821లో ఆడమ్ అనే ఆంగ్లేయుడితో కలసి కలకత్తా నగరంలో “యునిటేరియన్” అనే సంఘాన్ని స్థాపించారు. బ్రహ్మసమాజం స్థాపించేంత వరకు రామమోహనుడు తననుతాను “హిందూ యునిటేరియన్”గా చెప్పుకునేవారు. అంటే బహుదేవతరాధనను, అవతారాలను విశ్వసించక పరబ్రహ్మమును మానసికోపాసన చేయు హైందవుడని అర్ధము. ఈ సంఘము ఇతరురులెవరి సాయముకు నోచుకోక విఫలమైంది.
“యునిటేరియన్ సంఘము” విఫలమవ్వగానే రామమోహనుడు బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. సహగమన దురాచారాన్ని రూపుమాపడానికి బ్రహ్మసమాజం ప్రత్యేక కార్యక్రమం రూపొందించి ఉద్యమించింది. బ్రహ్మసమాజం కృషి మూలంగా వైస్రాయ్ లార్డ్ బెంటిక్ 1829లో “సహగమన దురాచార నిషేధ” శాసనము చేశాడు.
1830 జనవరి14వ తేదీన సనాతనవాదులు ఎనిమిది వేల మంది కలకత్తా పౌరుల సంతకాలతో “సహగమన దురాచార నిషేధ” శాసనముకు వ్యతిరేకముగా వైస్రాయ్ లార్డ్ బెంటిక్ కు అర్జీ సమర్పించారు. దానికి ప్రతిచర్యగా రామమోహనుడు ఇరవై వేల మంది సంతకాలతో “సహగమన దురాచార నిషేధ” శాసనమును అమలుజేయాల్సిందిగా కోరుతూ వైస్రాయ్ లార్డ్ బెంటిక్ కు అర్జీ సమర్పించారు.
పాశ్చాత్య విజ్ఞానం భారతీయులకు అందాలనే దూరదృష్టితో రామమోహనుడు దేశంలో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడానికి విశేష కృషి చేశారు. ఫలితంగా 1817 జనవరి 26న “హిందూ కళాశాల” స్థాపించబడింది. తరువాత తన సొంత సొమ్ముతో “సురిపర” అనే ఆంగ్లబడిని స్థాపించారు. రామమోహనుడి కృషిని గుర్తించి మొఘలాయ చక్రవర్తి “రాజా” అనే బిరుదునిచ్చాడు.
1830వ సంవత్సరంలో తూర్పు ఇండియా వర్తక సంఘం యొక్క అధికార పత్రం మరికొంత కాలం అమలులో ఉంచడంపై బ్రిటిష్ ప్రభుత్వం పరిశీలిస్తూ ఉన్నది. విధివిధానాల మారబోతున్న ఆ సమయంలో స్వయంగా సహగమన దురాచారముపై అర్జీ సమర్పించుటకు ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లారు రామమోహన్ రాయ్. అక్కడే బ్రిస్టల్ నగరంలో 1833వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన రామమోహనుడు మరణించారు.
రామమోహనుడు మరణించిన పదహారు సంవత్సరాలకు అంటే 1849వ సంవత్సరంలో వెంకటగిరి పట్టణంలో మల్లమ్మ దేవి అనే ఒక స్త్రీ మూర్తి సహగమనం చేసింది. మల్లమ్మదేవి మనులాలాపేట గ్రామంలోని ఓ కర్ణసాలె కుటుంబానికి చెందినది. ఆమెను వెంకటగిరి పట్టణం కాశీపేటలో ఉండే ఇల్లాబత్తుని రంగయ్యకిచ్చి పెండ్లి చేశారు. కాలగమనంలో రంగయ్య సిరిసంపదలు తరిగిపోవడమే గాక అతను క్షయవ్యాధి బారిన పడ్డాడు. మూడేండ్లు ఆ వ్యాధితో పొరాడి మరణించాడు. మల్లమ్మ పతితో పాటు సహగమనానికి సిద్ధపడింది. అన్నదమ్ములు ఎంత చెప్పినా వినలేదు. అప్పటికే సతీసహగమన నిషేధ శాసనం అమలులోకి వచ్చినందున స్థానిక వెంకటగిరి జమీందార్ అనుమతి లేకుండా సహగమనం చేయడానికి వీలులేదని కుమార్‌రాజా మరియు అధికారులు అడ్డుపడ్డారు. ఆ సమయంలో వెంకటగిరి జమీందార్ బంగారు యాచమ నాయుడు కాశీయాత్రకు వెళ్ళి ఉన్నాడు. మల్లమ్మ వెంటనే మాయమై కాశీలో ఉన్న జమీందారు దగ్గరకు వెళ్ళి అనుజ్ఞపత్రము తీసుకుని వచ్చి కుమార్‌రాజాకు చూపించింది. ఇది కనికట్టో, మాయో అని వాళ్ళు నమ్మక ఆమెకు మరో పరీక్ష పెట్టాలని, ఆమెను చనిపోయిన భర్తతో మాట్లాడించగలవా అని అడిగారట. వాళ్ళు అడిగిన విధంగానే ఆమె చనిపోయిన భర్తతో మాట్లాడించిందట. ఆమె పాతివ్రత్య మహిమకు అబ్బురపడి కుమార్‌రాజా సహగమనానికి అనుమతి ఇచ్చారట. ఆమె సహగమనం చేసిన తావులో ఇప్పుడు గుడి వెలసింది. మల్లమ్మ, ఆమె భర్త రంగయ్య రాతి బొమ్మలు పూజలు అందుకుంటున్నాయి.
మన దేశంలో చరిత్రను మతవిశ్వాసాలు, సాంఘిక కట్టుబాట్లు ఏ విధంగా మరుగున పరుస్తాయో చెప్పడానికి మల్లమ్మ కథ ఒక ఉదాహరణ. మల్లమ్మకు మహిమలు ఆపాదించి అసలు జరిగిన కథేమిటో ఎవరికీ తెలియనీకుండా మరుగున పరిచారు. అప్పటి హైందవ సమాజంలోని దురాచారాలను పరిరక్షించడానికి, కొనసాగించడానికే ఇటువంటి ఐతిహ్యాలను అల్లారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆంగ్లేయులు ఇటువంటి దురాచారాలను నిషేధించడం చూసే గురజాడ వంటివారు “కాంగిలేయుల ధర్మరాజ్యం” అని బ్రిటిష్ పాలనను కొనియాడారు. ఇక్కడ మనం మరో కోణం చూడాలి. ఆంగ్లేయులు సతీసహగమనాన్ని నిషేధించినా, వితంతు వివాహ చట్టం చేసినా వారి ఆలోచనల వెనుక ఉన్నది భారతీయ సమాజాన్ని సంస్కరించడం కాదు. భారతీయ మతధర్మాలను నాశనం చేయడం. క్రైస్తవాన్ని ప్రతిష్టించడం. అలా చేయడం వల్ల భారతీయులలో ఉన్న హిందూ జాతీయ భావన తొలగిపోయి, ఆంగ్లేయ పాలన బలపడడం. అలా సంకుచితమైన దృష్టితో చేసిన చర్యల వల్ల అసంకల్పితంగా భారతీయ సమాజానికి కొంత మేలు జరిగింది.
మధ్యయుగపు సామాజిక వాతావరణం పోయి భారతీయ సమాజంలో ఆధునిక భావాలు రావడానికి రామమోహన్‌రాయ్ వారధిగా నిలిచారు అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. మనం వారిని స్మరించుకున్నా, స్మరించుకోకపోయినా వారి స్మృతులు ఆధునిక భారతదేశంలో కలకాలం నిలిచే ఉంటాయి.