Menu Close
Samudraala Harikrishna
అపురూప పరిశోధన!! (కథ)
సముద్రాల హరికృష్ణ

యూనివర్సిటీ ఆడిటోరియం కిక్కిరిసిపోయింది.

ఇది ఒక అపురూపమైన డాక్టరేట్ సిధ్ధాంత గ్రంథం అని పలువురు ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు, అప్పటికే, ఆ సభలో. ఉన్న వాళ్ళలో సగం మందికి పైగా డాక్టరేట్ లే, మిగతా సగమూ, కాబోతున్న డాక్టరేట్లు, వారి విద్యార్థి మిత్రులూ!

సిద్ధాంతగ్రంథ నామమే, కొత్తపుంతలు తొక్కే విధంగా పెట్టారు, ఆ సిధ్ధాంతవ్యాస కర్త, పేరు పొందిన సామ్యవాద భావజాలం ఉన్న సాహితీ స్ఫూర్తి, నిస్సందేహం నిరాఘాటమూర్తి గారు.

"పురాణ వాజ్ఞ్మయంలో సమన్యాయం- ఒక పరిశీలన"!

మొత్తం మీద హిరణ్యాక్ష హిరణ్యకశిపుల దగ్గర నుంచి, రావణకుంభకర్ణాదుల మీదుగా శిశుపాలదంతవక్త్రుల వరకూ కూడా జరిగినది దైత్యకులావమానమే, మోసమే అని తేల్చారని రచయితను తెగ మెచ్చుకున్నారు వక్తలంతా!

అంతా ఆ దేవతా గణాలు, వారికి దన్నుగా విష్ణుమూర్తీ, పట్టపగలు, నిట్టనిలువుగా చేసిన ఛలమే అని, అమాయకులై నష్టపోయింది రాక్షసులే యుగాల పర్యంతం అనీ- ఘంటాపథంగా రచయిత నిరూపించారని వక్కాణించారు.

వ్రాసినవారి సామాజిక దృక్కోణాన్నీ, న్యాయదర్శన దక్షతనూ, పీడిత వర్గాల పట్ల సానుభూతినీ వేయి విధాల పొగిడారు.

పాత కథలకు, ఇది ఒక నూత్న కోణంలో వ్యాఖ్యానావిష్కరణమని, ఇది పరిశోధనారంగంలో కొత్త దారులకు పునాది కార్యక్రమమనీ, పురోగతి సాధించినకొద్దీ, అన్నింటితో పాటు ఈ రంగంలోనూ రావాల్సిన మార్పుకిది నాంది అనీ, పొగడ్తల వర్షం కురిపించారు, ఆ రచయిత ఉబ్బి తబ్బిబ్బయ్యేట్టు!

ఇందులో ఇంకా ఇతర ఘట్టాల ప్రసక్తీ లేకపోలేదు.

అసలు, ఆ క్షీరసాగర మథనానంతరం, అమ్రృతభాండం చేత పట్టుకుని, వయ్యారాలు పోతూ మోహినిగా విష్ణువు చేసిందేమిటీ, వంచన గాక?!

కష్టమేమో ఇద్దరిదీ, అనగా రాక్షసులు, దేవతలూ ఇద్దరిదీ- ఫలం మాత్రం, అయిన వారైన దేవతల కొక్కరికేనా?! ఇదెట్లా న్యాయమౌతుందనీ---

గజేంద్రమోక్షణ ఘట్టంలో, గుట్టుగా పిల్లాజెల్లాతో సంసారం నెట్టుకుస్తున్న ఆ మొసలి ప్రశాంతతను భంగం చేసింది గజరాజు కాదా?! తన సరస్సు, అంటే తన ఇంట్లోకి వచ్చి అల్లకల్లోలం చేస్తే ఎవరైనా ఊరుకుంటారా?! ఏదో ఆత్మరక్షణ కోసం, ఏనుగును నిరోధించింది, ఆ మకరం!

అది న్యాయమా, మదమెక్కి రెచ్చిపోయిన ఏనుగుది న్యాయమా?!

ఎట్లా తీసుకుంటాడు ఆ విష్ణువు- ఆ ఆక్రమణదారుడు గజరాజు పక్షం, నష్టపోయి ప్రతిఘటించిన మొసలిని వదిలి! ఇదెట్లా న్యాయమౌతుందనీ---

అడిగాడు పోన్లే మూడే మూడు అడుగులు, ముద్దొచ్చేట్టున్న కుర్రాడని ఒప్పుకుంటే, వామనుడై వచ్చి త్రివిక్రముడై పెరిగి, అణిచేస్తాడా పాతాళానికి, ఆ బలిచక్రవర్తిని!

పైగా తన శిష్యుడికి హితవు మాట చెప్పిన శుక్రుణ్ణి దర్భతో పొడిచి, ఏకాక్షుణ్ణి చేస్తాడా, దారుణంగా--

ఇదెట్లా న్యాయమౌతుందనీ---

సరే ఏదో తెచ్చాడు సీతాదేవిని, ఎంత మర్యాదగా చూసుకున్నాడు?!

రావణుడు పొరబాటున కూడా దగ్గరకు పోలేదే, ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదే?! ఇంటి వాడైన విభీషణుణ్ణే, లంకారాజ్యం ఎరచూపి, చేరదీసి రావణ నాశనం చేస్తాడా?! ఇదా వీర లక్షణం?! ఇదెట్లా న్యాయమౌతుందనీ---

ఇక భారతంలో ఎన్నెన్ని  ఆసమానతలు, ఎన్నెన్ని అన్యాయాలు?!

ఏకలవ్యుడి కి జరిగింది ఎంతటి వివక్ష? పక్షపాత బుద్ధి అంత ధర్మవిరుద్ధమైన పనికి కూడా పురికొల్పుతుందా, అది కూడా గురు స్థానంలో ఉన్నవాడిని, నలుగురికీ మార్గదర్శనం చేయవలసిన వాడినీ?!

కర్ణుడికి ఎదురైనది నేడు సమాజంలో చూస్తున్న కుల వివక్ష లాంటిదే కద?! ప్రతిభ ఉన్నా వెనుకబడిన కులం వాళ్ళకి అవకాశాలు ఇవ్వదా ఈ సమాజం?!

ఇలా మౌలికమైన ప్రశ్నలు లేవనెత్తారు రచయిత, అందుకు బహుధా ప్రశంసనీయులు అని దాదాపు వక్తలందరూ చెప్పారు.

బాల్యంలోనే ఇక క్రృష్ణుడు చేసినవి ఒకటా రెండా తప్పులూ, అధర్మాలూ?!

నిజానికి శిశుపాలుడికి వంద తప్పులన్నాడే కానీ, తన వెయ్యిన్నొక్క తప్పులు జాబితా ఎప్పుడైనా చూసుకున్నాడా ఆ శ్రీకృష్ణుడు?!

యుద్ధంలో ఎన్ని కుట్రలు, ఎన్ని మోసాలు చేశాడు, చేయించాడు?! భీష్ణవధ, ద్రోణ హత్య, సైంధవ సంహారం, దుర్యోధనుడి తొడలు తెగ్గొట్టించటం- అన్నీ ఈతని ఘనకార్యాలు కావూ? ఈయన పాత్ర లేనిదే, ఈ కుటిల ఆలోచనలు లేనిదే, పాండవులు గెలిచేవారా?! కౌరవులు ఓడేవారా?! మొత్తం తిరగరాయలేదూ వారి జాతకాలను, ఆ మాయావి కృష్ణుడు?! ఇదెట్లా న్యాయమౌతుందనీ---

ఎన్ని ప్రశ్నలు లేవనెత్తారు నిరాఘాటం గారు ఈ సిద్ధాంతం గ్రంథంలో అని, ఆ మేథోనైశిత్యాన్ని ఆకాశానికి ఎత్తుతూ పొగిడారు, అందరూ ఏకకంఠంతో!

చివరగా, ఒక ముసలి రిటైర్డ్ ప్రొఫెసర్ ఖచ్చితాల సాంబమూర్తిట ఆయనెవరో మాత్రం అందరికీ విరుద్ధంగా చెప్పబోయాడు.

ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఆయన పలికిన ఓంకారంలోనే అక్కడ ఉన్న చాలామందికి అపస్వరం వినబడ్డది! తన ఉపన్యాస ఆరంభం లోనే ఆయన,

"మొహమాటం లేకుండా చెపుతున్నాను, ఇప్పటి పీహెచ్ డి లలో చాలా మటుకు ఎత్తిపోతల పథకాలే, ఎక్కడినుంచో దింపుకోళ్ళే! తగినంత పరిశ్రమా చేయట్లేదు, విషయగాఢతా ఉండటం లేదు ఆ రాసిన దాంట్లో! "మనవాడైతే చాలు, వేసెయ్ వీరతాడు", అన్నట్టుంది వ్యవహారం!

ఆ వాక్యాల మర్మం అర్థం అయినవారికి అర్థంమయ్యింది, బుజాలు తడుముకోవలసినవారు మౌనంగా తడిమేసుకున్నారు కూడా!

ఆ సదరు డాక్టరేట్ల మార్గదర్శక ప్రొఫెసర్లు లోపల కుతకుతలాడి పోయారు, "ఇతన్ని ఎవరు అసలు ఆహ్వానించిందీ", అని!

ఆయన అవి ఏవీ పట్టించుకోకుండా సాగిపోయాడు తన ధోరణిలో:

“విమర్శ చేయండి, ఆ కాలపు ధర్మాలు, ఆ నియమాలు, ఆ చట్టాలు ద్రృష్టిలో పెట్టుకుని అప్పుడు మాట్లాడండి. గుడ్డిగా పాతది కాబట్టి, అంతా పనికిరాదనే ధోరణి వద్దు. మీరు తిరిగి రాయవలసిన అవసరం లేదు మన ప్రాచీన గాథలను, వాటిలోని ప్రతీకాత్మకతను పట్టుకోండి, ఆ సందేశం ఆకళింపు చేసుకోండి, ముందుకు నడవండి. అంతే తప్ప ఆయనెవరో మహానుభావుడు ఎన్నడో చెప్పినట్టు "దిద్దకుడయ్య భారతము.... " అనుకోవాల్సి వస్తుంది. తెలివి మా సొత్తు అనుకుంటే ఎట్లా?

అప్పటి వాళ్ళూ ఏదో ఒక కారణం చేతనే అట్లా ఆ యా సందర్భాల్లో ప్రవర్తించి ఉఃటారనీ, ఆ రకంగా స్పందించి ఉంటారనీ, ఈ ఎరుక ఉండాలి ఎప్పటికీ జాగ్రృతమై ఒక పరిశోధకుడి బుర్రలో!

ఏదో ఒక ఇజం గొడుగు లో కూచుని తోచింది రాసి, తలతిక్క అన్వయాలు దయచేసి చేయవద్దు. సంయమనం చాలా అవసరం ఈ పని చేపట్టాలంటే!

ఆ కథలు గాథలూ జరిగిన కాలం వేరు, ఆ ప్రమాణాలు వేరు, ఆ ధర్మాలు వేరు, ఆ నేర చట్టాలు వేరు, వారి శిక్షాస్మ్రతులూ వేరు, ఆ శాపవ్రృత్తాంతాలు వేరు, ఆ దేహం ప్రమాణాలు వేరు, ఆయుధం పరిమితులు వేరు, ఆ మానసిక శక్తులు వేరు, ఆ ఆదర్శ జీవితాలు వేరు, తద్వారా వారు సాధించిన శీల స్వచ్ఛత వేరు, వాక్శుధ్ధులు వేరు!

అవేవీ తెలియకుండా నిన్నటి ఏ,చేసే‌సత్తా లేకుండానే అవన్నీ  ఏవో కల్పిత‌మహిమల కథలనీ,మనం చేయలేము కాబట్టి ఆ కాలంలో వారూ చేయలేరు అనుకోవటం అవివేకం తప్ప మరేదీ కాదు. వాటికి ఇప్పటి నియమాలతో, పరిస్థితులతో ముడిపెట్టి ఎట్లా మీ సొంత వ్యాఖ్యానాలు చేస్తారూ?!

వాటి మానాన వాటిని ఉండనీయండి. కావాలంటే సరికొత్త కథలు వ్రాసుకోండి, కొత్త నీతులు వల్లించుకోండి! నిలబడేది నిలబడుతుంది, లేనిది బంగారు గోడ దన్ను పెట్టినా జారి నేలకూలి, కాలగర్భంలో కలిసిపోతుంది"!!

ఆయనేదో ఇంకా చెప్పబోతుంటే, కొందరు వెనకాల నుంచి అరవటం మొదలు పెట్టారు,

"ఏయ్ కూచోవయ్యా, సాంబమూర్తో, సాంబారుమూర్తో నీ పేరు, మహా చెప్ఫొచ్ఛావూ, సోది! ఇందరు మేధావి ప్రొఫెసర్లకు తెలియనిది నీకు తెలుసని మేం నమ్మాలా?! ఎప్పుడో పాతకాలం మాటలు మళ్ళీ వల్లిస్తావు, చాల్ఛాలు ఆపు", అంటూ----

అంతలో, కార్యక్రమ అధ్యక్షులు, పరిస్థితి చేయి జారిపోక ముందే మంచిదని, లెక్చరర్ ఒకాయనను వందన సమర్పణ చేయమని చెప్పేశాడు.

ఆయన ఆ నాలుగు ముక్కలూ గబగబా చెప్పటంతో, ఆ నాటి కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. అందరూ చకచకా బైటికి నడిచి వెళ్ళిపోయారు. సాంబమూర్తి గారు మాత్రం, అందరూ వెళ్ళే వరకూ ఆగి, నెమ్మదిగా తన జోలె సంచీ బుజాన వేసుకుని, నెమ్మదిగా బయటికి వెళ్ళారు. ఏవో కొన్ని నవ్వులు వినబడ్డాయి ఆయనకు, తాను బయటకు వస్తుండగా! పట్టించుకోలేదు ఆయన. పట్టించుకుని ప్రశ్నించినా, ఏమీ ప్రయోజనం ఉండదని!

***

ఆయన రోడ్డుకి ఓరగా నడిచి వెళ్తుండగా, ఒక అంబాసిడర్ కారు, దానికి వెనక బోర్డు మీద "విద్యాసాంస్క్రృతిక శాఖ" అని ఇంతింత అక్షరాలలో కనబడింది.

ఆ కారులో కిటికీ దగ్గర, ఆ మహత్తర సిధ్ధాంతవ్యాస కర్త, నిరాఘాటం గారు దర్జాగా కూర్చుని ఉండటమూ కనబడ్డది. రెండూ చూసిన, సాంబమూర్తి గారు మౌనంగా తన నడక సాగించారు అర కి.మీ. దూరంలో ఉన్న బస్ స్టాపు కి! ఆయన ఏ మాత్రం ఆశ్చర్యపోలేదు ఆ చూసిన దృశ్యానికి!

ఒక్క డాక్టరేట్ట్ కి ఇంత హడావిడీ చేయించిందీ, ఆ ప్రశంసలు గుప్పించిందీ- ఈ నిరాఘాటంగారు, విద్యాశాఖామంత్రి కి మేనల్లుడు కాబట్టే అని, కుర్చీల్లో వున్న వాళ్ళతో బాంధవ్యం ఉంటే, ఏ రంగంలో నైనా పట్టు కిరీటాల ఏర్పాటు ఆట్టే కష్టం కాదని--- ఆయనకు తెలియనిది కాదుగా!.

***

తెలుగులో పరిశోధన ఒక కొత్త దిశగా, మలుపు తీసుకున్న రోజుగా, మరునాడు వార్తాపత్రికలు ఆ వార్తను అభివర్ణిస్తూ వ్రాశాయి, తాటికాయలంత అక్షరాలతో!

***

పై లోకాల్లో తెలుగు సరస్వతి కఛ్ఛపి వీణలో, ఒక తీగెలో ఏదో అపశ్రుతి తోచి, సరిచేసే పనిలో పడ్డది.

తన పని అయిన స్రృష్టి తప్ప ఏదీ పెద్దగా పట్టించుకోని బ్రహ్మగారు, ఇది గమనించనే లేదు.

లోకం యథాప్రకారం సాగిపోతుంది, సాహిత్య విద్యారంగాలతో పాటు- ప్రగతి పథంలో, అభ్యుదయ రథంలో! లక్ష పరిశోధనలూ, కోటి పీహెచ్డీ లతో!

శుభమస్తు!

********

Posted in December 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *