గాంధీజీ జీవితంలో పెద్ద మలుపు తిరిగిన దక్షిణ ఆఫ్రికా ప్రయాణం
రాజ్ కోటలో బ్రిటిష్ అధికారితో జరిగిన చేదు అనుభవం తరువాత మోహన్ దాస్ జరుగుతున్న రాజకీయాలమీద ఆసక్తి పెంచుకోనారంభించారు. కథియవార్ లోని రాజవంశస్థులు కూడా ఈ బ్రిటిష్ అధికారి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడేవారు. చివరకు అతనికి పనిచేసే చిన్న ఉద్యోగులు కూడా పొగరోబోతులే! ఈ విష వాతావరణంలో మచ్చ లేకుండా జీవించటం, మనుగడ సాగించటం మోహన్ దాస్ కు పెద్ద సమస్య అయింది.
దీనితో అతను అధైర్యంతో కృంగిపోసాగాడు. దీనిని పెద్దన్న చూసి ఏవిధంగానైనా తమ్ముడికి సాంత్వన కలుగజేయ ప్రయత్నించాడు. తమ్ముడు పైకి రావాలంటే ఈ బ్రిటిష్ అధికారి ఒక ప్రతిబంధకం అయ్యాడు.
ఇటువంటి నిరాశ, నిస్పృహతో ఉన్న సమయంలో అతని అన్నకు కథియవార్ లోని ‘మేమన్’ (Memon) కంపెనీ వ్యక్తి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఇందులో అతను “మాకు దక్షిణ ఆఫ్రికాలో ఒక పెద్ద వ్యాపార సంస్థ ఉంది. మాకు న్యాయస్థానంలో 40,000 పౌండ్లకు ఒక దావా ఉంది. దీనిని వాదించటానికి మేము పేరుమోసిన బారిష్టర్లను, వకీళ్ళను నియమించుకున్నాము. నీవు నీ తమ్ముడిని ఇచ్చటకు పంపిస్తే మాకు ఉపయోగపడగలడు. ఇది అతనికి కూడా ఉపయోగమే. ఇతను మా న్యాయవాదుల కంటే బాగా కేసులు విచారించగలడు. అదీ గాక మీ తమ్ముడు మరో ప్రపంచాన్ని చూసి, క్రొత్త పరిచయా లు ఏర్పరచుకోగలడు” అని వ్రాశాడు.
ఇది మోహన్ దాస్ కు చాలా నచ్చింది. పెద్దన్నతో పాటు ఈ కంపెనీకి సంబంధించిన ‘Seth Abdul Karim Jhaveri’ ని సంప్రదించాడు. ఆయన “మాకు దక్షిణ ఆఫ్రికాలో చాలామంది సంపన్న యూరోపియన్ లతో స్నేహం ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, కేసుల నకళ్లు వ్రాయటం అంతా ఇంగ్లీష్ లోనే. అది మాకు లాభమే. నీవు మా అతిధిగా ఉంటావు. అందువల్ల నీకు ఖర్చులు ఉండవు” అని వివరించాడు.
మోహన్ దాస్ జీత భత్యముల గురించి ప్రశ్నించగా “ఒక సంవత్సరం ఉంటే చాలు. నీకు మొదటి తరగతి (first class) ప్రయాణ ఖర్చులు, 105 పౌండ్ల జీతం ఇస్తాము” అని సమాధానం ఇచ్చాడు. ఈ ఉద్యోగం ఒక బారిష్టర్కు తగినది కాదని, అందులోనూ ఒకరి వద్ద ఉద్యోగిగా మారటం అయిష్టమయినా, దేశం విడిచి వెళ్లే అవకాశం వచ్చిందని సంతోషంతో దక్షిణ ఆఫ్రికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
అదీగాక ప్రతినెలా 105 పౌండ్లు అన్నయ్యకు పంపిస్తే అది ఆయన కుటుంబ ఖర్చులకు ఉపయోగ పడుతుందని ఆలోచించాడు. వెంటనే మోహన్ దాస్ దక్షిణ ఆఫ్రికా ప్రయాణానికి సంసిద్ధుడయ్యాడు.
మోహన్ దాసు ‘నాటాల్’ (డర్బన్) ఆగమనం
మోహన్ దాస్ కు దక్షిణ ఆఫ్రికాకు పయనమయ్యేటప్పుడు ఇంగ్లండ్ వెళ్లేముందు అనుభవించిన విచారం కలుగలేదు. ఇప్పుడు తల్లి లేదు. ప్రపంచానుభవానికి అంతకుముందు విదేశంలో ఉన్న అనుభవం తోడయినందువల్ల ప్రయాణం అంటే భయం లేదు.
ఈ ప్రయాణం గురించి గాంధీజీ మాటలలోనే తెలుసుకుందాం:
“ఈ సారి నా భార్యను విడిచి వెళ్తున్నాననే బాధ మాత్రం అధికంగా ఉంది. నేను ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత మరొక పుత్రుడు ‘మణిలాల్’ (29 అక్టోబర్ 1892) జన్మించాడు. మా ప్రేమ కామ రహితం కాకున్నా, అది క్రమంగా నిర్మలత్వం వైపుకు మొగ్గుతూ ఉంది. నేను ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత మేమిద్దరం తక్కువ కాలమే కలసి ఉన్నాం. నేను క్రమేణా కేవలం ఆమె భర్తనే గాక, ఒక ఉపాధ్యాయుడనయ్యాను. ఫలితంగా ఆమెలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అందువల్ల మాకు ఎడబాటు కష్టతరం అయింది”
“కాని దక్షిణ ఆఫ్రికా వెళ్లాలనే కోరిక బలంగా ఉన్నందువల్ల ఈ బాధను అనుభవించక తప్పలేదు. ‘కేవలం ఒక సంవత్సరం మనం కలుస్తాం కదా’ అని చెప్పి ఆమెకు మనఃశాంతి కలుగజేశాను. మరుసటి రోజున (1893, ఏప్రిల్ మొదటి వారం లో) రాజ్ కోట నుంచి బొంబాయికి బయలు దేరాను.”
నౌ ప్రయాణంకా
బొంబాయిలో దాదా అబ్దుల్లా (Dada Abdulla and Co.) కంపెనీ ప్రతినిధికి మోహన్ దాస్ కు ఓడలో మొదటి తరగతి సీటు సంపాదించటం వీలుకాలేదు. ఒక్క సీటు కూడా ఖాళీలేదు. ఇష్టమయితే ఓడ పై భాగం (deck) లో సామాన్యులతో పాటు ప్రయాణించవచ్చని అతను సూచించాడు. ఒక బారిష్టర్ సామాన్యులతో ప్రయాణించటం ఇష్టం లేక, మోహన్ దాస్ ఓడ ముఖ్య అధికారి ‘కాప్టెన్’ (Captain) తో మాట్లాడాడు. ఆయన “మొజాంబిక్'’(Mozambique) గవర్నర్-జనరల్ (Governor-General) తన బృందంతో ప్రయాణిస్తున్నందువల్ల మొదటి తరగతిలో ఖాళీలేదు. కాని, నీవు బారిష్టర్ వి కాబట్టి నా కాబిన్ (Cabin) లో ఒక ‘బెర్త్’ ఖాళీ ఉంటుంది. నీకు ఇష్టమయితే నాతో ప్రయాణించవచ్చు” అని అన్నాడు. దీనికి 24 ఏళ్ళు నిండని మోహన్ దాస్ వెంటనే అంగీకరించి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ‘ఏజెంట్’ ద్వారా టిక్కట్ కొని, 1893 ఏప్రిల్ లో దక్షిణ ఆఫ్రికాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోటానికి ఏప్రిల్ 13న పయనమయ్యాడు.
బొంబాయి నుంచి ఓడ బయలుదేరిన తరువాత 13 రోజులకు (ఏప్రిల్ 26) దక్షిణ సూడాన్ (Sud-an) తీరంలో ఉన్న ‘లాము’ (Lamu) రేవు (port) చేరింది. ఈ ప్రయాణంలో కెప్టెన్, మోహన్ దాస్ లు మంచి మిత్రులయ్యారు.
ఈ తన ప్రయాణం గురించి గాంధీజీ ఇలా వివరించారు.
“ఈ ప్రయాణంలో కూడా కెప్టెన్ నన్ను చదరంగం ఆడమని ప్రోత్సహించాడు. ఈ ఆట గురించి నాకు తెలియదు. ఆయన ఎంతో ఓపికతో ఎలా ఆడాలో నేర్పాడు. ఆయనకంటే ఎక్కువ ఓపికతో నేర్చుకున్నాను నేను. తరువాత మేము ఆడిన ప్రతిసారీ నేనే ఓడిపోయాను. దీంతో ఇంకా బాగా నేర్చుకోవాలనే పట్టుదల పెరిగింది. చివరకు చదరంగం నాకు ఇష్టమయిన ఆట అయింది. కాని ఆ ఇష్టం కూడా లాము లో దిగిన మరుక్షణం తగ్గిపోయింది.”
"లాము లో ఓడ 3-4 గంటలు ఆగింది. ఆ సమయంలో ఓడ దిగి ఊరులోకి వెళ్లాను. అక్కడ పోస్ట్ ఆఫీసుకు వెళ్ళితే అచ్చట ఉన్న భారతీయులు, ఆఫ్రికన్ లతో మాట్లాడాను ఈలోపల చాలా సమయం గడిచిపోయింది. అతి కష్టం మీద చివరి క్షణంలో ఓడ ఎక్క గలిగాను. తరువాత కొద్ది రోజులకు మొదట ‘తూర్పు టాంజానియా’ లోని ‘జాంజిబార్’ (Zanzibar) రేవులో ఓడ ఆగింది. అచ్చట 8-10 రోజులు ఉండి మరో ఓడలోకి మారాలి. అంతవరకూ నేనంటే ఇష్టమయిన కెప్టెన్ తో నా స్నేహంలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది.”
“ఓడ ఆగిన తరువాత అతను నన్ను, ఒక ఇంగ్లీష్ స్నేహితుడిని, బయటకు తీసుకువెళ్లాడు. ఎక్కడకు వెళ్తున్నామో తెలియక వారిని అనుసరించాను. వారు వెళ్లి వెళ్లి ఒక మధ్యవర్తి (tout) చూపించిన నీగ్రో స్త్రీలున్న ఇంట్లోకి ప్రవేశించారు. నన్ను ఒక గదిలోకి వెళ్ళమన్నారు. వెళ్ళితే అక్కడ ఒక స్త్రీ నిలబడి నాకోసం వేచి చూస్తూ ఉంది. నేను ఎంతో సిగ్గుతో, అవమానంతో ఆమె ముందు ఒక మూగవాడిగా నిలబడిపోయాను. అలా ఎంత సేపు ఉన్నానో జ్ఞాపకం లేదు. కొంతసేపటికి కెప్టెన్ నన్ను బయటకు రమ్మని గొంతెత్తి పిలిచాడు. అతను నన్ను పరిశీలనగా చూసి నా నిష్కళంకత్వాన్ని గ్రహించాడు. మొదట నేను సిగ్గు పడినా, తరువాత నేను చేసింది మంచి పనేనని భావించి సంతోషించాను.”
“ఆ స్త్రీని చూసి నా మనస్సు చలించకపోవటం దేవుడి కృపవల్లనేనని భావించి ఆయనకు కృతజ్ఞత చెప్పుకున్నాను. ఇంతవరకు నేను ఎదుర్కొన్న అనుభవాలతో ఇది మూడవది. యవ్వనంలో చాలా మంది తెలియక ఇటువంటి కూపంలోకి లాగబడి, తిరిగి బయటకు వెళ్ళలేరు. నేను వీటిని తప్పించుకున్నానంటే స్వశక్తి కంటే దేవుడి సహాయమే అధికంగా తోడ్పడింది. ఈ అనుభవం వల్ల నాలో దైవభక్తి మరింత పెరిగింది.”
“జాంజిబార్ లో ఒక వారం రోజులు పైగా ఉండవలసివచ్చినందువల్ల మరుసటి రోజు నేను ఆ ఊరిలో తిరిగి ఒక గదిని అద్దెకు తీసుకుని ఉన్నాను. అచ్చట ఉన్న వృక్షసంపదను చూసి ముగ్ధుడనయ్యి, భారత్ లోని మలబార్ లో ఉన్నట్లనిపించింది. అక్కడ ఓడ మారవలసివచ్చింది. అది కొద్ది రోజులకు ‘మొజాంబిక్’ (Mozambique) చేరింది. ఎట్టకేలకు మే నెల (25) చివరలో ‘నాటాల్’ (Natal) రేవు పట్టణం చేరాం.
నాటాల్ (డర్బన్)లో మోహన్ దాస్ అనుభవాలు
నాటాల్ రేవు పట్టణం పేరు 1835 లో అప్పటి గవర్నర్ ‘బెంజమిన్ డర్బన్’ (Benjamin Durban) జ్ఞాపకార్ధం ‘డర్బన్’ (Durban) గా మార్చటం జరిగింది. రేవులో దిగగానే ‘అబ్దుల్లా సేథ్’ (Abdulla Seth) మోహన్ దాస్ కు స్వాగతం పలికాడు. అచ్చట ఉన్నవారిని చూసిన తరువాత డర్బన్ లో భారతీయులంటే చులకన భావం ఉన్నట్లనిపించింది. అతనికి పొడుగాటి కోటు, బెంగాలీ తలపాగా (turban) ధరించియున్న మోహన్ దాస్ ను చాలా మంది ఎగాదిగా చూశారు.
అబ్దుల్లా తాను నివసించే గృహంలో ఒక గదిని మోహన్ దాస్ కు కేటాయించారు. అబ్దుల్లా అంతగా చదువుకోకపోయినా, అపారమైన తెలివి, అనుభవం గల వ్యక్తి. కొంచెం ఇంగ్లీషులో కూడా నైపుణ్యం ఉంది. ఆయన వ్యాపార సంస్థ దక్షిణ ఆఫ్రికాలో ఉన్న భారతీయుల సంస్థలకంటే పెద్దది. మహమ్మదీయుడైన ఈయనకు అరబిక్ భాషలో ప్రావీణ్యం లేకపోయినా, ఇస్లాం తత్వాల మీద మంచి పట్టు ఉంది. ఈయనతో ఉన్న సాంగత్యం వల్ల మోహన్ దాస్ కు మహమ్మదీయ మతం మీద అవగాహన పెరి గింది. డర్బన్ వచ్చిన 3 వ రోజున (25 మే, 1893) అబ్దుల్లా మోహన్ దాస్ ను కోర్టుకు తీసుకువెళ్లాడు.
తరువాత జరిగిన సంగతులను గాంధీజీ ఇలా వివరించారు.
“అబ్దుల్లా నన్ను చాలామందికి పరిచయం చేసి, తరువాత అటార్నీ ప్రక్కన కూర్చోబెట్టారు. మేజిస్ట్రేటు నావంక తీక్షణంగా చూసి తలపాగాను తీసివేయమని ఆదేశించాడు. దీనిని నేను వ్యతిరేకించి, కోర్టులోపల నుంచి బయటకు వచ్చాను. దీనిని బట్టి ముందు ముందు నా పోరాటం చాలా ఉంటుందనిపించింది.”
“తరువాత అబ్దుల్లా, మరికొందరు భారతీయులు కోర్టులో తలపాగాలు ఎందుకు తీసివేయాలో నాకు వివరించారు. మహమ్మదీయ ఆహార్యం (వస్త్ర ధారణ) ధరించేవారికి లేని నిబంధన ఇతర భారతీయులకు మాత్రమే ఉంది. నేను ఉన్న రెండు, మూడు రోజులలోనే భారతీయులు అనేక వర్గాలుగా విభజించబడినట్లుగా అర్ధమైంది. వీరు: ఆరబ్ ముసల్మాన్ వ్యాపారస్తులు, హిందువులు, పార్సీలు, గుమస్తా (Clerks) లు. వీరిలో, హిందూ గుమాస్తాలు ఏ వర్గానికి చెందరు. పార్సీ మత గుమాస్తాలు తమను తాము ‘పార్శి’ గుమాస్తాలు' అనిపించుకుంటారు.
“ఈ వర్ణాలకతీతంగా అతి పెద్దదయిన మరో వర్గం ఉంది. దీనికి ‘ఒడంబడిక' (Agreements) లతో బందీలు కాబడిన ‘బానిస’ కాబడిన 'బానిస' కార్మికులు, శ్రామికులతో పాటు, ఈ ఒడంబడికల నుంచి విముక్తిలయినవారు చెందుతారు. యజమానులకు బందీ కాబడిన వీరు 5 ఏళ్ళు తప్పనిసరిగా పనిచేయాలి. వీరిలో దాదాపు భారత్ నుంచి తీసుకురాబడిన బీదవారు. వీరిని ‘Grimityas’ అని అంటారు. ఈ పదం భ్రష్టు (corrupt) పట్టిన ఆంగ్ల పదం (Agreements) కు పర్యాయపదం. ఈ పెద్ద వర్గంలో తెలుగువారు, తమిళులు, ఉత్తర భారతీయులు ఉన్నారు. పైన పేర్కొన్న వర్గాలకు ఈ శ్రామిక వర్గం తో వ్యాపార విషయంలో మినహా వేరే సంబంధం ఉండదు. ఇంగ్లీషు వారు వీరిని ‘కూలీలు’ (coolies) అని, ‘సామీ లు’ (Samis) అని అంటారు. యదార్ధానికి ‘స్వామి’ అంటే ‘యజమాని’. దేముళ్ళను కూడా ఇలాగే సంభోదిస్తాము. ‘సామి’ అసలు అర్ధం ఇంగ్లీషు వారికి ఎత్తిచూపితే మింగుడుపడక ‘ఏదయినా మీరు కూలీలే కదా’ అని వారు అవమానించేవారు.”
"అందువల్ల నేను ఇచ్చట ‘కూలీ బారిష్టర్’ గానే పరిగణించబడ్డాను. నా తలపాగా తీసివేయమనటం నన్ను అవమానించినట్లుగా భావించాను. దీనినుంచి బయటపడటానికి ఇంగ్లిష్ ‘టోపీ’ (hat) ధరిస్తేనే మంచిది కదా అనే ఆలోచన వచ్చింది. కానీ అబ్దుల్లా దీని వ్యతిరేకించాడు. ‘ఇంగ్లీష్ టోపీ’ ధరిస్తే నీవు ఒక హోటల్ సేవకుడు (Waiter) అని భావిస్తారు. అందువల్ల వస్త్ర ధారణ మార్చి, నీవు రాజీ పడినట్లుంటుంది. అది గాక నీకు తలపాగాయే బాగుంటుంది’ అని నచ్చ జెప్పాడు.”
“అబ్దుల్లా వాదనలో నిజం ఉంది. బందీలయిన శ్రామిక ‘కూలీ’ వర్గంలో మూడు ఉప-వర్గాల వాళ్ళు (sub-groups) ఉన్నారు. వీరు: హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు. క్రైస్తవ ఉపవర్గానికి చెందినవారు ఒకప్పుడు హిందువులే. కాని మతం మారిన తరువాత వీరు ఇంగ్లీషు వారి ఆహార్యం ధరించటం మొదలుపెట్టారు. వీరిలో అత్యధికులు హోటళ్లలో Waiters గా ఉన్నారు. ఈ కారణం వల్లనే అబ్దుల్లా నా వస్త్రధారణ మార్చవద్దని సలహా ఇచ్చాడు.”
“ఆయన వాదన నాకు సమంజసమనిపించి నేను వెంటనే న్యాయస్థానంలో నా తలపాగా విషయంలో జరిగిన సంఘటన విపులంగా వ్రాసి అచ్చట వార్తాపత్రికకు ఇచ్చాను. దీనిని చదివి చాలామంది నన్ను ఒక ‘ఆహ్వానించబడని సందర్శకుడు’ (Unwelcome Visitor) అని అభివర్ణించారు. కొందరు నన్ను సమర్ధిస్తే, మరి కొందరు తీవ్రంగా విమర్శించారు. కాని దీనివల్ల నేను దక్షిణ ఆఫ్రికాలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఎదురు చూడని ప్రాచుర్యం సునాయాసంగా లభించింది.”
“చివరకు నేను దక్షిణ ఆఫ్రికాలో ఉన్నంత కాలం నా తలపాగా శిరస్సును అలంకరిస్తూనే ఉంది.”