“అయ్యో అయ్యో అదేమిటండీ, ఎప్పుడూ ఇంట్లో పూజ చేసుకునే గణపతి మట్టి విగ్రహానికి ఏభైవేలు కట్టి కొన్నారా?” బుగ్గలు నొక్కుకుంటోంది పంకజం.
“నీ మొహం. నీకేం తెలీదు, ఎంతసేపూ ఆ టీవీలో వంటలక్క, బొచ్చుకుక్క సీరియల్స్ చూడ్డమే గానీ ప్రపంచం ఎంత ముందుకెళ్తోందో ఏం తెలీదు నీకు” ఆమె అమాయకత్వానికి తన తెలివితేటలకీ లంకె కుదరలేదంటూ తల కొట్టుకున్నాడు ఆంజనేయులు.
“ఆ… నామొహం ముందుకెళ్లడం. ఏం జరిగినా నా చేతిలో గరిట, మీ చేతిలో ఆ టిక్కుటిక్కున నొక్కుకునే ఫోనే గానీ ఏమైనా మారిందా ఏం? హవ్వ హవ్వ, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఏభైవేలు పెట్టి ఆ ఆన్‌లైన్‌లో కొని కుచ్చుటోపీ వేయించుకోకపోతే ఆ ఏభైవేలేవో నా మొహాన పడేస్తే నేనో నాలుగు పట్టుచీరలు కొనుక్కునే దాన్ని. అసలే కార్తీకమాసం ముహూర్తాలలో నాలుగు పెళ్ళిళ్ళకి వెళ్ళాలి” అంటూ రాగాలు తీసింది పంకజం.
“నేను ఆన్‌లైన్‌లో కొనడం మాట అటుంచి, అసలు నీకిప్పుడు నాలుగు పట్టుచీరలెందుకే పంకజం? ఏమైనా నీ పుట్టినరోజా లేక మన పెళ్ళిరోజా? అదీ కాదంటే మన అబ్బాయి పెళ్ళా లేక అమ్మాయి పెళ్ళా?” ఆశ్చర్యం కోపం కలగలిసిన వ్యంగ్యంతో అడిగాడు ఆంజనేయులు.
“అదేవిటండీ అలా అంటారూ, అప్పుడే మర్చిపోయారా ఏం? వచ్చే నెల పధ్నాల్గో తారీఖున మీ తమ్ముడి తోడల్లుడి చెల్లెలి ఆడపడుచు కూతురి పెళ్ళికి మరీ మరీ రమ్మని కార్డంపారా?
ఇరవయ్యో తారీఖున ఆ పక్కింటి మాలక్ష్మి ఒదిన కోడలి తమ్ముడి కూతురి పెళ్ళి అంటూ పిలిచారా? అప్పుడే మర్చిపోయారా ఏం?
ఆ తర్వాత ముప్పయ్యో తారీఖున మా పారాయణం గ్రూపులో ఉండే గాయత్రి తోటికోడలి కూతురి పెళ్ళా... నే వెళ్ళకపోతే బాగుంటుందా చెప్పండి? గాయత్రి ఇంట్లో పారాయణ పెడితే, నే వెళ్ళగానే ‘రా అక్కా’ అంటూ ఎంత ముద్దుగా పిలిచి పసుపుకుంకాలు, ప్రసాదం, కొబ్బరి చెక్కలూ అన్నీ ఇచ్చి పంపుతుందో. అసలు కొబ్బరికాయ పచ్చడికి గత ఏడాదిగా కొబ్బరికాయ కొననే లేదంటే నమ్మండి.
ఆ మర్నాడే మీ ఫ్రెండు గిరీశంగారి బావమరిది కొడుకు పెళ్ళని పిలిచారుగా. అదీ నేనే గుర్తు చెయ్యాలి మీకు. మరి ఈ పెళ్ళిళ్ళన్నింటికీ వెళ్ళొద్దా ఏం? మరీ చోద్యం కాకపోతే అలా అడుగుతారేఁ?” కళ్ళల్లో కొత్త పట్టుచీరల మెరుపులు కనబడుతుండగా చెప్పింది పంకజం.
“ఆసి నీ ఇల్లు బంగారంగానూ. నీ చీరలు దొంగలెత్తుకెళ్ళా. ఎవరెవరివో పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి కొత్త పట్టుచీరలెందుకే? ఆ బీరువాలో కారిపోతున్న, జారిపోతున్న, కాళ్ళమీద పడుతున్న చీరలన్నీ ఉన్నాయిగా. అందులోవి కట్టుకో” ఈసారి కాస్త అసహనంగానే అడిగాడు ఆంజనేయులు.
“అవన్నీ ఇదివరకే ఓసారి కట్టేసుకున్నాను. మళ్ళీ నలుగురిలోకి కట్టిన చీరే కట్టుకోవడం ఎంత నామోషీ చెప్పండి! అద్సరే నా మాట అటుంచి ఇంతకీ వినాయకుడికి ఏభై వేలు ఎందుకో చెప్పకుండా విషయం దాటేస్తున్నారు. చాలా తెలివైనవాణ్ణని మీ ఆలోచన కాబోలు. ఈ పప్పులేం నాదగ్గర ఉడకవు కానీ, విషయం చెప్పండి” సాగదీస్తూ నిలేసింది పంకజం.
సరే ఇంక చెప్పక తప్పేది లేదని అర్థమైపోయి, “ఇదిగో పంకజం, టెక్నాలజీతో పాటూ మనమూ అప్‌డేట్ అవ్వాలని చెప్తుంటాను నీకు, ఎప్పుడూ వినవు కాబట్టే నే చేసిన మహత్కార్యం నీకు అర్థం కాలేదు.
నేను ఈసారి వినాయక చవితికి AI & Robotics అనే కొత్త టెక్నాలజీతో చేయబడిన విగ్రహం కొన్నాను. ఇది ఆ మట్టి విగ్రహంలా కదలక ఒకేచోట ఉండదు. మనతో మాట్లాడుతుంది, ఆడుతుంది, పాడుతుంది. అంతేకాదు మననుంచే మాటలు, హావభావాలు చూసి పట్టేసి, తన తెలివిని కలిపి మనం అడిగిన వాటికి సమాధానాలు కూడా ఠక్కున చెప్తుంది. ఇకపై ఇంట్లో నేనొక్కడినే కాదు, ఇద్దరం తెలివైన వాళ్ళు ఉంటాం, అర్థమైందా మట్టిబుర్ర పంకజం!” వెటకారం కలిపి మరీ వివరించాడు ఆంజనేయులు.
“హా, అలాగా... ఇంకా ఏం చేస్తుందండీ ఈ రాబోటు?” అడిగింది ఆశ్చర్యం ఆపుకుంటూ.
“ఏం చేస్తుందేమిటే, ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల వివరాలూ చిటికెలో చెప్పేస్తుంది. అంతే కాదు, నీకు కొత్తకొత్త వంటకాల రెసిపీలు చెప్పి మరీ చేయిస్తుంది. నువ్వు ఎలా నవ్వుతావో, ఎలా నడుస్తావో, ఎలా ఆలోచిస్తావో అన్ని ఇట్టే పసిగట్టేస్తుంది. ఇంకేం కావాలేం?” అన్నాడు గర్వంగా, చిలిపిగా.
“సరేగానండీ, అది ఏం తింటుందీ? ఇప్పుడు మళ్ళీ దానికి కూడా వండిపెట్టాలా ఏం?” అంది పనెక్కువైపోతుందన్న దిగులుతో.
“నీ మొహం. రోబోటిక్ ఏఐ టూల్‌కి తిండేవిటే? చదవేస్తే ఉన్నమతీ పోయిందనీ. ఎప్పటికప్పుడు ఛార్జింగు పెడితే చాలు. పైగా అది కూడా నువ్వేం చేయనక్కర్లా... అదే ఛార్జి తగ్గే టయానికి ప్లగ్ దగ్గరకెళ్ళి దానికదే ఛార్జి పెట్టేసుకుంటుంది. నీకు పనేం ఎక్కువైపోదులే, బెంగెట్టేసుకోకు” చెప్పాడు ఆంజనేయులు.
“ఇదేదో భలే ఉందండీ. సరే, ఇంతకీ ఎప్పుడొస్తుందీ?” అడిగింది పంకజం కళ్ళు పెద్దగా చేసి, ఆశగా.
“ఆగు, అంత కంగారైతే ఎలాగా? ఓ రెండ్రోజులు ఓపిక పట్టు. చవితికి ముందురోజే ఇంటికొచ్చేస్తుంది” అన్నాడు ఆంజనేయులు.
అక్కడి నుంచీ పంకజం టీవీలో రోబోట్‌ల మీద వచ్చిన పాత కొత్త సినిమాలన్నీ ఏకరువు పెట్టి చూసేసి మన ఏఐ రోబో గణపయ్య ఎలా ఉండబోతున్నాడో అనుకుంటూ ఒళ్ళంతా కళ్ళు చేసి ఎదురు చూడసాగింది.
ఆంజనేయులు కూడా ఉత్సాహం ఉన్నా పైకి కనపడనీయకుండా గమ్మున కాలక్షేపం చేశాడు ఆ రెండ్రోజులూ.
మొత్తానికి “అమ్మా, పార్సిల్” అంటూ తలుపు కొట్టాడు అమెజాన్ అబ్బాయి.
ఇద్దరూ పరుగు పరుగున వెళ్ళి పార్సిల్ అందుకున్నారు. నేనంటే నేనంటూ పోటీ పడకుండా జాగ్రత్తగా అన్‌బాక్స్ చేశారు.
ఆంజనేయులు అన్‌బాక్స్ చేస్తుంటే పంకజం వీడియో తీసింది ఎందుకైనా మంచిదని.
మొత్తానికి కళ్ళల్లో ఎర్రని బల్బులూ, నెత్తిమీద మెరిసే సీరియల్ సెట్టుతో చేసిన కిరీటం, బొజ్జకి నాగబంధం ఉండే చోట కూడా లేజర్ లైటు పట్టీ, నెత్తిమీద చంద్రవంక స్థానంలో ఓ బ్లూ లైటు, చేతిలో ఉండ్రాళ్ళ పళ్ళెంలో చిట్టి చిట్టి బటన్సు, కాళ్ళ దగ్గర మూషికానికి కూడా ఎర్రగా మెరిసే కళ్ళూ, దాని చేతిలో కూడా ఓ లడ్డుండ స్థానంలో బ్లూ బటనూ, ఆ విగ్రహం ప్యాకింగూ, వైర్లూ, రిమోటు అన్నీ ఉన్న అబ్బో అద్దిరిపోయే విగ్రహం చూసి మొగుడూ పెళ్ళాలిద్దరూ మురిసిపోయారు.
పంకజం విగ్రహాన్ని చేతులోకి తీసుకునే లోపు “పంకజం ఆగు, అప్పుడే ఏం నొక్కెయ్యకు” అంటూ ఆంజనేయులు పెట్టిన గావుకేకకి హడిలిపోయిన పంకజం, ఆ దడలో విగ్రహాన్ని సగం వరకూ తీసేలోగా ధడేల్న వదిలేసింది.
అంతే, ఆ ఏఐ రోబో వినాయకుడి పొట్ట దగ్గరికి విరిగి రెండు ముక్కలై పోయింది. ఇంకేముంది ఆ హడావుడిలో పంకజానికి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆంజనేయులుకి కోపం, బాధ కలగలిసి హై బీపీ వచ్చేసింది. కిందపడి ఉన్న వినాయకుడి బొమ్మలోంచి, ఏదో బటన్ ఆన్ అయిపోయినట్టుంది, “హాయ్ దిస్ ఈజ్ బాల్ గణేశా. హౌ మే ఐ హెల్ప్ యూ” అంటూ రోబోటిక్ వాయిస్ పలికేసరికి ఇద్దరూ ఒక్క ఉదుటున లేచి ఓమూల కూర్చుని భోరున ఏడవడం మొదలుపెట్టారు.
ఉక్రోషంతో, “మీ ఏఐ గంగలో కలిసిపోయింది. ఏభై రూపాయలతో పోయే మట్టి విగ్రహానికి ఏభైవేలు తగలేసారు. ఇప్పుడిది బాగుపడేనా ఏమైనానా! ఇంతకంటే ఆ ఏభైవేలేదో నాకిచ్చినా పోయేది, వినాయకా...” అంటూ ఆంజనేయులుని మరుసటి సంవత్సరం వినాయక చవితి వరకూ తిడుతూనే ఉంది పంకజం.
ఓ పక్క ఏభైవేలూ పోయి, ఇంకో పక్క విగ్రహమూ పూర్తిగా బాగుపడక అది కేవలం ఛార్జిలో ఉన్నంతసేపే మాట్లాడడం చూసి కుమిలి కుమిలి ఏడ్చాడు ఆంజనేయులు. ‘కొత్త విగ్రహం రీప్లేస్ చేయాలంటే ఏక్చువల్ కాస్ట్‌లో అరవై శాతం కట్టాలి. ఎందుకంటే అది టెక్నికల్ ఫాల్ట్ కాదు, మీ తప్పిదం కాబట్టి...’ అని ఖరాఖండిగా చెప్పేశాడు కంపెనీవాడు.
మర్నాడు పూజకి ఇంటి పెరట్లోని బంకమన్నుతో విగ్రహం చేసింది పంకజం ఎప్పటిలాగే.