Menu Close
Paranandi-Aravindarao
అహమిక (గల్పిక)
పారనంది అరవిందారావు

అదొక అడవి. జంతువులు సంచరించే జనసంచారంలేని అడవి కాదు. కృత్రిమంగా సృష్టించిన అటవి. ఎంతో జాగరూకతో అందంగా పాతిన వటవృక్షాలు, గుబురుగా అల్లుకున్న పొదలు, వాటికి వయ్యారంగా వేలాడుతున్న తీవెలు, తీవెల నుండి గుభాళిస్తున్న పూవుల పరిమళాలు, మత్తెకిస్తున్న పరిసరాలు. కోయిల తీయని కూతలు, శుకపికాది కిచకిచలు, నేపథ్యంలో నాజూకుగా ప్రవహిస్తున్న సెలయేరు, సాంకేతిక పరిజ్ఞానంతో సన్నగా ధ్వనిస్తున్న సంగీతం... భూతలస్వర్గమే! సన్నటి జలపాతాలు సృష్టించి వాటినుంచి వినీ వినిపించనట్లు హరిప్రసాద్ చౌరాసియా వేణు గానం హాయిగా వీనులకందిస్తున్నారు. అనేక సాహిత్య, సంగీత, నృత్య, నాటక కార్యకలాపాలకోసం ప్రత్యేకంగాగా నిర్మించిన ఈ వేదిక ప్రముఖ, ప్రసిద్ధ, ప్రజారంజక, ప్రజాకర్షక ఎంపికైంది.

****

సాయంసమయం ఆరున్నర అయింది. కార్య నిర్వాహకులు బారులు తీరి నుంచుని ఉన్నారు. కొంతమంది బాలికలు పూల గుఛ్ఛాలు పట్టుకుని నుంచున్నారు. వాతావరణంలో ఏదో ఉత్సాహం, ఉత్కంఠత, ఆరడము పొంగి పొర్లుతోంది. దైవదర్శనంకై ఎదురుచూస్తున్నవంటి భయ భక్తులతో కూడిన పవిత్ర భావన. ఈ రోజు ఒక విశేషమైన, విశిష్టమైన అతిథి ఈ వేదికనలంకరించబోతున్నారు.

వేదిక ముందరి భాగంలో ఒక పెద్ద శ్వేతవర్ణపు కారు గాలిలో తేలుతున్నట్లు వచ్చి ఆగింది. డ్రైవర్ దిగి వచ్చి కారు వెనక తలుపు మర్యాదగా తెరిచాడు. ఒక పాదం నేలమీద ఆనింది. నేల మీది ఇసుక రేణువులు ఆ పాదానికి మొక్కుతున్నట్లు దానిని కప్పేసాయి. రెండో పాదం కూడ నేల మీద మోపి, గొప్ప కళాకారులు…. ప్రసిద్దికెక్కిన సంగీత విద్వాంసులు… సరస్వతీపుత్రులు ….రామశాస్త్రిగారు కారు దిగారు. వారి కాలికి ఉన్న గండపెండెరం ఆ సంధ్యాసమయంలో అప్పుడే అస్తమిస్తున్న అరుణుని కాంతిలో వింతగా మెరుస్తోంది. ఆయన కారు దిగంగానే నిర్వాహకుల కరతాళధ్వనులు మారుమ్రోగాయి. పూలరేకులు ఎగిరి వారి శిరస్సు తాకడం ఎంతో భాగ్యం అన్నట్లు ఎంతో ఆదరంతో తాకాయి. ఆయన అడుగులో అడుగు వేయగానే సహురిలోంచి సరిగమలు వెలువడుతున్నాయా అనే భావన అందరిని సంభ్రమంలో ముంచేసింది. ఆయన ధరించిన ధవళ పట్టు వస్త్రపు … పై హరిత వర్ణపు జరీఅంచు ఓ రకమైన హుందాతనం ఇస్తూ ఉండగా...… కింద కెంపురంగు వెడల్పాంటి జరీ అంచు కాలి మీద ఉన్న గండపెండెరాన్ని సున్నితంగా పలకరిస్తోంది.

శాస్త్రిగారిని సకల మర్యాద సత్కారాలతో, మంగళవాయిద్యాలతో వేదిక మీదకి తీసుకెళ్ళి ఆసీనులను చేసారు. వారితో ఎప్పుడూ వేదికనలంకరించే వాయిద్యకారులు లేచి నిలబడి నమస్కరించారు. ఆయన చిరునవ్వుతో తలపంకించి వారందరినీ కూర్చోమన్నట్లు సైగచేసారు. ప్రత్యేకంగా పరిచిన రత్నకంబళీ మీద అసీనులై శిరసు అటూ ఇటూ తిప్పి శ్రోతల వంక చూపు సారించారు. శాస్త్రిగారి సువర్ణ కుండలాలు, వారి కర్ణ క్రింది భాగానికి తగిలి వస్తున్న ధ్వనికి దరువులు తను వేస్తున్నాడా అన్న భ్రమలో పడ్డాడు మృదంగ వాయిద్యుడు. సభాసీనుల సంఖ్య తిలకించిన ఆయన బృకుటి ముడిపడింది. ఆయన ఆశించినట్లు సభావరణ కిటకిటలాడుతూలేదు. శాస్త్రిగారి కపోలాలు ఎర్రబడ్డాయి. ఇంత పేరుగొన్న విద్వాంసుడిని, తన గళం వినడానికి జనులు, తోటి సంగీత విద్వాంసులు పోటీ పడుతూ వస్తారు. ఈ రోజు ఇంత ప్రత్యేక వేదిక మీద తన కచేరికి 70 శాతం మాత్రమే శ్రోతలా అనే అహం ఆయనలో తొంగి చూసింది. పాడటానికి నిరాకరిస్తే తన పేరు ప్రతిష్టలేమవుతాయి అనే అలోచన కూడా మొలకెత్తింది. నిర్వాహకులని దగ్గరకు పిల్చి వారి చెవిలో గంభీరంగా గుసగుసలాడారు. వాళ్ళు వణికిపోతూ శాస్త్రి గారికి దండాలు పెట్టారు. ఇంకొద్దిసేపు ఆగుదాము శాస్త్రిగారు. తప్పక ప్రేక్షకుల సంఖ్య  పెరుగుతుందన్నారు. శాస్త్రిగారు మీమాంసలో పడ్డారు.

ఇంతలో అక్కడ కొమ్మమీద వ్రాలి ఉన్న కోయిల సన్నగా నవ్వి "శాస్త్రిగారూ! మీ అద్భుత గాత్రానికీ, అపూర్వ సంగీత నైపుణ్యానికి ప్రణామం! కాని ఒక్క సంగతి విన్నవించుకుంటున్నాను. ఎవరు విన్నా వినకపోయినా రోజు గొంతెత్తి నేను పాడుతాను.…..ఆ పాట కేవలం నా సంతోషం కోసమే కాని పరులైకాదు. అయినా నా పాట సాగుతూనే పశుపక్ష్యాదులు, జనం తలలూపుతూ వింటారు…… మీకర్థమయిందనుకుంటాను” అంటూ ఎంతో వినమ్రతో నమస్కరించి గొంతెత్తింది.

ఆ కొమ్మల క్రింద ప్రవహిస్తున్న ఏరు గలగలా నవ్వి "అక్షర సత్యం! ఎవరూ నా వొంపుసొంపులు చూసినా చూడక పోయినా అలా వయ్యారంగా సాగిపోతూ ఉంటాను….. అయినా నా మీద ఎన్నో గేయాలు, ఎంకి పాటలు, కవితలు జగతిలో ఉన్నాయి” అంది.

“చాలు ! నీ గొప్పలు ! ఇక ఊరుకో !” అని కళ్ళురిమింది వృక్షం. శాస్త్రిగారి వైపు చూసి తలవంచి.

"ఈ తలములో ఎవరూ తిన్నా తినకపొయినా ప్రతి ఏడాది పూలూ పళ్ళు కాచి నాదేహం మురిసిపోతుంది!” అంది వినయంగా.

వెనకాల ఉన్న జలపాతం గంభీరంగా గొంతు సవరించుకుని

"ఎంత చక్కగా సెలవిచ్చారు మీ అందరూ! మనందరికీ పెక్కు ప్రేక్షకులు కావాలని ఆశించడం అవివేకం… ఒకరి కోసం గాలివీచదు. సూర్యచంద్రులు, తారలు స్వయంచాలకంగా వస్తూ పోతుంటారు….. శాస్త్రి గారు! అహం వదిలి మీ మీద అభిమానంతో వచ్చినవారి కోసం తనివితీర పాడండి. శాస్త్రీయ సంగీతానికి జనాదరణ పెంపొందించండి!” అంది....లేదా ఇవన్నీ ఇలా అంటున్న భావన రామశాస్త్రిగారిలో కలిగి కళ్ళల్లో నీరు నిండి తన అహానికి సిగ్గుతో చితికిపోయారు. గొంతు సవరించుకుని, సభకి నమస్కరించి, అర్థనిమీలనేత్రాలతో విఘ్నేశ్వరుని ప్రార్థించి, శివరంజని రాగం ఎత్తుకున్నారు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.

*****

Posted in December 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *