కాలచక్రంలో మరో ఏడు రివ్వున సాగిపోయింది
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లాగ
గత ఏడాది చివరలో సరిగ్గా ఇదే సమయంలో
మదిలో ఎన్నో ఆశలు పొదివికొన్న ఆశయాలతో
ఈ ఏడాదికి చెప్పాను ఘన స్వాగతం అంజలితో
నా మనోగతమీడేరగ ప్రణాళికలు రచించుటలోనే
నిమగ్నయ్యాను కానీ ఇంకా ఆచరణ మొదలెట్టలేదు
ఇంతలోనే భల్లున తెల్లారినట్టు కొత్త ఏడాది వచ్చింది
ఇప్పుడే అయ్యింది జ్ఞానోదయం హృదిలో నవోదయం
కాలమెవ్వరి కోసమో ఆగదన్నది నిష్ఠుర సత్యం కదా!
గెలుపు గుఱ్రంలా కాలంతో పాటు పరిగెత్తాలి సదా
విశ్వమే కుగ్రామమైన ఆధునిక సాంకేతిక యుగంలో
రేపు మాపు అంటూ ఒళ్ళు బద్దకిస్తే బ్రతుకుకు చిల్లులే
లక్ష్యమే తోడుగ కఠోర పరిశ్రమ రగిలే అగ్ని కావాలి
ద్విగుణీకృతమైన దీక్షాదక్షతలు వాటికి ఆజ్యం పోయాలి
ఎదలో మెండుగా నిరంతర పోరాట స్పూర్తి నిండాలి
అప్పుడే కన్న కలల సాకారం శ్రమైక జీవన సాఫల్యం
జీవితమంటే ఒక్క విజయముతోనే ముగిసినట్టు కాదు
ఊపిరి ఉన్నంతవరకు కాలంతో సాగే వీర విహారం
ప్రతి ఏడు కొత్త కొత్త ఆశలు వినూత్న ఆశయాలతో
జీవన యవనికపై జైత్రయాత్రల చిత్రాలు గీయాలి
స్పూర్తిదాయక జీవితం పలువురికి కావాలి ఆదర్శం
ఈ విజయగాధ సమాజానికే చేయాలి మార్గ నిర్దేశం
మార్గ నిర్దేశం
Posted in January 2023, కవితలు