Menu Close
Lalitha-Sahasranamam-PR page title

చతుర్ధ అధ్యాయం (అమ్మవారి కుండలినీ యోగం రహస్యం)

శ్లోకాలు: 34/2-37, సహస్రనామాలు: 85-98

085. ఓం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజాయై నమః

వాగ్భవకూట రూపమైన ముఖపంకజంతో భాసిల్లు లలితా పరమేశ్వరికి వందనాలు. (పంచదశీ విద్యతో ప్రధమంగాఉన్న పంచాక్షరీకు వాగ్భవ కూటమని పేరు.)


086. ఓం కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః

కంఠమాదిగా మధ్య (నడుము) ప్రదేశం వరకూగల శ్రీ లలిత దివ్యశరీరంలో మధ్యకూటమియైన కామరాజకూటమి ఉంది. అట్టి స్వరూపంగల శ్రీ దేవికి వందనాలు.


087. ఓం శక్తికూటైక తాపన్నకట్యోథో భాగధారిణ్యై నమః

తన కటిప్రదేశానికి అథోభాగంలో శక్తికూటాన్ని ధరించియున్న శ్రీ విద్యా స్వరూపిణికి ప్రణామాలు.


088. ఓం మూలమంత్రాత్మికాయై నమః

సంసార సాగరాన్నుండి తరింప జేయుటకు సాధనమైనది మూలమంత్రము.
అట్టి మూలమంత్రమే ఆత్మగాగల దేవికి ప్రమాణాలు.


089. ఓం మూలకూటత్రయ కళేబరాయై నమః

‌మూలమంత్ర యుక్తమైన త్రికూటాలే శరీరంగాగల అంటే కూటత్రయ స్వరూపిణియైన శ్రీలలితా మాతకు ప్రణామాలు.


090. ఓం కుళామృతైక రసికాయై నమః

కుళామృత రసాన్ని ఆస్వాదించడంలో రసికురాలైన శ్రీ మాతకు నమోవాకాలు.


091. ఓం కులసంకేత పాలిన్యై నమః

శ్రద్ధాభక్తులతో వినయంగా అర్ధించువారికే శ్రీవిద్యను ఉపదేశించాలి. సత్కల సంకేతాలను పాలించునదీ, పాలింపజేయునదీ అయిన శ్రీవిద్యా స్వరూపిణికి ప్రణామాలు.


092. ఓం కులాంగనాయై నమః

పాతివ్రత్యాది గుణశీల పవిత్ర ఇత్యాదులుగల కులాంగన స్వరూపిణికీ ప్రణామాలు.


093. ఓం కులాంతస్థాయై నమః

ఇంద్రియ సమూహమైన కులంలో సుస్థిరమైయుండు మాతకు వందనాలు.


094. ఓం కౌళిన్యై నమః

గృహ, ప్రదేశ, దేహాదులన్నింటియందూ పూజింపబడునట్టి కౌళిణీ స్వరూపిణికి ప్రణామాలు.


095. ఓం కులయోగిన్యై నమః

వైదికులాచరించు సమయాచారమార్గంద్వారా ఆరాధించబడునట్టి కులయోగినీ స్వరూపిణికి ప్రణామాలు.


096. ఓం అకులాయై నమః

కుళసంబంధాతీతురాలను పరమేశ్వరికి వందనాలు.


097. ఓం సమయాంతస్థాయై నమః

సమయాచార మార్గంలో విహరిస్తూ తేజరిల్లునట్టి దేవికి వందనాలు.


098. ఓం సమాయాచార తత్పారయై నమః

వేద సమ్మతమైన సమయాచార మార్గంలో ఆరాధనలు పొందుటయందు తత్పరురాలైన శ్రీ మాతకు వందనాలు.


* * * చతుర్ధ అధ్యాయం సమాప్తం * * *

పంచమ అధ్యాయం (గ్రంథి భేదనము బంధమోచనము)

శ్లోకాలు: 38-40, సహస్రనామాలు: 99-111

099. ఓం మూలాధారైక నిలయాయై నమః

మూలాధారపద్మంలో నాలుగు దళాలుంటాయి. ఆపద్మకర్ణికా మధ్యదేశంలో సర్వదా నిద్రాణస్థితిలో కుండలినీ శక్తి ఉంది. ఆ స్థానంలో ఏకాకినిగా ఉండునట్టి శక్తి స్వరూపిణికి ప్రణామాలు.


100. ఓం బ్రహ్మ గ్రంథి విభేధిన్యై నమః

మాయచే కప్పబడిన బుద్ధిలో స్వస్వరూపజ్ఞానమును కలిగించుటకై బ్రహ్మగ్రంథిని భేదించినట్టి శ్రీలలితకు ప్రణామాలు.


101. ఓం మణిపూరాంతరుదితాయై నమః

నాభిలో దశదళ కమలం ఉంది. అందులో రత్నాలంకృతయై భాసిల్లు శ్రీదేవికి కల చక్రానికి మణిపూరకమని పేరు. ఆ చక్రానికి అధోభాగంలో ఉన్న బ్రహ్మగ్రంధిని భేదించి ప్రకటించబడుచున్న శ్రీమాతకు ప్రణామాలు.


102. ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః

మణిపూరక చక్రోపరి భాగానకల విష్ణుగ్రంథిని భేదించుకొని సాక్షాత్కరించునట్టి పరాశక్తిని ప్రణామాలు.


103. ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః

ద్విదళ పద్మంలో ఆజ్ఞాపరుడైన శ్రీ గురువు భాసిల్లుచుండుటచే దానికి ఆజ్ఞాచక్రమని పేరు. అట్టి ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై తేజరిల్లు శ్రీ మాతకు నమోవాకాలు.


104. ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః

హృదయస్థానంలో అనాహత చక్రస్థానంలోగల రుద్రగ్రంథిని భేదించు తేజరిల్లు పరమేశ్వరికి వందనాలు.


105. ఓం సహస్రారాంబుజారూఢాయై నమః

బ్రహ్మరంధ్రానికి అథోభాగంలో సహస్రదళాలతో తేజరిల్లు పద్మం భాసిల్లుతూంటుంది. ఆసహస్రారకమలో పరిభాగాన ఆరూఢయైన పరమేశ్వరికి అంజలులు.


106. ఓం సుధాసారాభి వర్షిణ్యై నమః

సహస్రారకర్ణిక నుండి అమృతం వర్షించుచుండును. అంటే పరమేశ్వరి అమృతవర్షిణియై నిజ భక్తులను అనుగ్రహిస్తుంది.


107. ఓం తటిల్లతా సమారుచ్చ్యై నమః

అజ్ఞాన, మాయాదులను రూపుమాపి జ్ఞానప్రకాశంతో మెరపుతీగవంటి కాంతులతో తేజరిల్లు మహేశ్వరికి వందనాలు.


108. ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః

మూలాధార, స్వాధిష్ఠాన మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా - నామకాలైన షట్చక్రాలకూ ఉపరిభాగంలో సహస్రార పద్మంలో భాసిల్లునట్టి శ్రీదేవికి వందనాలు.


109. ఓం మహాశక్త్యై నమః

మహత్తరమైన శక్తి స్వరూపిణికి నమస్కారాలు.


110. ఓం కుండలిన్యై నమః

మూలాధార చక్రంలో చుట్టుకొని యుండు సర్వాకృతికల కుండలినీ శక్తికి వందనాలు.


111. ఓం బిసతంతు తనీయస్యై నమః

తామర తూడులోని దారమువలె సూక్ష్మమై సన్ననైనది. పీతాభాస్వత్యుణూపమా - అని శ్రుతి కూడా చెప్పుచున్నది-- అనగా పరమాణువువలె పీతవర్ణంతో భాసిల్లుచున్నదని భావము. అట్టి సూక్ష్మ స్వరూపిణికి ప్రణామాలు.


* * * పంచమ అధ్యాయం సమాప్తం * * *

----సశేషం----

Posted in May 2022, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!