ప్రథమ అధ్యాయం
(అమ్మవారి స్థూలరూప వర్ణన) శ్లోకాలు: 01-21, సహస్రనామాలు: 01-54
బంగారంతో తయారు చేయబడిన కంకణం భుజకీర్తులచే శోభిల్లు మాతకు వందనాలు.
రత్నఖచితమైన కంఠాభరణాన్నీ, సువర్ణమయ చింతాకాన్నీ -- ముత్యాలహారాలనూ ధరించిన తల్లికి వందనాలు.
అమూల్యమైన తన స్తనద్వయంచే కామేశ్వరుని ప్రేమరూపమైన రతనాలనుకొన్న తల్లికి వందనాలు. అంటే కామేశ్వరునియందు శ్రీలలితాదేవి గాఢమైన ప్రేమ కలిగియున్నదని భావము.
నాభిదేశంనుండి ప్రభవించిన నూగారు రూపమైన లోతుకు స్తనద్వయ రూపమైన రెండు ఫలాలుకల శ్రీదేవికి వందనాలు.
శ్రీ లలితయొక్క ఊర్ధ్వభాగము, అధోభాగము రెండూ సమున్నతంగా ఉండడంవల్ల నడుము ఉన్నదా అన్న భావము కలుగుతున్నది. సన్నని నూగారు నడుము ఉన్నదని తెలియబరుస్తూన్నది. అట్టి దేవికి వందనాలు.
స్తనభారాధిక్యతచే నడుము వాలి పోవునేమోనన్న భీతితో బంగారుపట్టిని ముమ్మారు బంధించిరా అన్నట్టు వళిత్రయంతో శోభిల్లుతూన్న జననికి ప్రణామాలు.
ఎఱ్ఱటి కౌస్తుభం సదృశవర్ణం కల పట్టుబట్టను ధరించి తేజరిల్లి పోతున్న పరమేశ్వరికి వందనాలు.
రత్నమయాలైన చిరుగంటలుకల బంగారు వడ్డాణం ధరించిన లలితాంబకు వందనాలు.
కామేశ్వరునకు మాత్రమే తెలిసిన సౌభాగ్య మృదుత్వాలతో కూడిన ఊరుద్వయంకల మాతకు నమస్కారాలు.
మాణిక్య నిర్మిత మకుటాకారంతో శ్రీదేవి జాను(మోకాళ్ళు) ద్వయం విరాజిల్లుతున్నది.
ఆరుద్ర కటక నిర్మితమైన మన్మథుని తూణాలవలె ప్రకాశించు జఘన (పిక్కలు) భాగంలో శ్రీదేవికి వందనాలు.
గూఢ (బలిసిన) శాలమండలు కల దేవికి వందనాలు.
తాబేలు పృష్టభాగం కంటే పాదాల పైభాగం దృఢత్వంగా గల దేవికి వందనాలు.
తనకు నమస్కరించునట్టి భక్తజనుల అజ్ఞానాంధకారాన్ని రూపుమాపునట్టి నఖకాంతులుగల పరాశక్తికి ప్రణామాలు.
పద్మముల మృదుత్వ, సౌకుమార్యాలను తిరస్కరించునట్టి చరణద్వయం కలిగిన శ్రీమాతకు ప్రణామాలు.
మణి ఖచితములైన అందెలతో భాసిల్లుచున్న చరణారవిందద్వయంకల శ్రీదేవికి వందనాలు.
హంసినీ గమనంవంటి మంద మనోహరగమనం కల శ్రీదేవికి వందనాలు.
మహాలావణ్య నిధి స్వరూపిణి అయిన శ్రీ దేవికి వందనాలు.
పరమేశ్వరి శరీరకాంతి, ఆమె ధరించునట్టి వస్త్రాభరణ పుష్పాదులన్నిటికిన్నీ అరుణవర్ణం కలవి. అట్టి సర్వారుణమూర్తికి నమస్కారాలు.
దోషరహితమైన అంగములు గల పరమేశ్వరికి ప్రణామాలు.
ఆపాదాదిశిరః పర్యంతం శాస్త్రోక్తాభరణ సర్వస్వాన్నీ ధరించి తేజరిల్లునట్టి శ్రీ లలితా పరమేశ్వరికి ప్రణామాలు.
కామేశ్వరుని అంక స్థలంలో తేజరిల్లునట్టి పరమేశ్వరికి ప్రణామాలు.
అగ్నియందలి దాహక శక్తివలె పరమశివునిలో అర్థాంగియై అభిన్నమూర్తియైన శివాస్వరూపిణికి ప్రణామాలు.
తపస్సు ద్వారా పరమేశ్వరుణ్ణి స్వాధీనం చేసికొన్న పార్వతీమాతకు వందనాలు.