Menu Close
GSS-Kalyani
జ్ఞానానందమయం
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

శ్రీమతి గుండమరాజు శ్రీ శేష కళ్యాణి గారు, తమ కథల ద్వారా మన సిరిమల్లె కు సుపరిచితులే. ఆవిడ పుట్టింది మచిలీపట్నం. చదువంతా సాగింది తెలుగు నేల మీదే. కనుకనే మాతృభాష మీది మమకారం, తేటతెలుగు తీయదనం తనకు స్వతహాగా అబ్బింది. తల్లితండ్రులు సంగీత సాహిత్య ప్రియులు అదే దారిలో కల్యాణి గారికి కూడా సంగీత సాహిత్యాలపట్ల అభిమానం ఏర్పడింది. కనుకనే నేడు అమెరికాలో నివసిస్తున్ననూ తెలుగువారికీ, తెలుగు నేలకూ దూరమైనప్పటికీ, కథలు రాయడం ద్వారా తన మాతృభాష అయిన ‘తెలుగు’కు దగ్గర అవుతున్నాననే ఆనందంతో నిరంతరం ఎన్నో కథలను వ్రాస్తూ, వాటిని అనేక ప్రముఖ పత్రికలలో ప్రచురించడం ద్వారా భాషా సేవలో లీనమౌతున్నారు. తన కథలను రెండు సంకలనాలుగా కూడా ప్రచురించారు. ‘జ్ఞానానందమయం’ అనే శీర్షిక పూర్తిగా పిల్లల కొరకు వ్రాసి మన సిరిమల్లె లో ఈ నూతన ఆంగ్ల సంవత్సర సంచిక నుండి అందిస్తున్నారు. వారికి మనఃపూర్వక కృతజ్ఞతలు - మధు బుడమగుంట

ముందు మాట:

పిల్లలూ…,

ఈ ప్రపంచంలో మంచి విషయాలూ, చెడు విషయాలూ - రెండూ ఉంటాయి. మనము మన వివేకాన్ని ఉపయోగించి, మంచి విషయాలను మాత్రమే గ్రహించి, చెడు విషయాలను విడిచి పెట్టాలి. చెడు విషయాలు ఆకర్షణీయంగా తోచినప్పటికీ మనకు అవి కీడును చేస్తాయి. అందుకని మనము ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచిని మాత్రమే ఎంచుకోవాలి. మనందరికీ నేడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మనకు ఎన్నో విధాలా మంచిని చేస్తోంది. కానీ, అదే సాంకేతిక పరిజ్ఞానానికి బానిసలై కొందరు పిల్లలు తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు తెలుసా? 'చెడు చూస్తే ఏమవుతుందీ? చెయ్యాలని అనుకుంటే కదా సమస్య?' అని ఎన్నడూ భావించకూడదు. మనము చూసే ప్రతి దృశ్యం, వినే ప్రతి విషయం, చదివే ప్రతి రచనా మన ఆలోచనా ధోరణిని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. రక్తసిక్తమైన చిత్రం చూసినప్పుడు మన మనసుకు కలిగే భావన కన్నా ఒక అందమైన పువ్వును చూసినప్పుడు మనకు కలిగే భావన ఖచ్చితంగా గొప్పది! ఎందుకంటే అందమైన దృశ్యం మన మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రశాంతమైన మనసుతో నిదానంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మనకూ, మన చుట్టూ ఉన్న సమాజానికీ మంచిని చేసి, ఒక మంచి మనిషిగా మనము మన జీవితంలో విజయాన్ని సాధించేలా చేస్తాయి.

మరి మీరు నేర్చుకోవలసిన కొన్ని మంచి విషయాలను పొందుపరచి, కథలుగా రాసిన 'జ్ఞానానందమయం' అనే ధారావాహికను మన సిరిమల్లె పత్రికలో నెలకొక కథను చొప్పున మీ కోసం అందిస్తున్నాను. ఈ కథలలో ఉన్న సందేశాలను ఊరికే చదివి వదిలేయడం కాకుండా, వాటిని మీరు మీ జీవితంలో ఆచరణలో పెట్టి, తద్వారా భవిష్యత్తులో మీరు ఈ ప్రపంచానికి శ్రేయస్సును కలిగించే ఉత్తములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

(పెద్దలకొక చిన్న విన్నపము: ఈ కథను మీ ఇంట్లోని పిల్లల చేత చదివించండి. అవసరమైతే మీరే స్వయంగా వారికి ఈ కథను చదివి వినిపించి, ఇందులోని మంచిని వారికి వివరించి చెప్పండి. ధన్యవాదాలు!)

-కృతజ్ఞతలతో,  శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

****సశేషం****

Posted in January 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!