కంగారుపడుతూ కొడుకును దగ్గరగా తీసుకుని, నిలబడిపోయింది మీనాక్షి. తలెత్తి చూసిన మీనాక్షికి, లారీలైట్ల వెలుగులో, పదడుగుల దూరంలో రెండు కోడెత్రాచులు, బుసలు కొట్టుకుంటు, ఒకదాని నొకటి కవ్వించుకుంటూ, రోడ్డు వారనున్న పొదలలోకి పాకిపోవడం కనిపించి, భయంతో కొయ్యబారిపోయింది మీనాక్షి. ఆ లారీ రావడం వల్ల తనకూ, కొడుక్కీ ఆసన్నమృత్యువు తప్పిందని తెలిసి, ఆమె మ్రాన్పడిపోయింది.
అంతలో ఆ లారీడ్రైవర్ బండిదిగి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. "ఎవరమ్మా నువ్వు? ఇలాంటి సమయంలో- ఈ చీకట్లో పసివాడిని వెంటబెట్టుకుని ఎక్కడికి వెడుతున్నావు? మీకు ఎంత గండం తప్పిందో తెలుసా! సమయానికి నేను వచ్చాను కనుక సరిపోయింది, లేకపోతే ఆ పాములు మిమ్మల్ని కసితీరా కరిచి ఉండేవి! జట్టుకట్టే సమయంలో కోడెత్రాచులు చాలా ఉగ్రంగా ఉంటాయి!"
మీనాక్షికి నోట మాటరాలేదు. మౌనంగా చేతులు జోడించి నమస్కరించింది. తల్లిని చూసి, జీవన్ కూడా తమ ప్రాణదాతకు నమస్కరించాడు.
"ఏ ఊరు వెళ్ళాలి? అది నేను వెళ్ళే రూట్ లో గనక ఉంటే, తీసుకెళ్ళి దింపుతాను, చెప్పండమ్మా!"
ఏ ఊరంటే - మీనాక్షి ఏమని చెప్పగలదు? ఆమెకు పచ్చి వెలక్కాయ గొంతుకలో అడ్డం పడినట్లు, ఉక్కిరిబిక్కిరిగా తోచింది. కాని తమ ప్రాణదాతతో అబద్ధం చెప్పకూడదనుకుంది ఆమె.
"ఏ ఊరు వెళ్ళాలో ఏమీ తెలియదు అన్నా! పరిస్థితులు బాగోక, ఎక్కడైనా బ్రతుకుతెరువు దొరక్కపోతుందా - అని, పిల్లాడిని వెంటదీసుకుని, తెగింపుగా ఇలా బయలుదేరాను. ఆపై అన్నింటికీ ఆ భగవంతుడే దిక్కు!"
"అంతకన్న గొప్ప దక్షత మనకు ఇంక ఎవరున్నారు కనుక! ఆయనే మీకొక దారి చూపించకపోడు! ఇంతకీ మీరు ఏమేం పనులు చెయ్యగలరో చెప్పండమ్మా ... "
"నేనేం పెద్దచదువులు చదవుకోలేదన్నా! ఇంటిపని, వంటపని బాగా చెయ్యగలను. మంచిమంచి పిండివంటలు చెయ్యడం కూడా వచ్చు. ఎక్కడైనా వంటపనిచేసి పిల్లాణ్ణి పెంచుకోవాలని ..."
"బాగుందమ్మా, మంచి ఆలోచన. మా ఊళ్ళో ఒకరు వంటలక్క కావాలంటున్నారు. మా ఊరు రా, అక్కడ ఇంకా ఎవరూ కుదరకపోతే ఆ పని నీకు ఇప్పిస్తా. వాళ్ళకు పూజ, మడీ, ఆచారం ఎక్కువ..."
మీనాక్షి ముఖం వికసించింది. " నే నా పని తప్పకుండా చేస్తానన్నయ్యా! ఏ ఊరైనా ఫరవాలేదు. ఇకనుండీ అదే నా ఊరనుకుంటా. కాయగూరలతో అన్ని వంటలు, పప్పులు, పచ్చళ్ళు యావత్తూ చేతనౌను. కాని, మరోరకం వంటలు - మసాలాలు వేసి వండేలాంటివి మాత్రం నాకు చేతకావు."
డ్రైవర్ అర్ధం చేసుకుని నవ్వాడు, "అవెవరికీ అక్కరలేదు లెండమ్మా! వాళ్ళు నీచు తినరు. బ్రాహ్మణులు. నువ్వుకూడా బాపనక్కవే ఐతే వచ్చి బండెక్కు, తెల్లారి జాము పొద్దెక్కేసరికి అక్కడ దింపుతాను" అంటూ బండి దగ్గరకు నడిచాడు ఆ లారీ డ్రైవరు.
ఇంతవరకూ ముక్కూ మొహం తెలియని వ్యక్తిని నమ్మి, వెంట వెళ్ళిపోడమేనా - అని ఒక్క క్షణం తటపటాయించింది మీనాక్షి. అది అతడు కనిపెట్టాడు.
"ఇదిగో ఓ అమ్మోయ్! నా పేరు వెంకటేశ్వర్లు. నాకు అట్టాంటిట్టాంటి చెడ్డ బుద్ధులేం లేవు. నన్ను నమ్ము. నువ్వు నన్ను "అన్నా" అన్నావని, నీ బాధ్యత నామీద వేసుకుని, నీకు సాయం చెయ్యాలనుకుంటున్నా. ఏ ఇతర ఆలోచనలూ మనసులో పెట్టుకోకు, వచ్చి బండెక్కు, నీకు మంచి జరుగుతుంది" అన్నాడు, అతడు ఇంజన్ స్టార్టు చేస్తూ.
వెంటనే కొడుకునెక్కించి, తానూ ఎక్కికూర్చుంది మీనాక్షి. లారీ బయలుదేరింది.
********
అలావచ్చి చేరారు ఆ తల్లీ కొడుకులు యాజులుగారింటికి. అక్కడ వంటలక్కగా కుదిరాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేకపోయింది మీనాక్షికి. ఏ ఇబ్బందీ తెలియకుండా ఈ పదిహేనేళ్ళూ పరస్పర సహకారంతో చక్కగా గడిచిపోయాయి. జీవన్ పెరిగి పెద్దవాడై డిగ్రీ పూర్తిచేశాడు. ఇంకేం కావాలి! నేడో రేపో ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక, పెళ్ళీ పేరంటం జరిపించి, ఒక ఇంటివాడిని చేస్తే, ఒక తల్లిగా మీనాక్షి బాధ్యత తీరుతుంది. తండ్రి లేకపోయినా, కొడుకుని తీర్చిదిద్ది ప్రయోజకుడిని చేసిన తృప్తి ఆమెకు ఉంటుంది. తన కొడుకు మనుగడకు, అభివృద్ధికీ దారిచూపించిన ఆ యాజులు దంపతుల మీదే కాదు, యాజులుగారి కుటుంబం మొత్తం మీద మీనాక్షికి అవధు లెరుగని కృతజ్ఞత, భక్తి గౌరవాలు ఉన్నాయి. వాళ్ళకు కష్టం కలిగే ఏ పనినీ ఆమె సహించ లేదు. ఎంత తన కొడుకే అయినా కూడా అంతస్తుల వ్యత్యాసం మర్చిపోయి, అభం శుభం తెలియని ఆ ఇంటి అమ్మాయికి తన చిరునవ్వుతో వలవేసి సమస్యలు సృష్టించి, యాజులుగారికి కష్టం కలిగించడం, తను ఎంతమాత్రం ఒప్పకోలేదు. అందుకే జీవన్ ని మందలించి మంచిదారిని పెట్టాలనుకుంది. తనుకాకపొతే బుద్ధి చెప్పడానికి వాడికి ఇంకెవరున్నారు కనుక!
తప్పు చేసినప్పుడు పిల్లల్ని కోప్పడి, దారి మళ్లించడం మంచి పని కాదని ఎవరనగలరు? బాధ్యత వహించే వాళ్ళు, మంచి దారికి మరలిచడంలో కూడా బాధ్యత వహించక తప్పదు కదా! కాని, "అతి సర్వత్ర వర్జయేత్" అన్నారు పెద్దలు. ఆ తప్పు తనవల్ల జరిగింది. ఇప్పుడింక ఏమనుకుని ఏం లాభం! ఆ దైవం తన మొహాన ఏమి రాసి ఉంచాడో - అనుకుంటూ, పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, పూర్వాపరాలను గుర్తుచేసుకుంటూ, కొడుకుమీద ప్రేమ పొంగులువారగా, పరిపరి విధాలుగా వాడిని గురించే తలబోసుకుంటూ, కొడుకు వచ్చే దారివైపు చూస్తూ - ఊరి జనమంతా గాఢనిద్రలో మునిగి ఉండగా తను మాత్రం కళ్ళలో ఒత్తులు వేసుకుని, వీధి గుమ్మంలో కొడుకు రాక కోసమని కనిపెట్టుకుని ఉంది మీనాక్షి...
"ఆకలి కడుపుతో వచ్చిన వాడికి ముద్దుగా అన్నం పెట్టడానికి బదులు, మొహం వాచేలా చివాట్లు పెట్టాను. భరించలేక విస్తరి దగ్గర కూచోవలసినవాడు లేచి వెళ్ళిపోయాడు కదా! పాపిష్టి దాన్ని, ఎంతపని చేశాను! నాలాంటి కర్కోటకురాలైన తల్లి ఈ భూమిమీద మరెక్కడా ఉండబోదు" అనుకుంటూ దుఃఖించింది మీనాక్షి.
కాలచక్రం కదలిపోకుండా క్షణమైనా ఆగదు ఎవరికోసమూ! "ఠంగ్, ఠంగ్" మంటూ రెండు కొట్టింది పక్కింటి గడియారం. ఆ దెబ్బలు సుత్తితో తన తలపైనే కొట్టినట్లుగా బాధపడింది మీనాక్షి. ఎంతవద్దనుకున్నా, "వాడు, కొంపదీసి, ఏ అఘాయిత్యమైనా చేసుకోలేదు కదా!" అన్న భావం పదే పదే ఆమె మనసులోకి వస్తూ, ఆమెలోని మాతృహృదయాన్ని దహిస్తూనే ఉంది.
ప్రేమున్నవాళ్ళు తిట్టినట్లుగా పగవాళ్ళు కూడా తిట్టలేరు - అంటారు, ఒక సామెతలా. అలాగే మీనాక్షికి కూడా కొడుకును గురించి, ఏవేవో మహాభయంకరమైన ఆలోచనలు మనసులోకి వచ్చి, ఆమెకు అంతులేని మనోవేదన కలిగిస్తున్నాయి. ఆమె కొడుకుకోసం ఎదురుచూస్తూ తన ఆకలి దప్పుల్ని మాత్రమే కాదు, నిద్రను కూడా పూర్తిగా మర్చిపోయింది.
తాపాన్ని పోగొట్టి సేదదీర్చే పిల్లతెమ్మెర అల్లనల్లన మెల్లగా వీచింది. ఆకాశాన్ని ఆవరించి ఉన్న కారుమబ్బులు అలవోకగా చెదిరిపోయాయి. నక్షత్రాల కాంతిలో దూరంగా, ఎక్కడో ఒక వ్యక్తి , రోడ్డు మలుపుతిరిగి, ఆ నీరవ నిశీధిలో ఒంటరిగా రోడ్డుమీద నడుచుకుంటూ ఇటువైపుగా వస్తున్న పొలకువ కనిపించింది. క్రమంగా ఆ నడిచి వచ్చే తీరు చూస్తుంటే, అతడు తనకు తెలుసున్న మనిషే - అనిపించింది మీనాక్షికి. ఆ తలెత్తుకు దర్జాగా నడిచే తీరు, అడుగు ముందుకు వేయడంలోని ఒదుగులు - అన్నీ తనకు పరిచయమున్నవే! రోడ్డుమీదే ద్రష్టి నిలిపి, కొడుకు రాకకై ఎదురుతెన్నులు చూస్తున్న మీనాక్షి, ఆ వచ్చేది జీవనేనని గుర్తుపట్టి ఆనందంతో పరవశించింది.
"వచ్చేస్తున్నాడు నా బంగారు కొండ! నా కన్నుల పంట" అనుకుంటూ ఎదురుగా పరుగుపెట్టింది.
అది మరీ అర్థరాత్రి కావడం వల్ల, జనమంతా గాఢనిద్రలో మునిగిపోయి ఉండడంచేత ఆ తల్లీ కొడుకులను ఎవరూ చూడలేదుగాని, చూసి ఉంటే - అది ఒక అద్భుతమైన సమాగమం - అని తప్పక ఒప్పుకునే వారు. చేయి జారిపోయిందనుకున్న పెన్నిధి, చేజిక్కిందన్న సంతోషంతో ఉన్న మీనాక్షి, పట్టరాని ఆనందంతో జీవన్ ని కౌగిలించుకుని "భోరున" ఏడ్చింది. జీవన్ కి కూడా కళ్ళు చెల్లగిల్లగా, "అమ్మా" అని ఆక్రోశిస్తూ తల్లి కౌగిలిలో పసిబిడ్డలా ఒదిగిపోయాడు. కొంతసేపలా ఉండి నెమ్మదిగా తెప్పరిల్లారు ఇద్దరూ. ముందుగా జీవనే నోరువిప్పి మాట్లాడాడు...
"అమ్మా! నేను నిన్ను చాలా కష్టపెట్టాను, నన్ను క్షమించగలవా?"
"నువ్వే నన్ను క్షమించాలిరా కన్నా! నువ్వు చెపుతున్న మాటల్ని కూడా వినిపించుకోకుండా నిన్ను తూలనాడాను, నా పాపానికి నిష్కృతి అన్నది లేదు" అంది మీనాక్షి, కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ.
క్షణం మౌనంగా ఉండిపోయి, ఆపై మాటాడాడు జీవన్, "అమ్మా! నన్ను నువ్వే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారమ్మా? నాకు ఆ పిల్ల మాటతీరుకి నవ్వొచ్చింది. అంతేగాని నాకు మరే చెడు ఉద్దేశమూలేదమ్మా! నన్ను నమ్ము..." అన్నాడు దీనంగా.
మీనాక్షి కొడుకు రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకుని, "నన్ను క్షమించరా నాన్నా! ఆ పిల్ల ఒట్టి తింగరిదని తెలిసీకూడా, నిన్ను ఎంతో బాధపెట్టాను" అంటూ అపరాధ భావంతో తలవంచుకు నిలబడింది.
"ఇప్పటికైనా గుర్తించావు, చాలమ్మా! అదే సంతోషం నాకు. కన్నతల్లే నన్ను అనరాని మాటలు అంటూంటే, నాకు బ్రతుకుమీద విరక్తి కల్గింది. రాత్రి పన్నెండు గంటలకు మన ఊరిమీదుగా వెళ్ళే ఎక్సుప్రెస్ బండి క్రింద పడి చచ్చిపోడం కోసం ట్రాక్ మీద పడుకున్నా, రైలు స్టేషన్ కి వచ్చి కూసింది, అంతా ఐపోయిందనే అనుకున్నా కాని... "
"కెవ్వు"మంది మీనాక్షి. గుండెలుబాడుకుంటూ, "అమ్మో! అమ్మో! ఎంత అఘాయిత్యానికి తలపెట్టావురా నాయనా! నువ్వులేకుండా ఈ అమ్మ ఎలా బ్రతుకుతుందనుకున్నావురా! నేను బ్రతికేదే నీకోసం కదురా" అంటూ ఏడ్చింది. .
"అమ్మా! బాధపడకు, నాకంటే బాగా ఆ భగవంతుడే ఆలోచించాడు నీకోసం! ఎప్పుడూ ఇటువైపు ట్రాక్ పైన వెళ్లే రైలుబండి ఎందుకనో, ఈ వేళ అటువైపునున్న రెండవ ట్రాక్ మీదుగా వెళ్ళిపోయింది. నే నొచ్చేశా కదా, ఇంక బాధపడకు." అంటూ జీవన్ తల్లి కళ్ళు తుడిచి ఓదార్చాడు.
"నాన్నా! క్షణంలో ఎంత ఘోరం తప్పిందిరా! ఒంట్లో బాగుండక ఏదో తిక్కపుట్టి బుద్ధి లోపించిపోయి, నిన్నలా నానా మాటలూ అన్నాను గాని, మీ నాన్న పోయాక ఇంకా నేను ఇలా ప్రాణాలతో మిగిలున్నది నీకోసమే కదురా!"
తల్లి చేతులు పట్టుకున్నాడు జీవన్, "నన్ను క్షమించమ్మా! ఏదో చిరాకులో తల్లి ఒకమాట అన్నదని, ఆమె కడుపులో చిచ్చు పెట్టాలనుకోడం నాదే తప్పమ్మా! నన్ను క్షమించగలవా?" అంటూ తల్లి చేతుల్లో ముఖం దాచుకున్నాడు. మళ్ళీ అంతలోనే తలెత్తి, "అమ్మా! నువ్వు భోజనం చేశావా? నాకు బాగా ఆకలిగా ఉందమ్మా" అన్నాడు మాటమార్చే ప్రయత్నంలో.
"ఇన్నేళ్ళాయి చూస్తున్నావు, ఎప్పుడైనా నేను నీకు వడ్డించకుండా ముందుగా తిన్నానా, చెప్పు?"
"పదమ్మా! చాలా ఆకలిగా ఉంది. ఎంతలేటైనా ఫరవాలేదు, రెండుముద్దలు మజ్జిగన్నం తిందాము, కడుపు చల్లబడుతుంది" అంటూ తల్లి చెయ్యి పట్టుకుని ఇంటివైపుగా దారితీశాడు జీవన్.
ముందుకి రెండడుగులు వేసి ఆగింది మీనాక్షి, "యాజులు తాతయ్యకు ఏదో ఒకటి చెప్పుకోవచ్చుగాని, నువ్వా పిల్ల వెళ్లిపోయే వరకు ప్రైవేటు చెప్పడానికి అక్కడకు రావద్దు. జరిగినది చాలు" అంది.
"సరేనమ్మా! నువ్వు చెప్పినట్లే చేస్తా, తాతయ్యకు నువ్వే ఏదో ఒకటి, ఏ ఇంటర్వ్యూ కో వెళ్ళానని సద్ది చెప్పు, సరిపోతుంది. ఈ మధ్య "ఇంటర్వ్యూ ఏమయ్యింది" అని అడగడం మానేశారు తాతయ్య. ఆ మాట చెపితే ఇంక ఏ ప్రశ్నలూ రావు." అన్నాడు జీవన్.
********
కడిగిన బియ్యం ఎసట్లో పోస్తున్న మీనాక్షికి, "ఆంటీ" అన్నపిలుపు వెనకనుండి వినిపించింది. కాని బియ్యం ఎసట్లోపోస్తూ మాటాడకూడదని శాస్త్రం ఉంది. ఆ ప్రకారం బియ్యం ఎసట్లో పోసి, ఆపై గరిటతో కలియదిప్పి, ఆ తరవాతే వెనుదిరిగి చూసింది మీనాక్షి. ఓణీ కొస నోటిలో ఉంచుకుని మునిపంటితో కొరుకుతూ, మెలికలు తిరిగిపోతూ కోవిద ఎదురుగా కనిపించేసరికి మీనాక్షి కోపం తారస్థాయికి చేరింది.
కానీ, కోపాన్ని బలవంతంగా అణుచుకుని, మృదువుగా మాటాడింది మీనాక్షి, "ఏమ్మా! ఇలా వచ్చారూ, కాఫీ కావాలా" అని అడిగింది.
అదేం పట్టించుకోకుండా కోవిద, "ఆంటీ! ఈవేళ మాష్టారు ప్రైవేట్ చెప్పడానికి రాలేదేం" అని అడిగింది.
"ముఖ్యమైన పనిమీద ఊరెళ్ళాడు, నాల్గు రోజులదాకా రాడు. అయినా ఆయన గొడవ మీకెందుకు? కాఫీ కావాలంటే చెప్పండి, అమ్మాయిగారు! చిటికలో తయారు చేసి ఇస్తా" అంది మీనాక్షి.
కోవిద కాఫీ కోసం కాదు కదా వచ్చింది, మీనాక్షి మాటల్ని పట్టించుకోకుండా, తన మనసులోని మాటను చెప్పేసింది...
"నేను మాష్టార్ని గాఢంగా ప్రేమించా! "లౌ ఎట్ ఫస్టు సైట్!" అంటే తెలుసా మీకు? చూడగానే నా కాయనపై ప్రేమ కలిగింది. ఢిల్లీ వెళ్ళగానే మా నాన్నకి చెప్పి, మా పెళ్ళికి ఏర్పాట్లు చెయ్యమంటా. రేపే మేం మావూరు వెళ్లి పోతున్నాము. మాష్టారికి ఈవేళ నేనే స్వయంగా ఢిల్లీ రమ్మని చెప్పాలనుకున్నా, కాని సమయానికి ఆయన ఊరెళ్ళారు. ఊరునుండి మాష్టారు రాగానే, మీకు నేను చెప్పానని చెప్పి ఢిల్లీ రమ్మని చెప్పండి. మర్చిపోరుకదూ! సరిగా సమయానికి ఆయన ఊరెళ్ళకుండా ఉంటే ఎంతో బాగుండేది" అంది కోవిద బుంగమూతిపెట్టి గునుస్తూ ...
"ఒక్కమాట చెపుతా ఏమీ అనుకోకండమ్మాయిగారూ!" అంటూ మొదలెట్టింది మీనాక్షి, "ఇంతకీ ఈ అబ్బాయితో మీ పెళ్ళికి మీ అమ్మగారు, నాన్నగారూ ఒప్పుకుంటారని మీకంత నమ్మకం ఏమిటి?"
కళ్ళు రెపరెపలాడించి జవాబు చెప్పింది కోవిద, "ఒప్పుకుంటారు. తప్పకుండా ఒప్పుకుంటారు. ఇంతవరకూ నేనేమడిగినా ఎప్పుడూ కాదనలేదు. ఇప్పుడుమాత్రం ఎందుకు కాదంటారు?"
"అయ్యో! అమ్మాయిగారూ, మీరు చాలా పొరపడుతున్నారు. ఇన్నాళ్ళూ మీరడిగినవి చిన్నచిన్న వస్తువులు. పెళ్ళంటే బొమ్మలాటకాదు. రెండు జీవితాలు ఒకటయ్యే బంధం, రెండు కుటుంబాలమధ్య పెనవేసుకునే అనుబంధం! పెళ్ళితో ఎన్నెన్నో బరువు బాధ్యతలు ముడిపడి ఉంటాయి. మీరు అడగ్గానే దీనికి, అంతస్థుల భేదం మర్చిపోయి, పెద్దవాళ్ళు గమ్మున ఒప్పేసుకుంటారనుకోవద్దు. మీరు బాగా ..."
మీనాక్షిమాటలకు అడ్డువచ్చి, "ఆంటీ! మీరన్నీ భయమేసీ మాటలు చెబుతున్నారు. ఎన్నెన్ని సినిమాల్లో చూడడం లేదు మనం! పెద్దవాళ్ళు ఒప్పుకుని పెళ్లి చెయ్యకపోతే, మేము ఇద్దరం ఇంట్లోంచి వెళ్ళిపోయి, ఏ గుడిలోనో పెళ్లి చేసేసుకుని, ఆపై సుఖంగా ఉంటాము" అంది కోవిద కళ్ళు విదుపుకుంటూ.
"సుఖంగా ఉంటాము" - అని అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలరండీ అమ్మాయిగారూ? ఆ అబ్బాయిని గురించి మీకేం తెలుసని!"
ఏమీ సందేహించకుండా జవాబు చెప్పింది కోవిద. "నాకు బాగా తెలుసు ఆంటీ! చూడగానే బోలెడంత మంచివాడనిపించింది. అంతే కాదు, ఎంతో అందంగా ఉంటాడు. హాండ్సం గై! ఇంకేం కావాలి ఆంటీ! అందుకే నేను జీవన్ మాష్టార్ని తొలిచూపులోనే ప్రేమించేశా! వెంటనే 1 - 4 - 3 కూడా చెప్పేశా!" సంతోషం పట్టలేక కిలకిలా నవ్వింది కోవిద.
"1 - 4 - 3" అన్న మాట వినగానే ఉలిక్కిపడింది మీనాక్షి. నిన్న ఆమె, జీవన్ నోటి వెంటకూడా వింది అదే మాట. అదేమిటో తెలుసుకోవాలనుకుంది.
"1 - 4 - 3" అంటే ఏమిటండీ అమ్మాయిగారు?" వెంటనే అడిగేసింది.
కిసుక్కున నవ్వి అంది కోవిద, "అయ్యో! అదికూడా తెలియదా ఆంటీ! అది ఒక కోడ్. ఇంగ్లీషులో " I - LOVE - YOU " అనడానికి బదులు గుట్టుగా అలా అంటారు. అక్షరాల సంఖ్యతో దాన్ని అలా ఒక కోడ్ వర్డుగా మార్చారు. ఆ పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. ఢిల్లీలో మేం CD తెచ్చుకుని చూశాం. నాకు ఆ సినిమా చాలా బాగా నచ్చింది. దాన్ని మీరు చూడలేదా ఆంటీ?"
ఇంకా పసిదనం వదలని కోవిద మాటలు వింటుంటే నవ్వాలో, ఏడవాలో తెలియలేదు మీనాక్షికి. ఆ పిల్లకు ఎలాగైనా నచ్చచెప్పి, భ్రమలు పోగొట్టాలని చూసింది ఆమె ...
"మెరిసేదంతా బంగారం అనుకోకూడదండీ అమ్మాయిగారు! నిదానించి దాని నిగ్గు తేల్చుకోవాలి. ప్రేమించగానే సరిపోదు, ఆ ప్రేమ పెళ్ళిగా మారి స్థిరపడాలి. ఎంత ప్రేమ వివాహమైనా, అది కూడా పెద్దవాళ్ళ అనుమతితో జరిగినప్పుడే రాణిస్తుంది. అప్పుడు ఆ జంట పెద్దల అండదండలతో, చక్కగా సుఖసంతోషాలతో కలకలలాడుతూ కలకాలం ప్రశాంతంగా బ్రతుకుతారు."
పొయ్యిమీద అన్నం ఉడుకుతోంది. కూరలు తరుగుతూ మాటాడుతోంది మీనాక్షి. వంటింటి గుమ్మానికి అడ్డంగా నిలబడి కబుర్లు చెపుతోంది కోవిద.
"నాకా నమ్మకం ఉంది ఆంటీ! నేనడిగితే, ఎప్పుడూ మా పెద్దవాళ్ళు కాదనరు. తప్పకుండా ఒప్పుకుంటారు - అని చెప్పాకదా" అంది నమ్మకంగా కోవిద.
"ఇంతవరకు అడిగిన లాంటిది కాదిది - అన్నాకదా! ఏ తండ్రయినా, కన్యాదానం చేసే వేళలో తను కడిగే కాళ్ళు తనకంటే చిన్న వయసువాడివైనా ఫరవాలేదు, సంతోషంగా కడుగుతాడు. కాని, తనకంటే హోదాలో మాత్రం పెద్దవాడయ్యుండాలని కోరుకుంటాడు. అంతేగాని, తన కూతుర్ని ఎవడో ఒక అనామకుడికి ఇచ్చి పెళ్ళి జెయ్యాలనుకోడు. మీకింకా నిండా పదహారేళ్లైనా ఉన్నాయో - లేవో, మీ కిప్పటినుండీ పెళ్లి ఆలోచనలు మంచివికావు, వెళ్లి చదువుకోండి" అంది మీనాక్షి.
కోపంవచ్చింది కోవిదకు, కాని మీనాక్షి మాష్టారి తల్లి - అన్నది గుర్తుకు వచ్చి సద్దుకుంది. కోపాన్ని దిగమింగి, చివరిమాటగా చెప్పింది, "నేను ఇందాకటి నుండీ చెపుతున్నాకదా, మా అమ్మా నాన్నా ఒప్పుకుంటారనీ, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా మేము ఊరుకోము, ఏ గుడిలోనో హాయిగా మా పెళ్లి మేమే చేసుకుంటామనీ - వినిపించుకోరేమిటి? ఈవేళ ఈ మాట మాష్టారికి చెప్పాలనుకున్నా, కాని అది కుదరలేదు, కనుక మీతో చెప్పాల్సి వచ్చింది. దయవుంచి, ఆయన ఊరినుండి రాగానే మాష్టారితో చెప్పండి నామాటగా - వెంటనే ఆయనని బయలుదేరి ఢిల్లీ రమ్మని! ఈ ఒక్కమాటా చెప్పండి, చాలు - ప్లీజ్!"
"సర్లెండి, అలాగే చెపుతా. ఇంతకీ అమ్మాయిగారూ! మీరు నాకు అసలు విషయం ఒకటి చెప్పారుకారు. ఆ అబ్బాయి మీ ప్రేమకు ఒప్పుకున్నాడా? అసలు, ఈ ప్రేమ విషయం మీరు మాష్టారు ఎప్పుడు మాటాడుకున్నారు?"
మీనాక్షివైపు పులుకూ, పులుకూ చూసింది కోవిద. "ఆంటీ! నేను ఇంతవరకూ ఒక్కసారైనా ఆయనతో మాటాడడం పడనే లేదు. కాని ఆయనకీ ఇష్టం ఉందనే నాకు అనిపిస్తోంది. అందుకే ఢిల్లీ రమ్మన్నాను, తీరిగ్గా అన్ని విషయాలు మాటాడుకోవచ్చని! ఈ లోగా మా వాళ్ళకి నేనంతా చెప్పి ఉంచుతాను."
"నక్కెక్కడ, నాకలోకమెక్కడ! మీవాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకేమీ లేదమ్మా! ఉత్తిపుణ్యానికి నువ్వు వెలితిపడి, మమ్మల్ని వెలితి చెయ్యొద్దు, నీకు పుణ్యముంటుంది. ఒక అనాధని, ఒక వంటలక్క కొడుకుని, ఏ ఆధారమూ లేనివాడిని - ఢిల్లీలో సర్కారు కొలువులో పెద్ద ఉద్యోగంలో ఉన్నాయన పిలిచి, పిల్లనిస్తానంటారని నేనేం ఆశపడటం లేదు. మమ్మల్నిలా బ్రతకనియ్యి తల్లీ!"
కాని కోవిద మీనాక్షిని అలా విడిచిపెట్ట దలుచుకోలేదు, "అలాగైతే మేం వేరే వెళ్ళిపోయి, పెళ్ళిచేసుకుంటామని చెప్పాగా, నమ్మరేం!"
"అలా చేస్తే, అదెన్నాళ్ళ ముచ్చటౌతుందిట? పెద్దవాళ్ళ అండదండలు లోపించగానే, ఎదురొచ్చే వాస్తవాలను ఎదుర్కొని బ్రతకడం చేతకాక, బతుకు నరకంగా మారుతుంది. ప్రేమ తిండి పెట్టలేదు కదా! అందుకే జీవితంలో స్థిరపడ్డాకే ప్రేమైనా, పెళ్ళైనా - అంటారు. ఊహలకీ వాస్తవాలకీ మధ్యనున్న తేడా చాలా ఎక్కువ!"
కోవిద ముఖం కోపంతో ఎర్రబడింది, "ఆంటీ! మీకు ప్రేమంటే అసలు ఏమీ తెలియదు. అందుకే అలా మాట్లాడుతున్నారు. మీకు ఏం చెప్పినా శుద్ధ వేష్టు!"
ఇంతలో "కోవిదా! ఎక్కడున్నావు?" అంటూ తల్లి పిలవడంతో, "వస్తున్నానమ్మా" అంటూ, పట్టుపరికిణీ కుచ్చిళ్ళు రెపరెపలాడేలా విసురుగా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది కోవిద.
"పిల్లకాకి కేంతెలుసు ఉండేలు దెబ్బ'' అనుకుంది మీనాక్షి. మానసికమైన అలజడివల్ల కూరలు తరుగుతూ ఆమె చెయ్యి కోసుకుంది. గాటుపడి నెత్తురోడుతున్న వేలుని, సింకులోని కుళాయిదగ్గర కడుక్కుంటూ, అనుకుంది...
"జనమంతా నేను విధవరాలిననీ, నా భర్త చనిపోయాడనీ అనుకుంటారు. కాని, నాకు మాత్రం - ఆయన ఎక్కడకీ వెళ్ళిపోలేదనీ, నా గుండెల్లోనే పదిలంగా దాగి ఉన్నాడనీ, నా గుండె చప్పుడే ఆయన హృదయస్పందననీ అనిపిస్తుంది. ఆ పిల్ల తేలిగ్గా నన్ను ఎంతమాట అనేసింది! నాకు ప్రేమంటే ఏమిటో తెలియదా? నేను పుట్టగానే అందిట నా మేనత్త, శంకరానికి పెళ్ళాంపుట్టింది" అని. బహుశః అప్పుడే బావకీ నాకూ మధ్య వీడని ప్రేమానుబంధం ఏర్పడి ఉంటుంది! దానిని మృత్యువు కూదా జయించ లేకపోయింది. నేను ఇంకా బావ ప్రేమలోనే జీవిస్తున్నా!, నా భర్తకు ప్రతిరూపమైన నా కొడుకులో ఆ ప్రేమఫలాన్ని చూసుకుంటూ బ్రతుకుతున్నా! నాకు ప్రేమంటే తెలియదా! చటుక్కున ఎంతమాట అనేసింది ఆ తింగరి పిల్ల!".
అంతలో రాజ్యలక్ష్మిగారు అటువైపు రావడంతో పైటి కొంగుతో మొహమంతా నొక్కి తుడుచుకుని పనిలో పడిపోయింది మీనాక్షి.