లలాటమా లోకపావని అది
............సూర్యబింబమును కూడి ఉషోదయ కాంతులు చిందే వినీలాకాశమే కదా.
కనుబొమల కామాక్షి అవి
............ఆ పరమేశ్వరుడు ఎక్కుపెట్టిన శివధనస్సు నుండి వెలువడిన రక్షణ రేఖలే కదా.
వీక్షణమా విశాలాక్షి అది
............అజ్ఞాన తిమిరాంధకారాలను పారద్రోలే జ్ఞాన వీచికలే కదా.
నాసికయ నీరజాక్షి అది
............సమస్త జగతికి ఊపిరినందించే ప్రాణ శక్తియే కదా.
హసితమా హరిణలోచని అది
............నిశీధిలో వెలుగులు పంచే పున్నమి వెన్నెల లే కదా.
పలుకుల పద్మనాయని అవి
............జీవకోటిని ఉద్ధరింపచేసే అమృత వాక్కులే కదా.
కంఠస్వరమా కమలాక్షి అది
............దుష్ట సంహారానికై పూరించే సమరశంఖారావమే కదా.
కరముల కమల లోచని అవి
............భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షములే కదా.
పాద పద్మముల పంకజలోచని అవి
............భక్తకోటి పొందగోరే ముక్తిధామమే కదా.
నవరాత్రులలో వివిధ రూపాలలో కొలువై కటాక్షిస్తావు.
రూపం ఏదైనా భక్తుల కాచే విధం ఒక్కటే కామితఫల ప్రదాయని.