జీవన ప్రయాణంలో
ప్రయాస సాగరంలో
ఉదయమౌనరాగ వీచికలలో
గంభీర సాగరతీర దారులలో
ఎందరిమో మేము
పయనమయ్యాము
మా దారి ప్రక్కన పూలు కిలకిల నవ్వుతున్నా
మబ్బు సందుల్లో బంగారు కిరణాలు రువ్వుతున్నా
వడివడిగా వేటిని ఆస్వాదించ కుండా
కులాసాగా ఏ పాటలు పాడకుండా
ఉల్లాసంగా ఏ ఆటలు ఆడకుండా
దారిలో పల్లెలు సంతలు దాటుకొంటూ
మాలో అందరూ మౌనాన్ని మోసుకొంటూ
మా త్రోవన మేము వెళుతూనే వున్నాము
నవ్వకుండా ఆగకుండా పోతూనేఉన్నాము
పొద్దెక్కినకొద్దీ వడిగా నడవ సాగాము
ఎండదొర నడినెత్తి కొచ్చాడు
గూళ్ళనీడలో పిట్టలు మూలిగాయి
ఎండుటాకులు గలగలా తిరుగుతున్నాయి
మర్రిచెట్టు నీడలో గొర్రెల కాపరి
కునుకు తీస్తూ కలలు కంటున్నాడు
నేను ప్రక్కనున్న కొలను ప్రక్కన
పచ్చికపై అలా నడుము వాల్చాన
నను జూసి మావాళ్ళు హేళనగా నవ్వి
తలెత్తుకొని వడిగా వెళ్లి పోయారు
ఒక్కసారైనా వెనక్కి చూడలేదు
ఒక్క క్షణము నాకోసం ఆగలేదు
ఎన్నెన్నో మైదానాలు కొండకోనలు
ఎత్తుపల్లాలు భవ బంధాలు
దాటి విచిత్ర విదూర దేశాల కు పోయారు
దూరపు వినీల పథంలో మాయమయ్యారు
ప్రభో! అంతులేని దూరాలకు వెళ్లిన
ఆ దీరుల పథ నిర్దేశకు డవు నీవే కదా!
ఈ మహా ఆది అంతాల నిర్మాత నీవే కదా!
ఏవో వెక్కిరింపు లు కేరింతలు
నని ట కదల్చాలని చూసాయి
నేనీ పరిసరాలకు ముగ్ధుడనయ్యాను
ఇహలోక ఆకర్షణకు లోనయ్యాను
చెప్పలేని ఆనందపు మసక నీడల్లో
అవమానపు పరాజయాన్ని ఒప్పుకున్నాను
పడమర అంచుల సిందూర కాంతులు
మెల్లమెల్లగా నా ఎదను మీటినాయి
నీ ప్రకృతి ఇంద్రజా లానికి నామనసు
నా తలపు అర్పించుకున్నాను
నా నిద్ర మేల్కొని కళ్ళు తెరవగానే
నా నిద్రను నీ చిరునవ్వుతో నింపేసి
నా ప్రక్కనే నిల్చొని నవ్వుతున్నావు
మరి నా ప్రయాణ మేమైనదని......
నా వారెల్లిన దారి చాలా దీర్ఘమని.....
నేను చేరాలనే సాధన కఠినమని......