Menu Close
Galpika-pagetitle

బాబ్బాబు మీరైనా సెప్పండే -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

మీకు బాబుగోరు తెలుసాండే?

బాబుగారంటే మన బంగార్రాజుగారేనండి. ఆయనంత పెద్ద మనసున్నోరు, పెద్ద గుండెకాయున్నోరు, పెద్ద కమతం ఉన్నోరు, పెద్ద మేడున్నోరు ఈ పాగోజి. తూగోజిల్లో ఇంకొకాయన్లేరండి మరి.

ఆయన ఇటేపు గుద్దితే గోడకి అటేపున్నా ఇటికలన్నీ పొడిపొడిగా రాలి పోవాల్సిందే. అదండి, బంగార్రాజుగారి గుద్దు బలం! ఇంకాయన ముద్దు బలం మాట చెప్పక్కర్లెద్దండి. ఎందుకంటే ఆరి ముద్దు బలానికి ఎకరాలెకరాలే కరిగి కాళింగేట్లో కలిసిపోయాయిలెండి. ఇంకారి కలాపోసనంటారా? అటేపు కాశీబుగ్గనించీ ఇటేపు నాయుడు పేటదాకా ఆరిని మించిన కలాపోసన చేసినోరు ఇంకొకర్లేరండి. ఆయన కలాపోసనకే కారుకొన్నారండి. కారున్నాక డైవరుండాలి కదండే! అప్పట్లో డైవింగొచ్చిన మొనగాడొక్కడే ఉండీవోడండి. ఆడు మిలట్రీకెల్లి జీపు డైవింగ్ నేర్చుకుని ఒచ్చిన మొనగాణ్ణని చెప్పుకుంటాడుగానీ, ఆడే మిలట్రీలోనూ పనిచెయ్యలేదండి. ఆడు బెజవాడ మిలట్రీ హోటల్లో పనిచేసొచ్చిన వీర సైనికుడండి బాబా! ఆ వీర సైనికుణ్ణి తీసుకొచ్చి ఆరు డైవరుగా ఎట్టుకున్నారండి. ఆ వీర సైనికుడి పేరేంటో ఆడు కూడా మర్చిపోయాడండి. ఎందుకంటే ఆణ్ణి అందరూ డైవరు బాబు డైవరు బాబు అనీవోరండె. దాంతో ఆడు ఇల్లలికేసిన ఈగలాగా కారు కడిగేసిన కనకరాజైపోయాడండి. కనకరాజంటే డైవర్ బాబండె. ఎంతైనా బంగార్రాజుగారి డైవరంటే ఆమాత్రం గౌరవ మర్యాదల్లేపోతే ఎలాగండి బాబా.

మన బంగార్రాజుగారు కలాపోసనలో భాగంగా ఒక సినిమా తీశారండె. అప్పట్లో ఫస్ట్ కలర్ బొమ్మ ఆరు తీసిందేనండె. సినిమావోళ్ళంటే మీకు తెల్దుగానీ ఆళ్ళంతా మహా జంతర్ మంతర్ జాదూటోనాగాళ్ళండె. హాం ఫట్ అంటే చాలు. అంతా అం అః ఇం ఇః ఉం ఉః హెహేహై హొహోహౌ ఐపోవాలంతే. ఉబ్బులింగడైతే ఆడి బతుకంతా హ గుణింతవేనండె. ఆ మాట నేను ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేవోన్నండె. కానీ బంగార్రాజుగారంటే డైవర్ బాబుల మాటలు ఇనేరకం కాదండి. గట్టిగా మాట్టాడితే నన్నే ఉబ్బులింగడంటావా? అని తొక్కి నార తీసేసేవారండె.

తెలుపూ నలుపుల్లో కనపడే రంగుల్లోనే ఎంతోమంది మాడి మసైపోనారండి బాబుగోరా! ఇంక రంగుల బొమ్మలజోలికెళ్తే మసికూడా అంటకుండా గాల్లో కలిపేత్తారండేబాబా అని నేను గిలగిలగిలా గింజుకుంటూండగానే ఆరు కలర్ సిన్మా మొదలెట్టారండె. బొంబాయినించీ కెమెరావోడూ, కలకత్తానించీ దొర్సకుడూ వచ్చి మడ్రాసులో కూకుని కథ ఒండేరండి. అందులో జాంగ్రీకీ జిలేబీకీ తేడా తెలీని తంగవేలుగారు మేనేజరై ఆడిన నాటకాలు ఒకటా రెండా? అప్పట్లో ఎంత చెత్త సినిమా అయినా రెండుమూడు వారాలాడేదండి. మనది కలగూరగంప కదా, రోజుకి ఐదాటల్లెక్కన పదిహేనాట్లాడిందండె. ఆ జిలేబీగాడి దెబ్బకి బంగార్రాజుగారి పూతరేకులన్నీ గాలికి కొట్టుకుపోనాయండి బాబా.

మొత్తానికి రాజుగారి కలాపోసనకి కారు కూడా కరుసైపోయిందండి.

కారులేకుండా డైవరెందుకండే?

ఈ మాటడగ్గానే అద్దెపోన్లే అని డైవర్ని ఇంటికంపిచేత్తే ఆరు బంగార్రాజుగారెందుకౌతారండే బాబా. నేనెల్లిపోతానని మొత్తుకున్నా ఆరు ఒప్పుకునేవారు కారండె. అందుకే ఆరికి కాపడకుండా నేను బల్సుమూడినించీ మకాం ఎత్తేసి గుడివాడలో గంగరాజుగారి కారుకి డైవర్ గా కుదురుకున్నానండె. ఈ సంగతి బంగార్రాజుగోరు ఎలా పసిగట్టారోగానీ ఈ డైవరు బాబు వాసన పట్టేసి తిన్నంగా గుడివాడొచ్చి నా డొక్క చింపి డోలు కట్టి మెడకి తాడేసి మరీ లాక్కుపోయారండి.

రథం ఉన్నా లేపోయినా రాజుగారు రాజుగారే కదండె? కిరీటకాలెట్టుకుని కత్తి నడుముక్కట్టుకుంటేనే రాజుగోరా? పేంటేసి సొక్కాయేసి టై కట్టి కోటేసినోళ్ళందరూ రాజులు కాలేరండి. ఎంత పెద్దరాజుగారైనా మన బంగార్రాజుగారంతటి రాజుగారవ్వాలంటే మాట్లేంటండె బాబా! కోటెనక్కాల సొక్కా సిరిగిపోయిందని కోటుకి ఇస్త్రీ చేయించకుండా ఉంటారా? నమ్ముకున్న మడేలన్నని గాలికొదిలేత్తారా? కారు లేదని డైవర్ని ఉప్పుటేర్లోకి తోసేత్తారా? రాజుగారంటే రాజుగారేనండి. బంగార్రాజుగార్లాంటోరికి మణులూ మాణ్యాలూ కాదండె లెక్క. మనుసులూ మనసులేనండి అసల్లెక్క. ఎంతమంది మనుసుల్ని పోసిత్తే అంత పెద్ద రాజుగారని లెక్కండె.

ఓపారి కార్లేని నాకూ బట్టేల్లేని మడేలుకీ మీరు గొరుక్కునే గెడ్డానికి మల్లిగాడికీ జీతాలెందుకండె దండగ?" అంటే రాజుగారు నవ్వేవారండి. కారుదేముందిరా డబ్బులు పారేస్తే వస్తుంది. గెడ్డమంటావా? డబ్బులుల్లేకపోయినా మాస్తుంది. కానీ మనుషులలా కాదురా. ఒకసారి మనిసిని పోగొట్టుకుంటే మల్లీ సంపాయించుకోలేం. అందుకే డబ్బులకోసం మనుషుల్నెప్పుడూ వదులుకోకూడదురా రేయ్ అనేవారండి.

అంతేకాదు, డైవరంటే సారథంట. సారథంటే పార్థసారథంట. రథం ఉన్నా లేపోయినా ఆ నరుడికి నారాయనుడు సారథంట. డైవరే లేపోతే ఏ బండీ కదల్దంట. బండిని చేసిన వండ్రంగోడికంటే కొన్న రాజుగోరికంటే దాన్ని నడిపేవాడో గొప్పోడంట. అందుకే డైవర్లేనోడు ఆడేం రాజురా?" అనేవోరండె. అయినా మన బంగార్రాజుగారి మాటంటే రాంబాణవే. దానికి తిరుగుండదండి మరి.

అలాంటి తిరుగులేని బంగార్రాజుగోరిమీదే తిరుగుబాటు చేసారండె రాణమ్మగారు.

రాజుగోరి రాజరికానికి మంటెత్తి రాణిగోర్ని ఆరి పుట్టింటారు తీసికెల్లిపోయారండె.

అయినా రాజుగోరు నమ్మిన బంట్లెవ్వర్నీ వదల్లేదండె. ఆరిక్కావలసింది మనుషులండె. మనుషులంటే డబ్బుకోసం చూసుకోకూడదండె. డబ్బుకోసం చూసుకుంటే ఆరు ఎప్పటికీ మనుసులు కాలేరండె.

ఏండే మీకు మాట్లాడే అవకాశం లేదు కాబట్టీ, కిక్కురుమనకుండా నేను రాసిందంతా చదువుతున్నారుగానీ అదే మీగ్గనక మాట్లాడే అవకాశం ఇచ్చాననుకోండి, అప్పుడు కూడా ఇలాగే ఊరుకుంటారా?

ఏమో!!!

మీరెలాంటోరో నాకు తెల్దు. మీరుకూడా మా బంగార్రాజుగోర్లాంటారైతే అప్పుచేసైనా నాకు జీతం ఇత్తారేమో! కాపోతే "మిలట్రీ మొకం చూడని డైవరెదవా, ఊరికే మీకు జీతాలు దొబ్బబెట్టడానికి మీ తాత ముత్తాతలకాడ మేమేమైనా అప్పుతీసుకున్నామనుకుంటున్నావం ట్రా వడ్డీ నాకొడకా" అంటూ పాలేరుకి చెప్పి బైటగ్గెంటేత్తారేమో ఎవరికి తెలుసు? ఐనా మీరెవరో తెలీకుండానే మీ గురించి నేనే ఊహించేసుకుని జవాబులు కూడా నేనే చెప్పేసుకుంటే మీరు నన్ను చూసి నవ్వుకుంటారో లేదో కూడా నాకు తెల్దండె.

కానీ మా మనవడున్నాడు కదండే, ఆడికన్నీ తెసుసండె. ఆడి బాబున్నేను పాలూరి ఈరరాగవయ్య మున్సిపల్ ఎలిమెంట్రీస్కూల్లోనూ, శ్రీ సింతలపాటి బాపిరాజు మెమోరియల్ ఐస్కూల్లోనూ, దంతులూరి నారాయనరాజు కలాసాల్లోనూ సదివించానండి.

మీరెక్కడ దొరికారండేబాబూ. సదివించానంటే అన్నీ నేనే దగ్గరుండి పాఠాల్చెప్పేసి పరీచ్చలెట్టేసి మన మనవడే కదాని అన్నీ ఫస్టుమార్కులేసేసి సదివించేసాననుకుంటున్నారా? లేదండె బాబా, ఈ డైవర్ బాబుకి ఏలుముద్రేగానీ పొట్ట సింపితే అచ్చరమ్ముక్క రాల్దండె.

సర్లెండి మనవడి కత మొదలెట్టి కొడుకు పాట పాడ్డం పద్ధతి కాదుగానీ, మావాడు ఆడి కొడుకుని అంటే మా మనవణ్ణి భీంవరంలో సదివించలేదండె. ఆడు బెజవాడంతా ఇంగ్లీషులో సదివేసి, ఐద్రాబాదంతా దున్నేసి ఉప్పుడు బెంగులూర్లో తెగ తూరుపెత్తేస్తన్నాడులెండి.

ఆడెలాంటోడంటే, వోటల్ కెల్తే వందరూపాయలు టిప్పేత్తాడుగానీ ఆకల్తో ఎవరైనా అడుక్కునేవాడొస్తే అర్ధణా కూడా విదల్చడండె. అదేంట్రా జీతందొబ్బే హోటలోడికేసే ఆ టిప్పేదో ఈ అడుక్కుతినేవాడికేస్తే ఆడి ఆకలైనా తీరుద్ది కదరా అంటే, "ఓర్నా సత్తెకాలంతాతా, తిరిపెంగాడికి కోటిరూపాయిలిచ్చినా తిరిపెం ఎత్తడం మానడు. ఎందుకంటే ఆడి బుద్దే అడుక్కుతినే బుద్ది. అది పుటం పెట్టినా మాన్దు. కాబట్టీ కథలాపి కాకరకాయి రసం తాగు" అనేవాడు.

ఈయాల సంక్రాంతి పండక్కదండే పొద్దున్నే ఆడో కారు కొన్నాడండె.

ఆ కార్లో నన్నెక్కమన్నాడండె. డైవర్ బాబుని కదా, ముందెక్కబోతుంటే, "మహారాజులా ఎనక్కాల కూకో తాతా"అన్నాడు. "ఆడు నాకిచ్చే గౌరవ మర్యాదలు ఈ బెంగులూర్లో మైసూరు మహారాజుకైనా ఇత్తారో లేదో" అనుకుంటూ ఎనక్కాలెక్కి కూకున్నాను.

ఆల్ల ఆఫీసుకాడికి తోలుకెల్లాడు. పొద్దున్నెల్లిన ఎదవ బోయినం టయానిగ్గానీ రాలేదు. వొణ్ణం తినొచ్చాక నాకు డైవింగ్ సేత్తేగానీ నిద్దరట్టదనిపించింది. అందుకే, "కాసేపు నన్ను తోల్నివ్వరా మనవడా" ఆణ్ణి తెగ బతిమలాడేశాను. కానీ ఆడు మాత్రం "నీకేం కర్మ తాతా మహారాజులాగా ఎనక్కాలకూకో" అనే మాటమీదే ఉండిపోయాడు. అంతలోనే ఆడి బాబు ఫోన్ చేశాడు. ఆడితో ఈడు మాట్లాడతన్నప్పుడు గానీ నాకు అసలు సంగతి అర్థం కాలేదు.

ఊహూ, అసలు సంగతి నాకర్థం కావాలనే ఆడు ఆడి బాబుతో అడక్కపోయినా సెప్పేత్తన్నాడు. అదన్నమాట అసలు కథ.

ఆడు డైవింగ్ నాకెందుకివ్వలేదంటే,

నేను బంగార్రాజుగారి డైవర్నంట. ఆ కాలం కార్లు వేరు. ఈకాలం కార్లు వేరంట. మాది గేర్లబండి కాలమంట. ఈడిది గేరుల్లేని బండంట. ఇలా ముట్టుకుంటే అలా కందిపోతందంట. నాలాంటి బండడైవర్ బాబుల సేతికిత్తే కాకిముక్కికి దొండపండు, కోతి సేతికి కొబ్బరికాయా ఇచ్చినట్టంట. నాలాంటి డైవరుగాల్లకిత్తే ఆడి బండిని పాడుచేసేత్తారంట. అందుకే ఆడు డైవర్లని నమ్మడంట. ఆడి కారు ఆడే తోలుకుంటాడంట. ఎందుకంటే ఆడి కారు పేరే "ఆడి" అంట.

*ఆడి* అంట *ఆడి*

మర్యాద తెలవని కారు.

మనం పెద్దోల్లని _ఆడి ఆడు_ అని ఎరుగుదుమా? *ఆరు ఆరి* అంటూ ఎంత మర్యాదగా పిలుత్తాం?

ఆడి ఏంటండి ఆడి?

అంతే లెండి. ఇలాంటి *ఆడి* గాళ్ళకి

డైవర్ కావాలంటే జీతం పారేత్తే వత్తాడు. కానీ కార్రాదుగా?

ఈ ఆడి గాడి కార్లో నేను కూకోలేనండే బాబా

మీరు సూత్తంటే మంచోర్లా కనిపిత్తన్నారు. బాబ్బాబు మీరైనా సెప్పండే

ఆడి కారాపమని

ఆమె “జాన్” -- అత్తలూరి విజయలక్ష్మి

ఆకుపచ్చ వస్త్రాలు ధరించి, ముత్యాల హారాలతో అలంకరించుకున్న వాకిలమ్మ చుట్టూ, కెంపులద్దిన పసుపు పచ్చని మేలిముసుగుతో, పచ్చలహారాల పాపిడి బిళ్ళలతో, చెక్కిళ్ళ మీద గొబ్బెమ్మల దిష్టిచుక్కలతో చుక్కల పల్లకి మీద ముద్దు “గుమ్మాలు” తోడురాగా, కళ్యాణ మంటపానికి తరలివెళుతున్న కొత్త పెళ్ళికూతురులా ఉంది పల్లె. నీలి పట్టు చీరల రెప,రెపలతో, గాజుల గలగలలతో, అలంకరించిన ముద్దబంతి పూవుల్లా పెళ్ళికి తరలి వెళ్తున్నాయి మబ్బుల పేరంటాళ్ళు. మొదటిసారి పరికిణీ కట్టుకున్న కన్నెపిల్లలా హోయలుపోతూ పల్లె చుట్టూ అందాలు ఆరబోస్తోంది కృష్ణమ్మ.

నేల మీద విరిసిన ఇంద్ర ధనుస్సుల్లా నీలాల కళ్ళల్లో, వజ్రాల మెరుపులు కురిపిస్తూ పసుపు, కుంకుమలకి పరువాలు వచ్చినట్టు, ఆకాశాన్ని అంటినట్టున్న పొడుగాటి చెట్లకి గొలుసులా అల్లుకున్న తీగల్లా చేతులు, చేతులు కలిపి మంచుకొండల మీద నుంచి జారిపడుతున్న ముత్యాల్లా ముసి,ముసి నవ్వుల సొగసులు చల్లుతూ, చల్లగాలి స్పర్శకి పులకించి మ్రోగిన వేయి వీణల నాదానికి పులకించి పూసిన పూవుల్లా వాలారు అమ్మాయిలూ.

“ఆడండే అమ్మాయిలూ...” ఊరంతా ఊడలు పరచి, విశ్రాంతి తీసుకుంటున్న మహావృక్షం లాంటి ముసలమ్మ రుస, రుసలాడింది... ముసలమ్మ గద్దింపుకి కెరటం, గగనం రాచుకున్నట్టు ఓధ్వని తెరలు, తెరలుగా అన్ని పక్కలకూ పాకింది...

గొబ్బియళ్ళ...  గొబ్బియళ్ళ...  సఖియా వినవే!
చిన్ని కృష్ణుని సోదరి వినవె.. కృష్ణుని చరితము వినవె..

చేతులు కలిసిన చప్పట్లకు, అడుగులు చేస్తున్న నాట్యానికి శృతి కలిపిన కొమ్మలన్నీ, ఆ “కొమ్మల” పాటలకి వేస్తున్న తాళం ఊరంతా హార్మోనియం అయింది.

పర్వతాలకు రెక్కలు మొలిచినట్టు ఊరిచివర లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్న వృద్ధులు, మధ్యవయస్కులు అయిన మగవాళ్ళు, గాలిపటాలతో పాటు ఎగురుతున్న యువకులు, యవ్వనంలో పాడిన పాటలు గుర్తుచేసుకుంటూ గృహిణులు బిలబిల్లాడుతూ వచ్చేశారు.. రావమ్మా మహాలక్ష్మి అని పలకగానే అష్టలక్ష్ములంతా విచ్చేయడంతో తుంబురనాదంలా వచ్చిపడ్డాడు హరిదాసు “కృష్ణార్పణం” అంటూ... ఆటలతో, మాటలతో, పాటలతో, పాఠాలతో అలసిన వారందరికీ అరిసెలు పంచి మురిసిపోయారు మహిళలు..

“హలో, హాయ్ .. హాపీ పొంగల్ టు every body .... welcome to our show పొంగల్... బంగాల్..చెంగల్... మీ అందరికీ మా షోకి స్వగాతం....”

పుష్పక విమానం నుంచి మెట్రో రైలు మీదకి విసిరేసినట్టు ఉలిక్కిపడి లేచింది మంజరి.

వాళ్ళ ఒంటిమీద నగలున్నాయా.. నగల మీద వాళ్ళున్నారా అనే అనుమానం కలిగేలా ధగ, ధగలాడుతున్న నగలు, అంతకన్నా జిల్ మనిపించే దుస్తులు వేసుకుని రెండు చెవుల దాకా సాగిన పెదాలు విప్పి ముప్ఫై రెండు పళ్ళు కనిపించేలా వెకిలిగా నవ్వుతూ కనిపించారు టి వి స్క్రీన్ మీద యాంకరు.. ఆమె పక్కన మరో నలుగురు ..

అప్పటిదాకా కళ్ళు టి వి మీద, మనసు ఎక్కడో పారేసుకున్న మట్టిలో వెతుక్కుంటున్నాను అన్న విషయం గుర్తొచ్చింది ఆమెకి. గుర్తొచ్చాక ఏడుపొచ్చింది... గబుక్కున లేచి టివి ఆఫ్ చేసి ఊపిరి పీల్చుకుంది.

“టి వి ఎందుకు ఆఫ్ చేశావు” సగం నిద్ర, సగం మెలకువ తో సోఫాలో జోగుతున్న రవీంద్ర తలవిదిలిస్తూ అడిగాడు..

“తెలుగు పండక్కి అరవపేరు పెట్టి ఏడుస్తోంది ఆ పిల్ల... అయినా రేపు భోగి అయితే పొంగల్ అని చెప్తుందేంటి..దాని బొంద..” విసుగ్గా అంది మంజరి.

“ఏదో ఒకటిలే.. మనకి టివి లో చెబితే గానీ ఏ పండగ ఎప్పుడొస్తుందో తెలిసిచావడం లేదుగా..టైం ఎంత?” అన్నాడు ఆవలిస్తూ

సమాధానం చెప్పలేదు మంజరి. ఇద్దరాడపిల్లలు పెళ్ళిళ్ళు అయి అమెరికా వెళ్ళాక, పండగలకీ మామూలు రోజులకీ తేడా తెలియడం లేదు.. మొగుడు, పెళ్లాల్లో ఒకరికి బి.పి, మరొకరికి షుగరు.. ఒకరు ఉప్పు తినరు.. మరొకరు తీపి తినరు.. అన్నం తిన్న రోజు అరగదు... రొట్టె తింటే విరగదు. సిరి ఉన్నా తినడానికి ఏమిలేదు సిరి ధాన్యాల గంజి తప్ప..  రెండు పడక గదుల ఫ్లాట్ లో ఒకరు ఒక గదిలో, మరొకరు మరో గదిలో....వినాయక చవితి పండాల్లో మైకులు చెబితే, దసరా మిగతా ఫ్లాట్స్ లో పేరంటాలు చెబుతాయి... దీపావళి బయట టపాకాయలు చెప్తాయి.. సంక్రాంతి మాత్రం స్మృతులు చెబుతాయి. నిజమే! ఇవన్నీ మధుర స్మృతులు.. మెదడు పొరల్లో ఘనీభవించిన హిమవన్నగాలు..జ్ఞాపకాల వెచ్చదనం సోకినప్పుడల్లా కరిగి కన్నీరవుతాయి. క్రిస్మస్ కి వస్తాము కానీ సంక్రాంతికి రాలేమమ్మా..సెలవులుండవు..నిస్సహాయంగా వాపోయే పిల్లల స్వరాలు వినిపించాయి... అవును మరి ఉన్నది తెలుగుదేశంలో కాదు కదా!

నిట్టూరుస్తూ లేచి కనీసం గడపన్నా కడిగి పసుపు, కుంకుమ పెడదాము.. ఒంగి ముగ్గువేసే శక్తి లేదు.. శక్తి ఉన్నా స్థలం లేదు అనుకుంటూ వీధి గుమ్మం తలుపు తెరిచింది. ఎదురు ఫ్లాట్ లో ఉండే యామిని జానెడు గుమ్మం ముందు ముగ్గు వేస్తోంది.. ఆవిడని చూడగానే “హాయ్ ఆంటీ!” అంది నవ్వుతూ.

“హలో శాలినీ... నువ్వు ముగ్గేస్తున్నావేంటి” ఐదారేళ్లుగా ఏనాడు ఆ ఇంటి ముందు ముగ్గు చూడని మంజరి ఆశ్చర్యంగా అడిగింది.

ఎడం చేతిలో ఉన్న ఫోన్ చూపిస్తూ ఉత్సాహంగా అంది “యూ ట్యూబ్ లో చూపిస్తున్నారాంటీ.”

“నా తల్లే” అనుకుంటూ మంజరి నీరసంగా నవ్వింది..

“అన్నట్టు ఆమెజాన్ లో ఆవుపేడ తెప్పించానాంటీ..గొబ్బెమ్మలు కూడా పెడతా.. కొంచెం మీక్కూడా ఇవ్వనా ఆంటీ!”..

కళ్ళు తిరిగి కిందపడబోయిన మంజరి తలుపు పట్టుకుని నిలదొక్కుకుంది..

పాపం చేప గేలం మరిచిపోయింది.. జాలం గోలలో... తలుపు డాం మ్మని చప్పుడు చేస్తూ మూసేసింది.

“ఏమైంది?” ఆ శబ్దానికి తలెత్తి చూసాడు రవీంద్ర...

“ఆమెజాన్ లో అమ్మాయిలోస్తారేమో అడగండి..” విసురుగా లోపలికి వెళ్ళిపోయింది జావ కాచడానికి.

తన సంతోషమే... -- గౌరీ కాసాల

"ఓకే పిల్లలూ.. రేపు కంటిన్యూ చేద్దాం. ఆన్లైన్ క్లాస్ ముగించి మీటింగ్ ఎండ్ అని క్లిక్ చేయబోయింది గీత.

"మేడం..మేడం మేడం..."స్టూడెంట్స్ అందరూ ముక్తకంఠంతో పిలిచారు. “ఏంటి” అంది కొంచెం కనీ కనిపించని విసుగుతో.

"రేపు క్లాస్ ఉందా మేడమ్"

"ఏం..రేపు ఏమిటి ప్రత్యేకత”

"సంక్రాంతి మేడం.... భోగి పండుగ మేడమ్.. పెద్ద పండుగ మేడం" ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చిన్న ఉద్వేగంతో చెప్పారు.

“ఓ.. రేపేనా భోగి సరే నేను ఈవినింగ్ మెసేజ్ చేస్తాను లెండి.”

ఏమిటో ఈ మధ్య ఒక్కత్తినే ఉండటంవల్ల... పండగలు, పబ్బాలు, డేట్లు, రోజులు, అన్ని మర్చిపోతున్నాను. అయినా ఒక్కర్తినే పండగ ఏం చేసుకోవాలి...చిన్నప్పుడు...సంక్రాంతి పండగ అంటే ఎంత సంబరం. అమ్మానాన్న ఏడాది పొడవునా సంక్రాంతి కోసం డబ్బులు దాచేవారు. మూడు రోజులకి కొత్త బట్టలు కుట్టించేది అమ్మ పండగ మూడు రోజులు తింటారు కదాని రెండు రోజులకు ముందే అరిసెలు చేసి జాడి నిండా పెట్టి ఎక్కడో దాచేసేది. లేకపోతే పండగ కన్నా ముందే స్వాహా చేసే వాళ్ళం...మేము వంటింటి వైపు వెళ్తుంటే..

అమ్మ అనుమానంగా చూసి ఎందుకు అనేది నవ్వుతూ గద్దిస్తు.....మేము దొరికిపోయి బిక్కమొహం వేస్తే దగ్గరికి తీసుకుని "కొంటెపిల్లలు" అనేది.... బుగ్గలు పుణుకుతూ అమ్మ చేత అలా అనిపించుకోవడానికి నేను మా అక్క తమ్ముడు ముగ్గురము వంతులవారీగా వంటింటి వైపు వెళ్లి అమ్మతో దోబూచులు ఆడేవాళ్ళం.

అన్నయ్య సంక్రాంతికి గాలిపటాల ఆట ఆడేవాడు ఎన్ని గాలిపటాలూ సరిపోయేవి కావు వాడికి. ఎదుటి వాడివి నాలుగు కొట్టినా వాళ్లు వీడివి రెండైనా కొడతారు కదా. ఆ రోజుల్లో అమ్మ అప్పుడప్పుడు వాడికి పది పైసలు నాకు అర్ధణ ఇచ్చేది ఏమైనా కొనుక్కోవటానికి. నాలుగైదు నెలల నుంచి ఆ డబ్బు దాచుకునే వాళ్ళం. గాలిపటాలకి అని. వాడు గాలిపటం ఎగరేస్తే దారపు కండె పట్టుకోవడం నా పని.

గొబ్బెమ్మల కి గుమ్మడి పువ్వులు, ఆవు పేడ కోసం ఎక్కడెక్కడో తిరిగేవాళ్ళం. నేను మా అక్క...., ఒకసారి అలాగా తెలియకుండా దగ్గరలో ఉన్న పల్లెటూరికీ వెళ్ళిపోయామ్. అమ్మ అలవాటు చొప్పున ఆలస్యమైనందుకు గాభరా పడుతూ ఇంటికి రాగానే ఒక బుగ్గ పోటు పొడిచింది.

అప్రయత్నంగా బుగ్గ తడుముకుంది..

కాలింగ్ బెల్ మోగటం తో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది.

"అమ్మా పాత న్యూస్ పేపర్స్ ఒక 2 ఇవ్వరా.'.. వాచ్మెన్ కొడుకుల అభ్యర్థన.

"ఇస్తాను గాని ఎందుకు రా" అన్నాను. గాలిపటాలు చేసుకోవటానికి అండి అన్నాడు పెద్దవాడు వినయంగా.

ఏం మీ నాన్నకి జీతం బాగానే ఇస్తున్నాం కదా గాలిపటాలు కొనొచ్చుగా"

అయ్యో అలాటిదేటి లేదండి.మూడు రోజుల పండగ కదండీ...మరి అప్పచ్చులు కూడా చేసుకోవాలి కదండీ అందుకనే" అప్పచ్చులు కావాలా గాలిపటాలు కావాలా” అని అడిగాడు.

అప్పచ్చులు ఎప్పుడూ రావు కదండి అందుకని అప్పచ్చులే చేయమన్నామండీ..కొత్తబట్టలు కూడా కొన్నారు కదండీ పాపం....అన్నట్టు అమ్మ మీకు చూపమన్నదండి..

ప్లాస్టిక్ కవర్ లో నుంచి బట్టలు తీసి చూపించాడు. చూడగానే చాలా మామూలుగా చీప్ సిల్క్ పైజమా లాల్చీ దానిమీద చమ్కీలు అద్దిన కోటు...

“ఈ కోటు చాలా బాగుంది కదా” అని అన్నాడు చిన్నవాడు..... భలే ముద్దుగా ఉంటాడు. బూరి బుగ్గలు..

పెద్ద కళ్ళు.. వాళ్ళ సంబరం సంతోషం చూసి అప్రయత్నంగానే ఉత్సాహం వచ్చింది గీతకి.

పర్సులో నుంచి 200 రూపాయల నోటు తీసి వాళ్ళకి ఇస్తూ "గాలిపటాలు కొనుక్కోండి" అంది.

వాళ్ల మొహాలు దివిటీల లాగా వెలిగిపోయాయి..

రెండడుగులు వెనక్కి వేసి తిరిగి "ఓ...” అని గట్టిగా అరుచుకుంటూ కిందకి పరిగెత్తారు.

గీత మనసు “ఓహో" అని బదులు పలికింది.

అనుకోకుండానే (గంట క్రితం చెప్పిన) తుమ్మల వారి ప్రబంధము.. కవిత జ్ఞాపకం వచ్చింది.

కొసరి నూరిన పచ్చి పసపు పూతతో మొగాన పూ దు మారమ్ము అద్దుకుని

కదలి వచ్చెను భాగ్యాల కడలి వోలె
మకర సంక్రాంతి లక్ష్మి హేమంత వీథి

'తను ఒక్కతే ఏంటి? తనకి ఆనందం కలిగించడానికి సంక్రాంతి లక్ష్మి కదిలి వస్తే...' అనుకుంది.
సాక్షాత్తు సంక్రాంతి లక్ష్మి వచ్చినపుడు ఒంటరితనం ఏమిటి నా మొహం..అనీ అనుకుంది..

తలంటి పోసుకొని కొత్త చీర కట్టుకుని అద్దం ముందుకీ వచ్చింది. శ్రద్ధగ తయారైంది. చిన్నప్పటినుండి గీతకి అలంకరణ మీద శ్రద్ధ ఎక్కువ. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్...ఆఫీస్ లో కొలీగ్స్..  రోజు తన రాక కోసం ఆసక్తిగా చూసే వారు...

అలాంటిది ఈ మధ్య ఆసక్తి తగ్గిపోయింది.

కానీ ఈ రోజు మాత్రం కాలేజీ రోజుల్లో లాగా తయారయింది. అద్దంలో తనని చూసి తనే మురిసిపోయింది.

ఇష్టంగా చేసుకున్న పాయసం ఇద్దామని వాచ్మాన్ పిల్లల్ని పిలిచింది. ఉరుకుల మీద వచ్చిన వారు గీతను చూసి అలాగే ఉండిపోయారు. చిన్నోడు..కళ్ళను మరింత విశాలంగా విపార్చుకుని చూడసాగాడు.

"హీరోయిన్ లా ఉన్నారు అమ్మా" అన్నాడు పెద్దోడు.. చిన్నోడు ఇంతలేసి కళ్ళు వేసుకుని చూస్తూ ఉన్నాడు.

"మీ మొహం... చాల్లెండి.. పాయసం ఇచ్చేసి రండి నేను వస్తా గాలిపటాల ఆటకి."

"అమ్మ గారూ..." అంటూ ఆనందం పట్టలేక రెండు కాళ్ళని వాటేసుకున్నాడు చిన్నోడు.

అప్రయత్నంగా వాడిని దగ్గరికి తీసుకుంది. టెర్రస్ మీదకి వెళ్ళారు.

పెంట్ హౌస్ లో అద్దెకున్న కుర్రాళ్ళు....ఆంటీ... అంటూ తోడయ్యారు. తను టెర్రస్ మీద ఉన్నట్టు ఎలా తెలిసిందో... ఫ్లాట్స్ లోని ఆడవాళ్లందరు వచ్చేసారు..

ఆరు పదుల వయసు మరచి వాళ్లందరితో కలిసి ఆడింది, పాడింది, ఆనందంగా గడిపింది.

ఒకళ్ళిద్దరు బొమ్మలకొలువుకి పిలిచారు.

"గీత గారు ఇంత సందడి ఎప్పుడు లేదండి. మీరు పండగకే కళ తెచ్చారు. ఈ సారి నుంచి ప్రతి పండగా అందరము కలిసి చేసుకోవాల్సిందే.

ప్రెసిడెంట్ భాగ్యమ్మ...మాటలకి నవ్వుతూ తలఊపి కిందకి వచ్చేసింది.

ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.

కాదు..కాదు.. ప్రశాంతంగా ఉంది.

ఆచారాలు సంస్కృతి విషయాలు ఎలా ఉన్నానలుగురితో కలిసి నవ్వుతూ గడపడానికి పండగలు పాటించాలి /పాటిస్తారు అనిపించింది.

అన్నం తిని.... నడుము వాల్చింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొంది ఎస్పీ గొంతు మధురంగా...
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
నిజమే కదా అనుకుంటూనే చక్కని నిద్ర లోకి జారుకుంది.

Posted in March 2022, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!