సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.
వీడియో కాల్
కొత్తింట్లోకొచ్చి వారం కూడా కాలేదు. బబ్లీకి ఆ ఇల్లు ఇంకా అలవాటు కాలేదు. అందుకేగడపదాటబోతూ కింద పడింది. తలకి దెబ్బ తగిలింది. వెంటనే ఆరున్నొకటోరాగం అందుకుంది. దాన్ని ఊరుకోబెట్టడానికి కితకితలు పెట్టాడు శ్రావణ్. మోకాళ్ళ ఉయ్యాల ఊపాడు. గాల్లోకి ఎగరేసి పట్టుకున్నాడు. ఎన్నిచేసినా తనకి ఒంటినొప్పులొస్తున్నాయే తప్ప కూతురి నోటికి మాత్రం నెప్పెట్టడం లేదు. పాపం సుస్వర దీంతో ఎలా వేగుతోందో ఏమిటో అనుకుంటూ భార్యమీద జాలిపడ్డాడు. తన తండ్రి ఎప్పుడూ లేనిది తనవల్లైనా తల్లిమీద జాలిపడుతున్నాడనే కృతజ్ఞతకూడా లేకుండా బబ్లీ ఏడుపు కొనసాగిస్తూనే ఉంది. చాక్లెట్లు, ఐస్ క్రీములు ఎన్ని తెచ్చినా తన జిగటకాంభోజిరాగం మాత్రం వదలడం లేదు.కూరగాయలు తేవడానికి వెళ్ళొస్తున్న సుస్వరకి వీధిలో ఉండగానే వినిపించింది బబ్లీ సంగీత సాధన. ఈ శ్రావణ్ కి ఎంత చెప్పినా అర్థం కాదు. పిల్లల్ని పెంచడానికి పెద్దవాళ్ళ అవసరం చాలా ఉంటుందని ఎంత చెప్పినా వినిపించుకోడు. తనకెలాగూ తల్లీతండ్రీ లేరు. శ్రావణ్ కి తల్లీ తండ్రీ ఉన్నారన్నమాటేగానీ వాళ్ళా ఊరు వదిలిపెట్టి రారు. వాళ్ళు ఊళ్ళో హాయిగా వ్యవసాయం చూసుకుందుగాని రారా అంటే ఈ శ్రావణ్ వినడు. వాళ్ళకి నచ్చజెప్పడం తనవల్ల కాదు. అంతకంటే తనే కిందో మీదో పడి బబ్లీని చూసుకోవడం తప్ప గత్యంతరం లేదు అనుకుంటూ లోపలకి పరిగెత్తుకొచ్చింది. కూరగాయలు పక్కనపడేసి బబ్లీని శ్రావణ్ చేతిలోంచీ తీసుకుంది.బబ్లీ విషయంలో తను కనిపెట్టిన తరుణోపాయాలన్నింటినీ ప్రయోగించి చూసింది సుస్వర. కానీ ఫలితం దక్కలేదు. శ్రావణ్ సుస్వర ఇద్దరూ మార్చిమార్చి బుజ్జగిస్తున్నా బబ్లీ ఊరుకోవడం లేదు. "ఒక్కోసారి తిక్కెక్కిందంటే ఈ బబ్లీని ఊరుకోబెట్టడం బ్రహ్మతరం కూడా కాదురా" అనుకుంటూ బైటికి తీసుకువెళ్తూండగా శ్రావణ్ కరవాణి మోగింది. చూస్తే అదో రాంగ్ నంబర్.ఆ సెల్ ని చూడగానే సుస్వరకి పాతింటి పిన్నిగారు గుర్తొచ్చారు. వెంటనే ఆవిడకి వీడియో కాల్ చేసింది. స్క్రీన్ మీద పిన్నిగారిని చూడగానే బబ్లీ ఏడుపు రెండింతలైంది. కూతురు రెట్టించిన ఉత్సాహంతో ఏడవడాన్ని చూసిన శ్రావణ్ అరికాలిమంట నెత్తికెక్కి సుస్వర చేతిలోంచీ ఆ సెల్ ని లాక్కోబోయేంతలో అవతల్నించీ పిన్నిగారు తన కూతురిమీద తెగజాలి చూపించేస్తూ "ఏంతమ్మా అలా ఏలుత్తున్నావ్, అమ్మ కొత్తిందా?" అంది "లేదు. పద్దాను""అయ్యో ఎలా పద్దావ్ తల్లీ?"ఇద్దో ఇలా పద్దాను" అంటూ తను గడపదాటబోతూ ఎలా పడిందో చూపించింది.
"దెబ్బ తలిగిందా?" "ఊc"
"లత్తమొచ్చిందా?"లాలా"
“లత్తం కూడా లాపోతే అదో దెబ్బా దానికో ఏడుపూనా. సిగ్గులేదూ? మీ అమ్మ నాన్న ఎప్పుడైనా ఏడ్చారా?""లేదు" బిక్కమొగంతో చెప్పింది బబ్లీ.
"నేను?""లేదు""నేను పెద్దా నువ్వు పెద్దా?" "నేనే పెద్ద" “పెద్దొల్లెక్కడనా ఏడుత్తాలా? ముందు కళ్ళు తుడుచుకో"అనగానే బబ్లీ కళ్ళు తుడుచుకుని ఆరిందాలా చెప్పింది,
"పెద్దోల్లు ఏడవకూడదు."ఆ తరవాత ఫోన్లోనే పిన్నిగారిమీద ముద్దుల వర్షం కురిపించింది.బబ్లీ ఏడుపాపేసి పాలుతాగి నిద్రపోయిన తరువాత భర్తకి నచ్చజెప్పడం కోసం ప్రేమగా పక్కన చేరింది సుస్వర. శ్రావణ్ జుట్టు చెరుపుతూ చెంపలు నిమురుతూ అంది, "ఇప్పుడైనా అర్థమైందా, ఇంటికి పెద్దవాళ్ళెంత అవసరమో!"
తడుముకోకుండా సమాధానం చెప్పాడు శ్రావణ్,"తెలిసిందిలే పిల్లా. పాప ఏడుస్తుందని ఏ పల్లె కొంపలోనో పడి చావక్కర్లేదు. నీలా పక్కింటి ఆంటీకి వీడియో కాల్ చేస్తే చాలు"
కాంతానికి ఎప్పటినించో ఉందా కోరిక.. తన మనసులో ఉన్న కోరిక ఎవరికి చెప్పాలన్నా ఏంటో మొహమాటంగా ఉంది. భర్తతో చెబితే ఆయన చేసే వ్యాఖ్య, నవ్వే వెటకారపు నవ్వు ఆవిడకి తెలుసు. కొడుకుని అడగాలంటే మొహమాటం ... నీకేందుకమ్మా ఈ వయసులో అంటాడేమో అని భయం. తన స్నేహితురాళ్ళంతా గుడికి వచ్చినా అది చేతిలో ఉంటుంది. పైగా అదేంటి కాంతం నీ దగ్గర మొబైల్ లేదా అంటూ పెద్ద నేరస్తురాలిని చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళంతా ఆధునికంగా ఉంటారు.. జుట్టుకి రంగేసుకుంటారు. బ్యూటీ పార్లర్ కి వెళ్తారు, నాజూకైన చీరలు కడతారు. తనే యాభై ఎనిమిదికే డెబ్బైఏళ్ల దానిలా ఉంటుంది అనిపించి ఈ మధ్యే కాంతం కూడా జుట్టుకి రంగేసుకోడం మొదలుపెట్టింది. పార్లర్ కి వెళ్లాలని ఉన్నా కొడుకు, కోడలకి తెలిస్తే బాగుండదని సిగ్గుపడి ఊరుకుంది. ఇప్పుడు వాళ్లకి లాగా మొబైల్ కొనుక్కోవాలని మాత్రం ఉబలాటంగా ఉంది. ఎలా? ఎలా?
మర్నాడే ఆవిడ ఎలాకి సమాధానం దొరికింది. కొడుకు శ్రీధర్ లేటెస్ట్ మోడల్ మొబైల్ కొనుక్కుని తను వాడుతున్నది మనవడికి ఇస్తుంటే అంది “ఇప్పటినుంచే వాడికి ఫోన్ ఎందుకురా.. ఆ ఫోన్ ఉంటె నేను మన బంధువులతో అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చుటగా.”
మనవడు కూడా “నాకు వద్దు డాడీ నాకు ఐ ఫోన్ కావాలి అది బామ్మకిచ్చేయ్” అనడంతో శ్రీధర్ ఫోన్ ఆవిడకి ఇచ్చి ఎలా వాడాలో చూపించాడు. వాట్సపు, పేస్ బుక్ ఆవిడ పేరుతొ ఓపెన్ చేసాడు. అందులోనుంచి ఫోన్ ఎలా చేయాలో చెప్పాడు. అన్నీ వివరించాక ఏది ఆన్ చేయి అంటూ ఆవిడ చేతికి ఇచ్చాడు. అప్పటిదాకా దేదీప్యమానంగా వెలిగిన స్క్రీన్ తన చేతిలోకి తీసుకోగానే నల్లగా అవడం చూడగానే ఆవిడ మొహం కూడా నల్లబడింది.
అది గమనించిన శ్రీధర్ అయ్యో ఇలా ఇవ్వు ఫేస్ లాక్ ఉంది తీసేస్తా అంటూ ఆవిడ చేతిలోంచి తీసుకున్నాడు. కాసేపు ఏవో నొక్కి ఏది నీ మొహం కనిపించేలా ఇటు చూడు అంటూ ఫోన్ ఆవిడ మొహం దగ్గరగా చూపించాడు. వెంటనే ఆన్ అయింది.
“దీన్ని పేస్ లాక్ అంటారు. నీ ఫోన్ నువ్వు మాత్రమే ఆన్ చేయగలుగుతావు నీ ఫేస్ ఐడెంటిఫికేషన్ అంటే నీ మొహం ఈ ఫోన్ గుర్తు పడుతుంది. ఇంకెవరూ ఉపయోగించకుండా ఇలాంటి సౌకర్యాలు ఉంటాయి ఫోన్ లో ఫింగర్ లాక్ అంటే నీ బొటనవేలు ఇలా పెడితే ఆన్ అవుతుంది. అలా కావాలా నీ ఫేస్ కావాలా” అడిగాడు.
“నా ఫేస్ పెట్టు ... మీ నాన్న సంగతి తెలుసుగా నా చేయి లాక్కుని మరీ ఫోన్ మీద పెట్టి వాడుకుంటారు.. అసలు ఆయనకి ఇవ్వను” అంది ఆవిడ. శ్రీధర్ చిరునవ్వుతో ఫోన్ సెట్టింగ్స్ చేసి ఆవిడ చేతికి ఇచ్చి “పిన్ని, అత్తయ్యా వాళ్ళు కూడా వాట్సప్ లో ఉంటే బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు... వాళ్ళు కొనుక్కున్న నగలు చీరెలు అక్కడికి వెళ్ళకుండానే చూసేయచ్చు” అంటూ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు.
అప్పటినుంచీ ఆవిడ గుడికి, మార్కెట్ కి ఎక్కడ ఉంటె అక్కడ ఫోన్ మర్చిపోకుండా తీసుకుని వెళ్తోంది. తన ఫోన్ కి ఉన్నట్టు మిగతా వాళ్లకు ఫేస్ లాక్ లేదని తెలిసి గర్వంగా ఫీలైంది.
ఆ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యూ ట్యూబ్ లో చూసిన వీడియో లో లాగా ఫేషియల్ చేసుకుని మొహానికి పాక్ వేసుకుని అది ఆరిందాకా యూ ట్యూబ్ చూడడానికి ఫోన్ చేతిలోకి తీసుకుంది. అదేంటో ఎంత ప్రయత్నించినా ఫోన్ ఆన్ అవలేదు.. ఆవిడకి కంగారేసింది. ఫోన్ పాడైంది కొడుకేమంటాడో అనుకుంటూ టెన్షన్ పడుతూ చాలా రకాలుగా ఫోన్ ఆన్ చేయడానికి ప్రయత్నించింది. ఏం చేసినా ఫోన్ ఆన్ అవలేదు. ఆవిడకి కన్నీళ్లు ఒక్కటే తక్కువైనాయి. ఈ లోగా మనవడు స్కూల్ నుంచి వచ్చాడు. ఆవిడ తను ఫేస్ పాక్ వేసుకున్న విషయం కూడా మర్చిపోయి మనవడికి ఎదురు వెళ్లి కన్నా ఫోన్ పాడయిందిరా... ఆన్ అవడంలేదు అంది ఏడుపు గొంతుతో. వాడు ఆవిడ మొహం చూసి ముందు ఉలిక్కిపడి తరవాత విచిత్రంగా చూసి “నీ మొహానికి ఏంటి బామ్మా ఏం పూసుకున్నావు” అనడిగాడు.
ఆవిడకి అప్పుడు గుర్తొచ్చింది తను ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు. సిగ్గుపడుతూ “ఇప్పుడే వస్తా అది ఆన్ చేయి ఈలోగా” అంటూ లోపలికి వెళ్లి మొహం కడుక్కుని వచ్చి ఆదుర్దాగా అడిగింది ఆన్ అయిందా..
వాడు మౌనంగా ఫోన్ ఆవిడ మొహానికి దగ్గరగా పెట్టాడు. విచిత్రం ఫోన్ ఆన్ అయింది.
వికసించిన మొహంతో అంది “మా నాన్నే బాగు చేశావా ... మీ నాన్న ఎక్కడ తిడతాడో అని భయపడ్డారా.. వాడడం రాక పాడు చేసాను” అంది.
“పాడుకాలేదు బామ్మా... ప్యాక్ వేసుకున్న నీ మొహం అది గుర్తుపట్టలేదు అందుకే ఆన్ అవలేదు”అన్నాడు. ఆవిడ మొహం పాలిపోయింది. ఇంట్లో వాళ్ళే కాదు తను ఫేస్ ప్యాక్ వేసుకుంటి స్మార్ట్ ఫోన్ కూడా ఓర్వలేదనమాట అనుకుంది కసిగా.