“నేను ఇటీవల చేసిన ప్రాజెక్ట్ లో భాగం అయిన సర్క్యూట్ టెలివిజన్ లో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఎంతవరకు నిత్య జీవితంలో ఉపయోగపడతాయి అనే సందేహానికి జవాబు లభించింది. ఒక కెమెరా లెన్స్ పవర్ ఎంత? మొబైల్ లో వీడియో లో కనిపించిన ఒక క్రైమ్ ఇన్సిడేంట్ ని దూరాన ఉండి కూడా ఎలా ఆపవచ్చు అనే కొన్ని కొత్త ఆలోచనలకు పరిష్కారం లభించింది. నిజానికి పెరిగిన టెక్నాలజీ ద్వారా మనం ఎంత దూరంలో ఉన్నా మన ఆఫీస్ లేదా ఇంటి పరిసరాల్లో జరిగే సంఘటనలు అతి దగ్గరగా చూడవచ్చు. అందులో రికార్డ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా ఆ రికార్డు పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.. కానీ, ఆ సంఘటన కి సంబంధించిన చర్యలు స్పాట్ లో తీసుకునే అవకాశం లేదు. అయితే మనం ఇటీవల చేసిన పరిశోధనలో మనం వీడియో లో చూసిన సంఘటన అభ్యంతరకరం అయితే దాన్ని అప్పటికప్పుడు మొబైల్ లో ఒక యాప్ ద్వారా స్టాప్ చేయవచ్చు. ఆ యాప్ నే “స్టాప్ వేర్ యు ఆర్” అన్నాము.. అది చాలా శక్తివంతంగా పని చేస్తున్నదని ఆస్ట్రేలియా లో ఉన్న మన ఇండియన్ ఇంజనీర్ ప్రయోగాత్మకంగా నిరూపించారు. అది మన కంపెనీ సాధించిన విజయాల్లో ప్రధానమైనది అని నేను అనుకుంటున్నాను..”
సన్నగా మొదలైన చప్పట్లు కొన్ని క్షణాల్లోనే ఉదృతంగా మోగాయి. చప్పట్లు పూర్తి అయ్యే వరకూ ఆగి తిరిగి ప్రారంభించింది.. “అయితే కేవలం స్టాప్ తో ఆగకుండా ఉన్న ప్రదేశం నుంచే తక్షణం చర్యలు తీసుకోవడం కోసం మరొక కొత్త యాప్ కనిపిట్టాము అదే “డూ ఫాస్ట్”. ఇప్పుడు ఆ యాప్ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో” ఆమె స్వరంలో క్రమంగా పెరుగుతున్న కాన్ఫిడెన్సు గమనించిన మాధవన్ కళ్ళల్లో సన్నని మెరుపు మెరిసింది ఆ మెరుపే ప్రశంస.. ఇప్పడు అతనికి కళ్ళ ముందు స్మరణలో మరో అమ్మాయి కనిపిస్తోంది... ఆమెలో చురుకుతనం, తెలివితేటలూ, కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరిన్ని కొత్త ఆలోచనలకు రూపకల్పన చేయాలన్న క్రియేటివిటీ కనిపిస్తున్నయి.
అందుకు బహుమతిగా మీటింగ్ త్వరగా పూర్తీ చేసి, మర్నాడు శనివారం, వీక్లీ ఆఫ్ అవడం చేత అందరినీ త్వరగా వెళ్ళిపొమ్మని చెప్పి స్మరణకి మెసేజ్ పెట్టాడు.. “త్వరగా కారు దగ్గరకు వచ్చేయి..”
కారులో కూర్చున్నాక అన్నాడు “మనసారా అభినందిస్తూ నీకు ఇవాళ ఒక గిఫ్ట్ శాంక్షన్ చేస్తున్నాను.”
“ఏంటో అది...” కళ్ళు విశాలం చేసి చూసింది.
“చెప్తా” అన్నాడు.
కారు మరికొద్ది సేపట్లో కృష్ణ రాజ సాగర డాం దగ్గర ఆగింది. అప్పటికి ఆరు దాటుతోంది.. నెమ్మదిగా సూర్యుడు మబ్బుల చాటుకి వెళ్ళిపోతున్నాడు. నది పరవళ్ళు తొక్కుతోంది.
“చూసావా... నిన్ను చూడగానే ఈ నది కూడా పరవశించి హగ్ చేసుకోడానికి ఆరాటపడుతోంది” అన్నాడు మధు.
“వావ్... నీక్కూడా అప్పుడప్పుడూ కాస్త ఈస్తటిక్ సెన్స్ పని చేస్తూ ఉంటుందా..”
“ఊ ... నీకు బుర్ర పని చేసినట్టు...” అన్నాడు.
కోపంగా అతని చేయి విడిపించుకుని దూరం జరిగి “ నేను ఎలా కనిపిస్తున్నాను... చదువురాని మొద్దులా కనిపిస్తున్నానా..” అంది.
“మరీ అలా కాదు కానీ పదహారణాల అమ్మాయిలా ..”
“నేను అమ్మాయినే...”
“ఏమో నాకు అప్పుడే ఎలా తెలుస్తుంది.?”
కోపంగా అతని మొహంలోకి చూడబోయి ఆ కళ్ళల్లో కనిపిస్తున్న కొంటె దనానికి సిగ్గుతో ముకుళించుకు పోతూ..
“నీక్కూడా మాటలు వచ్చే... ఐ మీన్ రొమాంటిక్ గా మాట్లాడడం” అంది.
“ప్రతి మనిషిలో రెండు రకాల రూపాలు ఉంటాయి... ఒకటి బయటి రూపం ... అంటే ఆఫీస్ లో, స్నేహితుల దగ్గర, పరిచయస్తుల దగ్గర, రెండో రూపం కుటుంబ సభ్యుల దగ్గర, భార్యదగ్గర, ప్రియురాలి దగ్గర .. రెండు చోట్లా ఒకేలా ప్రవర్తించేవాడు నా దృష్టిలో పనికిమాలిన వాడు.. ఎవరి దగ్గర ఎప్పుడు, ఎలా ప్రవర్తించాలో తెలిసిన వాడే జీవితంలో ముందుకు నడవగలుగుతాడు.”
“ఆపు బాబూ చస్తున్నాను ఈ ప్రవచనాలతో... ఇంకేదన్నా మాట్లాడు” అంది అతనికి బాగా దగ్గరగా జరిగి భుజం మీద తలవాల్చి.
“ఐ లవ్ యు” అన్నాడు ఆమె తల మీద చెంప ఆన్చి.
గబుక్కున సరిగా నిలబడి “అర్జంట్ గా తాతయ్యకి ఫోన్ చేయాలి... నీ మైకంలో పడి తాతయ్యకి మనం కలుసుకున్న విషయం చెప్పలేదు.. అసలు కలిసిన వెంటనే చెప్పాల్సింది” అంటూ బ్యాగ్ లో నుంచి మొబైల్ తీసింది.
“ఏమని చెప్తావు” కుతూహలంగా అడిగాడు.
“నేను చెప్పడం దేనికి నువ్వే విను ...” ఆంజనేయులు నెంబర్ డయల్ చేయబోతుండగా ఫోన్ మోగింది... అమ్మ కాలింగ్ అని డిస్ప్లే అయింది స్క్రీన్ మీద.
“హాయ్ మమ్మీ!” హుషారుగా అంది స్మరణ.
అవతల నుంచి వెంటనే సమాధానం రాలేదు... స్మరణ రెండు సార్లు ... “హలో! హలో!” అంది.
సన్నగా ఒక ధ్వని వినిపించింది.
స్మరణ విసుక్కుంటూ “ఈవిడ ఫోన్ పనిచేయడం లేదు కాబోలు.. ఈసారి ఫోన్ కొనాలి.. ఆ పాత ఫోన్ పట్టుకుని తిరుగుతుంది” స్వగతంగా అంటూ “ఓ మమ్మీ..” అంది గట్టిగా.
స్మరణ చిరాకు, పరాకు, మధ్య, మధ్య హుషారు అన్నీ గమనిస్తూ చిన్నగా నవ్వుతూ ఆమెనే చూస్తున్నాడు మధు.
స్మరణ అవతల నుంచి సమాధానం రాకపోడంతో మధు వైపు తిరిగి అంది “చెప్పాగా అమ్మ ఫోన్ పాడైంది... ముందు తాతయ్యతో మాట్లాడి అమ్మకి చేస్తాను” అని సంధ్య ఫోన్ కట్ చేసి, ఆంజనేయులు నెంబర్ డయల్ చేయసాగింది.
“మీ అమ్మా, నాన్న కన్నా నీకు మీ తాతగారంటే ఎక్కువ ఇష్టమా!” కుతూహలంగా అడిగాడు.
“అవును” అంది కొంచెం గర్వంగా..
“ఎందుకో” అదే కుతూహలం ప్రదర్శించాడు.
స్మరణ నెంబర్ డయల్ చేసి రింగ్ అవకపోడంతో కట్ చేసి అంది “తాతయ్య నాకు ఫ్రెండ్. నా గైడ్ ..మేము బోలెడు విషయాలు మాట్లాడుకుంటాము.. నా సీక్రెట్స్ అన్నీ తాతయ్యకి చెప్తాను. మా అమ్మ చాదస్తం నీకు తెలియదు మధూ! నా చదువు పూర్తీ అయి జాబు లో చేరిన వెంటనే మొదలుపెట్టింది పెళ్లి, పెళ్లి అనే నస.. కొన్ని మ్యాచేస్ కూడా తీసుకువచ్చింది. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది.. నీ గురించి నాకే తెలియదు.. వాళ్లకి ఏమని చెప్పను! అలా అని ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుని ఎలా బతుకుతాను! అప్పుడు నా బాధ అంతా తాతయ్యకి చెప్పాను.”
“అలాగా! విని ఏమన్నారు?”
“ఏమంటారు? పెద్దవాళ్ళు అందరూ అనేదే తాతయ్య కూడా అన్నారు కానీ, అందరికన్నా ఆయన ఎక్కువ బ్రాడ్ మైండెడ్ కాబట్టి ఎక్కడున్నాడో తెలియని వ్యక్తి కోసం ఎంతకాలం ఎదురు చూస్తావు? మీరిద్దరూ తిరిగి కలుస్తారని నీకు నమ్మకం ఉందా” అని అడిగారు. “ఉంది తాతయ్యా! నాకు నమ్మకం ఉంది.. ఎక్కువ టైం అడగను. ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి.. ఆ తరవాత మధు కనిపించకపోతే మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకుంటాను” అన్నాను.
మధు లైట్ల కాంతి ప్రతిఫలిస్తూ మెరుస్తూన్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ “ఇప్పుడు మీ తాతయ్య మన పెళ్ళికి ఒప్పుకుంటారు కదా..” అన్నాడు.
“ఎస్ ... వై నాట్ ?”
“మరి మీ పేరెంట్స్....”
స్మరణ సాలోచనగా అంది “డాడీ సంగతి పర్లేదు.. మా మమ్మీనే ఒప్పించాలి...”
“ఎందుకు? ఆవిడకి కాస్ట్ ఫీలింగ్ ఉందా..”
“అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి బాబూ! అసలు ఆవిడకి లవ్ మ్యారేజేస్ అంటేనే ఇష్టం లేదు.. పైగా ఈ కాస్ట్ ఒకటి.. ఎప్పుడో వాళ్ళ ఫ్యామిలీ లో ఏదో జరిగిందని అందరికీ అలాగే జరుగుతుందా చెప్పు! అసలర్ధం చేసుకోదు. ఇంటికి ఒక గంట లేట్ గా వెళ్తే టెన్షన్... నేను ఒక్కదాన్ని అవుట్ అఫ్ స్టేషన్ వెళ్తానంటే టెన్షన్.. నా ఫ్రెండ్ ఎవరన్నా అబ్బాయి మా ఇంటికి వస్తే టెన్షన్.. ప్రతి దానికి టెన్షన్.. ఆవిడకి తోడు ఆవిడ కొలీగ్స్ .. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే భయంతోటే బతుకుతారు.. మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి.. మీ మొగుళ్ళకి అప్పచెప్పి మేము కాస్త మెంటల్ గా రిలాక్స్ అవుతాం అని పోరు.. అయినా తప్పు వాళ్ళది కాదులే.. ఈ సొసైటీ అలా ఉంది పాపం ఏం చేస్తారు?”
“సో మొగుళ్లంటే బాడి గార్డ్స్ అన్నమాట..”
“అంతేగా మరి” కొంటెగా నవ్వింది.
“జీ హుజూర్ ... ఇప్పటి నుంచీ నేను నీ బాడీ గార్డ్ ని.. మీ అమ్మకి అలాగే చెప్పు... ఒప్పుకుంటుంది.”
“సరే బాడి గార్డ్ నాకిప్పుడు అర్జెంటు గా ఐస్ క్రీం కావాలి..” రెండు చేతులూ కట్టుకుని విలాసంగా నిలబడి ఆజ్ఞ జారీ చేస్తున్నట్టు అంది.
“చిత్తం ... ఇక్కడికి మీరు కోరిన మంచు మీగడ తేవాలంటే దారిలోనే కరిగిపోయే అవకాశం ఉంది.. కాబట్టి మిమ్మల్ని ఇలా తీసుకువెళ్ళి తినిపిస్తాను..” గబుక్కున రెండు చేతులూ నడుం చుట్టూ బిగించి ఎత్తుకోబోయాడు. కెవ్వుమంది స్మరణ.... “పిచ్చా! వదులు.. సినిమా షూటింగ్ అని జనం గుమికూడతారు..” అంది.
అతను నవ్వి నడుం చుట్టూ చుట్టిన చేతులు మరింత దగ్గరగా జరిపి గొలుసులా కలిపి ఆమెని గట్టిగా గుండెలకు అదుముకున్నాడు. హటాత్ సంఘటనతో ఆమెకి మైకం కమ్మినట్టు అయింది. ఆకాశంలో నక్షత్రాలన్నీ అక్షితలుగా తన మీద కురుస్తున్న భావన.. పరవశంతో పరిసరాలను మరిచిపోయి అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది..
అతను ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు.. “నీ నమ్మకం, నీ మనో ధైర్యం గెలిచాయి స్మరణా! ఎప్పటికీ నువ్వే విజేతవి.. నేను నిజంగానే నీ సేవకుడిని ..”
“ఛీ ...” కుడిచేతి వేళ్ళు అతని పెదాల మీద ఆన్చి “కాదు.. నా సర్వస్వానివి..” అంది కంపించే స్వరంతో.
“మనం కలుసుకున్న తరవాత నీ చిరాకు, పరాకు చూసి నవ్వుకున్నాను.. స్మరణ కూడా అందరు ఆడపిల్లల్లాంటిదే.. ఒట్టి పోసేస్సివ్ అని... అపుడే నిర్ణయించుకున్నా.. ఇక్కడే... ఇలాగే నీకు ఐ లవ్ యు అని చెప్పాలని... కానీ నీ మొహం చూస్తే చెప్పిందాకా ఆగేలా లేవు అనిపించి ముందు చెప్పాను. అయినా పర్వాలేదు.. దేని అనుభూతి దానిదే కదా.. ఇప్పుడు మళ్ళీ మరో రకంగా చెప్తాను” నెమ్మదిగా ఆమె చెంప మీద పెదాలతో స్పృశిస్తూ, చెవిలో చెప్పాడు..” ఐ లవ్ యు... ఐ లవ్ యు..”
ఓ పెద్ద అల చివ్వున నీళ్ళు చిమ్ముతూ ఆమెని ముంచెత్తినట్టు అనిపించింది స్మరణకి. గాలితో పాటు హమ్ చేసింది...”ఐ టూ” అంటూ.
ఆమె చేతిలో ఫోన్ మోగింది.. గబుక్కున దూరం జరిగి... “ఛ నేనేంటి ఇలా అయిపోతున్నాను.. నిన్ను కలిసిన దగ్గర నుంచి అమ్మ, నాన్నలను నెగ్లెక్ట్ చేస్తున్నాను.. చూసావా డాడీ ఫోన్.. మమ్మీ ఫోన్ పాడైంది అని చెప్పాగా ... నా గెస్ కరెక్ట్ ...” ఆన్సర్ బటన్ నొక్కి హలో అంది.
ఆమె ఎడమ చేయి అతని కుడిచేతి గుప్పిట్లో ఉంది. కుడిచేత్తో ఫోన్ పట్టుకుని “డాడీ! మమ్మీ ఫోన్ పాడైందా .. తాతయ్య ఫోన్ తీయడం లేదేంటి...నేను తాతయ్యతో మాట్లాడాలి..” గలగలా మాట్లాడుతున్నదల్లా గాభరాగా అడిగింది.. “ఏంటి? ఏమైంది? ఎందుకు? ఎప్పుడు?” ఆమె స్వరంలో కంగారు గమనించిన మధు చేయి చప్పున వదిలి ఆమెకి మరికొంచెం దగ్గరగా జరిగి భుజం మీద నొక్కి పట్టుకున్నాడు.
వణుకుతున్న స్వరంతో అడుగుతోంది.. “ఏంటి? తా.... తాతయ్యకి సీరియస్ గా ఉందా... నో.... నో..... ఎందుకు? ఏమైంది? లేదు... లేదు... అలా అవదు.. నేను వస్తాను.. ఇప్పుడే వస్తాను...లేదు వచ్చేస్తాను.. వచ్చేస్తున్నా” ఫోన్ కట్ చేసి మధు వైపు తిరిగింది... ఆమె కళ్ళల్లో అప్పటికే నీళ్ళు నిండి చెంపల మీదకి బొట్లు, బొట్లుగా రాలసాగాయి...
“మధూ... తా.. తాతయ్యకి సీరియస్ గా ఉందిట..నేను వెళ్ళాలి.. నన్ను పంపించు.. ఫ్లైట్ లో వెళ్తాను... వెళ్ళాలి...” గబా,గబా ఏడుపు మొదలుపెట్టింది.
అతను ఓదార్పుగా వీపు మీద నిమురుతూ “కంగారు పడకు స్మరణా! ఏం జరిగిందో! ఇప్పుడెలా ఉన్నారో అడక్కుండా వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేస్తే ఎలా? నేను మాట్లాడనా మీ డాడీతో..”
“ఒద్దు.... నేను వెళ్లిపోవాలి అంతే ... నేనే కాదు.. నువ్వు కూడా రావాలి..”
“అలాగే వెళ్దాము సరేనా! కారులో తీసుకువెళ్తాను.. ఫ్లైట్ టికెట్ ఇప్పటికిప్పుడు ఎలా దొరుకుతుంది? డోంట్ వర్రీ.. ప్లీజ్ రిలాక్స్ ...ఇంటికి వెళ్లి అమ్మకి చెప్పి వెళ్దాము సరేనా..” లాలనగా చెపుతూ చిన్న పిల్లలా ఒదిగిపోయి నడుస్తున్న ఆమెని అలాగే పట్టుకుని జాగ్రత్తగా తీసుకుని వెళ్లి కారులో కూర్చోబెట్టాడు.
“ఇంటికి వెళ్ళు కృష్ణా!” డ్రైవర్ కి చెప్పాడు.
“తాతయ్యకి ఏమి కాదు కదూ!” బేలగా అడిగింది స్మరణ.
“ఏమి కాదు.. హి విల్ బి ఆల్ రైట్ ...”
“ఐ సి యు లో ఉన్నారు.. సీరియస్ గా ఉన్నారు అని చెప్పారు డాడీ.. నాకు భయంగా ఉంది..”
“ఐ సి యు లో ఉన్నారు అనగానే భయపడతారు ఎందుకు? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ప్రమాదం జరిగే ప్లేస్ కాదు.. అత్యవసర వైద్యం అందించడానికి సౌకర్యంగా ఉండే ప్రత్యేకమైన గది.. పెద్దాయన కదా! మైల్డ్ అటాక్ వచ్చి ఉండచ్చు.. ఐ సి యు లో పెట్టి శ్రద్దగా వైద్యం చేస్తున్నారు.”
అతను చెప్పేది శ్రద్దగా వింటూనే తనలో తను అనుకుంటున్నట్టు చెప్పసాగింది. “అసలు నిన్ను కలిసిన వెంటనే ఫోన్ చేయాలి అనుకున్నా. చాలాసేపు తరవాత అంటే తాతయ్య పడుకునే టైం కి చేసాను.. ఆయన ఫోన్ తీయలేదు.. పోనీ నిద్ర లేవగానే చేసానా.. లేదు.. ఆఫీస్ కి వచ్చేసాను.. మళ్ళీ రాత్రి దాకా వీలు కాలేదు.. అప్పుడు కూడా పడుకున్నారు... ఫోన్ తీయలేదు..” గబుక్కున ఆగిపోయి అంది.. “అంటే నేను రెండు, మూడు సార్లు తాతయ్యకి, అమ్మకి, నాన్నకి కూడా చేసాను.. ఎవరూ లిఫ్ట్ చేయలేదు.. అంటే అప్పటికే వీళ్ళంతా హాస్పిటల్ లో ఉన్నారనమాట.. నేనెంత ఫూల్ ని.. అసలు అలాంటి ఆలోచన రాలేదు నాకు.”
“నెగటివ్ ఆలోచన కదా అది.. ఎలా వస్తుంది? దానికి నువ్వు ఇంత బాధపడనవసరం లేదు..నేను చెప్తున్నా కదా! ఆయన మనం వెళ్లేసరికి లేచి కూర్చుని ఇడ్లి తింటూ కనిపిస్తారు చూడు”
ఆ మాటకి స్మరణ అంత దుఃఖం లోనూ సన్నగా నవ్వింది. ఆ నవ్వు మెరుపులా మెరిసి, వర్షపు జల్లుల్లో జలతారు తీగల్లా అనిపించింది అతనికి. ఆ మెరుపులో ఎన్ని ఇంద్రధనుస్సులు విరిసాయో అన్నట్టు విండో లోంచి బయటకి చూసాడు..
“నిన్ను తాతయ్యకి చూపించి, మన పెళ్ళికి ఆయన చేత అమ్మకి రికమెండ్ చేయించాలని అనుకున్నాను. నేను తప్పు చేసాను మధూ! నిన్ను చూశానన్న మైకం ఒక పక్క.. ఇన్నేళ్ళ తరవాత కలిసినా నాతో గడపకుండా మీటింగ్స్ అంటూ వెళ్ళావన్న ఉక్రోషం ఇంకో పక్క.. ఈ రెంటి మధ్యా తాతయ్యని కొన్ని గంటలపాటు నిర్లక్ష్యం చేసాను.”
“ఇది సహజం స్మరణా! మన ఉద్యోగధర్మాలు, మన యాంబిషన్స్, ఎమోషన్స్, యవ్వనంలో కలిగే ఆకర్షణలు, వీటి వల్ల మనకి తెలియకుండానే మన వాళ్ళ పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం ప్రదర్శిస్తాము.. నిజానికి ఎవరో తప్ప అందరూ కూడా కావాలని పెద్దవాళ్ళను నిర్లక్ష్యం చేయరు..మనకి తెలియకుండా చేసే తప్పు ఇది.. తెలిసే సరికి చాలా ఆలస్యం అయిపోతుంది.. చేసిన తప్పు దిద్దుకునే అవకాశం లభించదు.. అందుకే వీలైనంత వరకు మనల్ని మనం కంట్రోల్ లో ఉంచుకోవాలి.. ఎనీ వే... ఇంటికి వచ్చేసాము.. నువ్వు రెడీ అవు... ఈ లోగా అమ్మతో మాట్లాడి, డిన్నర్ పాక్ చేయిస్తాను.. కారులో తిందాము ..” అన్నాడు మధు.
స్మరణ కారు ఆగగానే గబుక్కున దిగి లోపలికి పరిగెత్తింది. హాల్లో కూర్చుని టి వి చూస్తున్న మీనాక్షి పరుగు పెడుతూ వస్తున్న స్మరణ వైపు విచిత్రంగా చూస్తూ ఏదో అడగబోయింది. స్మరణ వెనకాలే వచ్చిన మధు ఆవిడ పక్కన కూర్చుని విషయం నెమ్మదిగా వివరించి “మాకు డిన్నర్ ప్యాక్ చేయమ్మా.. నేను కూడా రెండు డ్రెస్ లు, లాప్ టాప్ కారులో పెట్టిస్తాను..” అంటూ తన గది వైపు వెళ్ళాడు.
“అయ్యో.. పెద్దాయనకి ఏమి కాదు కదా.. భగవాన్ ఆయన్ని కాపాడు” అనుకుంటూ సోఫాలోంచి లేచింది.
స్మరణ సూట్ కేసుతో వచ్చి “సారీ ఆంటీ! మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను” అంది క్షమార్పణగా.
ఆవిడ వాత్సల్యంగా ఆ అమ్మాయి భుజం తట్టి “నీ మొహం ఇబ్బంది ఏంటి? అసలు నేనూ రావాలి.. కానీ ఇంత హటాత్తుగా కష్టం కదా.. మీరు వెళ్ళగానే నాకు ఎలా ఉందో చెప్పండి... నువ్వేం ఆందోళన పడకు.. తాతగారు తప్పకుండా కోలుకుంటారు.. మనవరాలి పెళ్లి చూస్తారు” అంది నవ్వుతూ.
స్మరణ కూడా నవ్వింది..
మధు బ్రీఫ్ కేసుతో వచ్చాడు. డ్రైవర్ వచ్చి వాళ్ళ లగేజి తీసుకుని వెళ్లి కారులో పెట్టాడు. ఇద్దరూ మీనాక్షికి మరోసారి చెప్పి, ఆవిడ ఇచ్చిన ఫుడ్ పార్సిల్ తీసుకుని బయలుదేరారు.