నాలో లోలో ఎన్నెన్నో ప్రశ్నలు
ఆ దేవుడివే అన్ని తప్పులు
ఉత్సవాలలో అపశృతులు
ఊరేగింపుల్లో ప్రమాదాలు
తొక్కిసలాటలో మరణాలు
తీర్థయాత్రలలో వరదలు
గుడిలో దేవునితో వ్యాపారాలు
పేదవాడికి అన్యాయాలు
ఉన్నవాడికి సౌకర్యాలు
ఏమిటీ మోసాలు
ఏమిటీ వేషాలు
దేవుడేం చేస్తున్నారంటున్నారు
అందుకే దేవుడే లేడంటున్నారు
అవును కదా!! నిజమే కదా!!!
ఆ దేవున్ని అడిగేద్దాం రండి
ఆ భవున్ని కడిగేద్దాం రండి
..................
................
ఏవో నిశ్శబ్ధ శబ్దాలు
అవిగో అమృతవాక్కులు
..........
................
తల్లిని మించిన దైవం లేదన్నాను
ఆవిడను పూజిస్తున్నారా?
తండ్రిని మించిన వేదం లేదన్నాను?
ఆయన్ని ఆదరిస్తున్నారా?
మానవసేవే మాధవసేవ అన్నాను
ఆర్తులకు సాయం చేస్తున్నారా?
అవసరానికి మించి దాచినా దోచినా
కడకు చిల్లిగవ్వ దక్కదన్నాను విన్నారా!
ఇంత దూరాల గుళ్ళకు రమ్మన్నానా?
మీ వూరి గుడిలో నేను లేనన్నానా?
ఇన్ని వ్రతాలు పూజల ఆర్భాటాలు చేయమన్నానా?
ఆకో, నీళ్ళో, పూవో చాలన్నానా?
మీ అహం, ధనం, కీర్తి కోసమే
ఇన్ని ఆర్భాటాలు చేస్తున్నారు.
నా గుడులు మీరే కట్టారు
నా రూపాలు మీరే చెక్కారు
నా దర్శనాలు మీరే చెప్పారు
నా ధరలు మీరే వ్రాశారు
ధర్మంగా వుంటే
ప్రతిరోజూ మంచిరోజే
మనసుంటే
ప్రతిరోజూ పండుగరోజే
మంచి తిధియని
మంచి పండగని
ఒకే రోజు వెర్రిగా లక్షల్లో జనం
మూకుమ్మడిగా ప్రదక్షిణాల జనం
ప్రమాదాలు ఉండవా?
ఫలితాలు చెందవా?
ఇంకా ఇంకా నన్నే నిందిస్తారా !
ఎప్పుడూ రాళ్ళల్లో బందిస్తారా!
నేనెక్కడలేనని
నీ ప్రక్కన లేనా!
కొండల్లో బండల్లో నీళ్ళలో లేను
నీలాటి మనుషుల్లో వున్నా..
నువుజేసే మంచి పనుల్లో వున్నా..
సాటి జీవుల్లో వున్నా..
సమాజ సేవలో వున్నా..
మనసు మనసులో వుంటే
మంచి భావన వుంటే
నీ అహం చంపుకుంటే
నేను, మేను ఒకటికాదని ఒప్పుకుంటే
నీ గుండెలో నేను లేనా
నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో నేను రానా
గుళ్ళ చుట్టూ రాళ్ళ చుట్టూ తిరగకు
నీ చుట్టూ నీవు తిరుగుకో
నీలో నీవే తొంగి చూసుకో
గుడిలో దీపాలు వెలిగించడం మానుకో
నీలో ఆత్మ జ్యోతిని వెలిగించుకో
అపుడు నీవే నేను
నేనే నీవని తెలుసుకో
జీవుడే దేవుడు దేవుడూ..
దేవుడే జీవుడు జీవుడూ..
కలవరిస్తూ కలగంటూ క్రిందపడ్డాను
కలవరింతతో బల్లున తెల్లారింది
నిలువెల్ల ఉల్లము వెల్లువయింది
నిజంతో నా గుండె నిండిపోయింది
తూరుపున ఎర్రని కాంతులు ప్రసరిస్తున్నాయి..
అజ్ఞానపు చీకటి తెరలను చింపేస్తున్నాయి..
****ఓంశాంతి శాంతి శాంతిః*****