ఛందోవస్తువైవిధ్య అక్షరారాధన
(రకరకముల ఛందస్సులలో వివిధకవితావస్తువులను అక్షరములతో ఆరాధించుట)
రచన – అయ్యగారి సూర్యనారాయణమూర్తి
1.
కవితావస్తువు : శ్రీసీతారామస్తుతి వృత్తం పేరు: సాధ్వి ఛందస్సు: ప్రతిపాదానికి 25 అక్షరాలు. గణాలు : భ-న-జ-న-స-న-న-భ-గ 8, 15, 22వ అక్షరాలు యతి. |
శ్రీరఘుకులవరు చిత్తసరసిరుహసీరక(1)కిరణుని సీతమనున్ మారుతసుతనుత మాతకుఁ(2) బ్రియమగు మానితగుణగణు మా విభునిన్ సారవిశిఖజితసాగరు మునివరుజన్నము నయముగ సాగు విధిన్ దారుణదనుజుల దవ్వుల కనిపిన దక్షునిఁ దలఁతుము తత్పరతన్ సూర్యుడు (2) సీతమ్మకు/ మా అమ్మకు |
భావము – శుభప్రదమైన రఘుకులంలో శ్రేష్ఠుని, మనస్సు అనే కమలానికి సూర్యకిరణమైన వానిని (రాముని), వాయుపుత్రుడైన ఆంజనేయునిచే స్తుతింపబడిన సీతమ్మను, మా అమ్మకు ఇష్టదైవము (సీతమ్మకు ప్రియమైనవాడు) అయిన గౌరవింపబడిన గుణజాలముకలవానిని, మాకు ప్రభువైనవానిని (లక్ష్మీవల్లభుని), గొప్ప శక్తివంతమైన బాణముతో సముద్రాన్ని జయించినవానిని, మునిశ్రేష్ఠు డయిన విశ్వామిత్రుని యజ్ఞము పద్దతిగా కొనసాగడానికి దారుణరాక్షసులను (మారీచ, సుబాహులను) బాణములతో దూరానికి పారద్రోలిన సామర్ధ్యము కలవానిని (రాముని) ఆసక్తితో స్మరింతుము. |
2.
కవితావస్తువు : తెలుగుభాష వృత్తం పేరు: కనకమంజరి ఛందస్సు: ప్రతిపాదానికి 11 అక్షరాలు. గణాలు : న-ర-ర-వ 7వ అక్షరము యతి. |
తెలుఁగుభాషయే తేనె లొల్కుఁగా చిలుకపల్కులే చేయు సందడిన్ లలితసాహితీలాస్యవైభవం బొలికి ప్రాసలే యొంటి సొంపులౌ |
భావము – తెలుగు భాష అంటేనే తేనె లొలకబోసే తియ్యని భాష. చిలుకపలుకులులా ముద్దుముద్దుగా ధ్వనిస్తుంది. మనస్సుకి ఇంపైన సాహిత్యము, అక్షరాలలో నృత్యవైభవాన్ని ప్రదర్శించే ప్రాసలు, తెలుగుభాష అనే స్త్రీకి సహజంగా అంగసౌష్ఠవాన్ని కలిగించి అందాన్ని చేకూరుస్తాయి. (అందుకే తెలుగు భాష “దేశభాషలందు తెలుగు లెస్స”, “The Italian of the East” వంటి కీర్తిపతాకా లందుకొంది.) |
3.
కవితావస్తువు : నందివర్ధనపుష్పం వృత్తం పేరు: నందివర్ధనం ఛందస్సు: ప్రతిపాదానికి 19 అక్షరాలు. గణాలు : ర-న-ర-న-ర-న-గ 13వ అక్షరము యతి. (ఇది నాకు “లాక్షణికకవిచంద్రమ” అనే బిరుదును సంపాదించిపెట్టిన నేను కల్పించిన ఛందస్సు) |
నందివర్ధనము నందివర్ధనము, నందివాహనున కా నందకారకము, స్వచ్ఛతాకృతిగ జ్ఞానచిహ్నమనఁగా సుందరమ్ము, సితవర్ణభాసురము, సోమశీతలముగా నొందఁజేయు ముద; మందఁజేయు నయనోత్సవమ్ముఁ గనినన్ |
భావము – నందివర్ధనం అనే పుష్పం సంతోషాన్ని వర్ధింపజేస్తుంది. నందివాహనుడైన శివునికి అనందాన్ని కలిగిస్తుంది. నిర్మలత్వానికి, జ్ఞానానికి గుర్తు అనేలా అందముగా తెల్లరంగుతో ప్రకాశిస్తూ చంద్రునివలె చల్లగా ఉండి, దీనిని గ్రహించినవారు సంతోషమును పొందేలా చేసి, చూసినవారికి కనుపండువు చేస్తుంది. (ఇది చాలా నిండైన పుష్పం. దీనికి వైద్యపరంగా వేడిని హరించే లక్షణం ఉంది.) |