స్రవంతి
బ్రహ్మముహూర్తము ఉ. బ్రహ్మముహూర్త మిచ్చుఁ బ్రతిభాసృజనానిశితైకచింతనాఽ జిహ్మగబుద్ధికౌశలవిశేషమనోఽబ్జవికాసబృంహణల్; బ్రహ్మముఁ జూడఁ గల్గుట కుపాసనకున్ దగునట్టి వేళ; యా బ్రాహ్మియె నా యెదన్ నిలిచి పల్క లిఖించెద ముఖ్యభావముల్ భావము - బ్రహ్మముహూర్తము (సూర్యోదయము ముందు 4 ఘడియలు=96 నిముషముల కాలము) ప్రతిభను, సృష్టించు శక్తిని, పదునైన ఏకీకృతమైన ఆలోచనను, తిన్నని బుద్ధికుశలతను, విశేషముగా మనస్సుఅనే కమలము విప్పారుటకు, వర్ధిల్లజేయుటకు తగిన శక్తిని ప్రసాదించును. పరమాత్మను/ సత్యమును చూడగల్గుటకు/ గ్రహించుటకు, ఉపాసించుటకు సరియైన సమయము బ్రహ్మముహూర్తము. అప్పుడు ఆ సరస్వతీదేవియే నా హృదయములో వసించి పలికించగా ముఖ్యమైన/ప్రధానమైన భావాలను వృత్తిలోను, ప్రవృత్తి యైన కవిత్వరచనలోను, లిఖితముగా వ్యక్తము చేయుదును. కమలద్వయము (పొరుగింటి తామర కొలనులోనివి) కం. కమలద్వయ మిది నీ పద కమలద్వయసేవ సేయఁగా వికసించెన్ కమలాద్వయహృత్ప్రియ! నా కమలద్విజరాజ(1)నామ! యాశ్రయ(2) మిడుమా! (1)ద్విజరాజము = కర్పూరము (2) అండ భావము - ఇది తామరపువ్వులజంట. తామరపువ్వులను పోలిన నీ రెండు పాదములను సేవించడానికి ఈ జంట విచ్చుకొన్నది. లక్ష్మీదేవియొక్క సాటిలేని మనస్సునకు ప్రియమైనవాడా! నాకు, నిర్మలమైన కర్పూరనామముకల స్వామీ, నీ అండను ప్రసాదించుమయ్యా! వడమాల సీ. వడమాలలు గ్రహించి పడసితొ హర్షంబు వెనువెంట వేకువ వేళ వచ్చి దర్శనం బిడినావు దయఁ జూపఁ; దిలకించి పులకించె నా మేను; మునివరుండు(1) శ్రీరాముబంటవై చేసిన నీ కృతు లద్భుతా లాదికావ్యమున(2) వ్రాసె; తలఁచిన కార్యసాధనకు నిర్వచనంబ వీవె యెన్ని యుగాల కేని యెపుడు తే.గీ. మా ర్పెఱుంగని చిరజీవి! మహితవిజయ! భానుశిష్యా! హరీశ్వర! వాయుతనయ! స్వాస్థ్యనిర్భయవాగ్వైభవప్రదాయి!(3) అంజలి ఘటింతుఁ గొను మిదే యాంజనేయ! (1) వాల్మీకి (2) రామాయణము (3) ఆరోగ్యము, భయము లేకుండుట, వాక్పటిమను ఇచ్చువాడా [తేటగీతి లోని ప్రతి పాదము య గుణింతములోని అక్షరముతో ముగియుట గమనార్హము] ఉ. ఎన్నఁడు మున్ను నిన్నుఁ గని యే నెఱుఁగన్ గపివర్య! యీ గతిన్ సన్నుతమంగళాకృతి! ప్రశస్తగుణాఢ్య! ధరాత్మజాశుభో త్పన్నకరక్రియాచతుర!(1) దాశరథిప్రియభక్త! మాకు నీ కన్నను మిన్న దిక్కెవరు క్రన్ననఁ గావఁగ ? మారుతాత్మజా! (1) భూపుత్రియైన సీతాదేవికి శుభములను పుట్టించు పనులు చేయుటలో నేర్పరి/సామర్థ్యుడు [హనుమదాలయములో పూజ చేసిన మఱునాటి ప్రభాతసమయములో చక్కని మర్కట రూపములో హనుమ మా యింటి ప్రాంగణములో క్షణకాలము కనిపించి వెడలుట విశేషము. మా కాలనీలో మర్కట దర్శనము చాల దుర్లభము]