Menu Close
Page Title
Sri Arabindula Samagra Yogashramam pagetitle

Yogasramam-Mapఇరవయ్యోశతాబ్దంలో భారత దేశం అనేక విశ్వవిఖ్యాత తత్వవేత్తలని, ప్రఖ్యాత మఠాధిపతులని, ముని పుంగవులని, నిస్సంగులైన సన్యాసులని, విద్యావేత్తలని ప్రసాదించింది. రమణ మహర్షి, కంచి- శృంగేరి పీఠాధిపతులు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, పరమహంస యోగానంద, చైతన్య మహాప్రభు, షిరిడి- సత్య సాయిబాబాలు, అరవింద ఘోష్, స్వామి శివానంద, దయానంద సరస్వతి, స్వామి చిన్మయానంద, జిడ్డు కృష్ణ మూర్తి, ఇంకా ఎందరో ఈ కోవలోకి చెందిన వారు ఉన్నారు. అందరికి మూలం సనాతన ధర్మమే అయినా, వారి వారి ఆలోచనా తీరు వల్ల మార్పులు చెందిన సిద్థాంతాలు, వాటి విపులీకరణ ప్రభావం వల్ల, వివిధ కొంగ్రొత్త యోగ పద్ధతులకు పునాది అయింది. అందరివీ వేర్వేరు సిద్ధాంతాలు, నియమ నిష్టలు, వివిధ ప్రతిభావంతులైన శిష్యగణాలు కలిగి ఆయా గురువుల సిద్ధాంతాలని ప్రచారం చేస్తుంటారు.భగవద్గీత లో శ్రీ కృష్ణుడు వివరించిన కర్మ, సాంఖ్య, జ్ఞాన, భక్తి యోగాలకి అనుసంధానము చేస్తూ రాజయోగ, క్రియాయోగ, హఠ యోగ, అష్టాంగ యోగ, సహజ యోగ, కుండలిని యోగ, శివానంద యోగ, వివేకానంద యోగ, సమగ్ర యోగ, అయ్యంగార్ యోగ, మొదలైనవెన్నో ఆవిష్కరించ బడ్డాయి. అవన్నీ శారీరక సరళత్వం సాధించడం ప్రధమ సాఫల్యమైనా, ముఖ్యోద్దేశం అదికాదు, క్రమంగా మనోస్థైర్యాన్ని చేతనత్వాన్ని పెంచి ముక్తి మార్గానికి దారి సులభతరం చేస్తాయని ప్రతి యోగ గురువు రూఢిగా నమ్మి శిష్యగణాన్ని ఉత్సాహపరుస్తూంటారు.

చాలాకాలంగా ఫ్రాన్స్ దేశపు వలస ప్రాంతాలుగా ఉంటున్న పాండిచేరి, కారైక్కాల్ (రెండూ తమిళనాడు వద్ద), మాహె (కేరళ వద్ద) మరియు యానాం (కాకినాడ వద్ద, ఆంధ్ర ప్రదేశ్ లో) ప్రశాంత వాతావరణం కలిగి యోగ సాధనకు అనుకూల స్థితిని కలిగి యున్నాయని జనం నమ్ముతారు. బహుశా అదే కారణం వల్ల కావచ్చు బంగభూమికి చెందిన అరవింద ఘోష్, పాండిచ్చేరిని తన 'సమగ్ర సాధన యోగ' ప్రయోగానికి, తదుపరి ఆచరణకు అనువైన ప్రదేశంగా ఎన్నుకున్నారు. పాండిచేరీ బహుశా ఆంగ్లేయుల అధీనంలో లేకపోవడం, అప్పుడే జైలునుండి విడుదలై వివిధ కేసుల నుండి సులభంగా బయట పడలేకపోవడం కూడా  ఒక కారణం కావచ్చు. వివిధ తెగలతో కూడిన ఆయన శిష్య బృందం నానాటికి వృద్ధి చెందుతూ అరబిందాశ్రమానికి పవిత్రత, ఖ్యాతి పెంపొందిస్తోంది. దానికి 'మాత' గా ప్రసిద్ధిగాంచిన 'మిర్ర అల్ఫాస్స' అనే ఫ్రాన్స్ దేశానికి చెందిన యువతి ఆయన కి సమాన గురువుగా పరిగణింపబడేది వారి శిష్యులచేత. ఆమె గురుత్వ బాధ్యతలనే కాక క్రియాశీల పాత్రని కూడా నిర్వర్తించి 'ఆరోవిల్' అనే 'ప్రభాత నగరం' రూపు  దిద్దుకునేటట్లు చేసింది. నేడు ఆమె పంచభూతాత్మకమైన తరువాత కూడా  'ఆరోవిల్' విశ్వనగరం గా ఆదర్శ సమాజాన్ని నిర్మిస్తూ పురోగమిస్తోంది.

పండితుడు, కవి, పత్రికా సంపాదకుడు, యోగ గురు, తత్వ వేత్తల అవతారాల్లో జీవించిన మహర్షి అరబిందు ఘోష్, స్వర్ణలత కృష్ణ ధున్ ఘోష్ లకు మూడవ సంతతి గా 1872  ఆగష్టు పదిహేనో తేదీన కలకత్తాలో జన్మించారు. అసిస్టెంట్ సర్జన్ గా రంగపూర్ లో వైద్య వృత్తిలో ఖ్యాతి గడించిన తండ్రికి బ్రిటిష్ వ్యవస్థ పై గల నమ్మకం గౌరవం అయనను ఏడో ఏటనే ఇంగ్లాండు పంపించి అక్కడ సెయింట్ పాల్'స్ స్కూల్ లో 1884  లో చేర్పించేటట్లు చేసింది. అయన అఖండ ప్రజ్ఞతో పారితోషికాలని ఆర్జిస్తూ 1890 లో కేంబ్రిడ్జి కింగ్స్ కాలేజీ లో చేరారు. సునిశిత బుద్ధి, చేస్తున్న పనిలో అంకిత స్వభావం గలిగి ఉండడం తో I C S పరీక్ష లో ఉత్తీర్ణులయ్యారు. 28 వ ఏట, 1901 లో మ్రిణాళిని వివాహమాడారు అరబిందులు. కానీ విధి వశాత్తు 1918  లో ఆవిడ తుది శ్వాస విడిచింది.

Maharshi-Arabindu-Ghoshబరోడా రాజకుటుంబం లో ఉపాధ్యాయునిగా, గేక్వాడ్ మహారాజుకి  కార్యదర్శి గాను, బరోడా కాలేజీ కి వైస్ ప్రిన్సిపాల్ గాను పనిచేసిన పన్నెండు ఏళ్లలోను బ్రిటిష్ వారు భారతీయులకి, వారి సంస్కృతికి చేస్తున్న అన్యాయాలు, కలిగిన హాని తెలుసుకో గలిగారు. అవి కనువిప్పు కలిగించి స్వదేశీ ఉద్యమం లోను, భారత రాజకీయాల్లోనూ ఆసక్తి చూపడానికి  దారి తీసింది. వాటి ప్రోద్బలంతో బరోడా వదలి కలకత్తా చేరి 1906 లో దాదాభాయ్ నవ్రోజి ఆధ్వర్యంలో నడిపిన 'ఇండియన్ నేషనల్  కాంగ్రెస్' వార్షిక సమావేశం లో పాల్గొనేటట్లు చేసింది. స్వరాజ్ స్థాపనకై ఉద్యమాన్ని, స్వదేశీ వస్తువుల వాడుక, విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్యావిధానాల విషయమై ఆంగ్ల ప్రభుత్వం పై ఒత్తిడి పెంచ డానికై 'వందే మాతరం' పత్రిక 1907 లో స్థాపించి ఏడాది పైన నడిపించారు. 1908 లో బ్రిటిష్ ప్రభుత్వం అలిపిరి బాంబు కేసు లో అరెస్ట్ చేసి ఆయనని ఆలీపూర్ జైలు లో ఉంచి ఏడాది తరువాత విడుదల చేసింది. ఆలీపూర్ జైలు లో ఉండగా వివేకానందుల తాత్విక వాదన పదిహేను రోజుల  పాటు  వినిపించిందట, ఫలితం గా చేసిన పునరాలోచనల వల్ల రాజకీయాలనుండి తత్వ శాస్త్రం వైపు, క్రమంగా ఆత్మావలోకనం వైపు దృష్టి మరలించి పాండిచేరి లో యోగ ఆశ్రమ స్థాపనకు దారితీసిందని రాసుకున్నారు, అరవిందులు.

Book-Savitriఆయనకు మొదటినుంచి కవిత్వం వైపు గల మొగ్గు 1930 లో ఆయనచేత 24000  పంక్తుల తో 'సావిత్రి' అనే తత్వ కావ్యాన్ని వ్రాయించింది. ఆయన పేరు 1943 లో  సాహిత్యానికి, 1950 లో శాంతికి నోబెల్ బహుమతికి పేర్కొనడం జరిగింది. అయన ఇంకా The Life Divine,  Synthesis  of  Yoga Essays on Gita, The Secret of the Veda, The Powers within, Hymns to the Mystic Fire, The Upanishads, The Renaissance of India, War and self-determination,  The Human Cycle, The Ideal of Human Unity, The Future Poetry మొదలైన పుస్తకాలు వ్రాసారు. 1926 లో మిర్ర రిచర్డ్ సాయంతో 1926 లో "శ్రీ అరబిందో ఆశ్రమం" స్థాపించడం జరిగింది.  1926 తరువాత అరబిందులు ఆత్మానేషణకై ఏకాంతం లోకి వెడలిన తరువాత మిర్ర రిచర్డ్ ఆశ్రమ వ్యవహారాలు చూడనారంభించింది. ఆమెనందరు ‘మదర్’ లేక 'మాత' అని సంబోధించ నారంభించారు, ఆమె తెలివితేటలలోగాని, పరిశీలనాశక్తిలో గాని, తత్వ విజ్ఞానం లో గాని అరబిందులకి ఏవిధంగానూ తీసిపోదని శిష్య బృందం గౌరవించేవారు. మదర్ వ్రాసిన కొన్ని పుస్తకాలు:  How to get rid of Unpleasant Thoughts,  How to Overcome Depression, Prayers and Meditations, Flowers and their spiritual significance. Questions and answers.

The-Mother
Sri-Arabindo-Ashramam

అందరి చేత 'ది మదర్' అని పిలువబడే ఆధ్యాత్మిక గురువైన శ్రీమతి మిర్ర అల్ఫాస్స ఫ్రాన్స్ దేశం లోని పారిస్ లో 1878 , ఫిబ్రవరి 21  న జన్మించారు. ఆమె హెన్రీ మొరిశెట్ అనే ఆయన్ని వివాహమాడి మొదటి సారి 1914  లో పాండిచ్చేరి వచ్చి అరోబిందుల తేజస్సు వైపు ఆకర్షించబడి, అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుని, అయన ప్రచురిస్తున్న 'ఆర్య' అనే పత్రికకి అరవిందుల ఆధ్యాత్మిక వ్యాసాలు ఫ్రెంచ్ లోకి తర్జుమా చేసేవారు. పదమూడు పధ్నాలుగేళ్ళ వయస్సు లో ఆమెకు తరుచు ఒక దివ్య శక్తి వ్యక్తి గా  కనిపిస్తుండేదట.  అప్పటికే ఆమె భగవద్గీత, వివేకానందుల రాజయోగ ఫ్రెంచ్ అనువాదాలు తండ్రి లైబ్రరీ లో చదివి ఆ శక్తిని 'కృష్ణ' అంటుండేదట. ఆమె భర్తకి ఫ్రెంచ్ పార్లమెంట్ కి ఎన్నుకోబడాలని బలమైన కోరిక ఉండేదట. దాని సాధనకై అతడితో పాటు పాండిచ్చేరి వెళ్లిందట. అక్కడ అరబిందోని చూస్తూనే తనకు తరుచు లీలగా కనిపించే దివ్య మూర్తి గా అతడిని గుర్తించి ఇంక అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నదట. మొదటి ప్రపంచ యుద్ధానంతరం తప్పని పరిస్థితులలో జపానులో నాలుగేళ్లు గడిపి తిరిగి 1920  లో పాండిచేరి చేరుకున్నారు. క్రమంగా అరబిందుల శిష్యగణం పెరగడంతో అక్కడే 1926 లో అరబిందో ఆశ్రమాన్ని స్థాపించి 1943 అనుబంధ పాఠశాల నొకటి ప్రారంభించి,1968 లో 'ఆరోవిల్' అని పిలువబడే ప్రయోగాత్మక గ్రామానొకదానిని రూపొందించి, స్థాపించి దానిని మానవతా ఐకమత్యానికి అంకితం చేశారు. 'ఆరోవిల్'- City of Dawn - 'ప్రభాత నగరం' తమిళనాడు లోని విల్లుపురం లో కొంత భాగం, పుదుచ్చేరి లో కొంత భాగం గా ఉన్న ఒక ఆదర్శ గ్రామం. "అక్కడ ఏదేశపు జీవి అయినా శాంతి తో ప్రగతి శీల సామరస్యంతో కుల, మత, రాజకీయ, భేదాలకి అతీతం గా జీవించ గలగాలి.  “'ఆరోవిల్' ముఖ్యోద్దేశం మానవత్వ ఐకమత్య సాధనే." అంటారు మదర్. దానిని ఆవిడే ప్రత్యేక శ్రద్ధతో రూపకల్పన చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాల మృత్తికను తెచ్చి ఊహాత్మక భావితర క్షేత్రానికి 1968 లో పునాదివేసారు; యునెస్కో దాన్ని గత పదేళ్లుగా పరిరక్షిస్తున్నది. ఆ సమాజం 'ఆరోవిల్' - 'ఆరోవిల్' ముఖ్యోద్దేశం మానవత్వ ఐకమత్య సాధనే." అంటారు మదర్. ఆ సమాజం వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆంతరంగికంగా సాధించగలుగుతోంది. అందులో 50 కోట్లు విదేశాలనుంచి, భారత ప్రభుత్వం నుంచి చందా గాను లభిస్తోంది. అక్కడ నివసించడాని అనుమతింపబడ్డ వాళ్లు సమాజ సేవ చెయ్యాలి.

Matri-Mandir-01
Matri-Mandir-02
Matri-Mandir-03
Matri-Mandir-04

మాతృమందిర్ రూపకల్పన నిర్మాణ వివరాలతో సహా 'మదర్' స్వయంగా  నిర్ణయించినట్లు చెబుతారు. అది ఒక అద్భుత యోగ మందిరం. బయట ఆకాశంలోఉన్న భానుని స్థానము ఏదిశనున్నా సూర్యకిరణాలు అద్దాలద్వారా మందిరంలోపలికి పరావృత్తమై పంపబడి ఒక కటక సముదాయము పై కేంద్రీకృతమై అవి క్రిందనున్న స్పటిక గోళం (Zeiss- 85 cm &1100 kg crystal) పై పడి  గతిని మార్చుకుని అన్నికిరణాలు సమాంతరములై స్థంభాకారాన్ని ధరించి ఉంటాయి. బయట సూర్యుడున్నంత కాలం ఆ నీలి స్థంభం ఆహ్లాదకరమైన వెలుగుని ప్రసరిస్తూ, అద్భుత అనుభూతిని అందిస్తూ ధ్యాన మగ్నులైన యోగ నిష్ఠాపరులకు సరైన వాతావరణాన్ని సమకూరుస్తుంది. మధ్యనున్న పటం దాని నిర్మాణము, పనిచేయు విధానము వివరిస్తుంది. ఏకైక మర్రి వృక్షం కేంద్రంగా ప్రభాత నగరం నిర్మించాలన్నది ఆమె యోచన.  రెండు అడుగుల వ్యాసంతో, 28  న్నర అడుగుల పొడవు గల నాలుగు స్తంభాల సహాయంతో (మహా కాళీ, మహేశ్వరీ, మహాలక్ష్మి & మహా సరస్వతి లను ప్రతిబింబిస్తూ)  1415 బంగారు రంగు డిస్క్ లతో  కప్పబడిన గోళాకార 'మాతృ మందిర్' నిర్మాణము ఫ్రెంచ్ శిల్పి '’రోజర్ అంగెర్' చే జరిగినది. చుట్టూ ఉన్న 12 యోగ ధ్యాన కేంద్రాలైన తోటలకి అవి పెంపొందించగల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ వివిధ పేర్లొసగబడినవి. అనేక  రకములైన పుష్ప వాటికలతో (అవి వివిధ యోగ ప్రక్రియలకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచగలవని పరిశోధించి నిర్ణయించిన  పిమ్మటనే  ఏర్పరిచినవి) ఆ గోళంచుట్టూ అమర్చి ఉంచారు.  దాని  వివరాలు ప్లాన్ లో చూడవచ్చు. ఏ మానసిక స్థితికి ఆ వాటిక అనుకూలమో కూడా వివరించడము జరిగింది. అక్కడ ఎవ్వరైనా వెళ్లి ధ్యానం చేసుకోవచ్చు, కానీ ముందుగా అనుమతిని పొందాల్సి ఉంటుంది.

అరబిందుల వారి సంతకం: Sri-Arabindo-Signature

Sri-Arabindo-Ashram-Pujaపుదుచ్చేరి శ్రీ అరబిందో ఆశ్రమం లో డిసెంబర్ 5th 1950 ని పరమపదించిన శ్రీ అరబిందుల వారిది, నవంబర్ 17 ,1973న పరమపదాన్ని చేరుకున్న మాతల పార్థివ శరీరాల అవశేషాలు ఉంచబడి పూజలు జరుగుతుంటాయి. అనేకులు నేటికీ ప్రార్ధనలు చేసి మనశ్శాంతిని పొందుతుంటారు.

పుదుచ్చేరి లో 500  ఏళ్ళ క్రిందట నిర్మింపబడిన మహిమాన్విత ప్రార్థన మందిరం ‘మనకుల వినాయక ఆలయం', అరబిందో ఆశ్రమానికి దగ్గరలోనే ఉంది. రోజులో ఏ సమయంలో వెళ్లినా చాల మంది గణపతిని ప్రార్థిస్తూ, మ్రొక్కులు తీర్చుకుంటూ కనబడతారు. ఆశ్రమం దగ్గరలోనే ఉన్న సముద్రతీరం చాలా ఆహ్లాదకరంగా ఉండి సూర్యోదయ సంధ్యా సమయాలు సందర్శకులకు సేదతీర్చి, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. అయితే ఆ సముద్రతీరం కూడా నిత్యం సందర్శకులతో, యాత్రికులతో రద్దీ గానే ఉంటుంది.

Mankula-Vinayaka-Temple

-o0o-

Posted in March 2022, సాహిత్యం

2 Comments

  1. Vijayalakshmi nallakunta

    Nice article Miraculous experiences to those who surrender to Mata in the ashramam SaktiSwarupini .

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!