నేనా తేనె తుట్టెను
కోరికలు తేనెటీగలు
నా హృదయమే నైవేద్య తేనెనయ్యా
ఆరగిస్తవో...అవతలేస్తవో...నీ ఇష్టమయ్యా...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
నాన్న..సిరులు తేలేని చిల్లరనాన కొడుకంటడు
అమ్మ..పైసలేనోడు నాకొడుకే కాదంటది
ఆలి ఏమో నగలు తేలేక వగలెందుకని పొగలు గక్కతుది
నన్నే నీకిచ్చాను ఎవరికేమిస్తవో నీ ఇష్టమయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
శివ స్మరణ భజన చేస్తున్నందుకు
అమెరికా రమ్మంటరు
అమలాపురం రమ్మంటరు
గడప మొద్దై, ఇంటి ఎద్దై, పొలము పంటై ఉన్న నిన్నిడిచి
నేన్యాడికెళ్తా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
శంకరా నేను నీ కింకరుడినయ్యా
నా శంకలు తీర్చ
జ్ఞాన చక్కర పలుకులు ధారపోయవయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
నేను గర్భంలో పుడితినంట
నువ్వు గర్భగుడిలో ఉంటవంట
నా మది గర్భగుడికి ఎపుడొస్తవంట
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
నువ్వు నా మదిలో ఉదయించి
నా మదిలోనే అస్తమించే సూర్యుడవవు
నేనా.. యోనిలో ఉదయించి
ఆరడుగుల గోతిలో అస్తమించే జడుడను
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
రాలిపోయే ఆకును నేనా...?
ఎండిపోయే పువ్వును నేనా...?
కందిపోయే కాయను నేనా...?
ఏనాటికి చెడని దివ్యఫలము నువ్వా...?
నీదెంత మాయరా...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
ఓ కన్ను సూర్యుడుని చేస్తావ్
ఓ కన్ను చంద్రుడుని చేస్తావ్
మూడో కన్నుతో ఈ సృష్టినే మన్ను చేస్తావ్
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా..
పుట్టుకను అక్షరం చేస్తవ్
కదలికను పదమంటవ్
కాలి మిగిలిన బూడిదను వాక్యమునుచేసి
నీలోకి కలుపుకుంటవ్
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా..
నీ జ్ఞానమే మూడొంతుల నీరు
మా అజ్ఞానమే ఓ వంతు కన్నీరు
నీ కరుణతో మా కన్నీరును పన్నీరు చేయవయ్యా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా..