పాల సముద్రం మదించిన దేవతలకు
అమృతం వచ్చెనయ్యా
సంసార సముద్రం మదించిన నాకు విషం మిగిలెనయ్యా
అంతా..! నీ కొడుకులమే...!
ఈ భేదమేమిటయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
ముంచుతారని తెలిసికూడా...!
భస్మూడికి వరమిస్తివి
భాణుడుకి వరమిస్తివి
నన్నే...నిలువెత్తు క్షవరం చేస్తివి
నిన్ను ముంచనన్నుందుకా...?
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
పొద్దున్న సూర్యుడ్ని మేల్కొపుతావ్
రాత్రి చంద్రుడ్ని మేల్కొపుతావ్
అగ్నినెప్పుడూ...మెలుకువలోనే ఉంచుతావ్
అజ్ఞాన దుప్పట్లో తొంగున్న నన్ను ఎప్పుడు మేల్కొపుతావో...?
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
నీ కుడి కన్ను నిత్యం పూజలందుకుంటున్నదయ్యా
నీ ఎడమ కన్ను నిత్యం పూజలందుకుంటున్నదయ్యా
రెండు కన్నుల మధ్యనున్నా...!
నీ మూడో కన్ను కూడా నిత్యం పూజలందుకుంటున్నదయ్యా
నీకు ఏ కన్ను కానందుకా...?
నన్ను మన్నులో ముచ్చేటపుడే... పూజిస్తరు
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
పచ్చగడ్డి మీద నడిస్తే పసందుగా ఉంటదయ్యా
పచ్చని కాపురంలో పొగలేస్తే పట్టరానంత బాధొస్తదయ్యా
పచ్చగుండమంటవ్...పొగ బెడుతుంటవ్
రెండు నాలుకల బుద్ధి నీకెందుకయ్యా...?
అడిగేవాడు లేనందుకా...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
నను కూలీని చేస్తివయ్యా
ఆకలిలో ముంచితివయ్యా
ఒంటరి రోకలిగా మిగిల్చితివయ్యా
అయినా నిన్నేమనగలను...!
నేను...!నువ్వే...గనుకా...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
తాగుటకు విషం లేదయ్యా...
గంగలో దూకుటకు ధైర్యం చాలదయ్యా
మెడకు తాడేద్దమంటే...
నా వాయు రూపాన్ని ఆపగలిగే మొనగాడివా...
అని ఎదురు ప్రశ్న ఎదురాయేనయ్యా...
చావడానికి కూడా చేతగాని చవటనయ్యా...
ఈ బ్రతుకును సాగదీస్తవో...
సగములోనే జగమునుంచి వెలివేస్తవో...నీ ఇష్టమయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
భక్తులు గుడికి వచ్చుట లేదని
బెంగ కలిగి
మమ్ము చూడ కుటుంబ సమేతంగా ఇట్టా వచ్చితివా...
మాయదారి రోగమిచట ఉన్నదయ్యా ముందు మాస్కు పెట్టుకోవయ్యా...
లేకపోతే....!
రిస్కు లేని ఆటలో ఇష్క్ లేదని ఈ మాస్కు కరోనా ఆటకు నువ్వే బీజమేస్తివా....
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
కనిపించే మా బ్రతుకును
కనిపించకుండా చేస్తనంటు
కనిపించని హాలాహలము పుట్టెనయ్యా
కనిపించని నువ్వు కనికరించి
మమ్ము కావవయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
ఓ రోజు కంట్లో బాలేదంటము
ఓ రోజు ఒంట్లో బాలేదంటము
ఓ రోజు ఇంట్లో బాలేదంటము
ఓ రోజు మంట్లో కలిసేదాక
నిత్యం దేంట్లోనో...ఓ దాంట్లో బాలేదని
నీ మాయాటలో సిగపాట్లు పడుతుంటము
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...