మట్టిని చేశావు
మట్టిపై నన్ను కదిలే మట్టిబొమ్మను చేశావు
మట్టిబొమ్మలో మనసను మాణిక్యాన్ని ఉంచావు
మనసును నీ మాయలో పడి మలినపరుచుకునేలా చేశావు
మరలా నువ్వే కాటి కంసాలై మట్టిబొమ్మను కాల్చి
మనసును మెరుగుపెట్టి ఆభరణంగా ధరిస్తావు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
అజ్ఞానులకు
నీ లింగం
బూతు పురాణమయ్యా
దాని లోతులు తెలుసుకొన
జ్ఞానులకేమో జన్మలు చాలవయ్యా
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
కన్నోళ్ళ చేత కన్నీళ్ళు పెట్టించావు
కష్టాలచేత నన్ను కాల్చావు
కర్మఫలం వంకతో నన్ను మెరుగుదిద్ది
నీ భక్తి పరిమళ పువ్వుగా మార్చావు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
సత్ సాంగత్యం చేశాను
సత్వగుణంలో మునిగాను
నీ రమణీయ గాధలిన్నాను
రజోగుణంలో మునిగాను
నీ తత్వం తెలుసుకున్నాను
తమోగుణంలో మునిగాను
ఇన్ని గుణాల్లో మునిగిన నేను
ఏదో ఓనాడు నీ ప్రమధగణంలో ఒకడిని కాకపోతనా...!
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
ప్రహ్లాదునిలా చదువులో మర్మమెల్లా చదవలేదు
ద్రువుడిలా తపస్సు చేయలేదు
మార్కాండేయుడిలా పూజ చేయలేదు
అజ్ఞాన అల్పుడైన నాకు అక్షరప్రసాదమిస్తివయ్యా
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
ఆశలను ఆపసోపాలపాలుజేస్తూ
కోరికలను కష్టాలపాలుజేస్తూ
తనువులను బూడిద పాలుజేస్తూ
ఏం నవ్వుతున్నావయ్యా
నీ నవ్వు చూస్తుంటే మాకే వస్తోంది నవ్వు
ఆ నవ్వులోనే కదా పరిమళించేది సృష్టి పువ్వు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
బ్రహ్మ అంటేనే బాగుపడతామా...?
నారాయణుడిని తలిస్తేనే మంచి జరుగుతుందా...?
శ్రీమాత స్మరణతో చల్లగుంటామా...?
మనసు స్వచ్ఛమైతే... శవమును తలుచుకున్నా శివమే కలుగును కదా...!
ఓ శివా....! నీ ఆటలో అంతా ఒకటే కదా...!
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
ఊగవయ్యా స్వామి...
ఉత్సాహంగా ఊగవయ్యా
నా మనసు ఊయలపై
సతీ సమేతంగా నీవు ఊగినంత కాలం ఊపిరితో ఉంటాను
నీ ఊగుడు ఆపిన ఉత్తర క్షణం
నీ ఊపిరిలో సాన్నిధ్య ఊయలవుతాను...
అయినా ఊపిరికి ఊహను ఊయలచేసి
మనసును అందులో ఉంచి
ఉరకలెత్తించే నీ ఆటే వూర్జితకథ కదా...
ఉమామహేశ్వరా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
తనువు శంఖంలో
మనసు తైలం పోసి
ప్రాణ దీపం వెలిగించి
బ్రతుకు శంకలను తీర్చి
జీవితమునే కార్తీకం చేసే శంకరా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా
అపుడెపుడో...
తండ్రి హృదయంలో చలనం చేస్తివి..
తల్లి గర్భంలో అండం చేస్తివి
కాల వ్యవధిలో పిండంచేసి బ్రహ్మండాన తోస్తివి...
పెంచి పోషించి బుద్ధినిస్తివి...
ఇంటి వంకతో జంటను చేసి.
సరసపు జంజాట ఊబిలో మళ్ళ ముంచితివి...
నీ మాయను తెలియకుంది ఈ కన్ను...
శివా... అంటున్నా...
నేనున్నానని
నా భుజమున చెయ్యేసి
తట్టవయ్యా వెన్ను...
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...