బాదం చెట్టు బడి
- రాజేశ్వరి దివాకర్ల
బడి ముందర చెట్టొకటి నాటుకుని పెరిగింది
మెలకువల పరిసరాలలో
చిగురాకుల కళ్ళను తెరచింది.
తొలి చదువుల ప్రార్థనలకు
కర శాఖల తుషారాల
ఆచమనం చేసింది.
తల దాల్చిన కిరణాల
సవినయ సంస్పర్శలతో
గురువుల అభివాదానికి
పాదాలను తాకింది .
కంఠో పాఠాల తరగతిపుస్తకాలకు
వాయు లీనాల ఊపిరులనూదింది.
బాల బాలికల కటు పరీక్షా సమయాలకు,
పక్షి పాటల స్వేచ్ఛా గమకాలను పలికింది.
నుదుటిరాతల కొలత నీడలకు.
కోతి కొమ్మచ్చి ఆటల అల్లరిని నేర్పింది.
మధ్యాహ్న భోజనాల సంక్షేమ పథకాలకు
ముదురాకు పచ్చని విస్తళ్ళను పరచింది.
క్రమశిక్షణల అవసరాలకు
అధ్యాపకుల చేతి కోలగ హెచ్చరింపులు చేసింది.
పరిసరాల ప్రేమకు ప్రధాన ఉపాధ్యాయి నిగా
మచి గాలి సంపుటాల అధ్యాయం తెరచింది.
మరలి వచ్చిన వసంతానికి,
మరల చేవ నింపుకున్నట్లు,
పాతదైన భవనానికి
రంగు హంగులు చేర్చాలని,
మౌన సాక్ష్యాలను పలికింది.
సరాసరి బోధనల
ఉచిత విద్యా నిలయమిది అని
నానాటికి ఎత్తులకెదిగే
భుజకీర్తిని చూపించి చాటింది.
ఉత్తమ ఫలితాల విజయ గర్వానికి
చెట్టు కింద అరుగు గట్టి పునాదిని వేసింది.
భూమి లోతు వేళ్ళు
పాతుకున్నచెట్టు
శాస్త్రజ్ఞులు, విజ్ఞులు, దేశనాయకులు, పెద్దలు
చదువుకున్న"బాదం చెట్టు బడి" గా
ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు
తన పేరిట పలుకుబడిని తెచ్చింది.