వయసు వంతెనపై ఉదయించిన
వేడిగాలులు
వాళ్ళను కలిపాయి
సరసం అంచుల చివర ఉదయించిన
సమస్య వాసనలు
వాళ్ళను విడదీశాయి
ఇప్పుడు వాళ్ళకొచ్చిన
రోగమేమిలేదు
వాళ్ళ వేడిగాలుల ప్రవాహంలో ఉదయించిన
రాగానికే
అనాధనే రోగమొచ్చింది
అది అసలు సమస్య.
అతను
మాటలతో మనసుకు
అభిషేకం చేశాడు
కనుకే
ఆమె కళ్ళల్లో
తీర్థం పొంగుతున్నది
అతనిలో
చెలరేగిన
తుపాను
ఆమె
నయనాల్లో తీరం
దాటింది
ఆమె
మండిపడుతున్నది
ఎండలో
గొడుగెందుకు
తీసుకెళ్ళలేదని
అతను
చల్లగా చెప్పాడు
నిన్ను మించి
ఎండలు
మండడంలేదని
నిజమే
అతని కామాన్ని తీర్చే
కామధేనువు ఆమె
అతనిలో కామం
కడతేరగానే
ఆమె కనుమరుగైతాది మరీ
ఇది సృష్టి ధర్మమనే ముష్టిచర్చ
ఉన్నంతకాలం
ఆమె కనుమరుగవ్వాల్సిందే మరీ
అతనంటే
ఎందుకంత
కసియని అడిగాడతను
పువ్వులాంటి మనసులను
తూట్లుపొడిచే
సూది గుణం చూసినందుకన్నదామె
ఆమె
సున్నిత స్వభావం
అర్థకాని అసుర లక్షణంతో
కదిలాడతను