స్పందన
ఆరోజుల్లో ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు చూశాను. ఎంతోమంది శనివారం శ్రీవెంకటేశ్వరస్వామివారి గుడికి వస్తున్నారు, వెడుతున్నారు. కానీ నా కథలోని ముసలి గుడ్డి బిచ్చగాడినీ, అతని పక్కనే వున్న ఆరేళ్ళ పిల్లనీ చూడటం కానీ, కనీసం కొన్ని చిల్లర డబ్బులు పడేయటం కానీ చేయటం లేదు. గుడినించీ తిరిగి వెళ్ళే వారి చేతుల్లో వున్న అరటిపండునో, కొబ్బరి చిప్పనో వారికి ఇచ్చి, కనీసం ఒక పూటయినా వారి ఖాళీ కడుపులో ఏదో కొంత పడేటట్లు చేసినవారు కూడా కనపడలేదు. అలాగే రాజకీయ నాయకుల సిగ్గూ ఎగ్గూ లేని బీదోద్ధరణ అబద్ధాలు విన్నాక, శత దినోత్సవ ఆకలి బ్రతుకుల తెలుగు సినిమా కథలు చూశాక, కమ్యూనిష్టుల పేద జన బంధోద్ధారణలాటి పిచ్చి సొళ్ళు కబుర్లు విన్నాక, ‘మానవసేవయే మాధవసేవ’ మొదలైన అర్ధంలేని ఉత్తుత్తి ప్రవచనాలు వద్దనుకున్నా గుళ్ళల్లోనూ రేడియోలోనూ వింటున్నా, ఈ విషయం మీద ఒక కథ వ్రాయాలనిపించింది. ఇదిగో ఆనాటి కథ ఇప్పుడు మళ్ళీ మీ ముందు పెడుతున్నాను. చిత్తగించండి.
(ఈ కథ ‘ఆంధ్రభూమి’ వారపత్రిక నవంబర్ 12, 1980 సంచికలో ప్రచురింపబడింది)
ముసలయ్య అడుగుతున్నాడు, “ఏటే గవురీ! ఇయాల ఒక పయిసా అయినా రాలేదు” అని.
గవురి మాట్లాడలేదు.
ప్రొద్దుటినించీ కడుపులో ఏమీ పడలేదేమో నీరసంగా వుండి అసలు మాటలే బయటకు రాలేదు.
తన గుడ్డి కళ్ళకు అక్కడ గవురి వుందో లేదో అంతుపట్టని ముసలయ్య మళ్ళీ పిలిచాడు, “గవురీ ఈడనే వున్నావా?” అంటూ.
“ఊఁ!” అన్నది గవురి, తన చిరిగిపోయిన గౌను సర్దుకుంటూ.
“ప్రోద్దుటాలనించీ కూకుంటే ఒక్కా పయిసా నేదియాల. ఈ ఎంకటేసలుకి మన మీద ఏమాత్రం దయనేదు” సణుగుతున్నాడు ముసలయ్య.
లోపల గుళ్ళో గంటలు, మంత్రోచ్ఛారణ వినపడుతున్నాయి. చాలమంది జనం గుళ్ళోకి పోతున్నారు, బయటికి వస్తున్నారు. కానీ అక్కడే కొంచెం పక్కగా ఒక మాసిన గుడ్డ నేల మీడ పరిచి ముష్టెత్తుకుంటున్న ముసలయ్యనూ, ఆరేళ్ళ పిల్ల గవురిని ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు.
పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కనుక, దేవుడితో బేరం పెట్టటానికి ఇద్దరు కాలేజీ కుర్రవాళ్ళు వచ్చి ప్రక్కనే వున్న కొట్లో కొబ్బరికాయలు కొంటున్నారు.
“ఒరే సంతోష్. ఈ ఒక్క సిగరెట్ అయిన తర్వాత గుళ్ళోకి వెడదాం” అంటున్నాడు కళ్ళజోడు కుర్రవాడు.
“యా!” అన్నాడు సంతోష్ అనబడే ఆ రెండో అతను.
కళ్ళజోడు కుర్రవాడు సిగరెట్టుని గట్టిగా పీల్చి, ఆ పొగలోని ‘సంతోషాన్ని’ తనివితీరా అనుభవిస్తూ, ధర్మం అడుగుతున్న గవురి మాటలను వినిపించుకోలేదు.
“పద్మశ్రీ, నటజీవన సుబ్బారాయుడు నటించిన సినిమా ‘పేదోళ్ళ బ్రతుకులు’కు ఈ సంవత్సరం బంగారు ఎలుక బహుమతి వచ్చింది తెలుసా?” అడిగాడు సంతోష్.
“అవును. ‘సినిమా భాగోతం’ పత్రికలో చదివాను. సుబ్బారాయుడికి ఉత్తమ నటుడు బహుమతి, ‘అగ్ర ఉగ్రనటనాగ్రేసర’ బిరుదు, లక్ష రూపాయల నగదు కూడా ఇస్తున్నారుట.”
“నేనా సినిమా నాలుగోసారి చూసినప్పుడే అనుకున్నాను సుబ్బారాయుడికి బహుమతి వస్తుందని. పేదవాడిగా బాగా నటించాడు. ముఖ్యంగా లాటరీలో మూడు లక్షల రూపాయలు వచ్చినప్పుడు మంచి ఫీలింగ్స్ చూపించాడు”
“పేదోళ్ళ బ్రతుకులు హిట్టవటంతో, ఆ నిర్మాత ఇప్పుడు ‘బీదోళ్ళ బ్రతుకులు’ సినిమా తీస్తున్నాట్ట. అందులో మన సుబ్బారాయుడు బీదవాడుగానూ, ధనవంతుడిగానూ రెండు వేషాలు వేస్తున్నాట్ట”
ఈలోపల కళ్ళజోడు కుర్రవాడు సిగరెట్టు తాగటం అయిపోవటంతో, ఆ ఇద్దరూ గుళ్ళోకి వెళ్ళిపోయారు.
“చూసావా అయ్యా... పేదోల్ల చినిమాలకు బగుమతులిత్తన్నారంట…“ అన్నది గవురి.
అదోలా నవ్వాడు ముసలయ్య.
ఈలోపల ఏవో అరుపులు వినబడ్డాయి.
“పేదవారి బ్రతుకులు”
“బాగుపడాలి”
“పీడిత ప్రజల జీవితం”
“బాగు చేద్దాం”
“ప్రతిపక్ష పార్టీ”
“వర్ధిల్లాలి”
“అధికార పార్టీ”
“నశించాలి”
చాలమంది పెద్దగా అరుస్తూ, సైకిళ్ళ మీద ఊరేగింపుగా వెడుతున్నారు.
“అయ్యా… యిన్నావా... ఆల్లు మన బతుకులు బాగుచేసి… కూడు పెడతారంట..”
ఈసారి కూడా ఒక పెద్ద వేదాంతిలా నవ్వాడు ముసలయ్య.
నలుగురు వయసులో వున్న అమ్మాయిలు గుళ్ళోనించీ బయటకు వచ్చారు. గవురి కడుపులోని ఆకలంత పెద్ద జరీ బోర్డర్ వున్న పట్టుచీరలు కట్టుకున్నారు. అందులో తన లేత పెదిమలకు లేత గులాబీ రంగు రాసుకున్న అమ్మాయి, అందమైన పెదిమలు అందంగా కదుపుతూ అంటున్నది.
“ఇది విన్నావా విజయా! ప్రఖ్యాత రచయిత్రి తాయారమ్మ వ్రాసిన నవల ‘ఆకలి కడుపులు’కు సాహిత్య అకాడమీ బహుమతి వచ్చిందిట. దానితో ఆవిడకి పేరుకి పేరూ, పుష్కలంగా డబ్బుకి డబ్బూ...”
కనుబొమ్మలు సన్నగా గీసుకుని అందంగా దిద్దుకున్న సన్నపాటి విజయ అంటున్నది.
“నేనూ చదివాను ఆ పుస్తకం. బాగా వ్రాసిందావిడ. ముఖ్యంగా ఆ పేద పిల్ల జయంతిని, రధంలాటి కారులో దిగి వచ్చిన రాజశేఖరం ప్రేమించి పెళ్ళాడి, కాశ్మీరుకి తీసుకుపోవటం బాగా వ్రాసిందావిడ”
“అవునవును” అన్నది జార విడిచిన పమిటను ఒకసారి క్రిందకు జార్చి, ఇటూ అటూ చూసి సరి చేసుకున్న ఎర్రబుగ్గల లావుపాటి అమ్మాయి.
“హైద్రాబాదులో హిందూ మహాసముద్రపు ఒడ్డున బీచిలో అడుక్కునే ఆ పిల్ల, కాశ్మీర్ డాల్ సరస్సులో పాట పాడుతూ ప్రేమ విహారం చేయటం ఎంతో బాగుంది. ఇలాటి నవలలు ఎన్నో వస్తేగానీ, పేదవాళ్ళ జీవితాలు బాగుపడవు” బొడ్డు క్రిందకు కట్టిన చీరను ఇంకొంచెం క్రిందకు నెడుతూ అన్నది నాలుగో అమ్మాయి.
ఇంకా ఆ నవలలోని గుణగణాలని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు ఆ నలుగురు మెరుపుతీగలూ.
“యిన్నావా… అయ్యా… “ గవురి ఏదో అనబోతుంటే చేయి పైకెత్తాడు ఆగమని ముసలయ్య. విచిత్రంగా చూసిందతన్ని గవురి.
మళ్ళీ జీవనసారమంతా తెలిసిన వేదాంతిలా నవ్వాడు ముసలయ్య.
“అయ్యా... బాగా ఆకలేత్తావుంది...” అన్నది గవురి.
ముసలయ్య ఇంకా తను చేయగలిగిందేమీ లేదు కాబట్టి, ఆ ఆరేళ్ళ పిల్ల చింపిరి తల మీద చేయి వేసి ప్రేమగా నిమిరాడు. మరి అతను ఏ ఖర్చూ లేకుండా ఇవ్వగలిగింది ఆ ప్రేమ ఒక్కటే కదూ!
“చీకటి పడతావుంది. సూద్దారి. యింకాసేపట్లో ఏ దరమరాజో పయిసలిత్తాడేమో...” అన్నాడు.
ఈలోగా ఏవో అరుపులు వినపడ్డాయి.
“పేదవారి బ్రతుకులు”
“బాగుపడాలి”
“పీడిత ప్రజల జీవితం”
“బాగు చేద్దాం”
“ప్రతిపక్ష పార్టీ”
“నశించాలి”
“అధికార పార్టీ”
“వర్ధిల్లాలి”
చాలామంది పెద్దగా అరుస్తూ, ఊరేగింపుగా వెడుతున్నారు.
“అయ్యా… ఈల్లూ ఇందాకటోల్లూ ఒకలేనా” అడిగింది గవురి.
“కాదు. ఏరు ఏరు పారిటీ వోల్లు”
“ఆల్లు కూడా మన బతుకులు బాగు సేత్తారంట” అన్నది గవురి.
మళ్ళీ ఇంకోసారి నవ్వాడు ముసలయ్య.
ఇంతలో అక్కడికో కారు వచ్చి ఆగింది.
ఒక లావుపాటి సిల్కు లాల్చీ ఆయనా, ఆయన వెనుక తలలో బోలెడు మల్లెపూల ఆవిడా దిగారు.
“రేపు మా మహిళా సమాజంలో ‘పేద జనోద్ధరణ - మహిళల తక్షణ కర్తవ్యం’ అనే విషయం మీద నా ఉపన్యాసం వుంది. మీరు కూడా రావాలి” అంటున్నది త.బో.మ. ఆవిడ.
లా.సి.లా. ఆయన నవ్వాడు. “నాకెలా కుదురుతుంది వెంకటలక్ష్మీ. సరిగ్గా అదే సమయానికి గుడిసె పల్లెలో గ్రంధాలయం ప్రారంభోత్సవం చేయాలి కదా...”
ఇద్దరూ ముసలయ్యనూ గవురినీ కనీసం చూడనన్నా చూడకుండా గుళ్ళోకి వెళ్ళిపోయారు.
“మన గుడిసె పల్లెలో గందాలయం పెడతారంట. నాకు తెలవక అడుగుతాను, గందాలయం అంటే ఏందయ్యా?” అమాయకంగా అడిగింది గవురి.
“నాకూ తెల్దే... లే పోదారి. యింకో చెంటర్లో పయిచలొత్తాయేమో సూద్దాం. లేపొతే నిన్నా మొన్నాలానే ఇయాలా పస్తే” అంటూ లేచాడు ముసలయ్య.
గవురి కూడా లేచింది. క్రింద పరిచిన ఖాళీ గుడ్డని తీసుకుని భుజాన వేసుకుంది.
గవురి, గవురి భుజం పట్టుకుని ముసలయ్యా నడవసాగారు.
పక్కనే వెడుతున్న ఆయన గట్టిగా ముక్కుపొడుం పీలుస్తూ, “మానవసేవే మాధవసేవ కదండీ. మానవులకు, ముఖ్యంగా ఏమీ ఆధారంలేని పేద ప్రజలకు సేవ చేస్తే, ఆ దేవుడినే పూజించినట్టు అన్నమాట. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు అన్నారు మన పెద్దలు” అంటున్నాడు.
“అయ్యా... అందరూ పేద పెజలని బాగుసేయాలంతారు గందా, మరి మనకి పొద్దుటాల నించీ గుప్పెడు మెతుకులు దొరకనేదే...” అమాయకంగా అడిగింది ఆరేళ్ళ గవురి.
పేదవాడి బ్రతుకులు బాగుచేయాలి, చేస్తున్నాం అంటూ పేదవాడి పేరు మీద డబ్బు సంపాదించి, తమ స్వంత బ్రతుకుల నిచ్చెన మీద పైదాకా ఎక్కి తమ బ్రతుకుల్ని బాగుచేసుకునే ఈ లోకం గురించి ఆరేళ్ళ గవురికి ఎలా అర్ధమయేలా చెప్పాలో అర్ధం కాక ఊరుకున్నాడు ముసలయ్య.
“ఏమయ్యా... మాటాడవు” అన్నది గవురి, ఆకలి కడుపుని చేత్తో నిమురుకుంటూ.
ఎప్పటిలాగానే అదోలా నవ్వాడు వేదాంతి ముసలయ్య. అతని కడుపులోనూ బాగా ‘ఆకలిగా’ వుంది మరి!
భిక్షగాడికి డబ్బులు వేయటాన్ని వాళ్ళ బద్ధకాన్ని పోషించటం అని భావించేవాళ్ళూ వున్నారండీ.
నేను వేసవిలో జ్యూస్ షాపుకివెళ్ళినపుడు ఎదురుగా కూర్చున్న జ్యూస్ ఇప్పించి తర్వాత నేను త్రాగేదాన్ని.
లేకపోతే తాగబుద్ధయ్యేది కాదు.
అవునండి, బాగా చెప్పారు. ఎవరేమనుకున్నా మనం చేసే సహాయం మనం చేయటమే. మీలాటి సహృదయులు చేసినట్టే, ఒక్కొక్క మనిషీ ఒక బిచ్చవానికి ఒకపూటైనా కడుపు నింపగలిగితే అంతకన్నా ఏముంది? ఈ కథ మీద మీ స్పందనకు ధన్యవాదాలు.