Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 5
సత్యం మందపాటి

స్పందన

నాకు ఆనాటినించీ ఈనాటిదాకా ఎన్నో పుస్తకాలు, పత్రికలూ చదివే అలవాటు వుందని చెప్పాను గదా! అలాగే కొన్ని పత్రికల్లో పడుపు వృత్తి గురించి, వారు అలాటి వృత్తిలోకి కావాలని రాకపోయినా, ఆ విషవలయంలోకి ఎలా కొందరు స్వార్ధపరులు డబ్బుకోసం వారిని ఆ రొంపిలో తోసేస్తారు, సమాజంలో ఆ వృత్తి చేసుకునే వారికి మర్యాద, గౌరవం  ఎలా వుంటుంది మొదలైన విషయాలు చదువుతుంటే వచ్చిన ఆలోచనే ఈ కథ వ్రాయటానికి స్పందన. ఈ కథ ఆంధ్రపత్రికలో వచ్చాక, ఎందరో పాఠకులు మెచ్చుకుంటూ ఉత్తరాలు వ్రాశారు. అంతేకాక, ఆనాటి కొన్ని మంచి కథలు ప్రచురించిన ఒక కథా సంపుటిలో కూడా, ప్రత్యేకంగా ఆ పుస్తకానికే “మనిషి” అని పేరు పెట్టి ప్రచురించారు. ఇది నాకిష్టమైన కథల్లో ఒకటి. మీ అభిప్రాయం కూడా చెబుతారు కదూ!

మనిషి

(ఈ కథ ‘’ఆంధ్ర సచిత్ర వారపత్రిక’, సెప్టెంబర్ 4, 1974 సంచికలో ప్రచురింపబడింది)

ఒకసారి ఆ ఆరుగురినీ పరీక్షగా చూశాడతను.

ముఖాలకు తెల్లటి పౌడరు దట్టంగా పులుముకుని, కృత్రిమమైన చిరునవ్వులనింకా దట్టంగా పులుముకుని, ఒక వరుసలో వయ్యారంగా నించుని తన వేపే చూస్తున్నారు.

అందర్నీ పరీక్షగా చూసి, అతను ముఖం చిట్లించి ముందుకు కదలబోయాడు.

“మేమెవ్వరమూ నచ్చలేదా?” ఎర్రటి చీర కట్టిన అమ్మాయి అన్నది, నోటిలోని కిళ్ళీని బుగ్గన ఒక పక్కగా పెట్టి.

“ష్, నీకు ఎన్నిసార్లు చెప్పాను. అట్లా అనవసరంగా వాగవద్దని” కోప్పడింది అందరిలోకీ పెద్దగా కనపడుతున్న అమ్మాయి.

“జేబులో డబ్బులు లేకపోయినా, బాబుగారు ఏదో షికారుగా వచ్చినట్టున్నారు” అన్నది ఈ చివరి అమ్మాయి.

అతను చటుక్కున తల పైకెత్తాడు.

ఆ అమ్మాయిని అదోలా చూశాడు. ఫకాలున నవ్వింది.

ఇటువంటి స్థలాలకు రావటమే తప్పు. వచ్చిన తర్వాత కోపం తెచ్చుకోవటం మరీ తప్పు.

సర్దుకుని రెండడుగులు ముందుకి వేశాడు. అప్పుడే చూశాడామెను.

పక్క గదిలోనించి ఒకతనితో బయటకు వచ్చింది.

అతను తల వంచుకుని గబగబా వెళ్ళిపోయాడు.

ఆమె చెదిరిన ముంగురులను సరి చేసుకుంటోంది.

మళ్ళీ పరీక్షగా చూశాడామెను.

ఆమెలో అందం కన్నా, ఆకర్షణ కన్నా, అంగ సౌష్టవం కన్నా కూడా, అదో గాంభీర్యం, దానికి తోడు ఆమె కళ్ళల్లో ఏవో తెలియని భావాలు విశాలంగా కనపడ్డాయి అతనికి.

చిన్నగా దగ్గాడు.

ఆమె తల ఎత్తింది.

ఆమెను సూటిగా చూశాడు.

ఆమె కళ్ళతోనే ఏదో అడిగింది.

“ఊఁ!” అన్నాడు.

“రండి” మెల్లగా గదిలోకి నడిచింది.

ఇందాక వరుసలో నుంచున్న ఆరుగురూ తననీ, ఆమెనీ అదోలా చూస్తున్నారు.

తమలో తామే ఏవో గుసగుసలు చెప్పుకుంటున్నారు.

అతను గదిలోకి అడుగు పెట్టాడు.

ఆమె తలుపు వేసింది.

ఆమె ఏదో చెప్పబోయింది.

అతను తలూపుతూ, జేబులోనించీ రెండు పెద్ద నోట్లు తీసి ఆమెకి ఇచ్చాడు.

ఒకసారి అతన్ని వింతగా చూసి, వాటిలో ఒక నోటుని తిరిగి ఇచ్చేసింది.

“ఉంచు” అన్నాడతను.

“వద్దు” అన్నదామె మంచం మీద కూర్చుంటూ.

అతనూ ఆమె పక్కనే కూర్చున్నాడు.

ఆమె తన చేయి అతని చేతి మీద వేసింది.

ఆమె లోతైన కళ్ళల్లోకి చూస్తున్న అతనికి, అక్కడ మెరుస్తున్న కన్నీటి బిందువులు కనపడ్డాయి.

ఆమె కళ్ళల్లోకి ఇక ఎందుకో చూడలేకపోయాడు.

ఏదో ఆలోచన వచ్చినట్టుంది. చటుక్కున ఆమె చేయి విదిలించాడతను.

తలెత్తి వింతగా చూసింది.

“నీదే ఊరు?” అడిగాడు.

“తెల్లగా వున్న నిర్మలాకాశం మీద కారు మబ్బులు అలా హడావిడిగా పరుగెడుతూనే వుంటాయి. వాటిని మీదేవూరని అడిగితే ఏం చెబుతాయి?” అన్నది.

అతను కొంచెం ఆశ్చర్యంగా చూశాడామెని.

అతనిలో ఆమె గురించి కలిగిన కుతూహలం రెట్టింపయింది.

“అసలీ వృత్తిలోకి ఎందుకు దిగావు?” అడిగాడు.

“నా చిన్నప్పుడు మా రామయ్యగారికో ఆవు వుండేది. ఆ ఆవుని ఇక పోషించలేని స్థితిలో, అది ఆయనకి గుండెల మీద కుంపటిలా తయారయింది. దాన్ని అమ్మేయటానికి ప్రయత్నాలు చేశాడు కానీ, అమ్ముడవలేదు. చివరికి ఏ వివరాలూ తెలుసుకోకుండా అసలు మానవత్వమే లేని ఒకరికి అమ్మేశాడు కూడాను. వాళ్ళు ఆ ఆవుని ప్రతిరోజూ హింసించి చాల బాధ పెట్టేవారు. ఎంత భరించినా, కొన్నాళ్ళకి అస్సలు భరించలేక ఆ పిరికితనంలోనే ఒక విధమైన ధైర్యం వచ్చి వాళ్ళింట్లోనించీ పారిపోయి, మళ్ళీ రామయ్యగారి దగ్గరకే చేరింది. రామయ్యగారు భద్రంగా ఆ ఆవుని మళ్ళీ వాళ్ళకే అప్పజెప్పాడు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ పోరు భరించలేక మళ్ళీ పారిపోయింది. అప్పటికే రామయ్యగారు అటకెక్కటంతో, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. తర్వాత ఈ లోకంలో స్వతంత్రంగా బ్రతకలేకపోయింది. ఆ ఆవు ఎవరికి దొరికితే వాళ్ళు దానివల్ల డబ్బు చేసుకుంటున్నారు” గాఢంగా నిట్టూర్చింది.

ఫాన్ గాలికి స్వేచ్ఛగా ఎగురుతున్న ఆమె ముంగురులను చూస్తూ, తనలో ఆమె మీద పెరుగుతున్న ఒక పవిత్రమైన అభిప్రాయాన్ని గమనించాడు.

ఒక్క క్షణం ఆగి అడిగాడు, “నీకీ వృత్తిలో హాయిగా వుందా? ఇక్కడినించీ ఎందుకు పారిపోవు?” అని.

ఆమె కొంచెంసేపు నిశ్శబ్దంగా ఆలోచించి అన్నది. “ఒక కొలనులో కొన్ని చేపలుండేవి. అక్కడ చిన్న చేపల్ని పెద్ద చేపలు తింటూ వుండేవి. అందులో మరీ చిన్న చేపకి ప్రాణాంతకమయింది. ఏరోజు ఏ పెద్ద చేప తనని తింటుందో అని భయపడుతూ, ఆ కొలనులోనించీ ఇంకో కొలనులోకి, అక్కణ్ణించీ ఇంకో కొలనులోకీ మారుతూనే వుంది. అయినా ప్రతిచోటా పెద్ద చేపలు తనని తినటానికి సిద్ధమవుతూనే వున్నాయి. చివరికి ఒక పెద్ద చేప నోటికి చిక్కినప్పుడు అనుకున్నది, అసలీ చేపల్లో పెద్దా చిన్నా అన్న భేదం వున్నంత వరకూ ఏ కొలనులోనయినా ఒకటే అని”

చటుక్కున తల ఎత్తాడు అతను.

ఆమె తల వంచుకున్నా, ఆమె కళ్ళల్లోనించి పెల్లుబికిన వెచ్చని కన్నీరు అతని చేతి మీద పడి, అతని సహృదయంలో ఎన్నో కెరటాలను ఉధృతంగా పైకి లేపింది.

అతను ఆమె భుజం మీద చేయి వేశాడు.

“ఆలస్యం చేయకండి. అవతల నాకోసం జనం వస్తుంటారు” నెమ్మదిగా అంది.

సూటిగా చూశాడు ఆమెని. చటుక్కున అడిగాడు “నాతో వచ్చేస్తావా? నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని.

ఆమె అదిరిపడింది. అదోరకంగా చూసిందతన్ని.

అతను అనునయంగా ఆమె ముంగురులు నిమిరాడు.

“మా ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లవాడు వుండేవాడు. అతనికి రోడ్డు పక్కనే ఆడుకోవటం అంటే మహా సరదా. బురద గుంటల్లో కదులుతున్న పురుగుల్ని చూస్తే జాలి. ఆ పురుగుల్ని ఏరి ఒడ్డున పడేయాలని తాపత్రయపడేవాడు. ఫలితంగా తనుకూడా ఆ బురదను అంటించుకునేవాడు. వాళ్ళమ్మ అతన్ని దూరంగా తీసుకుపోయి, తల స్నానం చేయించేది. ఆ పురుగులు మాత్రం బయట బ్రతకలేక, మళ్ళీ ఆ బురదలోకే చేరేవి”

“అసంభవం,. ఎలా చేరతాయి? చేరటానికి వీల్లేదు” పెద్దగా అన్నాడు అతను.

ఆమె ఎంతో బాధగా నవ్వింది.

“సముద్రంలోకి తాటికాయలు విసిరేసేవాళ్ళం మా చిన్నప్పుడు. ఆ తాటికాయలు అలా అలా ఆ తెల్లటి నీళ్ళ మీద తేలుతూ పోవాలనీ, దిగంతాల అవతల వున్న స్వర్గాలను చూడాలనీ చాలా బలంగా విసిరేవాళ్ళం. మళ్ళీ అలలు వాటిని బయటికి నెడుతుండేవి. ఆ అందాల్ని చూడటానికి ఆ తాటికాయలు నోచుకోలేదేమో అనిపించేది. కొన్ని అలలు లోపలికి తీసుకువెడుతున్నా, బలమైన ఇంకొన్ని అలలు బయటికే నెడుతుండేవి. ఎంత ప్రయత్నించినా, ఒక్క తాటికాయనైనా ఆ సముద్ర తరంగాల మీద అవతలి అంచుకు పంపించలేకపోయేవాళ్ళం”

“నన్ను మభ్య పెట్టకు. నువ్వు చాల తెలివైనదానివి. చక్కటి మనసున్న దానివి. నీకలా జరగనీయను” అన్నాడతను ఆవేశంగా.

“వద్దు!” అన్నదామె. ఒక్కసారిగా భోరుమని ఏడుస్తూ.

ఆమె కన్నీళ్ళు తుడిచాడతను.

ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. పెద్దగా వెక్కివెక్కి ఏడ్చింది.

కాసేపాగి అన్నాడు, “ఎందుకు వద్దంటున్నావ్?” అని.

“కొన్ని బురద పురుగులు బురదలోనే వుండటం మంచిది. బురదలోనించీ బయటకు వస్తే, మీలాంటి వారికి ఆ బురద అంటటమే కాక, ఆ బురద పురుగుల ప్రాణం కూడా పోతుంది. వద్దు” అన్నది.

దిండులో తలపెట్టుకుని ఏడుస్తున్నది.

అతను ఆమెనే చూస్తూ నుంచున్నాడు.

కాసేపాగి “నే వెడతాను” అన్నాడు.

ఆమె అతను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేసింది.

“ఉంచు” అన్నాడు.

“వద్దు” అంది.

అతను ఆమెనోసారి సాదరంగా చూసి బయల్దేరాడు.

పోతూ పోతూ అడిగాడు, “నీ పేరు?” అని.

“మనిషి అని తెలుసుకోండి చాలు” అన్నదామె.

****సశేషం****

Posted in January 2023, కథలు

10 Comments

  1. ఓలేటి వెంకట సుబ్బారావు

    కధాంశము అత్యంత సున్నితమైనది..దానిని పాఠకులకు
    కధగా అల్లి అందించిన మీ విధానంలో ఒక ప్రత్యేకత కనబడుతున్నది, సత్యం గారు..
    అభినందనలు.

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు జయదేవ్ గారు. మీ అభిప్రాయాలు నాకెప్పుడూ అమూల్యమే.

  2. రామ్ డొక్కా

    అతి క్లుప్తమైన సంభాషణలతో, అమితంగా ఆలోచింపచేసే కథ, చాలా బాగుంది సత్యం గారూ..

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు మిత్రంఆ! మీకీ కథ నఇనందుకు సంతోషం.

  3. దర్భా లక్ష్మీ అన్నపూర్ణ

    ఈ కథలో నాయకుడికి వచ్చిన సందేహాలు హృదయమున్న ప్రతి మనిషికీ వస్తాయ్.ఎందుకో చక్కగా చెప్పారు.

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు అన్నపూర్ణగారు. మీకు ఈ కథ నచ్చినందుకు సంతోషంగా వుంది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!