జీవిత గమనములో - చిత్రము లెన్నియో
ఆ విధి నడకలలో - ఆశలచిత్తములే
పుట్టిన పుడమిలో - పొంచిన పొందుకకై
గిట్టిన సమయమున్ - గెల్వుము నాటుపోట్లు (1)
ఎంతటి వారైనను - ఎరుగక మానరుగా
చెంతను ధైర్యముతో - ఛేదించి తిరిగెరా
వంతుల వలయముతో - వారథి నిర్మిస్తూ
నిచ్చెల మనస్సుతో - నెదురించు నాటుపోట్లు (2)
చిక్కిన ప్రేమలతో - చేజిక్కును భాగ్యమ్ముల్
అక్కున రాదనుచు - ఆత్రుత లేలరా
అందని ద్రాక్షలలో - అలుపు సొలుపులే
సంతృప్తి యున్ననూ - సరిజేయు నాటుపోట్లు (3)
కష్టము లెన్నియున్న - క్రమశిక్షణ జూపుచూ
ఇష్టము చేసుకున్న - ఇబ్బందులు తొలగునే
దృష్టిని నిగ్రహించి - సృష్టికి ప్రతిసృష్టివై
ముందుకు సాగియున్న - ముగియు నాటుపోట్లు (4)
అందరి గమ్యములు - అచ్చోటు కలవకుండు
అందని తోడులని - అక్కసులేమి వద్దు
ఆఖరి నిమిషమందు - అక్కున జేరవచ్చు
ఆత్మస్థైర్యముల యందు - అంటవు నాటుపోట్లు (5)
కోర్కెలు నిగ్రహించుచు - కుంచిత బుద్ది వీడి
సమయపు విలువలో - సరిజూపు కుశలత
మార్పును స్వాగతించి - సన్మార్గము వెలికిజూసి
నేర్పులకు చేర్పయిన - నెంచవు నాటుపోట్లు (6)
భీతిని బిగియబట్టి - చేతిని చెక్కవలయు
బుద్ధిని సానపట్టి - ప్రోత్సాహము నెఱింగి
మాటలు కట్టిపట్టి - మార్గమును దిద్దుకున్న
అందని దేమిలేదు - అధిగమించు నాటుపోట్లు (7)
ఓటమిలనుకోవద్దు - ఓర్పును కోల్పోవలదున్
ఒక్కోమెట్టు విజయపు - సోఫాన మెక్కుటయే
ఒద్దికపడి తెలుసుకొన్న - ఒంటరియేడనుండు
గద్దెనధిరోహించగ - కానరావు నాటుపోట్లు (8)
స్ఫూర్తిని నింపుకొనుచు - స్ఫూర్తిదాయకమౌచు
ప్రయత్నసాధనెఱుగు - ప్రాణమున్నవరకు
ఫలితమందు హక్కు - కలిగినంతనే దక్కు
విజయభేరి మ్రోగించగ - వీడును నాటుపోట్లు (9)
వచ్చేటప్పుడు తేనివి - వద్ద తీసుకెల్లనివి
నీ ఉనికికి గుర్తింపు - నీ నడవడికలే
నీ శక్తికి ప్రేరణయే - నీవని తెలుసుకున్న
నీ విజయపు ధ్వనులే - నెట్టును నాటుపోట్లు (10)