ఆధారం
వెన్నెలకు నీ నవ్వే ఆధారం,
నువ్వెవరివని చెప్పను... అనామికా!
వేకువకు నీ రాకే ఆధారం,
నిన్నేమని కీర్తించను...అనుపమా!
నాట్యానికి నీ నడకే ఆధారం,
నిన్నెలా గుర్తించను....అవ్యక్తమా!
జీవితానికి నీ ప్రేమే ఆధారం,
నిన్నెలా నిలుపగలను...అదృశ్యమా!
ఆనందానికి నీ ఉనికే ఆధారం,
నిన్నెలా ఆహ్వానించను అవకాశమా!
మమతకి నీ హృదయం ఆధారం,
నిన్నెలా మరువగలను... అనుబంధమా!
మధురానికి నీ అధరం ఆధారం,
నిన్నెలా ఆవిష్కరించగలను.... అపురూపమా!
యవ్వనానికి నీకలయికే ఆధారం,
నిన్నెలా అనుసరించగలను...అసాధ్యమా!
కలలకి నీ కవ్వింపే ఆధారం,
నిన్నలా నమ్మించగలను...నిరుపమానమా!
కిలకిలలకి నీ నవ్వే ఆధారం,
నిన్నెలా క్రోడీకరించగలను....నవ్యరాగామా!
ఈ కవితకు నీ తలపే ఆధారం,
నిన్నెలా లిఖించగలను...కమనీయ కావ్యమా!
నా మమతకు నీ వలపే ఆధారం,
నీముందెలా మోకరిల్లగలను...మౌన గానమా!
ఈ రేయికి నువ్వే ఆభరణం, ఈ హాయికి నీ ఒడే ఆధారం.