Menu Close
Mahammari Corona
పం.
నరుల్ నిరంతరంబుఁ జేయు నష్టకారకక్రియల్
భరింపలేక యీ ధరిత్రి బాధ వెళ్ళఁబుచ్చఁగా
విరించి మంచి నెంచి నేఁటి వెఱ్ఱి వెఱ్ఱి చేష్టలన్
త్వరన్ నివృత్తిసేయ నొక్క దాని(1) నిట్లుఁ బంపెఁగా 1
............(1) జ్యేష్ఠాదేవియే యీ మహమ్మారి కరోన
తే.గీ.
మఱుఁగుపడుచున్న పద్ధతుల్ మఱల మనుజ
జీవనంబుల మఱవక చిరతరము ని
బద్ధత నియంత్రణల తోడ బ్రతుకు రీతి
మంచి గుణపాఠమును మహమ్మారి నేర్పె 2
కం.
శుభ్రతను నేర్ప వలెనె? య
శుభ్రత యెట నుండు నచట శోభ నశించున్
దభ్రం బగు సుఖశాంతులు
విభ్రమ మొందంగ నేల విశ్వం బెల్లన్? 3
కం.
రకరకముల ప్రాణుల నిల
ప్రకృతికి బిడ్డలుగఁ జేసి వర్ధిల విధియే
సకలము సృజించి, నరులకు
నకుంఠితంబైన బుద్ధి నధికముగ నిడెన్ 4
కం.
విధి యొసఁగిన వరమే కద
అధికులమను గర్వశిఖికి(1) నాజ్యము వోసెన్
వ్యధలకు గురి చేయుచు నే
విధి వర్తించినను బ్రకృతి వినవలె ననుచున్ 5
............(1) అగ్నికి
కం.
దాడినిఁ జేయఁ దొడంగెను
వాడినిఁ జూపించి; పిల్లవాఁడే దారిన్
వీడి చరింపఁగఁ బ్రకృతియె
తా డింభకు దిద్దవలయుఁ దల్లిగ నెపుడున్ 6
చం.
అదియె కరోనదండమయి యందఱి యాత్మల శుద్ధిచేయఁగా
మొదలిడె నేఁటికైన; నిఁక ముందు తరంబుల వార లెవ్వరున్
మెదలెడు వేళ శ్రద్ధమెయి మీరక హద్దుల నాచరించుచున్
పదపదమందు సృష్టికి నిబద్ధతఁ జూపరె బుద్ధిమంతులై 7
సుగంధి
సృష్టిసామరస్య మున్నఁ జేయునట్టి కార్యముల్
హృష్టి, తుష్టి, పుష్టి నిచ్చి యెట్టి కష్టనష్టముల్
సృష్టి సేయ; వీ ధరిత్రి యెల్ల ప్రాణికోటికిన్
ఇష్టజీవనాల స్వర్గమే యగున్ పదే పదే 8
కం.
పరమరహస్యం బిదియే
ఎఱిఁగి ప్రవర్తింపఁ జాలు నెల్ల వరంబుల్
నిరత మొసంగఁగఁ బ్రకృతియె
కరములు చాచుచును బిల్చుఁ గర మనురక్తిన్ 9
కం.
ఎవరి కరంబులు వారే
సవినయముగ జత యొనర్చి సలుపు నమస్సుల్
భువిజనశ్రేయస్కరములు
అవె యన్యవిధాలబాధ లన్నిఁటి బాపున్(1) 10
............(1) పోఁగొట్టును
Posted in April 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *