Menu Close
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
శ్రీనివాసస్తవము (స్రవంతి)
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
చం. తిరుమలనాథ! నిత్యనతదీనజనాకరపాలనవ్రతా!
     శరణము నీ పదాబ్జములె, సంతతియౌ మము నేలు కొమ్మయా!
     యరుణసుధాకరాక్ష! హృదయస్థరమావసుధావిరాజితా!
     నిరతము మంగళంబు లిడు నీదు సుదర్శననామశంఖముల్

చం. కరములు నీకు మ్రొక్క, మది గట్టిగ నిన్నె భజింప, వాక్సుధా
     కరములు పద్యముల్ దొరలఁగా భవదంఘ్రుల నాశ్రయింప, భా
     స్కరమహిమాన్వితాసమప్రశస్తవపుశ్శుభదర్శనంబు(1) శ్రీ
     కరమయి మమ్ము బ్రోవ, నినుఁ గాంచు మహాద్భుతభాగ్య మిమ్మయా!
            (1) తేజోవంతము మహిమకూడి సాటిలేని ప్రఖ్యాతి
                చెందిన శరీరము యొక్క మంగళకరమైన దర్శనము

చం. తలఁచినయంత మాత్రమున దర్శన మీయఁగ వచ్చు తండ్రివై
     కొలిచినవార లెల్లరకుఁ గొంగునఁ గట్టిన శాతకుంభమై(1)
     నిలిచిన స్వామి వీవె కద నిత్యము సేవల నందుకొంచు, నిన్
     వలచిన మానసం బితర భావనలన్ దరిఁజేర నిచ్చునే?
            (1) బంగారమై

చం. పలికినఁ బద్యమై చెలఁగి పావనమై భవదీయసేవలో
     నిలఁ గడుధన్యమౌ, కవిత యెప్పుడు నీ కరుణాప్తమే ప్రభూ!
     నిలకడ కీవె యౌదువుగ నిత్యనిదర్శన మిట్లు నిల్చి, భ
     క్తుల కడగండ్లు బాపెదవు కోట్లకొలంది తరించి యేఁగఁగన్

చం. నళినము లెట్టు లొప్పు నయనంబులఁ జూచిన సిగ్గుఁ జెందవే?
     యళికముఁ జేరి(1) పర్విడవె యన్నిసుగంధములున్? భవత్పదాం
     గుళులను దాఁకి యోటమినిఁ గుందుచు నిల్వవె(2) వృత్తమల్లికో
     త్కళికలు(3)?, నీదు సౌరు గని దాసుని భంగిని వంగు కంతుఁడే 
            (1) నొసటిపై ఉన్న సుగంధద్రవ్యభరితనామమును చేరుకొని
            (2) ఉండిపోవా (3) బలముగా ఉండు బొండుమల్లెమొగ్గలు 

కం. చంపకసరపంచక(1) మిది
     యింపుగఁ వాసన గ్రహింపు మీవే కృపతోఁ
     బంపిన ప్రేమామృతమును
     నింపితి నిండుగ స్వయాన నీ కర్పింపన్
            (1) ఐదు చంపకమాలలు
Posted in September 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *