వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 168 వ అంతర్జాల సమావేశం ఆగస్టు 14, 2026 నాడు ఆసక్తిదాయకంగా జరిగింది.
వీక్షణం అధ్యక్షులు డా.గీతామాధవి గారి తొలిపలుకులతో ఈనాటి సభ ప్రారంభమైనది. వీక్షణం భారతీయ నిర్వాహకులు శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ నేటి స్వీయపరిచయకర్తలు అయిన డా.చీదెళ్ల సీతాలక్ష్మి గారినీ, శ్రీ బిటవరం శ్రీమన్నారాయణ గారినీ సభకు పరిచయం చేశారు.
సీతాలక్ష్మిగారు, కరెంటు కూడా లేని పల్లెలో పుట్టి, గుడ్డిదీపం కింద చదువుకుని పైకొచ్చినవారు. అన్ని క్లాసులలోనూ ప్రథమురాలుగా వచ్చేవారు. మిగతా సమయాన్ని లైబ్రరీలో గడిపేవారు. శ్రీశ్రీ, దివాకర్ల, దాశరథి వంటి మహాకవుల ఉపన్యాసాలు విని సాహిత్యంపై అభిలాషను పెంచుకున్నారు. ఛందోబద్ధ పద్యాలనే గాక అన్ని ప్రక్రియలలోనూ వ్రాయగలదిట్ట. అనేక పురస్కారాలను అందుకున్నారు.
తదుపరి శ్రీ బిటవరం శ్రీమన్నారాయణగారి స్వీయపరిచయం జరిగింది. తన తండ్రిగారు హిందీ పండిట్. తన వ్యాపార రీత్యా అనేక రాష్ట్రాలు తిరగడం వల్ల బహుభాషా కోవిదులై అన్ని భాషలలో కవిత్వం వ్రాస్తున్నారు. వరంగల్ వాచస్పతి, కాకతీయా నంది అవార్డు లాంటి అనేక బహుమతులు పొందారు. షుమారు 5000 పైగా రచనలు చేశారు.
నాలుగు నెలలుగా ప్రవేశపెట్టిన ఈ స్వీయ పరిచయ కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకొంటున్నది!
తదనంతరం శ్రీ రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది.
మొదటిగా గీతామాధవిగారి "తక్కెడ" అనే విశిష్టమైన కవిత అందరినీ ఆకట్టుకుంది. ఈ లోకం ఎవర్ని ఎలా తూస్తుందో తెలియదు అంటూ అద్భుతంగా సాగింది కవిత.
చీదెళ్ల సీతాలక్ష్మి గారు తన ఎన్నికల ఫీట్లు కవితలోని అంత్యప్రాసలు ఆకట్టుకున్నాయి. పరిమి వెంకట సత్యమూర్తిగారు త్యాగాల కంచె అనే కవితలో సరిహద్దులలోని సిపాయిల త్యాగాన్ని శ్లాఘించారు. శ్రీ బిటవరం శ్రీమన్నారాయణగారు స్వాతంత్ర్యం నీ జన్మ హక్కు అంటూ ఓటర్ల కర్తవ్యాన్ని తెలిపారు. కె.శ్యామలాదేవిగారు ప్రకృతి సౌందర్యాన్ని అందంగా వర్ణించారు.
శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు ప్రకృతి జననం అనే కవితను చదవగా, సిరిమల్లె మంజులగారు మనిషిలోని ఓ మనిషీ అనే కవితను చదివారు. డా.ఉషారాణి ప్రతీకారమే పరిష్కారం కాదు అని ఉద్బోధించారు.
శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారు ఎగురుతుంది ఎగురుతుంది జాతీయ జండా అంటూ చక్కగా పాడారు. శ్రీ పాండురంగారావుగారు నోటు కోసం గాంధీ బొమ్మ ఓటుకోసం అంబేద్కర్ బొమ్మ అని చమత్కరించారు.
శాంతిశ్రీ గారు నేనొక అక్షర దివిటీని అని చదవగా, శ్రీ వీరాచారి గారు స్వతంత్ర భారతదేశం గురించి పాడారు.
ప్రసాదరావు రామాయణం అనే నేను ఆనవాయితీకి భిన్నంగా ఒక గజల్ పాడి వినిపించాను. అవధానం అమృతవల్లి గారు జయతు జయతు భారతమాతా అంటూ పాడడమే కాకుండా, అవ్యక్త గీతిక అనే చక్కని కవిత వినిపించారు.
డా:బృందగారు ఆనవాయితీకి భిన్నంగా సాధికారపు సంకెళ్ళు అనే కవిత చదివారు. మామూలుగా కమ్మని గాత్రంతో పాడేవారు. బుక్కపట్నం రమాదేవిగారు స్వప్న సంకలనం అనే కవిత చదవగా, బంతికట్ల నాగేశ్వరరెడ్డిగారు వారు వ్రాసిన రామాయణ కావ్యం నుండి పద్యాలు చదివారు. శరద్కవి మూర్తిగారు స్వయంకృతాపరాధం అనే కవితను చదివారు. శ్రీలతగారి కలం తిరుగుబాటు కవిత చాలా బావుంది. అమీనా బేగం గారు సర్వమత సామరస్యం గురించి తన కవితలో చక్కగా వివరించారు. శ్రీమతి కోదాటి అరుణ గారు సాగే నాగీతం అంటూ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. చివరగా శ్రీ రాజేంద్రప్రసాద్ గారు మీ కవితలు బాగున్నాయ్, నాదేశం బాగుంది అంటూ చదివిన కవిత చాలా బాగుంది మాత్రమే కాదు సభకి హైలైట్.
డా. గీతామాధవి గారి వందన సమర్పణతో ఈరోజు సమావేశం ముగిసింది. ఈ 168వ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.