Menu Close
Ghali Lalita Pravallika
కొలిమి (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

"బస్సులో వచ్చే పని అయితే మీ ఊరికి, ఉదయం 7:30 కల్లా బస్సు వస్తుంది. ఎక్కి రావచ్చు. లేదా మీరు మీ వెహికల్ లో వొచ్చే పని అయితే 8:45 కి స్కూల్ గేటు లోపల ఉండాలి," చెప్పారు కరస్పాండెంట్ పెంచల రెడ్డి.
"బస్సులో వచ్చేస్తుంది లెండి. ముందుగా వచ్చి, స్కూల్ పిల్లల్ని చూసుకుంటుంది," అని చెప్పి కరెస్పాండెంట్ సర్ కి థాంక్స్ చెప్పి, ప్రణవిని తీసుకుని బయటికి వచ్చాడు జంబేష్.
"మీరు అలా ఎలా చెప్పారు? స్కూల్ కి గంటన్నర ముందు వెళితే నా టైం అంతా పోతుంది కదండి. ఇంట్లో పనులు, పిల్లలను స్కూలుకు పంపడం... ఇవన్నీ చేసుకుని 7: 30 కి బస్ అంటే... ఏడు గంటలకే ఇంటిదగ్గర బయలుదేరాలి. ఇన్ని పనులు చూసుకొని, ఆ టైం కి బయలుదేరడం కష్టం అవుతుంది," అంది ప్రణవి.

"నీకు మంచి చేసినా చెడు గానే చూస్తావు. నువ్వు ఆ బస్సులకోసం పడిగాపులు పడాలి. బస్సులు ఆ టైం కి దొరకొచ్చు... దొరకక పోవచ్చు. ఒకవేళ దొరికిన నువ్వు బస్టాండ్ నుంచి స్కూల్ కి నడిచి వెళ్ళాలి. ఇదంతా చూసుకుంటే నీకు స్కూల్ బస్సే నయం. ఇంకా చెప్పాలంటే రోజు బస్ కి టికెట్ తీసుకుని వెళ్లాలి దానికి డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. నీకు వచ్చే జీతం బస్సు చార్జీలకే సరిపోతాయి. ఇవన్నీ ఆలోచించి చెప్పడం తప్పయింది. ఇప్పుడే స్కూలు బస్సు లో రాదని చెప్పేస్తాలే... తను విడిగా బస్సులో వస్తుందని చెప్తాను," అంటూ సంస్కూటర్ వెనక్కి తిప్పబోయాడు.

"ఇప్పుడు వెళ్ళి చెబితే అసహ్యం గా ఉంటుంది. వెనక్కి తిప్పబోకండి అలాగే స్కూల్ బస్సులోనే వెళ్తాను," అంది ప్రణవి.

"ఎందుకులే... నీకు ఇష్టం లేనప్పుడు, నీకు నచ్చినట్టుగా ఊరేగు. వాళ్ళు ఏమనుకొంటే నాకేం! నేను చెప్పేస్తా," అన్నాడు బండిని తిప్పకుండా నే.

'చెబితే చెప్పండీ. అందామనుకుంది కానీ, నిజంగా చెప్పేస్తే... ఈయన మాటల్ని బట్టి బస్ చార్జీలు ఇవ్వడు అని అర్థమైంది. తను ఇవ్వక పోతే రోజూ ఛార్జీల డబ్బులు ఎక్కడనుండి తెచ్చుకోవాలి? ఎవర్ని అడుక్కోవాలి? పోనీ ఉద్యోగానికి వెళ్ళకుండా ఆగితే! అమ్మో!పిల్లల పరిస్థితి ఏం గాను. పోనీ ఇంకో ఉద్యోగం వెతుక్కుంటే...! అది ఇప్పుడు సాధ్యమా! ఇక్కడ కంప్యూటర్ నేర్చుకోవచ్చు అని చెప్పారు. బయట కోర్స్ నేర్చుకోవాలంటే చాలా డబ్బులు కట్టాలి. ఇక్కడైతే నేర్చుకుంటూ చెప్పచ్చు. డబ్బులు మనకే వస్తాయి. చిన్న చిన్న కారణాలకి, వెనకడుగు ఎందుకు వేయడం? ఈయన యేంటి అర్థం చేసుకోకుండా... ఒకళ్ళనొకళ్ళు చర్చించుకుని డెసిషన్ తీసుకోవాల్సిన దగ్గర కూడా... మళ్లీ మళ్లీ నోరు ఇవ్వకుండా కఠినమైన నిర్ణయాలు తీసేసుకుంటారు. ఈయన దగ్గర ఎలాగైనా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికి ఎలాగో ఆయనను కన్విన్స్ చేసుకోవాలి,' అని అనుకొని, "నాది తప్పయ్యింది. నేను మీరు ఆలోచించినట్లు ఆలోచించలేకపోయాను. మీరన్నట్లుగానే చేద్దాం," అంది రిక్వెస్టింగ్ గా.

ఏ కళనున్నాడో ఏమో! బండిని ఇంటి వైపుకు పోనిస్తూ... "నా మాటకు ఎప్పుడు ఎదురు చెప్పబాక. నన్ను నువ్వు ఫాలో కావాలి. నీ బోడి ముండ సలహాలు నేను తీసుకోను. నాకు చెప్పే ప్రయత్నం ఇంకా ఎప్పుడు చేయక," అన్నాడు.

ప్రణవికి జంబేష్ మాటలకు కోపం వచ్చినా... 'అహంభావి ముందు మనస్సు ముడి విప్పితే ప్రమాదం,' అని అనుకుని, మౌనంగా ఉంది.

ప్రణవిని ఇంటి దగ్గర వదిలేసి జంబేష్ వెళ్లిపోయాడు.
***
పిల్లల్ని తనతోపాటు తయారు చేసి, ముందుగానే స్కూల్ కి పంపించేసింది ప్రణవి.

వాళ్లు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉండటంతో... క్యారేజీ ఇచ్చే పని లేదు. మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లల భోజనం స్కూల్ లోనే గడిచిపోతుంది. జంబేష్ ఎటూ మధ్యాహ్నం ఇంటిదగ్గర భోజనం చేయడు. అందువల్ల ప్రణవి వంట చేసే పని తగ్గించుకుంది. ఏదుంటే దానినే క్యారేజీలో సర్దుకుని వెళ్లిపోయేది.

స్కూల్ బస్సులో వెళ్లి బస్సులో వచ్చేది.

తనకేం ఖర్చు ఉండేది కాదు. ఉదయాన్నే స్కూల్ కి వెళ్లేసరికి ఈ ట్రిప్ పిల్లలు మాత్రమే ఉండేవారు. వాళ్లు అల్లరి చేయకుండా చూసుకునేది.

ప్రణవికి వారానికి 15 పిరీడ్స్ మాత్రమే ఇచ్చారు. మిగిలిన టైం అంతా ల్యాబ్ లో ఉండటమే. మిగిలిన కంప్యూటర్ టీచర్లకు 35 పిరియడ్స్ ఉండేవి. ల్యాబ్ ఇంచార్జ్ సురేష్ ప్రణవి కన్నా చాలా చిన్నవాడు. చాలా తెలివైనవాడు. కరెస్పాండెంట్ సర్... ఇతని దగ్గరే నీకు తెలియనివి తెలుసుకో అని చెప్పి చెప్పారు. కానీ అతనిని అడిగి తెలుసుకోవడానికి టైం సరిపోయేది కాదు ప్రణవికి.

"లీజర్స్ అనేవి క్లాస్ కి వెళ్లకుండా ఉండటానికి... ల్యాబ్ లో వచ్చే పిల్లలను మీరు చూసుకోవాలి. వాళ్ల చేత ప్రాక్టికల్స్ చేయించాలి. అందరి పిల్లలు కంప్యూటర్ మీద ప్రోగ్రామ్స్ చేసేట్టు గా మీరు చూడాలి," అంటూ చెప్పాడు సురేష్.

వాళ్లు క్లాస్ కి వెళ్ళినప్పుడు సగంమంది పిల్లల్ని ల్యాబ్ కు పంపించేవారు. ఆ పిల్లలందరినీ లైన్ లో కూర్చోబెట్టి. ఉన్న సిస్టమ్స్ ను అందరికీ, అందెట్టుగా చూడటం, వాళ్లు ప్రోగ్రామ్స్ చేస్తున్నారో లేదో చూసుకోవటం ప్రణవి పని అయింది.

తను వెళ్ళిన క్లాసులో యొక్క నోట్స్ కూడా దిద్దేందుకు టైం ఉండేది కాదు.

సురేషు ఇంకో టీచర్ మాత్రం వాళ్లు ల్యాబ్ లో ఉన్న ప్రణవికి పిల్లల్ని చూసుకోమని అప్పచెప్పి, వాళ్లు నోట్స్ లు కరెక్షన్ చేసుకుంటూ ఉండేవారు.

ప్రణవి పిల్లలకి నోట్స్ ఇచ్చేముందు సురేష్ సార్ కి చూపించాలి. ఆయన ఓకే అని సైన్ చేసాక అప్పుడు పిల్లలకు ఆ నోట్స్ ఇవ్వాలి.

ఆ నోట్స్ ఆయన చూడటానికి కొంత టైం తీసుకునేవారు. నోట్స్ ప్రిపేర్ చేయాలన్న పిల్లల బుక్స్ కరక్షన్ చేయాల న్నా... ఇవన్నీ ప్రణవి ఇంటి దగ్గరే చేయాల్సి వచ్చేది. స్కూల్ కి ముందు వెళ్లిన రాసుకోవడానికి ఉండేది కాదు. ముందు ట్రిప్ లో వచ్చే పిల్లల్ని కాపలా కాసుకోవాల్సి వచ్చేది.

స్కూల్ పని ఇంటికి రావడంతో ఇంట్లో పనులు వాయిదాలు పడ్డాయి. ఇంట్లో పిల్లలు చూసుకునే టైం తగ్గిపోయింది. దానికి తోడు పిల్లల నోట్స్ లన్నీ వేసుకుని బస్సు ఎక్కుతూ ఉంటే అందరూ నవ్వేవారు. స్కూల్లో మిగిలిన టీచర్లు అంతా కూడా ఇంటిదాకా పుస్తకాలు పట్టుకెళ్లే వాళ్ళు కాదు. ప్రణవి తెలుగు మీడియం చదవడం వల్ల, ఇది ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ అవ్వడంతో ఎక్స్ప్లనేషన్ చేయాలన్నా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది.

సెంట్రల్ బోర్డ్ లో మాత్రం చాలా స్క్రిప్ట్ గా ఉండేది. కచ్చితంగా ఇంగ్లీష్ టు ఇంగ్లీషే చెప్పాల్సి వచ్చేది. స్టేట్ బోర్డు కొంచెం తెలుగులో మాట్లాడినా ఇబ్బంది ఉండేది కాదు. అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే... టెక్నికల్ కోర్స్ కావటంతో... కొన్ని టర్మ్స్ ఉపయోగించి, చెప్పడం ఈజీగా ఉండేది. ఫిఫ్త్ లోపు పిల్లలకి చెప్పడం వల్ల... అంత డెప్త్ అవసరం ఉండేది కాదు. కీస్ పరిచయం చేయటం. కమాండింగ్ కీస్... డ్రాయింగ్ బోర్డులో ఉండే వి చెప్పటం. కాపీ పేస్ట్ ఎలా చేసుకోవాలి? అసలు డెస్క్ టాప్ అంటే ఏంటి? మిని మైజ్, మేగ్జిమైజ్...
కర్సరు... మౌస్ లో లెఫ్ట్ బటన్ యూజ్ రైట్ బటన్ యూజ్ ఇలా చిన్న చిన్నవే చెప్పడం వల్ల లాంగ్వేజ్ ప్రాబ్లం పెద్దగా రాలేదు. కానీ టీచర్లతో... పిల్లలతో మాట్లాడేటప్పుడు...
కచ్చితంగా ఇంగ్లీషులోనే మాట్లాడాలి.

ప్రిన్సిపల్ సార్ అయితే అసలు తెలుగులో మాట్లాడేవారు కాదు. ఆయనకు అసలు తెలుగే రాదు. ఆయన కేరళ నుంచి వచ్చారుట.

మిగిలిన టీచర్లు చాటుమాటున తెలుగులో మాట్లాడేవారు. కానీ ప్రిన్సిపాల్ సార్ ని చూస్తే అందరూ ఇంగ్లీషులో మాట్లాడుకునేవారు.

ల్యాబ్లో కి వేరే టీచర్లను రానిచ్చేవారు కాదు.

కేవలం కంప్యూటర్ స్టాఫ్ మాత్రమే ఉండేవారు.

వీళ్ళకి చక్కగా ఏసి క్లోజ్డ్ రూమ్ ఉండేది.

వీళ్లు భోజనాలు కూడా అక్కడే చేసేవారు.

మిగిలిన టీచర్లు అందరికీ స్టాఫ్ రూమ్ వేరే ఉండేది. వాళ్లకి ఒక లాంగ్ టేబుల్ రెండు ఫ్యాన్లు మాత్రమే ఉండేవి. వాళ్లు కంప్యూటర్ స్టాఫ్ ని చూసి జల్సిగా ఫీల్ అయ్యేవారు.

స్లిప్ టెస్ట్ మొదలైంది. ప్రణవి క్వశ్చన్ పేపర్ తయారు చేసి సురేష్ కి ఇచ్చింది. అతనేమో కొన్ని మార్చి సైన్ చేసి ఇచ్చాడు. తర్వాత అందరి కొసెన్ పేపర్లని కలెక్ట్ చేసుకుని, ఆఫీసులో సబ్మిట్ చేసేసాడు.

పిల్లలకు పరీక్షలు మొదలయ్యాయి. ప్రైవేట్ స్కూల్స్ లో పరీక్షలు వస్తున్నాయి అంటే పిల్లల కన్నా ముందు టీచర్లకి భయం. ఏ కారణం చేతనైనా వాళ్ల మార్కులు తగ్గాయంటే ... ముందు టీచర్లకే అక్షింతలు పడేది.

వాళ్ళ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆ టీచర్ కి ఇన్విజిలేషన్ డ్యూటీ వెయ్యరు. వాళ్లు పిల్లలు సరిగ్గా రాస్తున్నారో లేదో వెళ్లి చెక్ చేసుకోవాలి. ప్రణవీకి ఇదంతా కొంచెం కొత్తగా ఉంది. ఫస్ట్ అపాయింట్మెంట్ కదా! కంప్యూటర్ ఎగ్జామ్.

ముందు ఎగ్జామ్స్ అప్పుడు టీచర్లు పడ్డ పాట్లు చూసి ఉండటంతో... ప్రణవి కి భయం మొదలైంది.

★★★ సశేషం ★★★

రచయిత్రి పరిచయం ..

Ghali Lalita Pravallikaపేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’ బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in September 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *