(ఓ దేవా నీవు సహించగలిగే ఆ కష్టాలు అర్భకులమైన మాదాకా రానీయద్దు)
సుఖ నిద్రకు అడ్డుగా యున్నశంఖ చక్రాలు విసిరేసి
హంసతూలికా తల్పంపై దేవి చెంతన హాయిగా పడకేసి ,
ఆమె పసందైన మాటలు, పాడే వీనుల విందైన పాటలు వింటూ,
భక్తులు కష్టాలను ఒక కంట ఆర్ద్ర హృదయంతో కంటూ,
వారికోర్కెలన్నీ చిరునవ్వుతో తీర్చుతూ వారు పడే కష్టాలు కడగంటనే ఆర్చుతూ యుండక ఎందుకయ్యా నీకీ గోల ..
శేష నాగు పలు పడగల బుస రుసల రొదలో యుగాలుగా నిలిచి మురుగుతున్న కంపు పాలకడలిలో
ఎగసి పడే అలల ఊపుతో పడి లేస్తున్న పాము చుట్టపైన, యోగ నిద్రకై సిద్ధమౌతున్న నీకు ఆ దేవి మమతతో కాళ్ళు పట్టినా కంపుని తోలుకుంటూ, ఎగిరెగిరి పడుతున్న పాముపై నీకెక్కడిదయ్యా నిద్ర ప్రాప్తి,
ఆ దేవి చేతులకి మిగిలేది నొప్పులే గాని లేదు గదా ఎందునా ఆమెకి తృప్తి.
అన్ని చిక్కులలో ఉండి కూడా నీకు తప్పలేదు లోక కళ్యాణం కోసం ధర్మనిరతి, కష్టాల కడలిలో కూడా ఆ తారణము. అయినా దీనంగా భక్తులు విన్నవించే విన్నపాలు నిన్నుకరిగించి ఆఘమేఘాలపై ఉరుకులెత్తించాయి వారి కష్టాలు చూడలేక దయతో వాళ్ళని ఆదుకోవడానికే జరిగింది నీ వివిధ అవతార అవరోహణం.
క్షీరసాగర మథనం సమయంలో సాగరములో కవ్వమై గిర గిర తిరుగుతున్న మంధర గిరి కృంగి మునిగి పోతున్న స్థితిలో దేవదానవులు చేసిన ఆర్తనాదాలు తొందరపెట్టాయి నిన్ను ఆ కడలి వైపు, దాన్ని అగాధములో కూలిపోకుండా నిలిపేందుకు…అప్పుడు నీవు కూర్మమై దాని అడుగున చేరి…
‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది వేద వాక్యం
నీ అభయ హస్తం దాపు లేనిదే నిలబడదా సూక్తం
లోకరక్షకుడు, ధర్మమూర్తవయిన నీ తోడు లేకుండా
దేవదానవులంతా కూడి కూడా ఆపగలిగినారా కృంగి పోతున్న మంధరగిరిని సాధించ గలిగారా సముద్ర మధనాన్ని దొరికేదా అమృతమసలు ఎన్నితిప్పలు పడినా
దొరికిన అమృతాన్ని సమంగా పంచే నెపాన్నైనా చెడుని వంచనతో దించి మంచిని ఆదరంతో పెంచుతూ అతిలోక సుందరీమణిగా చూపుల గాలం విసురుతూ అమృతానికై జరుగబోయే దేవదానవుల పోరునాపి ధర్మాన్ని జగత్ సంరక్షణార్థమై కాపాడినది నీవే కదా.
పీడిస్తున్న తండ్రి నుంచి ప్రహ్లాదుని విముక్తి కై నీ ప్రయత్నం బహుదా శ్లాఘ్యం —
అతిబలవంతుడనని బ్రహ్మవరగృహీతనని గర్వంతో హిరణ్యకశిపుడు
లోకాలన్ని తానే గెలిచానని, తన మరణానికి ఆకాస్కారమే లేదని మిడిసిపడి కన్నకొడుకనికూడా కనికరించక మితిమీరిన అహంతో
పసిబాలుడనికూడా దయచూపక ఆ తండ్రి కోపోద్రేకంతో వాని నారాయణ జపం నిలుపుటకై చేసిన అకృత్యాల దారుణం అదుపులేకుండా సాగిపోతున్న ధాటికి విష్ణువు వారుణమై వాకిట స్తంభం నుండి యురికి ఉగ్ర నరసింహుడై నిల్చి రాక్షసుని లాగి కాళ్లపై పడవేసి ఉదరాన్ని వాడి నఖాలతో చీల్చి చెండాడి హతమార్చి ప్రహ్లాదుని ఆ దుష్టుని బారినుండి రక్షించి భక్తులకండగా నిలిచిన ఓ దయానిధి, భక్తరక్షకా, మమ్ముల రక్షించుమా!
మకరి పట్టువిడిపించి రక్షించమని ఆర్తితో ప్రార్థిస్తున్నగజేంద్రుని కాపాడటానికై నీవు చేసిన నీ ఉద్రేక భరిత ఉరుకు పయనం అమోఘం, అద్వితీయం …
విచ్చలవిడిగా గజరాజు తన మిత్రులతో అరణ్యాన్ని అతలాకుతలం చేస్తుంటే, క్రిమి కీటకాలు వాటి పాదాల క్రింద పడి చస్తూ దీనావస్థలో దేవుణ్ణి ప్రార్థిస్తుంటే, చిరు జంతువులను కాళ్లతో బండగా త్రొక్కుతూ చేస్తున్నఆగడాన్ని అడ్డుకునే వారు లేక జంతు జాలమంతా బిక్కు మంటూ దిక్కులు చూస్తూ యుండగా ఏమియు చేయలేక గజరాజు జలక్రీడలనాడుట కభిలషించి ప్రక్కనే నున్న సరోవరంచెంతకు గుంపుతో నేగ అందు దమ్మున దూకగా అందాడుతున్న మకర కూనలు గొల్లున ఏడుస్తూ తల్లుల వద్దకేగ అది గాంచిన మకరరాజు చెంగున ఎగిరి కరిరాజు కాలు బలంగా పట్టి కొరుకగా రక్తమోడుతున్న కాలుతో ఆ గజరాజు చేసిన ఘీంకృతి వనమెల్ల దద్దరిల్లగా పక్షులెల్ల భీతితో చెదరి ఆకాశమంతా విస్తరించి వినువీధి చీకట్లు చేయగా కరి ఒడ్డుకి మకరి చెరువు లోకి లాగుతూ జరుగు పోరాటం క్రమంగా పెరుగగా వారాలు గడవగా తిండిలేక, కోల్పోతున్న రక్తంతో కరి అలసి నిస్సత్తువతో తూగగా దాని రుధిరాన్ని త్రాగుతూ బలాన్ని పుంజుకున్న మకరి మరింత చెలరేగగా నిస్సహాయుడైయున్న కరి హరిని దీనముగా ‘నీవు తప్ప వేరు దిక్కులేదని’ ప్రార్థించగా సతితో ఉత్సాహంగా ఆడుతున్న ఆటను మధ్యలోనే విడిచి పరుగున సరస్సుకై పరుగులిడగా వెనువెంటనే వచ్చిన సుదర్శన చక్రాన్ని వేగాన విసరి మోక్షమిచ్చే విష్ణు మకరికి మకరినుంచి విముక్తినిచ్చి కాపాడిన దేవుని వేనోళ్ళ పొగడ దీవించినాడా పరంధామ కరిని.
ద్రౌపది మాన సంరక్షణ కై మరోసారి శ్రీకృష్ణావతారంలో…
శకుని పన్నాగం ఫలించి అందు భాగమైన పాచికల జూదపు ఖేలలో ధర్మజుడు రాజ్యాన్ని, తనను తుదకు ద్రౌపదిని ఓడి ఖలతతో తమ్ములతొ తలలు దించుకుని ఖిన్నులై దుర్యోధనుని ఎదుర్కొన లేక ఇదంతా చూస్తూ కిమ్మనక యుండిన పెద్దల న్యాయమర్థించలేక ద్రౌపదిని నిండు సభలోనికి జుట్టుబట్టి లాగి తెచ్చి వలువలొల్చుతున్న
దుశ్శాసనుని నాపలేక నిస్సహాయులై పాండవులుండ, నిస్సహాయురాలై నిలచిన
ద్రౌపది ఎక్కడో యున్న కృష్ణునికి మ్రొక్కే తన మానాన్ని కాపాడి రక్షించమన ఆ ఆపద్బాంధవుడు వెనువెంటనే ఎడతెగక చీరలందించి ఆప్తుడైనాడు, ద్రౌపది మాన సంరక్షకుడై.
దూర్వాసుని శాపావేశానికి బలి కాబోతున్న ద్రౌపదిని మరోసారి రక్షించిన శ్రీ కృష్ణుడు.
దూర్వాసుడొకమారు దుర్యోధనుని ప్రోద్భలాన పాండవుల పరీక్షింపదలచి అరణ్యవాసాన యున్న పాండవులచెంతకు చేరె తన శిష్యకోటినెల్ల గైకొని, భోజనసమయం దాటియున్న సమయాన పాండవులందరు సతీసమేతంగా భుజించి విశ్రాంతి లో యుండ, ద్రౌపదిను పాత్రలన్నిటిని
క్షాళనము గావించి విశ్రాంతి గైకొను వేళ ‘ఆకలితో యున్నవారమని, అన్నమొడ్డించ’మని ముని
శాసించి స్నాదులకై నదికరుగ, వంటసామానులన్నియును లేకున్నదై, దిక్కుగానక,
‘దీన బాంధవ, కాపాడుటకు నీవు తప్ప వేరు దిక్కులేద’ ని ఆ మురళీధరుని మ్రొక్కుకొనగ నాతడు వేగాన ఏతెంచి ద్రౌపది నూరడించి, ఆ పాత్రల్లో అన్న శకలం మేదైన గలదేమో చూడమన్నద్రౌపది దానప్పుడే కడిగిన పాత్రలో అన్నపు మెతుకుండుట గాంచి కలయేమోనని ఆశ్చర్యముతో మాధవునికి జూప అతడు దానిని భక్షించి, ఆ మునికి వారిశిష్యులకు తుష్టిగా ఉదరములు నిండ వారును “బ్రేవ్” మని త్రేంచుతూ “మేమింక తినలేమ”ని చనిరి సంతుష్టులై.
త్రివిక్రముని చమత్కృతి
బాల బ్రహ్మచారివై యాగమునకేగిన అచట నీ చిన్ని పాద ప్రమాణముతో కోరితివి మూడడుగుల నేలనే యాగ మందున, మహాబలి ఆదరణతో తన స్థాయికి తగ్గ వరాలను కోరుమనగా శుక్రాచార్య హెచ్చరికగా ఇచ్చిన సలహాను కూడ పెడచెవిని బెట్టి ఆ దానశీలుడైన బలి నీ చిన్ని కోర్కెను తీర్చుటకు సిద్ధమవగా, వామనుడవైన నీవు అంతంతగా పెరిగి త్రివిక్రముడవై రెండు పాదాలతో జగత్తునీ అన్నిలోకాల ఆక్రమించి తిరిగి మూడోపాదానికి తావెక్కడ చూపుమనగ ఆ బలి చక్రవర్తి
నీ గుర్తెరిగి, నీ యోచన గ్రహించి తన తలను వంచి మూడవ పాదము భర్తికి తావు చూపగా పాతాళానికి అణగత్రోక్కి మోక్షానికి తెరువు చూపి అవతారానికి భాష్యం చెప్పిన సర్వేశా, మాకు కూడా మోక్షగతిని చూపు దీనజన మందార, పాహిమాం, రక్షమాం…
చిన్నప్పటి తోటి విద్యార్థి బీద కుచేలునికి చేసిన సహాయం
ఆనాడు చిన్ననాడు తోటి విద్యార్థులుగా, ఒకే గురువు వద్ద వ్యాకరణం నేర్చారట, నేడు కుచేలుడు గంపెడు పిల్లలతో కడు బీదస్థితిలో రోజులు నెట్టుతున్నాడట. దొరకినచోటల్లా అప్పులుచేసి మరెక్కడా అప్పు పుట్టని స్థితిలో దిగులుగా రోజుగడవని స్థితిలో యుండ భార్య ధనార్జనకి తెరువు వెతకమని పోరగా ఇంకను ఋణమిచ్చువారెవరాని వెదుకుతుండ గుర్తునకు వచ్చే సహాధ్యాయి వాసుదేవుడు, కానీ ఆ లక్ష్మీపతి తనను చూచునో లేదో అన్న సందేహము వెంటాడ నా కుచేలుడు బయలువెడలె కానీ బహుమతిగా మితృన కేమి గొనిపోదునన్న సంశయమున కొనుటకు రూకలు లేక ఇంట మిగిలియున్న నాలుగు గుప్పిళ్ళ అటుకులే గతియన కొంగునగట్టుకుని దూరానయున్న మధురకు చేరే కానీ అచట ద్వారపాలకులతనిని లోనికి పోనీయరాయె, ఏమిచేతునో కృష్ణ అని చతికిలబడ,దూరాన ఆ నిట్టూర్పు విని కృష్ణుడు వేగముగ యేతెంచి యాతని ఆదరమున లోనికి గొనిపోయి నాకేమి తెచ్చితి వన సంతతాన బిడియ పడుతూ చూపేనతడు మూటవిప్పి అటుకులను, అప్పుడా వనమాలి ఆరగించే రెండు గుప్పెడులును మూడవ గుప్పెడు తినబోవ లక్ష్మి పరుగునవచ్చి అతనిని తిన్నదిక చాలు అదియె అధికమని నుడువ
ఇరువురు కుశలమడిగి పంపె నా కుచేలుని, అంతటాతడిలు చేరిచూడ ఇల్లంత సువర్ణ మయమై, సతియు సుతులను గుర్తింప నలవికాని రీతిన గూడి అబ్బురముగా అలంకారభూషితులై, సంతుష్టులై, ఆనంద మయులై చేరిరాతని.