కదంబం - సాహిత్యకుసుమం
ప్రతి రోజూ చుట్టి ముట్టే
నీ ఈ పూల పరిమళం కదా
నా హృదయాన్ని వెన్నెల్లో ముంచింది.
ఈ మల్లెల వెలుగు లో కదా
నీ నవ్వులు మెరిసిపోయేది.
ఇన్ని సువాసనల వెనుక
నలిగే జీవితాలు లేవంటావా
ఎండలో పేలే దేహాలు
ఇక్కడ చూడలేమంటున్నావా
నువ్వు చూపే పూల దండ వెనుక
చేతులు నలిగిన కథలను తెలుసుకో...
కాసిన్ని కన్నీటి ప్రవాహాలు దాగుంటాయి.
పెదవులు పూసే ఉదయం విరాజితమై
ఇలా పువ్వుల్లా పరిమళిస్తుంది.
జీవితం నిగూఢంగా దారమై ప్రవహిస్తుంది.
మట్టి దేహాలు మొగ్గల్లా ఎదిగి
సువాసనలకి ఆధారమౌతుంటే
గొడుగు కింద పూలమ్మే ముసలమ్మ
ప్రాణవాయువు ఇక్కడే పైకి లేస్తుంది.
ఈ మాల దేవునిదైనా పెళ్లి వాకిట్లో సందడిదైనా
పుష్ప గుచ్ఛమై ప్రేమను అలంకరించినా
ప్రేమ గుబాళింపుల తుళ్ళింతలైనా
చెమట చుక్కల వికాసమే కదా.
ఇన్ని సమయాలు వాకిట్లో తొంగి చూస్తున్నాయి.
ఈ పరిమళం వెనుక కథలను
పెర్చుకుంటూ పోతున్నాను.
ఆమె ముఖంలో జీవితాన్ని
పువ్వుల పరిమళం లో దాగిన
రహస్యాల్ని అన్వేషిస్తున్నాను.....