కదంబం - సాహిత్యకుసుమం
చింతకన్న...చిరుదీపం మిన్న
- పోలయ్య కూకట్లపల్లి -
చింతించే చీకటిని తిట్టే మాటల కన్నా
చిరుదీపం వెలిగించే చేతి వెలుగే మిన్న..
నిరాశ నిట్టూర్పుల నీడల కన్నా
నిప్పురవ్వలాంటి ప్రయత్నమే మిన్న...
గాలిలో పెట్టిన దీపం ఆరిపోయిందని ఆవేదన చెందే కన్నా
జాలిలేదని హోరుగాలిని నిందించే కన్నా
దీపాన్ని ఆరిపోనియ్యక అరచేతిని అడ్డు పెట్టడమే మిన్న...
వీధిలో ఆకలితో అలమటించే అనాథ బాలున్ని చూసి
అయ్యో పాపమని విచారించే కన్నా, జాలిచూపించే కన్నా
ఆకలి తీర్చే దయగల హృదయమే దేవాలయం కన్న మిన్న...
రక్తపు మడుగులో విలవిలలాడే మనిషి ఆక్రందనల్ని సెల్లో బంధించే కన్నా
అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చడమే మిన్న...
దారిలో వడదెబ్బకు సొమ్మసిల్లిన బాటసారికి సానుభూతి చూపేకన్నా
చెట్టునీడన చల్లని నీరు అందించిన చేయే మిన్న.
మాటల మల్లెపూల దండలకన్నా...
మదిలో పరిమళించే మానవత్వమే మిన్న...
0