Menu Close
Rajesam Thokala
కవిత (పద్యకవిత)
తోకల రాజేశం
సీ: గొంతువోయిన ప్రజాకోటికి కొత్త గొం
          తుకనొక్క దాని చేతులకు నిచ్చి
    మోసపోయిన వైనమును విప్పి లోగుట్టు
          చూపింప గలుగు చక్షువుల నిచ్చి
    హృదయ దీపాల వెల్గింకనీయక ప్రేమ
          తైల వర్షమ్ములో తడిపి తడిపి
    బతుకు పోరున చిక్కువడిన మేధకు చిక్కు
          ముడులను విడిపించు గొడవ దెలిపి

తే: మనిషి ముందు వెన్కల నిల్చి మస్తకమున
     జ్ఞాన దీపంబు వెల్గింప గలుగు నదియె
     ధరను సాహిత్యమను పేరు దాల్చు గాని
     హితము గోరనిదెట్లు సాహిత్యమగును?

చ. ఒకచో మిత్రుని వోలె కష్టముల చేయూతమ్ముగానిచ్చు వే
     రొకచో దేశికు భంగి జీవితముపైనున్నట్టి సందేహ రా
     శికి నగ్గిన్ దగిలించు-తుట్టతుద రాజీలేని వ్యక్తిత్వ శి
     క్షకుడైపోవును-సాహితీ ప్రభలు విశ్వశ్రేయముం గూర్పవే?

అ.వె. కవిత జదివి మారగలవాడు గల్గిన
       కవిత జన్మ సార్థకంబు గాదె?
       మారనిమ్ము చదివి మారక పోనిమ్ము
       కాని రాత లాపలేను నేను

క. తెలిసిన జీవిత వృక్షం
    బులలో కొంగొత్తవైన పూవుల మాడ్కిన్
    తెలియనివెన్నో ఛాయలు
    గలవన్నియు కైత రూపు గుట్టును గాదే?

తే.గీ. హద్దులే లేని ఆకాశ మందు స్వేచ్ఛ
       కెత్తిన పతాకమును బోలి ఎగురు చున్న
       పక్కి వలె నా కవిత్వ ప్రపంచ మందు
       సంకెలలు లేని కావ్యమ్ము సంతరింతు

ఆ.వె. ప్రజల కొరకు పుట్ట వలయును కవితలు
       ప్రజల బాధ లెల్ల పలుక వలెను
       ప్రజలు లేక ఈ ప్రపంచమే లేదయా!
       కవితలెట్లు బతుక గలవు సుమ్ము

రచయిత పరిచయం

Rajesam Thokalaతోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు. వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు. ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం (2006), చెమట చుక్కలు (నానీలు-2010), పాతాళ గరిగె (సాహిత్య వ్యాసాలు-2013), అడవి దీపాలు (వచన కవిత్వం-2017), మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర (తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020), కొబ్బరి నీరా! శతకం (పదిమందితో కలిసి-2023), మట్టి విజయం (పద్యకవిత్వం-2024) అనే పుస్తకాలు ముద్రించారు. తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం (2012), సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012), సాహితీ శిరోమణి పురస్కారం(2015), సినారె పురస్కారం(2023), తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Posted in September 2026, పద్యకవితలు, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *