ఆత్మహత్య
అమెరికాలో ఒక సంప్రదాయం వుంది. అక్కడ ముఖ్యమైన విషయాలన్నింటికీ ఒకరోజుని కేటాయిస్తారు. ఉదాహరణగా Mother’s day, Father’s Day, Friendship Day, Doctors Day, ఇలా కొన్నింటిని మనం చెప్పుకోవచ్చు. ఆలోచిస్తే ఇది ఒక మంచి సంప్రదాయమే అని అనిపిస్తూవుంటుంది నాకు. ఎందుకంటే మిగిలిన రోజుల సంగతి ఎలా వున్నా, కనీసం ఆ ఒక్కరోజన్నా ప్రజలు ఆ ప్రత్యేకతలను గుర్తు పెట్టుకుంటారు. సంతోషంగా వాటి సంబరాలను జరుపుకుంటారు.
ఆ విధంగానే సెప్టెంబరు 10 ని ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినంగా, అంటే World Suicide Prevention Day గా పరిగణించారు. World Health organization, WHO సమర్పణలో, అంటే sponsorship లో 2003 నుండి International Association for Suicide Prevention, IASP ఈ దినాన్ని జరపడాన్ని మొదలుపెట్టింది.
ఆత్మహత్య అన్నది పూర్తిగా నివారింపసాధ్యమైన చర్య. అందుకే ఈ ఆత్మహత్యలని ఎలా నివారించగలమో, దానికి మనందరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అసలు ఈ ఆత్మహత్యల ఆలోచనలు మనుషుల మనసులలోకి ఎందుకు వస్తాయో, వీటన్నిటి గురించి అందరిలోనూ మంచి అవగాహనను రేకెత్తించడమే ఈ ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినాన్ని ప్రకటించటంలోని ముఖ్య వుద్దేశం.
ఇతరులను చంపితే దాన్ని హత్య అంటాము. అలాగే మనల్ని మనమే చంపుకోవటానికి ప్రయత్నిస్తే దాన్ని ఆత్మహత్యా ప్రయత్నం అంటాము. హత్యలాగానే ఆత్మహత్య కూడా చట్టవిరుద్ధమైనది. నా జీవితం, నా ఇష్టం, దాన్ని జీవించాలన్నా, ముగించాలన్నా అది పూర్తిగా నా ఇష్టమే అనుకోవటానికి లేదు. మీ జీవితాన్ని ఎలా జీవించాలో నిజంగా మీ ఇష్టమే! కానీ మీ జీవితం మీకు నచ్చకపోయినా సరే, దాన్ని అంతం చేసుకునే అధికారం మాత్రం మీకు లేదు. ఈ జీవితాన్ని మనకు ఇచ్చిన ఒక్క ఆ భగవంతుడికే ఆ హక్కు వుంది. చివరికి ఆ జీవితాన్ని పోషించే ఆ మనిషికి కూడా ఆ అధికారం లేదు. అందుకని ఆత్మహత్య చట్టబద్ధమైన చర్య కాదు. ఆత్మహత్య పిరికితనాన్ని సూచిస్తుంది కాబట్టి నైతికంగా కూడా అది సరైన చర్య కాదు.
మరి ఈ విషయం తెలిసి కూడా కొంతమంది ఎంతో విలువైన తమ జీవితాన్ని అంతం చేసుకోవాలని ఎందుకు కోరుకుంటారు? ప్రాణాలంటే తీపి అంటారు. మరి అలాంటి ప్రాణాలు చేదుగా ఎందుకు మారతాయి? మంచి ప్రశ్నలు కదూ? వీటికి సమాధానం చెప్పాలంటే మాత్రం ఇక్కడ విషయం పూర్తిగా వ్యక్తిగతమైపోతుంది. అంటే జీవితం భారమై, ఆత్మహత్య చేసుకోవాలన్న తలపు మనసులోనికి రావటానికి ప్రతి మనిషికీ వారివారి సమయ సందర్భాలని బట్టి వేరువేరు కారణాలు వుంటాయి. తరచుగా అందరికీ కనిపించే కారణాలు కొన్నిటి గురించి మాత్రం ఇప్పుడు మాట్లాడుకుందాము.
అన్నిటికంటే ముందుగా నాకు తోస్తున్న కారణం ప్రేమ. ఈ ప్రేమని ఆ పైవాడు ఏ ఘడియలలో ఎలా సృష్టించాడో కానీ అది వున్నా తంటానే! లేకున్నా కూడా తంటానే! ఎక్కువైనా చిక్కే! తక్కువైనా కూడా అంతకంటే ఇంకా పెద్ద చిక్కే! నేను వలచినవారి ప్రేమ నాకు అందడంలేదని కొంతమందికి నిరాశ. ప్రేమ ఎక్కువై నన్ను కట్టడి చేయడం మరీ ఎక్కువైపోయింది, ఈ అనుమానాలు భరించలేకుండా వున్నాను, ఈ పంజరం బతుకు నాకు వద్దు అంటూ నిస్పృహ చెందేవారు మరికొందరు. ఇలా ఈ ప్రేమ తన ఎక్కువ తక్కువలతో, బలహీన మనసులను తికమక పెట్టేసి వారిని చంపేస్తోంది. ఇలాగే జీవితంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఇంక వాటి పరిష్కారమేదీ లభించనప్పుడు నిరాశలో కొంతమంది ఈ ఆత్మహత్య దారిని ఎన్నుకుంటారు. ఈ సమస్యలు శారీరకమైనవి కావచ్చు, మానసికమైనవి కావచ్చు, ధనసంబంధమైనవి కావచ్చు, ఉద్యోగసంబంధమైనవి కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ దాని వలన ఆ సమస్యలు తీరుతాయా, లేదా అన్న సంగతి అటుంచి ఇంకొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి వారికి, వారివారికి కూడా. అయినా సమస్యలని ధైర్యంగా ఎదిరించి, పోరాడి, ఓడించటం సరైనపని కానీ ఇలా పారిపోవడానికి దారిలాగా ఆత్మహత్యని ఎన్నుకోవటం నిజంగా పలాయనవాదం, పిరికితనమే అవుతుంది. అవునా?
కొంతమంది తమ మానసిక రుగ్మతలలో ఎంత లోతుగా మునిగిపోతారంటే వారికి అసలు ఏం చేస్తున్నారో వారికే తెలీదు. ఆ జబ్బు తీవ్రతలో ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తారేమో అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీన్నే depression అంటారు. ఈ depression లో వున్నవారికి వారి మీద వారికి అసలు నియంత్రణ అన్నదే వుండదు. ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తున్నారో వారికే తెలీదు. అందుకే మనం పెద్ద పెద్ద డాక్టర్లని కూడా ఆత్మహత్యా ప్రయత్నాలకు ఏదో వురి వేసుకున్నారనో, శరీరం మీద కిరసనాయిలు పోసుకుని అగ్నికి ఆహుతి అవడానికి ప్రయత్నించడం చేసారనో అప్పుడప్పుడు వింటూవుంటాము. అంటే ఇతరుల రోగచికిత్సలు చేసి వారికి మంచి చెడు చెప్పాల్సిన డాక్టర్లకి అసలు ఈ ఆత్మహత్యలేమిటి అన్న విషయాన్ని పక్కన పెడితే, అంతకంటే తేలికగా చనిపోయే పద్ధతులు తెలిసినా కూడా కేవలం ఒక మాములు మనిషిలాగా ఇంత కష్టమైన పద్ధతిని ఎన్నుకున్నారేమిటి అని మనకి ఆశ్చర్యం కలగచ్చు. అంటే ఆ సమయంలో నేను ముందే చెప్పినట్లు వారికి వారు డాక్టరు అని కానీ, ఆత్మహత్య తప్పనికానీ, దానికి తేలిక పద్ధతులు వున్నాయనికానీ, ఇంకే విషయం గుర్తు వుండదు. వారి depression వారికి గుర్తు వుండనివ్వదు. ఆ సమయంలో వారు డాక్టర్లు కాదు, depression లో వున్న మానసిక రోగులు, అంతే! అందుకే అతి సాధారణ సగటు మనిషిలాగా ఆత్మహత్యా ప్రయత్నాలు అతి సాధారణ పద్ధతిలో చేస్తారు. అందుకని depression, ఇంకా అలాంటి వేరే మానసికరుగ్మతలు ఆత్మహత్యలకి చాలా పెద్ద కారణం.
అలాగే మాదకద్రవ్యాల అలవాటు, తాగుడు అలవాటు కూడా మనిషికి చాలా చెడు చేస్తాయి. మనిషిని బాధలలోకి ఇంకా గాఢంగా నెట్టేస్తాయి. చాలామందికి ఈ విషయం గుర్తు వుందో లేదో నాకు తెలీదు, ఆల్కహాలు ఒక పెద్ద depressant. తాగుతున్నప్పుడు అన్నీ మరిపించి, మురిపించినట్లే అనిపిస్తుంది, కానీ ఆతర్వాత మాత్రం వారిని ఇంకా ఎక్కువ depression లోకి తోసేస్తుంది. మీ అందరికీ తెలుసు, depression లో మనిషి ఏ అఘాయిత్యమన్నా చేయటానికి సిద్ధం అవుతాడు, ఆత్మహత్య అన్నా సరే. అలాంటప్పుడు అసలే మత్తుపదార్ధాల సేవనం, ఆపైన depression కూడాను. మరి వారి ఆలోచనావిధానం సరైన దారిలో నడవమంటే ఎలా నడవగలదు?
జీవితంలో ఏవన్నా గాఢమైన దెబ్బలు తగిలినప్పుడు ఆ సమయం గడిచిపోయినా కూడా కొంతమంది వాటిని మర్చిపోలేరు. ఆతర్వాత జీవితంలో వారు ఎంత ముందుకు వెళ్ళినా సరే, జరిగిపోయిన ఆ పీడకలలాంటి పాడు క్షణాలు మాత్రం వారిని నీడలాగా వెంటాడక మానవు. ఆ మానసిక బాధ, ఒత్తిడులలో కూడా మనిషి ఆత్మహత్యాలోచనలకు గురి అయ్యే ప్రమాదం వుంది.
దారిద్య్రబాధని తట్టుకోవటం దుర్లభం. ధనం మూలం మిదం జగత్ అని అందుకే అన్నారు. ధనం లేకపోతే అసలు ఏమీ చేయలేము. విలాసాల మాట అటుంచి కనీసావసరాలు కూడా తీర్చుకోలేని దుర్భర స్థితిలో మనుషులు ఇంక వేరే మార్గం ఏదీ దొరక్క ఆత్మహత్యలు తలపెడతారు. నిరుద్యోగబాధ కూడా అలాంటిదే! చదువు, తెలివి, సమర్ధత, అన్నీ వున్నా కూడా సరైన వుద్యోగం దొరక్క అనేక బాధలు పడుతున్న యువతరం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి అప్పుడప్పుడు కొన్ని బలహీనక్షణాల్లో ఈ తప్పు చర్యలకు పాల్పడుతుంది.
వైద్యప్రపంచంలో AIDS అప్పుడే ప్రవేశిస్తున్న రోజుల్లో తమకి ఆ జబ్బు వచ్చిందని తెలియగానే ఆ బాధలని తప్పించుకోవటానికి, AIDS అంటే సంఘంలో వున్న కళంకానికి, అంటే, stigma లకి వెరచి కూడా కొందరు ఆత్మహత్యలకు తలపడేవారు. అంటే భరించలేని మరియు నివారణ అంటూ ఏదీ లేని శారీరకమైన జబ్బులు, అలాగే సమాజంలో తలవంపులు కూడా ఆత్మహత్యలను ప్రోత్సహిస్తాయన్నమాట.
ఇలా ఈ ఆత్మహత్యలకు రకరకాల కారణాలు వుండచ్చు. కానీ అవన్నీ పూర్తిగా వ్యక్తిగతమైనవి. అయితే Emile Durkheim అనే ఒక French సామాజిక శాస్త్రవేత్త, అంటే Sociologist ఈ ఆత్మహత్యలకి కారణాలను క్లుప్తంగా నాలుగు విధాలుగా విభజించారు. అయితే ఆ నాలుగింటిలోనూ సమాజం పాత్ర చాలా వుంది. ఎలాఅంటే, మనిషి సమాజంతో ఎంత గాఢంగా ముడిపడిపోతాడంటే ఏ కారణంచేతనైనా సరే, దానితో కొంచెం కూడా దూరం అవడాన్ని భరించలేడు. ఆ ఎడబాటులో తన జీవితానికి ఇంక అర్ధం అన్నదే లేదు అన్న నిరాశ, నిస్పృహలలో వారు ఆత్మహత్యలకి సిద్ధం అయ్యే ప్రమాదం వుంది అని మొదటి విభాగంలో చెప్పారు. అప్పుడప్పుడు మనిషికి సమాజంతో కానీ లేక ఆ సమాజంలోని ఒక భాగంతో కానీ ఎంత గాఢమైన విడదీయలేని బంధం ఏర్పడిపోతుందంటే దానికోసం, వారి ప్రాణాలని త్యాగం చెయ్యటానికి కూడా వారు ఏమాత్రమూ వెనుకాడరు అని రెండవ విభాగంలో చెప్పారు. సమాజంలోని సమతుల్యతని, అంటే balance ని నిర్వహించటం, ఆ నియమాలను పాటించడం ఒకొక్కసారి మనిషికి కష్టం అవుతుంది. ముఖ్యంగా ఏవన్నా సమాజమార్పులు వచ్చినపుడు ఇలాంటి సందర్భాలు చాలా ఎదురవుతూవుంటాయి. ఈ విషయమే మూడో విభాగంలో చెప్పారు. అప్పుడప్పుడు సమాజపు కట్టుబాట్లు, రీతిరివాజులు ఎంత స్థిరంగా, ధృఢంగా, అంటే rigid గా వుంటాయంటే వాటిని ఏమాత్రమూ కదిలించలేము. అంత కట్టుదిట్టమైన సూత్రాల సంకెళ్ళలో బందీలవటం ఇష్టం లేకపోతే ఇంక చేసేదేమీలేక మనిషి చివరి ఎంపికగా ఆత్మహత్యను ఎన్నుకోవచ్చు. ఇదే నాలుగో విభాగంలో చెప్పారు. ఈ నాలుగు విభాగాలను పరిశీలిస్తే నేను ముందే చెప్పినట్లు సమాజంతో మనిషికున్న పరస్పరచర్యలు, అంటే interactions, సమాజం పట్ల అతనికున్న నైతికమైన బాధ్యతలు ఇవన్నీ వీటికి మూలాధారాలనీ మనకు అర్ధం అయిపోతుంది.
కారణాలేవైనా ఆత్మహత్య మాత్రం మహాపాపం, ఘోరమైన చట్టవిరుద్ధమైన కార్యం. దీన్ని మనం ఎలాగైనా సరే అరికట్టాలి, కనీసం అరికట్టే ప్రయత్నమైనా చెయ్యాలి. అసలు ముందు మనుషులలో ఈ ఆత్మహత్య సూచనలను మనం పసిగట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా విపత్తులో మునుగుతున్నప్పుడే ఆత్మహత్యలను అరికట్టే ప్రయత్నం మొదలైతే, విషయం ఆత్మహత్యల దాకా వెళ్ళకపోవచ్చు. సమాజానికి, కుటుంబానికి, మనిషికి, అందరికీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించటం అన్నిటికంటే మొదటి మెట్టు. ఎవరైనా ఏమన్నా చిక్కుల్లో వుంటే అవేమిటో కనుక్కుని చేతనైనంత సహాయం చేయటం, ఒకవేళ అది కుదరకపోతే కనీసం మాట సహాయమన్నా చేయటం ఒక సాటి మనిషిగా మన కర్తవ్యం. అసలు ఎవరి మనసులోనైనా ఆత్మహత్య తలపుల తుఫానులు రేగుతున్నాయని మనకి ఏమాత్రం అనుమానం వచ్చినా, అనిపించినా వెంటనే వారికి సాంత్వన చేకూర్చే వాతావరణాన్ని సృష్టించి, మనసుకు వూరట కలిగించే సాంత్వన వచనాలని పలికితే వారి మానసిక అలసట దూరం అవుతుంది. ఆతర్వాత రేపు మీద ఆశ పుట్టించే తీయని మాటలు, భవిష్యత్తులో జరగబోయే మంచి మంచి విషయాలు వారికి మరొక్కసారి గుర్తు చేస్తే వారి మనసు మారచ్చు. అలాగే చిన్నప్పటి నుండి పాఠశాలల్లో సంభాషణాచాతుర్యం, భావ వ్యక్తీకరణ, సమస్యాపరిష్కార నైపుణ్యం, సహానుభూతి, అంటే sympathy, పరానుభూతి, అంటే empathy, స్థితిస్థాపకత, అంటే Resilience, ఇవన్నీ నేర్పచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు వారి ఆఫీసు వాతావరణంలో స్నేహం, సహాయభావాలు ఎక్కువవటానికి, అసూయాద్వేషాలకి దూరంగా వుండే వాతావరణాలను సృష్టించడానికి ప్రయత్నాలను చేయవచ్చు. వారి వుద్యోగస్థుల కోసం ఇలాంటి మంచి విషయాలు నేర్పించే training class లను ఏర్పాటుచేయవచ్చును. వారి ఉద్యోగస్థులలో ఎటువంటి మానసిక ఒత్తిడులు లేని ఆఫీసు వాతావరణాన్ని కల్పించవచ్చు. కేవలం ఆఫీసు విషయాలే కాకుండా వారి వ్యక్తిగత వివరాలు కూడా కనుక్కుంటూ వారి మంచిచెడ్డలు పరామర్శలు చేయవచ్చును, ఒక ఆఫీసులో కాకుండా ఒక కుటుంబంలోలాగా, కేవలం ఉద్యోగస్థులలాగా కాకుండా అందరు ఒక కుటుంబ సభ్యులలాగా వుండేలాంటి సామరస్యమైన వాతావరణాన్ని సృష్టించవచ్చును. ప్రభుత్వం, సామాజిక సంస్థలు కూడా Alcoholics Anonymous లాంటి సంస్థలలాంటివి ఆత్మహత్యలు చేసుకునే ధోరణి వున్నవారి కోసం కూడా స్థాపించవచ్చు. ఎందుకంటే తమలాంటి బాధలు పడ్డవారిని, వారి అనుభవాలను వింటున్నప్పుడు అచ్చు అలాంటి మానసికమధనంలోనే వేగుతున్నవారు చాలా సాంత్వన పొందుతారు. తమలాంటి పరిస్థితులలోవున్న వారి దగ్గరనుండి, వారి అనుభవాల నుండి చాలా నేర్చుకుంటారు. ఇతరులు చెప్తే వారి మనసులలోకి ఎక్కని విషయాలు అచ్చు తమలాంటి మానసిక రుగ్మతలు వున్నవారి ద్వారా వింటే ఆ ప్రభావం వేరుగా వుంటుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే అటువంటివారి మాటలు వినటానికి, విని వాటిని ఆచరణలో పెట్టడానికి కూడా అవకాశం చాలా ఎక్కువగా వుంటుంది. ఇంకో విషయం. ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసినవారు పదేపదే ఆ ప్రయత్నాలను పునరావృతం చేయటానికి అవకాశాలు చాలా వుంటాయి. ఎందుకంటే వారి ధోరణి ఆత్మహత్యలకు వారిని మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తుంది. ఇలాంటివారికి వైద్యసహాయం, counseling, therapy లు తేలికగా అందుబాటులో వుండేలాగా చెయ్యాలి. అంటే ఆత్మహత్యకు వాడే సాధనాలు దూరం, ఆ ధోరణిని వదుల్చుకోవటానికి కావలిసిన సాధనాలు దగ్గరగా, అందుబాటులో వుండేలాగా చెయ్యాలన్నమాట. వీరికి మాత్రమే కాదు, ఆత్మహత్యలతో ప్రాణాలు పోగొట్టుకున్నవారి కుటుంబసభ్యులకు కూడా ఇవన్నీ చాలా అవసరమే! ఎందుకంటే అసహజంగా, అకాలమృత్యువుపాలైన ప్రియాతిప్రియమైన తమ కుటుంబసభ్యులకోసం వారు పడే చిత్రవధ అపారమైనది, ఎవ్వరూ ఏ భాషలోనూ వర్ణించలేనిది. తమకోసం తమవారు ఎంత బాధపడతారో వూహించుకుంటే ఎవ్వరూ ఈ ఆత్మహత్యల ఆలోచనల జోలికి అసలు వెళ్ళరేమో!
ఈ ఆత్మహత్య సమస్య మనుషుల మధ్య అంతరాలేమీ చూపకుండా అన్ని రకాల వయసువారిని తమ చీకటి కబంధహస్తాల్లోకి లాగేసుకుంటుంది. 10 నుండి 34 మధ్య వయసువారిలో మృత్యువుకి ఇది రెండవ ప్రముఖ కారణమట. అలాగే 34 నుండి 54 మధ్య వయసువారికి నాల్గవ ప్రముఖ కారణమట. అలాగే 45 నుండి 54 మధ్య వయసువారికి అయిదవ ప్రముఖ కారణమట. ఈ లెక్కలు చూస్తుంటే చాలా బాధగా వుంది కదూ! భగవంతుడిచ్చిన ఈ విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా, చేజేతులా అంతం చేసుకుంటున్న ఈ మనుషుల తొందరపాటు, అవివేకాల గురించి ఏం అనుకోవాలి? అందుకే ఇంక ఆశ వదిలేసే సమయంలో కూడా మీ కోరిక తీరే అవకాశం ఆ చాటుమాటులలోనే దాగివుందేమో అని ఆలోచించడం మరువకండి అని Joyce Meyer అనే అమెరికాకు చెందిన ఒక క్రైస్తవ మత ప్రచారకురాలు, రచయిత్రి, వక్త అందరినీ హెచ్చరించారు. అందుకే ఎవరికైనా సరే, తొందరపాటు వద్దు, సహనం, ఆత్మవిశ్వాసం ఎవరికైనా ఎప్పుడైనా చాలా ముఖ్యం. కష్టాలలో ఇంకా ఎక్కువ అవసరం. పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోయామని కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటంలాంటి వార్తలు మనం వింటూవుంటాము. వార్తాపత్రికలలో కూడా చదువుతూవుంటాము. ఇలాంటివి విన్నప్పుడు కూడా నాకు చాలా బాధగా వుంటుంది. ఒకసారి, పోనీ కొన్నిసార్లు ఉత్తీర్ణులు కాలేక పోయినంత మాత్రాన ఇంక జీవితం అయిపోతుందా? వృద్ధిలోకి వచ్చే అవకాశాలే ఇంక వుండవా? ఏదో విధంగా మన గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి కానీ దారులన్నింటిని అలా మనమే మూసేసుకుంటే ఎలా? అసలు అన్నేళ్ళు పడిన కష్టమంతా ఒక్క క్షణంలో ఎలా మర్చిపోగలుగుతారు? అందుకే ఏదన్నా ఉద్దేశవిరమణ చేస్తున్నపుడు దానికోసం అన్నేళ్ళు మీరు ఎందుకు కృషి చేసారో ఒక్కసారి గుర్తు చేసుకోండి అని Hayley Williams అనే అమెరికాకు చెందిన ఒక కవయిత్రి, సంగీత విద్వాంసురాలు అందరినీ హెచ్చరించారు.
అసలయినా, ఈ ఆత్మహత్యల వలన తమ సమస్యలు తీరుతాయి అని వారు అనుకుంటున్నారు కాబోలు. అది కొంచెం కూడా నిజం కాదు సరికదా, వారి సమస్యలు శాశ్వతంగా తీరి వారి జీవితాలు బాగుపడే అవకాశాన్ని మాత్రం వీటివలన వారు శాశ్వతంగా కోల్పోతున్నారు. ఈ విషయాన్ని వారు గ్రహించి ఆత్మహత్యలాంటి ఘోరమైన ఆలోచనలను వారి మనసులలోంచి శాశ్వతంగా పారద్రోలితే బాగుంటుంది. చిన్నవో పెద్దవో సమస్యలు, కష్టాలు లేని జీవితం అంటూ ఏదీ వుండదు. కలతలు, కష్టాలు, నిరాశలు, నిస్పృహలు అనుభవించని మనిషంటూ కూడా ఎవ్వడూ వుండడు. కష్టసుఖాలు, గెలుపు ఓటమిలు, వెలుగునీడలు, ఇవన్నీ ఒకదానితో ఇంకొకటి ఎప్పుడూ కలిసిపోయివుంటాయి. ఎదురుదెబ్బలు తగిలాయని ఇంక జీవితాన్నే అంతం చేసుకుంటామా? ఇవాళ చీకటి కప్పేసిందని మనసు తలుపు మూసేసుకుంటే మరి రేపు వెలుగు లోపలికి ఎలా వస్తుంది? ఇవాళ ఏం జరిగినా సరే, ఈరోజు పరిస్థితులు ఎంత విషమించినా సరే, జీవితం ముందుకు సాగుతూనేవుండాలి, ఎందుకంటే రేపు తప్పకుండా మెరుగ్గా వుంటుంది అని Maya Angelou అనే అమెరికాకు చెందిన ఒక కవయిత్రి అన్నారు. అదే ఆశతో అందరం అడుగులు ముందుకు వెయ్యాలి. ఎందుకంటే ఆశ, నమ్మకం లేనిదే రేపు లేదు. రేపు అన్నది లేనిదే భవిష్యత్తు లేదు. భవిష్యత్తు అన్నది లేనిదే జీవితమే లేదు. అవునా?
ఇంకో విషయం. కష్టాలలో మునకలు వేస్తున్నప్పుడు నిరాశ, నిస్పృహలకు లోనవడం ఎవరికైనా సహజం. కానీ ఒక్కసారి ఆ చీకట్లు వదిలి వెలుగురేఖలు విచ్చుకున్నప్పుడు ఎంతో ఉపశమనం లభిస్తుంది. అందుకే ఆ కష్టకాలంలో ప్రయాణం చేయడం మంచిదయింది, చివరికి ఇంత మంచిరోజులని అనుభవించగలిగాను అని John Greeen అనే ఒక అమెరికను రచయిత అన్నారు. ఆయనే కాదు, ఎవరైనా అలాగే అనుకుంటారు.
జీవితమంటేనే కష్టసుఖాల కలయిక. కొంతమందికి దురదృష్టవశాత్తూ కష్టాలపాలు ఎక్కువవచ్చు. కానీ జీవితమంటే అంతులేని పోరాటం కూడా. అందుకే కొన్నిసార్లు అసలు జీవితం కొనసాగించడమే చాలా ధైర్యంగల పని అని Lucius Annaeus Seneea అనే ఒక రోమను తత్వవేత్త అన్నారు. పోరాడి గెలవటం ధైర్యం కానీ ఓటమికి బాధపడి జీవితాన్ని అంతం చేసుకోవడం పిరికితనం కాదూ? అందుకే నా జీవితంలో అన్నిటికంటే ఎక్కువైన సాహసవంతమైన పని ఏమిటంటే చచ్చిపోవాలి అని అనుకున్నప్పుడు కూడా పట్టుదల వదలకుండా జీవితాన్ని కొనసాగించాను అని Juliette Leavis అనే ఒక అమెరికను నటి, గాయని. అన్నారు.
అందుకే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారు అని ఏమాత్రం అనుమానం వచ్చినా మౌనంగా ఏదో తెలీని సంకోచంతో తటపటాయించకండి. కొంచెం అప్రమత్తతతో వారు బహిర్గతపరచే సూచనలను గమనించండి. కొంతమంది జీవితం మీద ఆశ నశించింది అంటూ విరక్తిగా వుంటారు. ఇంకొంతమంది నా జీవితం ఇంకెన్నటికి బాగుపడదు అన్న నకారాత్మక భావాలలో మునిగిపోయివుంటారు. మరికొంతమంది నాకు చచ్చిపోవాలనివుంది అంటూ స్పష్టంగా తమ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తారు. మరికొందరు అసలు ఎవరితోనూ కలవకుండా తమకు తామే ఏకాంతశిక్షను వేసుకుంటారు. ఇవన్నీ ఆత్మహత్య భావాలు వారి మనసులో అల్లకల్లోలాన్ని రేపుతున్నాయి అని సూచించే చిహ్నాలే! జాగ్రత్తగా గమనించండి. ఆలస్యం చేయకుండా సరైన సమయంలో వారికి వైద్య సదుపాయం అందేలాగా చూడండి. మీ చేతనైనంత సహాయం మీరు కూడా చేయండి. మీ సహాయం వలన ఒక్క ప్రాణం నిలిచినా చాలు. ఒక కుటుంబం, అనేక స్నేహితులు, హితులు, శ్రేయోభిలాషులు, ఎందరో మీకు ఋణపడివుంటారు.
ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. కిందకు జారే బలహీనత వున్నపుడు పైకి ఎక్కగల ధృడత్వం ఎందుకుండకూడదు? ఎంత పెద్ద కష్టమైనా సరే, కలకాలం వుండదు. ఎంత గడ్డుకాలమైనా సరే, కలకాలం నిలవదు. శాశ్వతంగా ఎప్పటికి నిలిచేది, మీకు అక్కరకు వచ్చేది మీ మానసికశక్తి, ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ. అయినా ఇంతవరకు ఆశాభంగాలే ఎదురైనాయని ఇకముందు కూడా అలాగే వుంటుందని ఎందుకనుకుంటున్నారు? భవిష్యత్తు తియ్యగా వుంటుందన్న ఆశ మీలో ఎందుకు కలగటంలేదు? మీ జీవితం ఇప్పటిదాకా మీకు గర్వకారణంగా వుందని, ఒకవేళ అలా లేనిపక్షంలో మళ్ళీ దాన్ని తిరగదోడి మొదటినుండి మళ్ళీ మొదలుపెట్టే సాహసం, ధైర్యం మీలో వున్నాయని నేను నమ్ముతున్నాను అన్నారు Francis Scott Fitzgerald అనే ఒక అమెరికను కధారచయిత, నవలారచయిత. ఆయనే కాదు, నేను కూడా అదే అంటాను. ఒకసారి మోడువారిందని మొత్తం చెట్టంతా కొట్టేస్తాం అంటే ఎలాగ? మోడువారిన కొమ్మలు మళ్ళీ చిగురిస్తాయి కదా!
ఈ ఆత్మహత్యల వలన ఏవిధంగానైనా సరే ప్రభావితమైనవారి గౌరవార్థం ఈ ఆత్మహత్యానివారణ రోజున కొంతమంది ఊదా మరియు టిల్ (ఆకుపచ్చ, నీలం కలగలుపు) ఈ రెండు రంగులు కలబోసిన రిబ్బన్ ని కట్టుకుంటారు. టిల్ రంగు మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని సూచిస్తే, ఊదా రంగేమో ఆత్మహత్య నివారణను సూచిస్తుంది. International Association for Suicide and Prevention (IASP) సభ్యులు పసుపు, కాషాయ రంగుల రిబ్బన్ ని కూడా కట్టుకుంటారు.
ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో, అంటే emergency లో అన్నమాట, సహాయం కొరకు అమెరికాలో మనం 911 నెంబరుని పిలుస్తాము, ఇండియాలో 100 లాగా. అలాగే అమెరికాలో ఆత్మహత్య మరియు సంక్షోభానికి (Suicide and crisis lifeline) పిలవాల్సిన నెంబరు 988. ఈ ఆత్మహత్య నివారణ కొరకు అమెరికాలో అనేక సంస్థలు కృషి చేస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి American Foundation for Suicide Prevention (AFSP), National Institute for Mental Health (NIMH), Department of Health (DOH), Centre for Disease Control (CDC), Suicide Prevention Coordinating Council (SPCC).
బాధ్యతకల నాగరికులుగా, మనసున్న మనుషులుగా మనందరం కూడా ఈ ఆత్మహత్యలని అరికట్టడానికి మన చేతనైనంత ప్రయత్నం చేద్దాం. ఏదో ఒక్క బలహీన క్షణంలో జరిగే ఈ హఠాత్పరిణామాలని దూరంగా నెట్టివేద్దాం. ఆ ఒక్క పీడక్షణం దాటితే చాలు, ఇంక వాళ్ళే తమ ఆలోచనావిధానాన్ని మార్చుకుంటారు. ఆ బలహీన క్షణాల్లో వారికి మన తోడు, మద్దతు చాలా అవసరం. వాటితోపాటు వారిపట్ల మన అవగాహన కూడా వారికి చాలా ఓదార్పునిస్తుంది, సహాయం చేస్తుంది. అవునా?
సరే, ఇంక ఈసారికి మరి ఇంతటితో ఆపనా? మళ్ళీ వచ్చే నెల ఇంకో మంచి విషయాన్ని వెంటపెట్టుకొని మీ ముందుకు వస్తాను. అంతదాకా సెలవు.