Menu Close
Pentapati Rajendraprasad
కలిసొచ్చిన అదృష్టం (కథ)
పి.రాజేంద్రప్రసాద్

"లే..మావా! నీతో ఇదొక సావొచ్చినాది. ఎవలైనా రాత్రిపూట పండుకొని ఉదయాన్నే లెగుస్తారు. నువ్వు మద్దానం పూట పండుకొని సాయంతరం కూడా లేవట్లేదు. నిన్ను లేపలేక సస్తన్నా. సందేల పండుకుంటే దరిద్రౕవఁట్టుగుంటాది. అందరూ నవ్వుతున్నారు. లే మావా." రంగణ్ణి కుదిపి కుదిపి లేపుతూనే సాధిస్తోంది అతడి భార్య రత్తాలు.

"చెస్... నీ..." కోపంగా అరుస్తూ లేచాడు రంగడు. "ఎవడే నవ్వేది? నా పనేంది?..ఆళ్ల పనేంది?.. మద్యానం దాకా అన్ని సోట్లా తిరగాలాయె. మద్దానపేల ఎప్పటికో వచ్చి తిని అప్పుడు పండుకోవాల. అసలుకే ఈ రోజు రాత్రికే పని ఉన్నది కదనే! నా బాదలు ఈళ్లకేటి తెలుత్తయి? మద్దానం లేటుగా పడుకొని సాయంకాలం తొందరగా లేవాలంటే ఎట్టాగయితదే. అనేవోడికీ, ఇనోవోల్లకీ బుద్ధుండాల." తిట్టుకుంటూనే పక్క మీంచి లేచాడు.

రంగడు అనేదాంట్లోనూ అర్థముంది. అతను రాత్రిపూట ఇళ్లల్లో పడి దొంగతనాలు చేస్తాడు. ముందు రోజు ప్రిపరేషన్ కోసమనీ, తరవాతి రోజు నిద్ర తక్కువ కావడంవల్లనూ పగలంతా పడుకుంటాడు. నెలకు రెండు మూడు సార్లు మాత్రమే చేసే ఈ పని కోసం రోజూ ప్రిపరేషన్ ఉంటుంది. ఉదయం పూట ఏదో ఒక చిల్లరవస్తువులు నెత్తిన పెట్టి అమ్ముకునే నెపం మీద ఇళ్లన్నీ గమనిస్తాడు. ఆ ఇళ్లు ఎలాగ ఉన్నాయి, రాత్రి పూట ఎలాగ లోపలికి వెళ్ళాలి, లోపల ఎవరెవరు ఉంటారు, వాళ్ళ ఉద్యోగాలూ, అలవాట్లూ అన్నీ జాగ్రత్తగా గమనిస్తాడు. ఆ కాలనీ అంతా ఒక వారం పాటు తిరిగిన తరువాత ఒక ఇంటిని లక్ష్యంగా పెట్టుకుని రాత్రి పూట అక్కడ దిగి జాగ్రత్తగా తన పని కానిస్తాడు.

వారం రోజులుగా ఆ ఎగువ మధ్యతరగతి కాలనీలో సైకిల్ మీద కూరగాయలు అమ్ముతూ  తిరుగుతున్నాడు రంగడు. ఒక ఇల్లు అతన్ని బాగా ఆకట్టుకుంది. ఇల్లు మామూలుగా చూస్తే పాతకాలపుదే. పై భాగం ఈ మధ్యనే కట్టుకున్నట్టున్నారు. బాగా మోడర్న్ గా అపార్ట్ మెంట్ లాగా రెండు బెడ్ రూమ్ లు, ఒక హాలు, ముందు భాగంలో సిట్ ఔట్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక బెడ్ రూమ్ మాత్రమే వాడుతున్నట్టున్నారు. రెండవది పెద్దగా తెరిచినట్టు కనిపించలేదు. బెడ్ రూమ్ కిటికీ తెరలు కదిలినప్పుడల్లా లోపల ఉన్న కప్ బోర్డులూ, దాని లోపల సెట్ చేసిన మామూలు బీరువా, రోడ్డు మీద ఉండేవాళ్ళకి కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఇంటికి ముందువైపు రోడ్డు కొద్దిగా చీకటిగానే ఉంటుంది. కాబట్టి కాంపౌండు వాల్ మీదనుంచి సులభంగా ఎక్కేయొచ్చు. మెట్లు అవతలపక్కకు ఉన్నాయి. అటు కూడా రోడ్డు ఉంది గాని బాగా వెలుతురుగా ఉంటుంది. అంతగా కాకపోతే పనైపోయాక అటువైపున్న మెట్లు దిగి దర్జాగా వెళ్లిపోవచ్చు. రాత్రి వచ్చేటప్పుడు ముందుగానే తన సైకిల్ అవతలివైపు పెట్టుకుంటే సరిపోతుంది.

ఆ ఇంటి ఇల్లాలు దాదాపు ముప్ఫై, ముప్ఫై ఐదేళ్ల వయసులో ఉంటుంది. అత్త మామలు కిందా, భార్యాభర్తలు పైనా బెడ్ రూములను వాడుకుంటున్నారని తన నిశిత పరిశీలనలో కనిపెట్టాడు రంగడు. వంటలూ, భోజనాలూ కిందే అయినా మధ్యాహ్నం పూట భోజనం తరువాత ఆమె పై బెడ్ రూమ్ కి వెళ్ళిపోవడం గమనించాడతను. తన ఊహ నిజమైతే ఆ జంట ఈ రోజు రాత్రి విడివిడిగా రెండు బెడ్ రూమ్ లలో పడుకుంటారు. ఈ రోజు రాత్రి పన్నెండున్నర గంటల నుండి మూడున్నర గంటల దాకా సంపూర్ణ చంద్రగ్రహణం అని మొన్ననే యూట్యూబ్ లో చూశాడు మరి.

నిన్నటి రోజున ఊరి చివర చెరువు దగ్గరకు వెళ్ళి తనలాంటి చిరు వ్యాపారులతో పోటీ పడి దర్భగడ్డి కోసుకొచ్చాడు. అది ఈ రోజు ఆ కాలనీకి తీసుకు వెళ్ళి అమ్మాడు. చాలా మంది ఆ దర్భగడ్డిని పోటీలు పడి కొన్నారు. అందులో ఆ ఇంటావిడ కూడా ఉంది. ఇక వాళ్ళు అన్ని నియమాలూ పాటిస్తారనీ, తన ఐడియాకు తిరుగే లేదనీ నవ్వుకున్నాడు. ఆ ప్రిపరేషన్ లో భాగంగానే ఈ రోజు తన భార్య లేపేదాకా లేవకుండా మొద్దు నిద్ర పోయాడు.

ఎలాగూ నిద్ర లేచాం కదా అని ఈ రాత్రి దొంగతనానికి అత్యవసరమైన వస్తువులన్నీ సరిచూసుకున్నాడు రంగడు. సైకిల్ అన్ని విధాలా పర్ఫెక్ట్ గా ఉన్నదని నిర్ధారించుకున్నారు. బొడ్లో పెట్టుకునే బటన్ నైఫ్ పదును చూసుకున్నాడు. అలాగే ముఖానికి మాస్క్, చేతులకి గ్లోవ్స్, కిటికీలోంచి లోపలికెళ్లాలి కాబట్టి అది ఓపెన్ చెయ్యడానికి కావలసిన సామాగ్రి, అన్నీ ఒకసారి సెట్ చేసుకుని ఇక తృప్తిగా భోజనానికి కూర్చున్నాడు.

***

మామూలుగా రంగడు దొంగతనానికి వెళ్ళే టైము రాత్రి రెండు దాటాక మూడుకు దగ్గరవుతుంటే. కానీ ఈ రోజు స్పెషల్. రాత్రి పన్నెండున్నర నుంచే చంద్రగ్రహణం ఉంది. మూడున్నరకు చంద్రగ్రహణం అయిపోతే నియమ నిష్ఠలు పాటించేవాళ్ళు రాత్రి మూడుకే అలారం పెట్టుకుని విడుపు స్నానానికి ప్లాన్ చేసుకుంటారు. రెండున్నర నుండీ వాళ్లకు నిద్రా మెలకువా కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ లోపులోనే తన పని పూర్తి చేసుకోవాలి. అందుకని అతను ఆ రోజు రాత్రి ఒంటిగంటకే బయలు దేరాడు.

అనుకున్న ప్రకారం ఇంటికి వెనక భాగంలో మెట్ల పక్కన కాంపౌండు వాల్ కి అవతల కొద్దిగా మరుగు ఉన్నచోట జాగ్రత్తగా సైకిల్ ను గోడకు ఆన్చి నిలబెట్టాడు. జాగ్రత్తగా చెట్ల నీడల మధ్యలో నక్కుతూ, నక్కుతూ నెమ్మదిగా ఇంటి ముందుకొచ్చాడు. తనను ఎవరూ గమనించడం లేదని నిశ్చయించుకున్నాక ఒకే జంప్ లో కాంపౌండ్ వాల్ మీదికి ఎగిరి దూకాడు. దాని మీద నుంచి మరొక దూకులో మేడ మీదికి చేరుకున్నాడు. ఆకాశంలో చంద్రుడు రాహువు కోరల్లో చిక్కుకుని నల్లబడుతుంటే, భూమి మీద వెన్నెల కాస్తా నెమ్మది నెమ్మదిగా చీకటిగా మారుతున్నది. వీధి దీపాలు వెలుగుతున్నా, ఆ కాలనీలో నిశ్శబ్దం ఒక రకమైన భయాన్ని గొలుపుతోంది. కుక్కలు ఏడుస్తున్నట్టుగా వింతగా అరుస్తూ, ప్రకృతిలోని అలజడిని సూచిస్తున్నాయి. రంగడికి ఈ రోజు అమావాస్య కన్నా మరీ ఎక్కువ చీకటిగా ఉన్నట్టు అనిపించింది. "పోనీలే! ఇదీ ఒకందుకు మంచిదే!" అనుకున్నాడు.

కిటికీ దగ్గరకు చేరుకున్నాడు. కిటికీకి లోపలి నుండి నల్లని తెరలు వేసి ఉన్నాయి. పొరపాటున కూడా చంద్రుడి వెలుతురు లోపలికి రాకూడదు కామోసు.. ఈళ్ళకి చాదస్తం మరీ ఎక్కువలా ఉంది..." నవ్వుకున్నాడు రంగడు. తన దగ్గరున్న స్క్రూ డ్రైవర్ కు పనిచెప్పాడు. తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినబడుతుంటే, చెమటలు పట్టి, పట్టు జారిపోకుండా చేతులకు వేసుకొన్న గ్లోవ్స్ ను ఒకసారి సరిచూసుకున్నాడు. నెమ్మది నెమ్మదిగా ఆ మోడర్న్ టైప్ కిటికీకి ఉన్న స్క్రూలు ఒక్కటొక్కటే నిశ్శబ్దంగా ఊడిపోయాయి. ఇక కిటికీదేముంది. గోడకీ ప్రేముకీ మధ్య  స్క్రూ డ్రైవర్ ను ఏటవాలుగా పెట్టి నెడుతూ ప్రేముని ఒక ప్రక్కన పట్టుకుని బలంగా లాగేడు. నిశ్శబ్దంగా ఊడిపోయి చేతిలోకొచ్చింది. మరింత నిశ్శబ్దంగా దానిని కూడా గోడకి ఆన్చాడు. ఇక ముఖ్యమైన పని ఇక్కడే ఉంది. గ్రహణం కాబట్టి భర్త ఒక్కడూ ఇక్కడ పడుకుంటే భార్య, క్రింద గదిలోనో, ఖాళీగా ఉన్న పక్క గదిలోనో ఉండి ఉండాలి. మారుతాళాల గుత్తి జేబులోనే ఉంది. ఇలాగ ఊహించుకుంటూనే రంగడు నెమ్మదిగా కిటికీ తెర కొద్దిగా తప్పించాడు. తీరా లోపలికి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. కిటికీ రెక్క మెల్లగా పక్కకు జరగగానే, లోపల ఉన్న 'నైట్ ల్యాంప్' వెలుతురు నీలిరంగులో గది అంతా పరుచుకుని కనిపించింది. సన్నని ఏ సీ శబ్దం తప్ప గదిలో మరే చప్పుడూ లేదు. ఆ గదిలో ఉన్న ఖరీదైన సెంటు వాసనతో అతడికి తలతిరిగినంత పనయ్యింది. బెడ్ మీద మెలుకువగానే ఉండి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక జంట. అతడి గుండె గతుక్కుమంది. అప్రయత్నంగా గుటక వేశాడు. గుండె దడదడలాడి ఊపిరి బలంగా విడిచాడు. చేతిలోని కర్టెన్ మీద అతని బరువు పడి ఒక్కసారి రాడ్ తో సహా అది కింద పడింది. భళ్లుమన్న శబ్దానికి ఆ జంట ఉలిక్కిపడింది. ఆ వ్యక్తి మంచం మీంచి గభాలున లేచాడు. అతడిని చూసిన రంగడు నిలువునా వణికిపోయాడు. అయినా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో జేబులోని బటన్ నైఫ్ బయటకు తీసి తళతళ మెరిసేలా ఝుళిపించాడు.

ఆ అతి కొద్ది సమయంలోనే అతడి బుర్రకి ఏదో మెరుపులా తట్టింది. "అవును...ఇతగాడు ఇంటి యజమాని కాడు. అతడు ఎర్రగా, కొద్దిగా పొట్టిగా గుమ్మటంలా ఉంటాడు. వీడు పొడుగ్గా సన్నగా ఉన్నాడు. రంగడికి ఈ సంగతి అర్థమయ్యేలోపులోనే ఆ వ్యక్తి హడావుడిగా కింద పడి ఉన్న తన లుంగీ తీసుకుని అడ్డదిడ్డంగా చుట్టేసుకొని, షర్టు పైపైన తగిలించేసుకుని ఒక పక్క బటన్స్ పెట్టుకుంటూనే అవతలివైపున్న తలుపు తీసుకుని మెట్ల మీద నుండి అరక్షణంలో దిగిపోయాడు. రంగడికి ఇప్పుడు విషయమేమిటో పూర్తిగా అర్థమై పోయింది. చేతిలో కత్తిని ఝుళిపించుకుంటూ మంచం దగ్గరికి నడిచాడు. అప్పటికే  పక్కన పడి ఉన్న తన చీరను ఒంటిమీదకు లాగేసుకుని తనను తాను కప్పుకున్న ఆ  ఇల్లాలు కళ్ళనిండా నీళ్ళతో రెండు చేతులెత్తి దణ్ణం పెట్టి...భయం భయంగా.. "నన్నేం బలవంతం చెయ్యకు.. నీక్కావలసింది గొడవ చెయ్యకుండా తీసుకెళ్లి పో.." అని వేడుకుంది.

రంగడికి ఒళ్ళు మండింది.."చెస్... నీకు నీతినేకపోతే నాకు నేదనుకున్నవేటి! ఇంటికాడ నాకు బంగారం నాటి పెళ్ళాం ఉంది. అది ఇంకోడ్ని కన్నెత్తిసూడదు." మీసం మెలేస్తూ అన్నాడు. ఆమె గుటకలు మింగింది.

"సరే గాని ఇంక అయ్యి తియ్యి!" అన్నాడు క్రూరంగా.

"ఏమిటి?" భయంగా అడిగింది ఆమె, తన చీరను మరికొంచెం పైకి లాక్కుంటూ.

"చెస్...ఇప్పుడే సెప్పినాను కాదా అది కాదని. బంగారం.. డబ్బూ తియ్యి..." కసురుకున్నాడు.  మొగుడు కింద ఉన్నాడని తెలిసి కూడా, పరాయి వాడిని పడక గదిలోకి రప్పించిన ఆ ఇల్లాలు ధైర్యానికి అతడికి ఒక పక్క మంటగానూ, కోపంగానూ ఉంది. ఆ కసురుకి ఆమె భయంగా తలూపింది. ఆమె ఒంటి మీద నగలే కాక బీరువాలోని నగలూ, నగదూ మొత్తం ఏ శ్రమా లేకుండా అతడి చేతిలోకి వచ్చిపడ్డాయి. ఇక దాదాపు రెండు మూడు నెలలకు అతని కుటుంబానికి ఏ లోటూ లేకుండా సంపాదించుకున్నాడు.  "ఇక ఇంటి కరుసులకే కాదు, వచ్చే పండక్కి రత్తాలుకీ, పిల్లలకీ కొత్తబట్టలకి కూడా రంది లేదు" ఆనందంగా అనుకున్నాడు.

"అన్నా! నువ్వు చూసింది ఎవరికీ చెప్పకు మరి..." దణ్ణం పెట్టింది ఆమె.

"అన్నా లేదు... గిన్నానేదు గానీ...నీ ఎదవ పని గురించి సెప్పి నన్ను జెయిలుకెలమంతవేటి?" ఎటకారంగా నవ్వేడు రంగడు. మరోమారు దణ్ణం పెట్టింది ఆ ఇల్లాలు. బజారుకెళ్లి కూరగాయలు కొంటుంటే ఎవడో తన వైపు వెకిలిగా చూశాడని ఈడ్చిపెట్టి వాడిని చెంపదెబ్బ కొట్టిన రత్తాలు అనుకోకుండా అతడికి జ్ఞాపకం వచ్చింది. తను దొంగే కావచ్చు. కానీ తన పెళ్ళాం రత్తాలు తన కోసమే బతుకుతున్నదని అతనికి గర్వంగా అనిపించింది. తన సంచిలో ఉన్న నగల్లాగా, ఇంట్లో ఉన్న బంగారంలాంటి భార్య కూడా తనకు కలిసొచ్చిన అదృష్టమేనని నవ్వుకుంటూ వడివడిగా వెనుకవైపు మెట్లు దిగి తన సైకిల్ తీసుకొని హుషారుగా ఇంటికి బయలుదేరాడు.

********

Posted in September 2026, కథలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *