Menu Close
యిరువంటి శ్రీనివాస రావు
ఇంతే సంగతులు (కథ)
యిరువంటి శ్రీనివాస రావు

ఆ రోజు సాయంత్రం USPS వాహనం వచ్చి పోస్ట్‌బాక్స్ లో ఉత్తరాలు వేసింది. నాన్న ఒంటరి పడకకుర్చీలో కూర్చొని, వాహనం తిరుగుతున్న చప్పుడు విన్న వెంటనే తల తిప్పి వాకిలివైపు చూశాడు నేనేనా అని.

నేను పోస్ట్ తీసుకొని ఆయన పక్కన కూర్చుంటే, ఆయన ప్రశ్న–ఏమైనా వచ్చాయా రఘూ?

రోజూ అలా అడగటం మాములే.

ఆ…అక్క దగ్గర్నుంచి వచ్చింది. మీ మనవడు రాసాడు.

చదువన్నట్లు నా వైపు చూసాడు నాన్న.

“తాతయ్యకి నా నమస్కారాలు...“ నిన్న మా క్లాస్‌లో 'ఫ్యామిలీ ట్రెడిషన్స్' గురించిన ప్రాజెక్ట్ పెట్టారు తాతయ్య. అందరూ iPads, Keynotes చూపిస్తుంటే, నేను నీ చేతివ్రాత ఉత్తరాన్ని చూపించాను. మా టీచర్ ముచ్చటపడిపోయింది. “ఇలాంటి భావోద్వేగాలతో రాసే వ్యక్తి ఇప్పుడు దొరకడం అరుదు…” అంది.

నాన్న కన్నీటి కలకలతో చిన్నగా నవ్వాడు. “వాడికి ఓ చిన్న కాగితం వల్ల అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ... నేనెంత సంతోషపడాలి రఘూ!”

నేనూ చిన్నగా నవ్వి, మిగిలిన ఒక్క వాక్యం చదివి ముగించాను.

“నీ చేతివ్రాతలే నిజమైన జ్ఞాపకాల పేజీలు తాతయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త.” ఇంతే సంగతులు. ఇట్లు మీ పెద్ద మనవడు ఆదిత్య.

నాన్న జగన్నాథం … ఏడు దశాబ్దాల జీవితాన్ని గడిపిన విశ్రాంత అధ్యాపకుడు. అక్క, చెల్లెలుకి అమెరికా సంబంధాలు వచ్చి పెళ్లిళ్లు అయ్యి ఇక్కడకు వచ్చిన తర్వాత, నేను MS కోసం వచ్చి ఇక్కడే జాబ్ రావటం, అక్క చెల్లెలు కూడా ఇక్కడే ఉండటం వలన ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండి పోయాను. అమ్మ  రోహిణి మరణించిన అనంతరం, నాన్న ఒంటరితనంతో కుంగిపోగూడదని, అక్కడ ఉన్న కొద్ది పాటి ఆస్తులను అమ్మేసి నాన్నను అమెరికా తీసుకుని వచ్చాము.

అమెరికా కొత్త. సంస్కృతి కొత్త. భాష పరాయి. కానీ నాన్న మనసు మాత్రం పాత గుర్తుల మెరుపులతో నిండి ఉంది. ఆయనికి ఈ ప్రపంచం కోణాలు తలకిందులుగా కనిపించాయి. ఇంట్లో మనవళ్లు, మనవరాళ్లు ఉన్నా, అందరి మేనులోనూ స్క్రీన్ వెలుగు మాత్రమే.

అబ్బా… మన మనసులు ఇప్పుడు టచ్ స్క్రీన్‌ లో పోతున్నాయేమో అని నవ్వేవాడు నాన్న.

అమెరికా వచ్చిన కొత్తలో మా ముగ్గురి దగ్గర వున్నన్ని రోజులు పట్టుబట్టి పిల్లలందరికీ తెలుగు చదవడం రాయడం నేర్పించాడు. ఆ తర్వాత నా దగ్గరే వుండిపోయాడు. అక్క, చెల్లి, బావలు, పిల్లలు అందరం వేసవి సెలవల్లో డల్లాస్ మా ఇంటికి వచ్చినప్పుడు నాన్నకు సందడే సందడి.

నాకు బాగా గుర్తు. నా చిన్నప్పటినుంచి ఆయన ఉత్తరాలు రాయటం, వచ్చేవాటికోసం ఎదురుచూడటం పరిపాటి. అక్క పెళ్లిఅయి అమెరికా వచ్చేసింది. నేను, చెల్లి హైదరాబాద్ లో చదువుకునే రోజుల్లో - నాన్న రోజు పోస్ట్ మాన్ కోసం ఎదురుచూసేవాడు, ఏమన్నా ఉత్తరాలు వస్తాయేమోనని.

"నాన్నా, ఈ టెక్నాలజీ కాలంలో ఇప్పుడు ఎవరూ ఉత్తరాలు రాయరు," అని చెప్పేవాడిని.

"రఘూ, ఈ మెసేజ్‌లు, కాల్స్ ఇవన్నీ తాత్కాలికం. కానీ ఉత్తరం… అది ఒక జీవితాంతమైన అనుభూతి." మన హృదయాల మాటలకి అడ్రస్ ఉండాలి కదా అనేవాడు నాన్న.

చిన్నప్పుడు నాన్న చేతులు పట్టుకుని రాత నేర్పినప్పుడు... నాకు అక్షరాలంటే ప్రేమగా మారింది.
అక్క పుట్టినరోజుకి నాన్న పాత ఫోటోలతో ఒక అందమైన లేఖ రాసాడు. ఆ లేఖని అక్క ఇంకా దాచుకుని ఉంది.

చిరునామాలు మారవచ్చు, కాలం మారవచ్చు. కానీ మనసుల మధ్య అనుబంధానికి ఉత్తరం లాంటి అక్షర బంధమే సాక్ష్యం అనేవాడు. మాటల్లో చెప్పలేని అనుభూతులను, ఒక కాగితం ముక్కపై వేసిన అక్షరాలే పూర్తి చేస్తాయని నమ్మేవాడు.

ఆయనికి ఉత్తరాలంటే ప్రాణం. ఎవరన్నా ఎదురుగా ఉన్నపుడు మనసులో మాటలు అంత తొందరగా రావురా అబ్బాయ్. అవే మాటలు అక్షరాల రూపంలో గొప్పగా వస్తాయి. అందుకే పెద్ద పెద్ద రైటర్స్ ఏవీ తమ మనసులో ఉంచుకోకుండా రాసేస్తూ వుంటారు. ఉత్తరాలు రాయటం వల్ల మనం కూడా ఒక చిన్న సైజు రచయితలం అయినట్లే.

ఆనందం, దుఃఖం, ఆప్యాయత, కోపం, విరహం, ఎడబాటు, వేదన ఇలా ఒకటేమిటి సమస్తం ఉత్తరాల్లో వ్యక్తం చెయ్యవచ్చు అంటారాయన.

"ఇక్కడ మేమంతా క్షేమం, మీరు క్షేమమని తలుస్తాను. మీ జాబు కోసం ఎదురుచూస్తూ ఉంటాం" అని రాయడంలో ఎంతో ఆనందం ఉందంటారాయన.

అప్పట్లో మీ అమ్మ పుట్టింటి వెళ్లి రాసిన ఉత్తరాలని చూపిస్తే సిగ్గు పడి నవ్వుకునేది. అలాగే మీరు పుట్టిన తర్వాత మీ అల్లరి, మీ ముద్దు ముద్దు మాటలన్నీ ఉత్తరాల్లో రాసి నాకు చెప్పేది.

భార్యతో మాట్లాడుకునే చిన్న చిన్న విషయాలు, పిల్లల మొదటి అక్షరాలు, మొదటి జీతం ఆనందం – అన్నీ ఉత్తరాల్లోనే. దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా బిజీ గా ఉండి, మర్చి పోయి ఉత్తరం రాయకపోతే, " ఏం ఒక్క ఉత్తరం ముక్క రాస్తే మీ సొమ్మేపోయిందని" ఆడిపోసుకునేది మీ అమ్మ.

ఎవరన్నా మనింటికి వచ్చి వెళ్ళేటప్పుడు "వెళ్ళగానే జాబు రాయండి" అని చెప్పటం మర్యాద ఆ రోజుల్లో.

నాన్నకి అప్పట్లో కలం స్నేహితులు కూడా వుండేవాళ్ళట. వాళ్లకు ఉత్తరాలు రాయటం ఒక వ్యసనం గా ఉండేది. వాళ్లలో ఎంతో గొప్ప వాళ్ళు ఎన్నెన్నో తెలియని విషయాలను ఎంతో వివరంగా ఉత్తరాల్లో చెప్పేవాళ్ళు. అలాగే ఒకసారి ఒక పెద్ద మనిషి జర్మనీ నుంచి రాసిన కార్డు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు నాన్న. "నన్ను మర్చిపోలేదే ఎప్పుడూ..." అని మనసులో అనుకున్నాడు.

ఆ ఉత్తరాలు దాటిన సరిహద్దులు, దాటిన సముద్రాలు… కాని వాటిలో ఉన్న హృదయానికి మాత్రం ఎటువంటి వీసా అవసరం లేదు.

ఆ ఉత్తరాలే జగన్నాథుడికి దారులు, దూరాలూ వేరేలా అనిపించనివ్వలేదు. ఎప్పటికీ తన హృదయంలో ఉన్నత స్థానంలో నిలిచిపోయాయి.

నాన్న రిటైర్ అయినా తర్వాత, ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం ఒక పని మాత్రం తప్పదు. పాత ఉత్తరాలను తడిమి తడిమి చూడటం. ప్రతి లేఖ — ఓ జ్ఞాపకం, ఓ శ్వాస, ఓ ప్రేమ సందేశం. "ప్రపంచం మారిందేమో, కాలం మారుతోంది, మనుషులు మారుతున్నారు... కానీ ఉత్తరాల్లోని ఆ మాధుర్య జ్ఞాపకాలు మాత్రం మన నుండి ఎప్పటికీ వేరుకాలేవు." అంటూ తనలో తనే నవ్వుకునేవాడు.

తాతయ్య భారతదేశం స్వతంత్ర ఉద్యమ సమయంలో చాలా ఆక్టివ్ గా ఉండేవాడట. అది విని మహాత్మా గాంధీ తాతయ్యకు ఉత్తరం రాసాడని చాల గొప్పగా చెప్పేవాళ్లట ఆ రోజుల్లో. ఆ ఉత్తరం చాలాకాలం నాన్న భద్రంగా దాచిపెట్టాడు.

నాన్న ఎప్పుడూ అనేవాడు, “వీలున్నపుడల్లా, మీరందరూ మీ పిల్లలకి నేను రాసిన పాత ఉత్తరాలు చదివించు రఘూ. జీవితం అంటే ఏమిటో అర్థం అవుతుంది.”

"నా ప్రతి ఉత్తరమూ వాళ్ళ హృదయంలో ఓ మచ్చిగా మిగిలిపోతే చాలు రఘూ… నేను పోయాక నా అస్తిత్వం వాటిలో ఉండాలి. అంతే!" అని చెప్పేవాడు.

ఎప్పటిలానే, ఆ సంవత్సరం కూడా అందరం డల్లాస్ లోని మా ఇంట్లో కలిసాం. నాన్న పుట్టినరోజు ఎప్పుడో తెలియక పోయినా, వేసవి లో అందరం కలిసినపుడు ఒక రోజు ఆయన పుట్టినరోజని సెలెబ్రేట్ చేసుకుంటాం.

ఆ రోజంతా హడావుడిగా వుంది. పుట్టినరోజు సెలెబ్రేషన్స్ కి చాలామంది గెస్ట్స్ ని ఆహ్వానించాము. నాన్న ఎప్పటిలాగానే పాత ఉత్తరాల కట్టలు పడకకుర్చీ చుట్టూ పెట్టుకుని చదువుకుంటున్నారు.

నాన్న మీరు భోజనము చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రానికి రెడీ అవ్వాలి. అంటూ ఆయన్ని కదిలించాను. ఆయన చేతిలో ఉత్తరం, కళ్ళు మూసుకుని అలానే ఉన్నారు. ఆయనలో చలనం లేదు. అందరూ నా చుట్టూ చేరారు. ఏమిటా అని ఆ లేఖ ని నాన్నచేతిలోంచి తీసి చూసాను. ఎప్పుడో అమ్మ కి నాన్న రాసిన ఉత్తరం ఆయన చేతిలో చివరిసారి మిగిలింది. అది ఒక ప్రేమ గుర్తుగా… ఒక జీవితం నిలిచిపోయిన చిహ్నంగా.

“ప్రియమైన రోహిణి… అని మొదలుపెట్టిన ఆ లేఖలో చివరి మాటలు – “ మన పిల్లలు పెద్దవాళ్లు అయిపోయారు. మనిద్దరం పాత ఉత్తరాల్లా మారిపోతున్నాం.”

"ఇంతే సంగతులు ప్రేమతో… నీ జగన్నాథుడు.”

మా అందరి కళ్ళలో నీళ్లు వచ్చాయి.

కాలం పోయినా… ఉత్తరాల సిరా ఇంకా వాసనలుగా ఉంటుందేమో. ఎప్పటికీ, ఆ పాత ఉత్తరాల్లో ఓ నాన్నను, ఓ ప్రేమను, ఓ జీవనదృక్పథాన్ని చూస్తూ… ఒక కథ తడుస్తూనే ఉంటుంది.... ఇంతే సంగతులు.

********

Posted in September 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *