పుత్రోత్సాహంబు పుత్రుని గాంచి నపుడె పుట్టు
పుత్రుని గని పొంగి పుత్రోత్సాహంబునఁ
దండ్రిఁ జూచి తనయునిఁ గని పది మంది
నాడుకొని పొగడఁగా నదియె పుత్రోత్సాహము.
నా తరం వాళ్లంతా పై పద్యం వింటూనే పెరిగాము. అదే పిల్లలను పెంచడానికి కొలబద్ద అనుకున్నాము. పిల్లల గుణగణాలను పది మంది పొగిడితే పై పద్యం సరిగ్గా వర్తిస్తుంది. కానీ పిల్లల జీవితంలో ఏ ఉద్యోగంలో స్థిర పడ్డారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు లాంటి విషయాలలో పది మంది ప్రశంసల కోసం తల్లితండ్రులు ప్రాకులాడడంలో వర్తించదు.
పిల్లల ప్రతిభను గుర్తించి, అది పెంపొందించుకోవడానికి అవకాశాలు కలిగించడం, వారి ఆశయాలు గుర్తించి వాటిని నెరవేరే మార్గాలు వెదకడం తక్కువమంది తల్లితండ్రులే ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది. ‘పది మంది …పొగడ్తలు’ జీవితాశయం అయిపోయింది. ఆ ప్రయత్నంలో పది మంది సామాన్యంగా పొగిడే గెలుపులు, సమాజంలో జీవన గమ్యాలైపోయాయని అనిపిస్తుంది. డాక్టర్ లేక ఇంజనీర్ లేక ఐ ఏ ఎస్ వాళ్లకే చప్పట్లు. గొప్పింటి సంబంధాలకే పది మంది మొగ్గు. ఆ గమ్యాలు పిల్లలు చేరడానికి తల్లితండ్రులు బ్యాక్ సీట్ డ్రైవర్లు, హెలికాప్టర్ పేరెంట్స్.
ఇలా పది మంది పొగడ్తల జీవితం వెదికే ప్రయత్నంలో, సంతోషం పోగొట్టుకొని జీవచ్ఛవాల లాగా సమయం గడుపుతున్న కొత్త తరం అవతరణ, ప్రయాణాలలో ఇంతవరకు అంతరాయం కనపడటం లేదు.
అమెరికా వచ్చిన తరువాత ఇక్కడి పెంపకంలో లోటుపాట్లే మొదట కనపడ్డాయి. 18 ఏళ్లకే హై స్కూల్ తరువాత పిల్లల బాధ్యతలకు స్వస్తి చెప్పడమేమిటి? హార్వర్డ్ లాంటి కాలేజీ లో సీటు సంపాదించిన తరువాత చదవటం మధ్యంతరంలో ఆపేసి మరో గమ్యం వైపు పరిగెడుతున్న పిల్లలను అడ్డుకోరేమిటీ పేరెంట్స్? డాక్టర్ గా రెసిడెన్సీ చేస్తున్న అమ్మాయి, దినసరి జీతాలకు పని చేస్తున్న రెస్టారెంట్ చెఫ్ ను పెళ్లి చేసుకుంటానంటే సంతోషపడుతున్నారేంటి?
కానీ అలా చేయడం వల్ల పిల్లలకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది, కొత్త మార్గాలు అన్వేషించడానికి, మానవాళికి ఉపయోగ పడే వినూత్న ప్రయత్నాలు ఆవిష్కరించడానికి కారణమవుతుందనుకుంటాను. ముఖ్యంగా పిల్లలకు జీవితం సంతోషంగా గడపడానికి అవకాశం కల్పిస్తుంది.
పై ఆలోచనలకు రూపు ఇచ్చే ప్రయత్నమే ఈ కథ. ఈ కథ అమెరికాకు వలస వచ్చిన భారతీయ వాసులకు సుపరిచితమే.
ప్రతి కథకు ఒక కొత్త నగరం, వీలైతే ఒక కొత్త దేశం నేపథ్యంగా అల్లడం నాకిష్టం. ఈ కథ వాషింగ్టన్ డీసీ లో జరిగినట్లు వ్రాయడం జరిగింది. బహుశా ఇప్పుడు వ్రాస్తే టైడల్ బేసిన్ లో సంవత్సరంలో ఒకటి రెండు వారాలు వికసించే చెర్రీ బ్లోసమ్ చెట్లను నేపథ్యంగా వాడుకొనేవాడినేమో. కథ ఒక రిసార్ట్ లో బదులు అందమైన ప్రకృతిలో నడుచుకుంటూ కూడా చెప్పొచ్చు కదా!
భలే మంచి చౌక బేరము
పొటామాక్ నది దాని ఇరువైపులా అందంగా ల్యాండ్ స్కేప్ చేసిన ఒడ్డు. నది పైన వాషింగ్టన్ అందాలు విహార యాత్రికులకు చూపెడుతూ వయ్యారంగా తిరుగుతున్న పడవలు. ఓ క్లాసిక్ పెయింటింగ్ లాగ కనిపిస్తున్నది.
సాయంత్రం కావడంతో ఆకాశం, క్షణ క్షణం మారుతున్న కెంజాయ రంగులతో కదులుతున్న మబ్బులతో, ఎదురుగా 19 అంతస్తుల ఏట్రియంలో ఓ వనంలా కట్టిన రెస్టారెంట్‌లో, కూర్చుని ఏమి త్రాగాలి ఏమి తినాలి అని సతమతమౌతున్న వారి దృష్టి ఆకర్షించడానికి తెగ పాట్లు పడుతున్నది.
ఏట్రియంలో ఓ వైపు 19 అంతస్తుల హోటల్ రూములు, పైకి కిందకి దిగుతున్న గాజు ఎలివేటర్లు ఉంటే, మిగిలిన మూడు వైపులా పైన గాజు, స్టీల్లో కట్టిన ఏట్రియం ఫౌంటేన్లు చిన్న చిన్న జలపాతాలు, పూల్స్, మొక్కలు, లాన్లు, ఏకంగా పెద్ద చెట్లే ఉన్న ఆ ప్రదేశం అదేదో పార్కా, షాపింగ్ మాలా, అన్ని సదుపాయాలున్న ఓ ఆధునిక నగరమా అన్న సందేహాన్ని కలిగిస్తుంది.
ఇంతకీ అదో పేరుమోసిన కన్వెన్షన్ సెంటర్, రిసార్ట్. దేశ విదేశాలలో ఉన్న సంస్థలు తమ ముఖ్యమైన కాన్ఫరెన్సులు ఈ రిసార్టులోనే జరుపుకుంటారు. కాన్ఫరెన్స్‌లలో పాల్గొనేవారు తమ ఫ్యామిలీ పిల్లలతో వస్తే వాళ్లకి కాలక్షేపంగా ఆ రిసార్ట్‌లోనే బోలెడన్ని ఆటలు, రైడ్లు, సిటీ చూడాలనుకునే వారికి గైడెడ్ టూర్లు అన్ని సదుపాయాలు చేయడం వల్ల ఆ సెంటర్ ఎప్పుడు బిజీనే. నెలల ముందే బుక్ చేసుకోవాలి.
సాయంత్రం అవ్వడం వల్ల రోజంతా కాన్పురెన్సులలో పాల్గొన్నవారు రెస్టారెంటుకు వచ్చి గుంపులు గుంపులుగా చేరి, కావలసిన డ్రింక్స్ వెయిటర్‌కో, బార్ టెండర్ కో చెప్పి తమ నెట్వర్కింగ్ ప్రయత్నాలలో పడిపోతున్నారు.
ఈ హడావిడికి కొంచెం అటువైపుగా విజే, బాబి కూర్చున్నారు. విజే అసలు పేరు వడమాలపేట జంబన్న. ఈ దేశం వచ్చాక స్టయిల్‌గా ఇంగ్లీష్‌లో పేరులోని మొదటి అక్షరాలు కలిపి విజే అయ్యిపోయాడు. బాబి పేరు గుణదల బాబ్జి.
‘ఇరవై ఏళ్లకు ఎంత మార్పుకదా. నిన్ననే అమీర్‌పేట్ కోచింగ్ సెంటర్ బయట టీ తాగుతున్నట్లు ఉంది’. అన్నాడు విజే బాబితో ‘అవును విజే’, బాబి గొంతులో అదే నాస్టాల్జియ.
విజే చదివింది బి.కామ్. బాబి బిఏ చదివాడు. పట్ని కంప్యూటర్ కంపెనీలో సేల్స్ గ్రూప్లో పనిచేస్తుండే వారు. తమతోపాటు చదివిన క్లాస్‌మేట్లు ఇంజనీరింగ్ అవీ చేసి అమెరికాకు పోయి అక్కడ డబ్బు సంపాదించడం, అక్కడి కబుర్లు వినడం, తాము పని చేస్తున్న కంపెనీ లోపల బయట వింటుండడంతో తాము కూడా బాగా చదివి ఇంజనీరింగ్‌చేసి అమెరికా వెళ్లి వుండాలేమో అని బాధపడుతున్న సమయంలో, అప్పటికే అమెరికాలో పనిచేస్తున్న కొంతమంది సొంత కంపెనీలు పెట్టి ఇండియా నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను పిలవడం మొదలెట్టారు. డిగ్రీలకంటే అనుభవంకే ప్రాముఖ్యం అని గమనించిన ఇలాంటి ఓ పిల్ల కంపెనీ ఓనర్ వీళ్ళ డ్రింక్ పార్టీ స్నేహితుడు కావడం వీళ్ల అదృష్టం. అక్కడి డిమాండ్ పట్టి వీళ్ళను ఓ ఎస్ ఏ పి(SAP) కోర్సు అమీర్‌పేటలో చేయమని వీళ్ళని హెచ్1 బికి స్పాన్సర్ చేసి అక్కడ చేరాక వాళ్ళకి లేని అనుభవాలు రెస్యూమెలో ఇరికించి తానూ డబ్బు చేసుకొని, వీళ్ళకీ ఓ జీవనోపాధి కలిగించడంతో వీళ్ళ అమెరికన్ డ్రీమ్ ప్రారంభం అయ్యింది.
వారంలో నాలుగు రోజులు ట్రావెల్ జాబ్. ఇంటికి వీకెండ్ మాత్రం రావడం. భార్యలు విసుక్కోకుండా వాళ్ళకి ఓ కంపెనీ మొదలెట్టి అన్ని బాధ్యతలను అప్పజెప్పడం. వచ్చిన డబ్బులు ఏమి చేయాలని రియల్ ఎస్టేట్ లో ప్రాంచైజ్లలలో పెట్టడం వారి జీవితాలని మరింత బిజీగా, మాట్లాడడానికి సమయం కూడా లేనంతగా మార్చేసాయి.
వచ్చిన కొత్తలో సెకండ్ హాండ్ కేమ్రీ కొనడం, తరువాత డబ్బులు రావడంతో తమకు లక్జరి జర్మన్ కార్లు, భార్యలకు లెక్సస్ కార్లు కొనడం అంతా ఏకాభిప్రాయంతోనే విజే బాబి చేశారా అనిపిస్తుంది. కొన్న కార్లు, ఇళ్ళు పిల్లలు చదువుతున్న బడులు, ఎక్సట్రా ట్యూషన్లు, టెన్నిస్ పాఠాలు భరత, కూచిపూడి నాట్యాలు, ప్రాం డేట్లు ఆ ఫోటోలు అన్నీ గొర్రె దాటులా ఒకేమూసలో పోసినట్లనిపించినా, దానికి కారణం జీవితంలోపైకి పోవాలి, పిల్లలని పైకితీసుకెళ్లాలనే అందరికి ఉన్న కామన్ తపనే ఉండచ్చు. జీవితం అంటే ఇది టాప్ మోడల్. ఇలాంటి మాడల్ జీవితమే కావాలి అంటూ టాప్ మోడల్ కారు, ఇల్లు కొన్నట్లే, డబ్బులు తీసుకొని పరుగులు తీస్తున్న జనంలో దూరి తాము కూడా పరిగెట్టడానికి విజేకి బాబికి పెద్ద సమయం పట్టలేదు.
ప్రయత్నాలు అన్నీ ఒకటే అయినా రిజల్ట్స్ ఒకటే కావడం, కార్లు ఇళ్ళు కొనడంలో సాధ్యమౌతుందేమో కాని పిల్లల చదువులలో కాదు. అదీ అందరూ తమ పిల్లలు డాక్టర్లే కావాలనుకుంటే పెద్ద సమస్యే. మెడికల్ కాలేజీ సీట్లు పరిమితమే. అండర్ గ్రాడ్యుయేషన్‌లో మంచి జిపిఏ, ఎంకేట్‌లో మంచి స్కోర్, వాలంటరీ పనులు చేసిన అనుభవం ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరిగా జవాబులు చెప్పడం లాంటివి ఎన్నో సరిగా చేసినా చేతికి సీట్ అందే వరకు నమ్మకం లేదు. ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ సీటు రాకపోతే వదలకపోవడంలో విజే, బాబిలకు అంతకు ముందే వలన వచ్చిన మనదేశీయులు మార్గ దర్శకులయ్యారు. ఆ ప్రయత్నంలోనే ఇలా విజే, బాబి ఈ కన్వెన్షన్ సెంటర్‌కు రావడం జరిగింది.
విజేకి అమ్మాయి, బాబికి అబ్బాయి. ఇద్దరూ ఇప్పుడు కాలేజి నాలుగో సంవత్సరంలో ఉన్నారు. చేతికందినంత డబ్బులు, ఖర్చు పెట్టడానికి బార్లు, కార్లు, స్నేహితులు వీరికి ఉన్నారు. వీరి తీరిక లేని తల్లిదండ్రులకి పిల్లలకి మెడికల్ సీట్ రాదని రెండో సంవత్సరంలోనే తెలిసిపోయింది. విజే, బాబిలకు మాత్రం పిల్లలను ఎలానో అలా డాక్టర్లను చేయాలని పట్టుదల. కార్లు, ఇండ్లతోపాటు, పిల్లలు డాక్టర్లు అయితేనే జీవన సఫలతకు పరాకాష్ట.
‘‘ఈ కెరీబియన్ కాలేజీల గురించి బాగానే చెప్పారు. నాకు వీటి గురించి అంతగా తెలియదు. నన్ను కూడా నీతో పాటు ఈ కాన్ఫరెన్స్‌కు పిలుచుకు వచ్చినందుకు థాంక్స్ బాబి’, అన్నాడు విజే.
‘ఇక్కడ అమెరికన్ యూనివర్సిటీస్‌లో సీట్ రాలేదంటే ఇక కరీబియన్, ఇండియాలలో ఏదో ఓ డొనేషన్ కాలేజినో మార్గం కదా. ఇంతకీ నీవేం నిర్ణయం తీసుకున్నావు’’ ప్రశ్నించాడు బాబి.
‘‘అమ్మాయి కదా, ఇండియా ఆప్షన్ మంచిదనిపిస్తుంది. కాలేజి దగ్గరే ఓ అపార్ట్మెంట్ కొని మా అమ్మను కూడా తోడుగా ఉండమనవచ్చు’’.
‘‘ఇంకా బేబి సిట్టింగ్ ఎందుకు విజే, ఆలోచించి నిర్ణయం తీసుకో. మెడికల్ డిగ్రీ బయట చేస్తే ఇక్కడ వెంటనే రెసిడెన్సీ ఇవ్వరు క్లినికల్స్ చేయాలి. లైసెన్స్ పరీక్షలు వ్రాయాలి. ఈ కరీబియన్ కాలేజీలకు అమెరికా ఈస్ట్ కోస్ట్‌లో ఉన్న కొన్ని కాలేజీలతో అనుబంధాలు ఉన్నాయి. కరీబియన్ కాలేజి పిల్లలు తమ 3వ 4వ సంవత్సరాల కోర్సులు ఇక్కడ అమెరికాలోనే చేయొచ్చు. రెసిడెన్సీ మేచ్ అవకాశాలు కూడా ఎక్కువ’’ అన్నాడు బాబి.
‘‘నాకు తెల్సిన డాక్టర్ వాళ్ళ అమ్మాయి ఇండియాలో చదివి మొన్న మార్చిలో మ్యాచ్ అయ్యింది. తనకు మంచి స్కోర్ కూడా వచ్చిందట. కొంత మంది రెసిడెన్సీ డైరెక్టర్లను కూడా మా బంధువులలో పట్టాను. సహాయం చేస్తామన్నారు కూడా’’ అన్నాడు విజే.
‘‘ఇండియాలో చదివి ఇక్కడి లైసెన్స్ పరీక్షలు పాస్ కాలేక తిరిగి ఏదో చిన్న ఉద్యోగానికే సెటిల్ అయిన వారిని కూడా చూసాను. డిగ్రీ తెచ్చుకోవడానికి ఇండియా అయినా కరీబియన్ అయినా కోటి పైనే ఖర్చు అవుతుంది. ఆలోచించు. నేనైతే మా అబ్బాయిని కరీబియన్ లోనే చేరుస్తాను. దగ్గర్లో ఉంటాడు. రెండు సంవత్సరాలు కేరీబియన్‌లో మరో రెండు ఇక్కడ అమెరికాలోనే చదువుకుంటాడు. ఆ కేరీబియన్ కాలేజి క్లినికల్ రొటేషన్ లైసెన్స్ పరీక్షలకి. రెసిడెన్సీ మ్యాచ్ కావడానికి సహాయ పడుతుంది. సక్సెస్ రేటు కూడా ఎక్కువ’’ మెత్తగా హెచ్చరించాడు బాబి.
అలా వారు పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటే, వారి దృష్టి ఓ రెండు టేబుళ్ల అవతల కూర్చున్న అతని మీద పడింది.
విజే బాబీలకంటే ఓ 20 ఏళ్ళు పెద్దతను. పూర్తిగా బట్టతల అక్కడక్కడా ఉన్న జుట్టు కూడా పూర్తిగా నెరిసిపోయింది, కనుబొమ్మలతో సహా. అతని ముఖం చూడగానే కొట్టొచ్చినట్లు కనపడేది ప్రసన్నత. తరచుగా దోబూచులాడే చిరు నవ్వు తను, తన పక్కనున్న వారు ఏదో మాట్లాడుతూ నవ్వుతూ సంతోషంగా ఉన్నారని ఇట్లే తెలిసిపోతుంది.
‘రామారావు కదూ, చాల రోజుల తరువాత కనపడ్డాడు’, విజే గొంతులో ఓ తేలికభావం బాగా ప్రస్ఫుటమయ్యేటట్లు మాట్లాడాడు.
‘అవును విజే, రామారావే తను ఇలాంటి రిసార్ట్, కాన్పెరెన్సులకు రావడమేమిటి? చూసి ఓ 10 ఏళ్ళ పైనే అయ్యింది’, అదే తేలిక భావంతో అన్నాడు బాబి.
రామారావు, బాబి ఓ పదేళ్ల క్రితం ఒకే ఊళ్ళో ఉండేవారు. ఉగాది సంక్రాంతి, దీపావళి లాంటి పండగలకు తెలుగు సంఘం పెట్టే కార్యక్రమాలలో కలిసేవారు. రామారావు 1970 ప్రాంతంలో చదవడానికి వచ్చి అలానే యూనివర్సిటీలో ఓ టీచింగ్ జాబ్‌లో చేరిపోయాడు. తనకు సరిపోయిన ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. వారికీ ఒకే అమ్మాయి. రామారావు గురించి అప్పటికే జనాలు గుస గుసలాడుతూ నవ్వుకునే వారు. దానికి కారణం అందరిలా కాకుండా ఓ విచిత్రమైన జీవన విధానం అతడు, ఎన్నుకోవడమే. అందరూ ఓ కమ్యూనిటీలో ఇళ్లు కొనుక్కుంటే రామారావు ఊరిబయట ఉన్న ఓపాత ఫార్మ్ హౌస్‌ను కొన్నాడు. చిన్న ఇల్లు దాని చుట్టూ పెద్ద యార్డు. కంచె బదులుఎత్తుగా పెరిగిన పొదలు, చెట్లు, ఇంటి పక్కన పాడు పడిన గాదె. అసలు ఆ గాదె కోసమే రామారావు ఆ ఇల్లు కొన్నాడు. రామారావు వాళ్ళావిడ పిల్లలకి సంగీతం నేర్పడం వల్ల దాదాపు ఊళ్ళో పిల్లలున్న తెలుగు వారందరూ ఆ ఇంటిని చూడడము, వెనుక నవ్వుకోవడం జరిగాయి. రామారావుకి ఆ సంగతి తెలిసే ఉంటుంది. కాని దానిని అతనెప్పుడూ పట్టించుకోలేదు. దానికి తగ్గట్టు, వారి అమ్మాయికి రామారావు మెర్సిడెస్ అన్న పేరు పెట్టడం కూడా రామారావును చూసి నవ్వడానికి మరో కారణమైనది. మెర్సిడెస్ పెంపకం ఒక విచిత్రమే. ఆ అమ్మాయి వాళ్ళమ్మ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. ఎప్పుడూ రామారావు వెంట ట్రక్ మీద పనిచేస్తుంటే సహాయం చేసేది. హైస్కూల్ వచ్చేసరికి, ఒక లెక్కల సబ్జెక్ట్ తప్ప మిగతా వాటిలో సరిగా మార్కులు వచ్చేవి కాదు. కమ్యూనిటీ కాలేజీలో వెల్డింగ్ వర్క్ షాప్ లాంటి కోర్సులు తీసుకొంది. అప్పుడే పిచ్చిగా పాత గడియారాల పైన గంటల తరబడి పని చేస్తుండేది. కాలేజీలో ఉన్నప్పుడు ఓ రోజు పిక్కల పైన, ముంజేతి పైన పెద్ద పెద్ద పచ్చలు పొడిపించేసుకుంది. ఆ తరువాత కాలేజి డ్రాప్ చేసి, పనిలో చేరినట్లు వినికిడి. ఏదో టూల్ కంపెనీలో చేరిందని చెప్పారు. మెర్సిడెస్ ఓ ఆర్టిస్ట్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుందన్న మాట ఎవరిని ఆశ్చర్యచకితులను చేయలేదు. రామారావు మీద జాలి పడడానికి, నవ్వుకోవడానికి మరో అవకాశంగా దోహదపడ్డాయి.
‘‘నాకు రామారావు అంతుబట్టలేదు బాబి. అందరిలాగా ఓ మోడల్ హోం కొనుక్కోవచ్చు కదా. ఓ మంచి కారు కొనవచ్చు కదా. స్పెల్లింగ్ బీ, జాగ్రఫీ బీ, యంగ్ బిజినెస్ లీడర్స్, పబ్లిక్ స్పీకింగ్, టెన్నిస్, బ్యాండ్, షో కాయిర్ ఎన్ని ఆక్టివిటీలు ఉన్నాయి. మనమంతా పిల్లలను వేసుకొని వీటిలో కోచింగ్ కని పాల్గొనడానికి అని తిప్పి తిప్పలు పడలేదు. పిల్లకు ఇంట్రెస్ట్ లేదంటూ ఒక్క దానిలో కూడా చేర్చలేదు. తనతో బాటు ఆ ట్రక్ పనిలో పెట్టేసాడు. ఉన్న ఒక పిల్లకు మంచి చదువులు చదివించి ఓ డాక్టర్నో, లాయర్నో చివరకు సాఫ్ట్‌వేర్ మేనేజర్‌నో చేసి ఉండవచ్చు కదా. పిల్ల భవిష్యత్తు నాశనం చేసేసాడు. పెళ్ళి కూడా అమ్మాయి మనసు పడితే ఒప్పుకోవడమేనా. వద్దని మంచి సంబంధాలు వెదికి ఉండవచ్చు కదా’’, అన్నాడు విజే.
‘‘నాకూ రామారావు మిస్టరీనే, విజే మా అబ్బాయి డాక్టర్ అయ్యితే డాక్టర్ అమ్మాయి సంబంధమే చూస్తాను. అప్పుడే ఈడు జోడుగా ఉంటుంది’’ అన్నాడు బాబి.
విజే, బాబిలు రామారావు గురించి మాట్లాడుతూ ఉన్నా, రామారావును కలవాలన్న ఆసక్తిలేదు. అందుకే వారు మరోవైపు చూస్తూ మాట్లాడుకోసాగారు. కాని రామారావు దృష్టి విజే, బాబి ల మీద పడింది. తనతో మాట్లాడుతున్న వారితో ఇప్పుడే వస్తానని, నవ్వుతూ విజే బాబిల దగ్గరకు వచ్చి ‘‘హలో’’ అని పలకరించాడు.
‘‘హలో రామారావు గారు’, ఇద్దరూ ఒకేసారి పలికారు.
‘‘ఎలా ఉన్నారు ఏంటి ఇలా వచ్చారు’?, అన్నాడు రామారావు
‘‘పిల్లలని మెడికల్ కాలేజీలో చేర్పించడానికి సెమినార్ కని వచ్చాం. మీరేమిటి ఇక్కడ? మెర్సిడెస్ ఎలా ఉంది’’, అడిగాడు బాబి.
‘మెర్సిడెస్ బాగానే ఉంది. తను కూడా వచ్చింది. పిల్లలు అప్పుడే కాలేజీలో చదువుతున్నారా? వాళ్ళని చిన్న పిల్లలుగా నిన్ననే చూసినట్లు ఉంది’, అన్నాడు రామారావు.
‘అవును టైం ఫ్లైస్ అండి ఇంతకూ మీరు వెకేషన్ మీద వచ్చారా ఈ రిస్టార్ట్‌కు’, బాబి ప్రశ్నించాడు.
‘‘లేదు మేము కాన్పరెన్స్ కోసమే వచ్చాం’, రామారావు బదులిచ్చాడు.
‘ఓహో కాన్పరెన్స్‌లో పాల్గొనాలని వచ్చారా? మీరు రిటైర్ అయ్యి పోయారు కదా. ఇంకా ఈ కాన్పరెన్స్‌లెందుకు?’
‘కాన్సరెన్స్ నాకు కాదు. మెర్సిడెస్‌కు’
‘అలానా మెర్సిడెస్ పాల్గొనాలని వచ్చిందా?
‘అవును. తనదో ప్రెజెంటేషన్ ఉంది’
‘మెర్సిడెస్ పేపర్ ప్రెజెంట్ చేస్తున్నదా? తను కాలేజి గ్రాడ్యుయేషన్ కూడా కాలేదు కదా’
‘అవును తను కాలేజీ డ్రాప్ ఔట్. తనదే కీనోట్ అడ్రస్’.
‘అర్థం కావటం లేదండి. కాచ్ అప్ చేయాల్సిందే. వివరంగా చెప్పండి’, విజే రామారావును అడిగాడు.
‘మెర్సిడెస్ ను మీరు చూసి పదేళ్ళ పైనే అయ్యింది కదా. తనకు చిన్నప్పటి నుంచే గడియారాలు, వాచీ మీనియేచర్ మోటార్స్ పైన పనిచేయడం ఇష్టం ఉండేది. కాలేజి డ్రాప్ అయ్యిన తరువాత ఓ కంపనీ పెట్టి శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ప్రవేశపెట్టగలిగే డ్రోన్స్ మీద పనిచేయడం మొదలు పెట్టింది. దీన్ని జబ్బులు కనుక్కోవడానికి చివరికి సర్జరీ బదులు కూడా ఉపయోగించే అవకాశాలు ఉన్నందువల్ల, వెంచర్ క్యాపిటలిస్టు సహాయపడడంతో, కంపెనీ బాగానే పైకి వచ్చింది. ఇప్పుడు ఓ పదిమంది డాక్టర్లు కూడా ఈ కంపెనీలో చేరారు. ఈ సెమినార్ మెర్సిడెస్ తన కంపెనీ సాధించిన ప్రగతి గురించి వైద్య రంగంలో ఉండేవారికని ఏర్పాట్లు చేసింది. కాన్ఫరెన్స్‌కు చాలా మంది డాక్టర్లు సైంటిస్టులు వచ్చారు’.
బాబికి రామారావు చెప్పిన విషయం షాక్ లాగ అనిపించింది. తను పిల్లలని పైకి తీసుకు రావడానికి ఎంచుకొన్న మార్గంకు భిన్నంగా ఉన్న మెర్సిడెస్ విజయపథం తీవ్ర అసంతృప్తికి కారణం అయ్యింది. వెంటనే రామారావు నుద్దేశించి ‘‘మరి మీ అల్లుడు సంగతేమిటండి? ఇంకా బొమ్మలేస్తూనే ఉన్నాడా’’. ఎంత దాచుకున్నా ఓ చిన్న ఎగతాళి గొంతులోంచి బయటపడింది.
రామారావు అదే చిరునవ్వుతో ‘‘అల్లుడు బాగానే ఉన్నాడండి. తన ఆర్ట్ ఎగ్జిబిషన్ పోయిన వారం న్యూయార్క్‌లో జరిగింది. తన పెయింటింగ్స్ మీద జనాలు, కంపెనీలు బాగానే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అతను ఫార్చూన్ 500 కంపెనీలకు ఆర్ట్ కన్సల్టెంట్ లాగా పనిచేస్తున్నాడు. మెర్సిడెస్ కంటే తనకే సంపాదన ఎక్కువ. మనసున్న పనే జీవనోపాధి అయితే అంతకుమించింది ఏముంది. ఏ పని ఎంచుకున్నా అందులో బాగా రాణించగలిగితే డబ్బు తనంతట అదే వస్తుంది, అన్నదానికి మా అల్లుడే తార్కాణం’’ అన్నాడు రామారావు. బాబి ఎగతాళి గమనించకుండా ఉంటే చివరి రెండు వాక్యాలు పలికే వాడు కాదేమో.
విజే కి కూడా ఈ సంభాషణ కష్టంగా ఉంది. అతనికి రామారావు మీద, ఇది విన్న తరువాత గౌరవం పెరగలేదు. కానీ తామెంచుకున్న మోడల్ కంటే రామారావు గారి మోడల్ మంచిదేమో అన్న సందేహం మొదలైంది.
‘మరి మేము పిల్లలను కరీబియన్లో చేర్పించడం సరి అంటారా మీ అభిప్రాయం చెప్పండి’ అని రామారావును అడిగాడు విజే.
రామారావుకు విజే ముఖం చూస్తే కొంచెం జాలి కలిగింది.
‘‘ఆ ప్రశ్నకు జవాబు, మీ పిల్లలే చెప్పాలి’’
*****
- మధురవాణి, 2016