మేజర్ సోమనాధ శర్మ
ఆ యుద్ధంలో వీరోచితంగా, అంకితభావంతో పోరాడిన వారిలో మేజర్ సోమనాధ శర్మ అగ్రగణ్యుడు. అతడు 31-1-1923 న పంజాబ్ లో జన్మించాడు. సోమనాధ శర్మ తండ్రియైన అమరనాధ శర్మ, మేనమామ యైన కెప్టెన్ వాసుదేవ శర్మ కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీలో పని చేసిన వాళ్ళు కావడంతో, సోమనాధ శర్మ కూడా పిన్న వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరాడు. అతని చదువు కూడా డెహ్రాడూన్ లోని “రాయల్ మిలటరీ అకాడమీ”లో సాగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లకి, జపాన్ వాళ్లకి బర్మాలో జరిగిన యుద్ధంలో పిన్న వయస్కుడైన సోమనాధ శర్మ బ్రిటిషువారి తరఫున పోరాడాడు. భారత్ కి స్వతంత్రం వచ్చాక అతడు భారత సేనలోని వాడయ్యాడు.
సోమనాధ శర్మకు చిన్నప్పటినుండీ వాళ్ళ తాతయ్య దగ్గర చనువు ఎక్కువ. ఆ పెద్దాయన మనుమడికి, తాను పారాయణం చేసే భగవద్గీత గురించి, దాని గొప్పతనాన్ని గురించి ఎప్పుడూ చెపుతూ ఉండేవారు. అలా సోమనాధ శర్మకి భగవద్గీతపై, అందులో బోధించిన విషయాలపై మక్కువ పుట్టింది. పెద్దవాడయ్యాక అతడు ఎప్పుడూ ఒక చిన్న భగవద్గీత ప్రతిని తన జేబులో ఉంచుకుని తిరిగేవాడు. ఎప్పుడు ఏ గొప్ప ఇబ్బంది వచ్చినా అది తనకు సహాయపడుతుంది - అని అతడు మనసారా నమ్మేవాడు.
ఒకరోజు సోమనాధ శర్మ తన తోటివారితో హాకీ ఆడుతూండగా చేతికి దెబ్బ తగిలి, చెయ్యి విరిగింది. డాక్టర్ విరిగిన ఎముకను సరిజేసి, పట్టీ వేశాడు. దాని మూలంగా సోమనాధ శర్మ ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది. సరిగా ఆ సమయంలోనే తొలి "ఇండో - పాక్ వార్" వచ్చింది. అతడు చెయ్యి విరిగడం వల్ల డాక్టర్ సర్టిఫికెట్ తో సెలవు తీసుకోడంచేత మిలటరీ అధికారులు అతనిని యుద్ధానికి పిలవలేదు. అది అతనికి ఏమాత్రం నచ్చలేదు. రోజూ రేడియోలో వస్తున్న యుద్ధవార్తలు వింటూ అతడు ఇంటిలో కుదురుగా కూర్చోలేకపోయాడు.
అతని ట్రూపులో ఉన్న వాళ్ళకు వార్ డ్యూటీ వేశారని అతనికి తెలిసింది. ఇంక సోమనాధశర్మ క్షణం కూడా ఊరుకోలేక పోయాడు. అప్పటికి ఇంకా అతని చెయ్యి పూర్తిగా అతుక్కో లేదు, స్లింగ్ లోనే ఉంది. అయినా, ఆర్మీ ఆఫీసుకి వెళ్లి, తన గ్రూపుకి తానే లీడరుగా ఉంటానంటూ అధికారులతో పోరాడి, పోరాడి చిట్ట చివరకు వాళ్ళని ఒప్పించ గలిగాడు సోమనాధశర్మ. అతని యుద్ధానుభవం, వ్యూహ రచనా నైపుణ్యం తెలిసిన ఆఫీసర్లు అతని కోరికని కాదనలేకపోయారు. మేజర్ సోమనాధ శర్మ కట్టు ఉన్న చేతిని స్లిoగులోనే ఉంచుకుని, అప్పటి కప్పుడు సంతోషంగా డ్యూటీ చెయ్యడానికి తోటివారితో కలిసి బయలుదేరాడు.
భారత్ ప్రభుత్వానికి గూఢచారి వర్గాల ద్వారా తెలిసింది - త్వరలోనే పాక్ ఆర్మీ వచ్చి, శ్రీనగర్ లోని ఎయిర్ ఫీల్డుని ఆక్రమించబోతోందని. కానీ ఆ సేన ఎటువైపునుండి వస్తోందన్నది మాత్రం ఎవరికీ తెలియలేదు. వెంటనే భారత్ సేన జాగృతమయ్యింది. శ్రీనగర్ ఎయిర్పోర్టును ఎలాగైనా అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి - అనుకున్నారు ఆర్మీ ఆఫీసర్లు.
భారత్ ఆర్మీకి ఆ రాత్రి చాలా కీలకమైనది. రాత్రి గడిచి తెల్లవారితే చాలు మరిన్ని సేనలు విమానాలపై శ్రీనగర్ కి రాబోతున్నాయి. శ్రీనగర్ ఎయిర్ పోర్టు కనుక అన్యాక్రాంతమైతే కాశ్మీర్ మొత్తం అన్యాక్రాంతమయ్యే భయంకర ప్రమాదం ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ అలా జరగడానికి వీలులేదు. భారత్ విమానాలు శ్రీనగర్ చేరేవరకు ఎలాగైనా పాక్ జవానుల్ని నిలువరించాలి - అనుకున్నారు ఆర్మీ ఆఫీసర్లు దృఢ నిశ్చయంతో. ఆ ఒక్క రాత్రీ సవ్యంగా గడిస్తే చాలు, తెల్లారితే ఇక భయం లేదు.
శత్రుసేన శ్రీనగర్ కి చేరకముందే, మధ్య దారిలోనే వాళ్ళని ఆపి, మట్టుపెట్టాలని నిర్ణయించుకుంది భారతసేన. ఉన్నంతలో అన్ని దిక్కులకూ కొంతకొంత సేనను పంపించితే, శతృవులు ఏ వైపు నుండి వచ్చినప్పటికీ తమ సేనకు వాళ్ళు ఎదురవ్వక తప్పదు. అప్పుడు అక్కడ యుద్ధం మొదలయితే, ఆ వార్త తెలియగానే తక్కిన సైన్యం కూడా హుటాహుటీన అక్కడకు వెళ్లి, తమ వాళ్ళతో కలిసి పోరాడి, తేలికగా శత్రువులను తరిమికొట్టవచ్చునని భావించారు ఆర్మీ ఆఫీసర్లు. అక్కడ ఉన్న భారత్ సేనలో కొంత భాగం రిజర్వులో ఉంచి, తక్కిన వారిని ఎనిమిది భాగాలుగా విడదీసి ఎనిమిది వైపులకు పంపించారు భారత సేనాధిపతులు.
మేజర్ సోమనాధశర్మ నడుపుతున్న “కుమావూన్ 4th బెటాలియన్” బడ్గాం అనే ఊరువైపుగా బయలుదేరింది. బడ్గామ్ చేరుకున్న వాళ్లకు అక్కడ అంతా ప్రశాంతంగా ఉన్నట్లే కనిపించింది. గ్రామస్థులనడిగితే వాళ్ళూ అదే మాట చెప్పారు. చివరలో మాత్రం గద్గద స్వరంతో, లోగొంతులో రహస్యంగా అన్నారు, “మాకు చాలా భయంగా ఉంది. మీరే మమ్మల్ని రక్షించాలి.”
కానీ, ఆ మాటల అర్థం సరిగా తెలుసుకోలేక పోయాడు సోమనాధ శర్మ. వెంటనే, “బడ్గాం” ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంది” అని ఆర్మీ ఆఫీసుకి వైర్లెస్ మెసేజ్ పంపించాడు. ముందుకు సాగమని ఆర్డర్ వచ్చింది. కొంత ఆర్మీ “మాగాం” అనే మరో ఊరు వైపుగా అప్పటి కప్పుడు తరలిపోయింది. సోమనాధ శర్మతో కలిపి 50 మంది మాత్రం ఆ రాత్రికి అక్కడ గడపాలనీ, తెల్లవారాక తాముకూడా మాగాం వెళ్లాలనీ అనుకున్నారు.
మేజర్ సోమనాధశర్మ, అతని అనుయాయులైన మరో 49 మంది మాత్రమే బడ్గామ్ లో మిగిలి ఉన్నారు. ఆ రాత్రికి వాళ్ళు అక్కడ టెంట్లు వేసుకుని స్థిరపడ్డారు. రాత్రి పడగానే ఇళ్లలోనుండి తుపాకీ గుళ్ళు దూసుకు రావడం మొదలయ్యింది. అప్పుడు వాళ్లకు అర్థమయ్యింది, గ్రామస్థులు తమకు చెప్పిన విషయం ఏమిటో! భారత్ సేన కంటే ముందే పాక్ సేన అక్కడకు వచ్చి, గృహస్థులను బెదిరించి, ఇళ్లలో దాగి ఉందని వారికి తెలిసింది. వెంటనే సోమనాధశర్మ హెడ్ ఆఫీసుకి పరిస్థితిని వివరిస్తూ, అదనపు సేనని ఆఘమేఘాలమీద పంపమని వైర్లెస్ మెసేజ్ పంపాడు.
వెంటనే వారినుండి జవాబు వచ్చింది, “సహాయక సేన బయలుదేరింది. కానీ, అది అక్కడకు చేరేందుకు కొంత సమయం కావాలి కదా! అంతవరకూ శత్రువులను మీరు నిలువరించ గలిగితే విజయం మనదే!”
భారత్ సేన తుపాకులు గురిపెట్టి, ఇళ్లవైపుగా పేల్చబోతూంటే మేజర్ శర్మ వారించాడు, “ఇళ్లలో పిన్నలూ, పెద్దలూ, స్త్రీలు, పసి బిడ్డలు మొదలైన అమాయకపు ప్రజలు ఉంటారు. మీరు పేల్చిన గుళ్ళు వాళ్లని తాకవచ్చు. వాళ్ళు మనకు శత్రువులు కారు. మరో ఉపాయం ఆలోచిద్దాము. మనం ఈ చీకటి చాటున నేలపై పడుకుని నిశ్శబ్దంగా ఉండిపోదాము. అప్పుడు పాక్ సేన, వాళ్ళ తుపాకి గుళ్ల దెబ్బలకు మనమందరం చనిపోయామనుకుని, బయటకు వస్తుంది. అప్పుడు చూపిద్దాం మన ప్రతాపం. మన దగ్గర ఎమ్యూనిషన్ కూడా తక్కువగా ఉంది కదా. అది అదనపు సేనలు వచ్చి మనల్ని చేరుకునే వరకు సరిపెట్టాలంటే మనం వ్యూహాత్మకంగా వ్యవహరించక తప్పదు“ అని చెప్పాడు.
వెంటనే భారత్ ఆర్మీ అక్కడున్న చెట్ల చాటున, మట్టి గుట్టలచాటున, వాళ్ళు వేసుకున్న టెంట్ల చాటున దాగి, నిశ్శబ్దంగా ఉండిపోయారు. అంతా నిశ్శబ్దంగా ఉండే సరికి, మేజర్ సోమనాథ శర్మ ఊహించిన విధంగానే, భారత సైన్యమంతా తమ తుపాకి గుళ్లకు బలై చనిపోయారనుకుని పాక్ సేన సంతోషంగా ఇళ్ళనుండి బయటికి వచ్చింది. అందరూ బయటికి వచ్చారనిపించాక, చీకటి చాటున వాళ్లపై గుళ్ళవర్షం కురిపించింది భారత సేన. ఇరుపక్షాల నుండి భయంకరమైన కాల్పులు మొదలయ్యాయి.
పోరు ఘోరమయ్యింది. భారత్ సైనికులు ఏభై మంది మాత్రమే. కాని పాక్ సైనికులు 500 - 700 మంది వరకు ఉండవచ్చునని అంచనా. మేజర్ శర్మ తన బలగాన్ని ప్రోత్సహిస్తూ, వారికి కావలసిన వస్తువులను ఒంటిచేత్తో తెచ్చి అందిస్తూ, ఆ ఒక్క చేత్తోనే శత్రు సేనపై గురిపెట్టి తుపాకిని పేలుస్తూ, మధ్యమధ్యన గ్రనేడ్లను శత్రువులపైకి విసురుతూ, అటూ ఇటూ మెరుపు వేగంతో పరుగులు పెడుతూ, ఎటు చూసినా తానే అన్నట్లుగా విజృంభించి వీర విహారం చేశాడు. కొంత సమయం గడిచాక చూస్తే, భారత్ సేనలో పదిమంది మాత్రమే మిగిలి ఉన్నారు.
అప్పుడు మేజర్ సోమనాధశర్మ ఆర్మీ ఆఫీసుకి మెసేజ్ చేశాడు, “సర్! శత్రువులు 50 గజాల దూరంలో ఉన్నారు. మా సంఖ్య బాగా తగ్గిపోయింది. మేము అత్యంత భయంకరమైన కాల్పుల మధ్య ఉన్నాము. కానీ, నాకు ఏమాత్రం తగ్గే ఉద్దేశం లేదు. మా దగ్గరవున్న ఆఖరి తూటా ఐపోయినా కూడా, మాలోని ఆఖరు వ్యక్తి ఉన్నంతవరకూ మేము శత్రువులను కదలనీకుండా ఆపుతూనే ఉంటాము.” ఇదే అతని ఆఖరు సందేశం.
అలా ఆ పదిమంది 6 గంటలపాటు శత్రువులను ప్రతిఘటించారు. అంతలో అదనపు సేన వస్తున్న అలికిడి విని ఆనందించే లోపుగా పాక్ సేన విసిరిన గ్రనేడ్ మేజర్ శర్మ పక్కకు వచ్చిపడి, పేలింది. కొత్తగా వచ్చిన భారత్ పటాలాన్ని చూసి, చావగా మిగిలిన పాక్ సైనికులు కాలికి బుద్ధిచెప్పి; వేగంగా, వచ్చిన దారినే పారిపోయారు.
తెల్లవారి వెలుగు వచ్చాక శవాలను వెతికి చూడగా మేజర్ సోమనాధశర్మ, అతని అనుయాయులు - మొత్తం 50 మంది చనిపోయారని తెలిసింది. పాక్ సైనికుల శవాలు 200కు పైగా లెక్కకు వచ్చాయి.
అక్కడున్న విగతజీవుల గుట్టలలో మేజర్ శర్మ పార్థివ దేహాన్ని కనిపెట్టడం కష్టమయ్యింది. కట్టుకట్టి ఉన్న అతని చెయ్యి, గ్రనేడ్ దెబ్బకు తెగిపోయి అల్లంత దూరంలో పడి ఉంది. వెతగ్గా వెతగ్గా ఒక సిపాయి పార్థివ దేహం యొక్క జేబులో భగవద్గీత పుస్తకం దొరికింది. అంతేకాదు, సోమనాధశర్మకు అతని చెల్లెలు, ఒకసారి ఎప్పుడో, తనపేరు రాసిన “హోలెస్టర్” ఒకటి బహూకరించింది. అతని బెల్టుకి అది ఉంది. గ్రనేడ్ ధాటికి ఛిద్రమైపోయిన మేజర్ శర్మ పార్థివ దేహాన్ని గుర్తుపట్టీలా చేశాయవి రెండూ.
వనరులు తక్కువ ఉన్నాయి. కడదాకా వెంట ఉన్నది కూడా 49 మంది యుద్ధ వీరులు మాత్రమే అయినా, అంకిత భావంతో, అసమాన శౌర్య ప్రతాపాలతో విజృంభించి వీర విహారం చేసి, ఎందరో శత్రువులను మట్టుపెట్టి, శ్రీనగర్ ఎయిర్పోర్టును శత్రువులనుండి కాపాడిన ఘనత మేజర్ సోమనాధ శర్మది, అతని అనుయాయు లైన బలగానిది!
యుద్ధానంతరం భారత ప్రభుత్వం మేజర్ శర్మకు, మరణానంతరం, అత్యంత ప్రతిష్టాత్మకమైన గేలంటరీ అవార్డు ఐన "పరమవీర చక్ర" (PVC) ఇచ్చి గౌరవించింది. స్వతంత్ర భారతంలోని తొలి పరమవీర చక్ర (PVC), గేలంటరీ అవార్డు గ్రహీత స్వర్గీయ మేజర్ సోమనాధ శర్మ! అది మరణానంతర బహుమానం కావడంతో తండ్రి అమరనాధ శర్మ వచ్చి, రాష్ట్రపతి ఐన రాజేంద్ర ప్రసాద్ గారి చేతి నుండి ఆ ఘనమైన బహుమానాన్ని కొడుకు తరఫున, కంట తడి ఉన్నా సగర్వంగా అందుకున్నారు ఆ తండ్రి.
కుటుంబంలోని పెద్దకొడుకును యుద్ధంలో కోల్పోయినా, ఆ కుటుంబంలోని వారెవరూ కొంచెమైనా భయపడలేదు, వెనుకంజ వేయలేదు. ఆర్మీలో చేరి తమ దేశభక్తిని చాటుకున్నారు. చెల్లెలి భర్త కృష్ణ తివారీ, సోమనాధ శర్మ యొక్క ఆర్మీ ఫ్రెండ్. ఆ కుటుంబం మొత్తం ఆర్మీలోనే ఉన్నారు. “ఇదం బ్రాహ్మ్యం - ఇదం క్షాత్రం” అన్న ఆర్యోక్తి కి ఆ కుటుంబం ఒక గొప్ప నిదర్శనం!
***
సావిత్రీ ఖణోల్కర్
భారత దేశాన్ని బ్రిటీషువారు పాలిస్తున్న రోజుల్లో, యుద్ధంలో తమ శౌర్య ప్రతాపాలను ప్రదర్శించి విజయాన్ని కైవశం చేసిన వీర సిపాయీలకు గేలంటరీ అవార్డులు ఇచ్చేవారు బ్రిటిష్ వారు. స్వతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం, తనదైన శైలిలో ఈ అవార్డులను ఇవ్వవలసి ఉంది. పరమ వీర చక్ర, మహా వీరచక్ర, వీరచక్ర, శౌర్యచక్ర, అశోక చక్ర …ఇలాంటి పేర్లతో వారివారి శౌర్యప్రతాపాలకు తగిన రీతిలో అవార్డు ఇవ్వాలని అనుకుంది భారత ప్రభుత్వం. బహుమానం పొందిన వారికి జ్ఞాపికగా ఒక మెడల్ని, వారి శౌర్యాన్ని, సాహస ప్రతాపాల్ని వర్ణించే “సైటేషన్” చెక్కిన రాగిరేకుని, కొంత సొమ్ముని ఇవ్వాలని నిర్ణయించింది భారత ప్రభుత్వం. ఆ మెడల్సుకి రూప కల్పన చేసే పనిని సావిత్రీ ఖణోల్కర్ అనే ఒక మహిళకు అప్పగించారు.
సావిత్రీ ఖణోల్కర్ తొలుత ఒక స్విస్ మహిళ! ఇండియన్ ఆర్మీ ఆఫీసరైన విక్రమ్ రాంజీ ఖణోల్కర్ని ఆమె వివాహమాడింది. కాలక్రమంలో ఆమెకు సనాతన ధర్మం పైనా, భారతీయ సంస్కృతిపైనా మక్కువ ఏర్పడడంతో తన పేరుని ఆమె సావిత్రిగా మార్చుకుంది. శాకాహారి అయ్యింది. ఆహారాన్నే కాదు, ఆహార్యాన్ని కూడా మార్చి, భారతీయమైన చీరను ధరించింది. అంతేకాదు, మరాఠీ భాష నేర్చుకుంది. వేద వేదాంగాలను గురించీ, పురాణేతిహాసాలను గురించీ తెలుసుకుంది, భారతీయ లలితకళలనూ నేర్చుకుంది. వేయేల - ఆమె మనోవాక్కాయకర్మలా సుధ్ధమైన భారతీయురాలిగా మారిపోయింది.
స్వతంత్ర భారతంలోని తొలి ఎడ్యుటెంట్ జనరల్ కు ఆమెను గురించి తెలిసింది. ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలనిపించింది ఆయనకు. భారత సేనకు "గేలంటరీ అవార్డు"తో ఇచ్చే జ్ఞాపికలైన "మెడల్స్" ఆమె చేత డిజైన్ చేయించాలని ఆయన నిర్ణయించారు. కోరగానే ఆమె అంగీకరించింది. అన్ని మెడల్స్ యొక్క డిజైనింగ్ అంతా సావిత్రీ ఖణోల్కర్ హస్తకళ ద్వారా తయారైనవి కావడం గొప్ప విశేషం. ఆమెకు తగిన గౌరవం దక్కింది.
***
కాశ్మీర్ విభజన
భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన “తొలి యుద్ధం" సంవత్సరం పైగా సాగింది. 22 అక్టోబర్ 1947 న మొదలైన ఆ యుద్ధం జనవరి 1 - 1949 న ముగిసింది. ఆ యుద్ధంలో పాకిస్థాన్ పూర్తిగా ఓడిపోయింది. ఇది ఇండో పాక్ యుద్ధాల్లో మొదటిది. కానీ, హరిసింగ్ కోరిన మేరకు భారతసేన పాకిస్థాన్ తో పోరాడి విజయాన్ని సాధించింది. రాజా హరిసింగ్ సంతోషంగా తన రాజ్యం మొత్తం భారత్ కి ధారాదత్తం చేశాడు. ఆ విధంగా కాశ్మీర్ మొత్తం భారత్ లో విలీనం అయ్యింది.
ఇరు దేశాలకూ రాజీ చేస్తామంటూ, “యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్” (UNO) వారు కోరి మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చి, పాకిస్థాన్ కష్టపడి కబ్జా చేసిన కాశ్మీర్ ప్రాంతం వాళ్ళ ఆధీనంలోనే వదిలెయ్యాలని తీర్పు చెప్పి, ఇరు దేశాలమధ్య సరిహద్దురేఖ (LOC )ని నిర్ణయించారు. కాశ్మీరును రెండు ముక్కలుగా చేసి, రెండింటికి మధ్యన వాళ్ళు అడ్డుగోడ కట్టారు. అప్పట్లో ఈ దారుణ అన్యాయాన్ని ప్రతిఘటించిన భారతీయుడే లేడు! అప్పటినుండీ ఆ కబ్జా అయిన ప్రాంతం పాక్ ఆధీనంలోనే ఉండిపోయింది. దానిని భారతీయులు “పాక్ ఆక్రమిత కాశ్మీర్” (POK) అంటే, దానినే "ఆజాద్ కాశ్మీర్" (AK) అంటారు పాకిస్థానీయులు.
అక్కడితో తృప్తిపడలేదు పాకిస్థాన్ ప్రభుత్వం. అదిమొదలు, కాశ్మీర్లో మిగిలిన భాగం కూడా తమకే కావాలని, ఎప్పటికప్పుడు తగని గోల చేస్తూనే ఉంటుంది ఆ దేశం.
తనకు సపోర్టుగా ఉండడo కోసం పాక్ ఒక ప్లాన్ వేసింది. జనాభా లెక్కల్లో ముస్లిమ్ ల సంఖ్య ఎక్కువగా ఉండడం కోసం, ఉగ్రవాదులను పెంచి, పోషించి; వాళ్ళని ప్రేరేపించి కాశ్మీర్లోని హిందువులపైకి ఉసిగొల్పింది పాకిస్థాన్. పాకిస్థాన్ తాలూకు ఉగ్ర మూకలు కాశ్మీర్లో ప్రవేశించి, "మీరు బ్రతకదల్చుకుంటే ఇస్లాం మతములో చేరండి, లేదా మీ ఆడవాళ్ళను ఇక్కడ వదిలి కాశ్మీరును విడిచి పారిపోండి” అంటూ మారణాయుధాలు చేత పట్టుకుని వచ్చి, కాశ్మీర్ లోని హిందువులపైన విరుచుకు పడ్డారు. అక్కడున్న సాత్వికులైన హిందువులను క్రూరంగా హింసించి హత్యలు, బలవంతంగా మత మార్పిడులు, ఆస్తి దహనాలు, మానభంగాలు చేసి, రకరకాలుగా వారిని బాధించి; వాళ్ళు ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని, స్వస్థలమైన కాశ్మీరును వదలి పారిపోయేలా చేశారు. ఎందరో కాశ్మీరీలు నిర్వాసితులై అల్లాడిపోయారు. కాందిశీకులులై ఇతరదేశాలలో తల దాచుకున్నారు.
వాళ్ళను ఆదుకోవలసిన ఆనాటి భారత ప్రభుత్వం, వారిపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. ప్రభుత్వం వారికి తగిన సహాయం అందజేయలేదు. పాక్ తాలూకు ఉగ్రవాదులతో పడలేక, సుప్రసిద్ధులైన కాశ్మీరీ పండితులు ఎందరో స్వదేశాన్ని వదలి వివిధ విదేశాలకు వెళ్లి, శరణార్థులై ఆ యా దేశాల రక్షణలో అనాధలుగా బ్రతకవలసి వచ్చింది.
న్యాయం భారత్ పక్షాన ఉంది. కాశ్మీరును బ్రిటిష్ వాళ్ళు తామై ఎవరికీ కట్టబెట్టలేదు. బ్రిటిష్ ఇండియాలోని ఒక సంస్థానం కాశ్మీర్. దానికి రాజు హరిసింగ్. 1947 ఆగస్టు 15 న భారత్ కి స్వతంత్రం వస్తే; ఆపై కొద్ది నెలల తరువాత కాశ్మీర్ రాజైన రాజా హరిసింగ్, తన రాజ్యాన్ని భారత్ కి రాసి ఇచ్చేశాడు. 26 అక్టోబర్ 1947న భారత్ లో తన రాజ్యాన్ని విలీనం చేస్తూన్నట్లుగా ప్రకటించి, రాజా హరిసింగ్ దానికి సంబంధించిన కాగితాల మీద సంతకాలు చేశాడు. ఆవిధంగా కాశ్మీర్ భారత్ లో భాగమయ్యింది. భారత్ పాకిస్థాన్ దేశాల్లో తనకు నచ్చిన దానిలో ఆయన తన రాజ్యాన్ని చేర్చవచ్చు - అన్నది, భారత్ ని వదలి వెడుతూ బ్రిటిషర్స్ పెట్టిన రూల్ కదా యిది! రాజా హరిసింగ్ ఎంతో ఇష్టపడి. తన రాజ్యoని తనకు నచ్చిన భారత్ లో విలీనం చేశాడు.
ఎప్పటి కప్పుడు పాకిస్థాన్ చేస్తున్న ఆగడాలను సంయమనంతో భారత్ ఎంతగా సద్దుకుపోతున్నా కూడా పాకిస్థాన్ రకరకాలుగా భారత్ ని కవ్విoచాలని చూస్తూ, ఎప్పటి కప్పుడు యుధ్ధం చెయ్యక తప్పని పరిస్థితులను కల్పిస్తూ, ఎల్లప్పుడూ బుసలు కొడుతూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది.
పాకిస్థాన్ వాళ్ళు తమ మూలాలను సాంతం మర్చిపోయారు. దురదృష్టవశాత్తు, ఎందరో హిందువులు నయాన్నో, భయాన్నో మతం మార్పిడికి గురై ముస్లింలు ఐనారుగాని, వాళ్ళూ ఒకప్పుడు మనవాళ్ళే కదా - అన్న సంగతి భారత్ మర్చిపోలేకపోతోంది. ఎంత చెడు చేసినా కూడా పాకిస్థాను దాయాది దేశంగానే భావిస్తుంది భారత్ ఇప్పటికీ. కానీ, పాకిస్థాన్ మాత్రం భారత్ తో తనకున్న బాంధవ్యాన్ని, రక్తసంబంధాన్ని పూర్తిగా మర్చిపోయి, భారత్ ని శత్రుదేశంగా భావించి, ఎప్పటికప్పుడు పనిగట్టుకుని భారత్ పైన దుఃశ్చర్యలకు పాల్పడుతూ, తాను హైరానా పడి, భారత్ ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
***
మహమ్మద్ ఆలీ జిన్నాలో అధికారేఛ్చ రగిలించీ, అంతవరకు కలివిడిగా ఉన్న హిందూ ముస్లిముల మధ్య విభేదాలు సృష్టించీ, రక్తం వరదలై పారేలా చేసీ, అఖండ భారతాన్ని మూడు ముక్కలుగా చేసి, ఇరు పక్షాలమధ్య ఆరని చిచ్చు రాజేసి మరీ వెళ్లారు బ్రిటిష్ వారు. ఆ చిచ్చు ఇప్పటికీ ఇంకా ఆరిపోకుండా, అహర్నిశలు "రావణ కాష్టంలా" రగులుతూనేవుంది. ఆ చిచ్చును ఆర్పాలని భారత్ ఎప్పుడు ప్రయత్నించినా, పాకిస్థాన్ సహకరించదు. ఎప్పటి కప్పుడు ఏదో ఒక రగడను సృష్టించి, ఈ అగ్నిని ఎప్పటికీ ఆరనీకుండా కాపాడుతూనే ఉంటుంది ఆ దేశం, "స్వపక్ష పరపక్ష నిర్ధూమధామమై!"
పరమ మూర్ఖులైన ఆటవిక జాతులను రెచ్చగొట్టి, కాశ్మీరీ హిందువులపై ఉసిగొల్పి, వారిని అక్కడ లేకుండా చెయ్యాలని పాకిస్థాన్, లోకల్ గూండాలను వారికి జతచేసి ఎన్నెన్నో హత్యలు, బలవంతపు మతం మార్పిడులు, మానభంగాలు, హిందువుల అమ్మాయిల్ని ఎత్తుకుపోయి, బలవంతంగా మతం మార్చి నిక్కా చేసుకోడం వగైరా ఘాతుకాలతో హిందువులపై అనేక అక్రమాలకు, అమానుష చర్యలకు పాల్పడుతూ, కాశ్మీర్లోని భారతీయులైన హిందువులను రకరకాలుగా హింసిస్తూ వచ్చింది. అప్పటి భారత ప్రభుత్వం ఆ దుర్మార్గాన్ని అదుపు చేయలేకపోయింది. అంతేకాదు, కాశ్మీర్ నుండి పారిపోయి వచ్చిన హిందువులకు తగిన సాయం కూడా చెయ్యలేకపోయింది. అక్కడితో చాలామంది హిందువులు పరదేశాలకు పారిపోయి కాందిశీకులయ్యారు. ఆ దుర్మార్గులు చేస్తున్న అక్రమాలకు తగిన ప్రతిఫలం వాళ్ళు అనుభవించవలసిన రోజు త్వరలోనే వస్తుందన్నది పాకీల బుర్రలకు ఎప్పటికీ అర్థంకాని విషయమయ్యింది. పాకిస్థాన్ అన్యాయపు కడుపుమంట ఎప్పటికి చల్లారుతుందో ఆ అల్లాకే తెలియాలి.