Menu Close
ఆర్ శర్మ దంతుర్తి
ఠింఠాకరాళుడు (కథ)
కధాసరిత్సాగరం
ఆర్ శర్మ దంతుర్తి

చివరి భాగం

మర్నాడు కళావతి స్వర్గానికి వెళ్లగానే, ఠింఠాకరాళుడు క్రితం రోజు తాను ఇంద్రసభలో చూసిన మేక - మునుపెప్పుడో ఉజ్జయినీ నగర సంచారంలో కనిపించినదాన్ని వెతకడానికి బయల్దేరాడు. ఆ మేకని చూడ్డానిక్కూడా అంత కష్టపడక్కర్లేకపోయింది. మూణ్ణాలుగు వీధులు తిరిగాక మేక కనబడేసరికి వెంఠనే దాన్ని పట్టుకుని కరాళుడు పలకరించేడు, “నేను నిన్నస్వర్గంలో చూసినది నిన్నే. అక్కడ నువ్వు చేసిన నాట్యం ఇక్కడ చేయగలవా?”

మేక కరాళుడు కేసి చూసింది కానీ ఏమీ శబ్దం చేయకుండా ఊరుకుంది. కరాళుడు మరోసారి మేకకేసి పరికించి చూసాడు. తాను చూసినదానిలో తప్పేం లేదు. అక్కడ స్వర్గంలో చూసిన మేకా ఇక్కడ ఉజ్జయినీ వీధులో మేకా నిశ్చయంగా ఒకటే. మరోసారీ మరోసారీ మేకని కొమ్ముల్తో సహా పట్టుకుని నాట్యం చేయమని నిర్భంధించాడు. అదే మౌనం, మేక మేకలాగే ఉంది గానీ నాట్యం లేదు, గీట్యం లేదు.

కోపం వచ్చిన కరాళుడు చివరికి అక్కడే ఒక్క దుడ్డుకర్ర తీసి ఏమీ సమాధానం ఇవ్వని మేక మొహం దుడ్డుకర్రతో బద్దలు కొట్టి రక్తం ఓడుతున్న ఆ జంతువుని అక్కడే వదిలేసి ఇంటికి చేరాడు. ఆ రోజు రాత్రి మాటల్లో తాను చేసిన పని చెప్పాడు కళావతితో - తాను స్వర్గంలో చూసిన మేక ఉజ్జయిని నగరం వీధుల్లో కనబడటం, దాన్ని, స్వర్గంలో చేసిన నాట్యం చేయమంటే అది చేయనప్పుడు దాని మొహానికి తాను దుడ్డుకర్రతో చేసిన బడితపూజా అన్నీ కలిపి.

కళావతి అదిరిపడి అంది, “నువ్వు చేసినపని ఎంత దారుణమైనదో తెలిసినట్టులేదు. ఆ మేక మరో చిల్లర దేవత. అది కూడా మిగతా నా లాంటి దేవతలతో పాటు భూమ్మీదకి వస్తూపోతూ ఉంటుంది. మనిద్దరికీ ఏదో అశుభం రాసిపెట్టి ఉంది కాబోలు లేకపోతే నువ్వా మేకని చావబాదడం దేనికీ? అది ఈ రోజు ఇంద్రుడికి జరిగినది చెప్పిందంటే మనకి మరో శాపం ఇస్తాడు. అయినా అసలు నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళడం నాదే తప్పు. మీ మగవాళ్ళకి బుద్ధీ జ్జానం ఉండవు. ఛీ, ఛీ.” చెప్పాల్సిన మాట చెప్పేసి అటు తిరిగి పడుకుంది కళావతి.

కోపం వచ్చిన కళావతిని బతిమాలే ఉద్దేశ్యంలో కళావతిని దగ్గిరకి లాక్కుంటూ చెప్పాడు ఠింఠాకరాళుడు, “అక్కడికక్కడ కోపం వచ్చి ఆ మేకని కొట్టడం తప్పే కానీ, మహాకాలుడు నన్ను చూసుకుంటానని చెప్పాక ఇంకా దేనికి విచారం? మరెప్పుడూ అలా చెయ్యనులే, క్షమించు,”.

“క్షమించు అని చులాగ్గా అనేస్తున్నావు కానీ రేపు ఏమౌతుందో తెలుసా? ఇంద్రుడికి ఎలాగో ఒకలాగ తెలుస్తుంది ఇదంతా. వెంఠనే నాకు రెండో శాపం ఇచ్చి తీరుతాడు. ఆ శాపం ఎటువంటిదో ఏమిటో?” దాదాపు ఏడుస్తూ అంది కళావతి.

“శాపం అంటూ ఇస్తే, అది ఇచ్చాక తప్పు ఒప్పుకుని కాళ్ళమీద పడితే అది పోవడానికి ఏదో ఒక దారి దొరకదా, అయినా మహాకాలుడున్నాడుగా, ఎందుకీ వ్యధ?”

“అవున్లే శాపం అనుభవించేది నువ్వు కాదు కదా, కబుర్లు చెప్పడం తేలికే,” ఎత్తిపొడిచింది కళావతి.  దానితో కరాళుడి నోరు మూసుకోక తప్పలేదు.

***

మర్నాడు కళావతి ఇంద్రలోకానికి వెళ్ళేసరికే ఇంద్రుడి దగ్గిర్నుంచి పిలుపు సిద్ధంగా ఉంది. కాళ్ళు వణుకుతుండగా వెళ్ళి నిలబడింది సభలో. అక్కడే ఉన్న మేకనీ, రక్తం ఓడుతున్న దాని మొహాన్నీ చూపించి గద్దిస్తున్నట్టూ అడిగేడు ఇంద్రుడు, “ఎవరు చేసిన పని ఇది?”

“ఏమైందండి? కాస్త వివరాలు చెప్తారా?”

“బుద్ధిలేనిదానా, ఏమైందని అడుగుతున్నావా? నువ్వు మొగుణ్ణి కొప్పులో పువ్వులాగా దాచి స్వర్గంలోకి తీసుకొస్తే నాకు తెలియదనుకున్నావా? ఈ మేక ఇక్కడ నాట్యం చేసినట్టూ భూమ్మీద చేయాలని నీ మొగుడు అడిగాడుట. అలా చేయనప్పుడు ఈ మేక దేవతాస్వరూపం అని తెలిసీ మొహం బద్దలుకొట్టాడు. భూమ్మీద జీవితం బాగుంటుందని నువ్వు చెప్పావు మొదట్లో. దాని ప్రకారం శాపం ఇచ్చి అక్కడే బతకమంటే ఇప్పుడు నువ్వు చేసిన నిర్వాకం ఇది. ఈ దేవత వచ్చి ఇలా నీ మొగుడు మొహం బద్దలు కొట్టాడని చెప్పేసరికి జరిగినదంతా నేను దివ్యదృష్టితో చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు?”

“మా ఆయన – చిత్త చాంచల్యం అణుచుకోలేని మానవుడు, చేసిన పనికి నేనెలా బాధ్యురాలినౌతాను?” అమాయకంగా చెప్తూ ఏదో నటించబోయింది కళావతి.

“బుద్ధి ఉండే అంటున్నావా ఆ మాట? నువ్వు అసలు ఆ మొగుణ్ణి ఇక్కడకి తీసుకురావడమే తప్పు. నీ భాధ్యత ఏమీ లేదంటున్నావా? ఈ పనికి నువ్వు నాగపురంలో రాజు నృశింహదేవుడు ప్రస్తుతం కట్టించే ఆలయం గోడమీద శిలాప్రతిమై పడి ఉండు!” మరోసారి శపించాడు ఇంద్రుడు.

అక్కడే సభలో ఉన్న కళావతి తల్లి, కళావతీ శాపం పోయేలాగ దారి చూపించమని వణుకుతున్న శరీరాలతో కాళ్ళమీద పడి ఏడుస్తుంటే, చెప్పాడు ఇంద్రుడు, “ఆ ఆలయం మొత్తం పునాదులతో సహా నేలమట్టం అయిననాడు నీకు శాప విమోచనం. కానీ ఆ శాప విమోచనం అయ్యాక మొదటి శాపం ప్రకారం మళ్ళీ మానవ జీవితం సాగించాలి. అప్పటికి ఠింఠాకరాళుడు బతికి ఉంటాడా, పోతాడా, ఉంటే జరాభారంతో నీ మెడకి గుదిబండలా తయారౌతాడా అనేది నువ్వే చూసుకో. బుద్ధి తెచ్చుకుని ఇటువంటి పనులెప్పుడూ మరోసారి చేయకు.”

“ఎలాగా శాపం అనుభవించక తప్పదు కనక నేను ఓ సారి మా ఆయనకి కనిపించి ఈ శాపం సంగతి చెప్పి నాగపురం వెళ్ళేందుకు సమ్మతించండి. లేకపోతే నేను కనబడక ఆయన మతిపోయినవాడై చావుకి సిద్ధమైతే ఆ ఆత్మహత్యా పాపం నాకు చుట్టుకుంటుంది.”

“సరే వెళ్ళు.”

భూమ్మీదకి వచ్చిన కళావతి ఠింఠాకరాళుడికి తన వంటి మీద నగలన్నీ నిలువుదోపిడీ ఇచ్చి కరాళుడు చేసిన వెధవ పని మూలాన తనకి తగిలిన శాపం ఏకరువు పెట్టి నాగపురానికి సాగిపోయింది అక్కడ ఆలయంలో గోడమీద శిలాప్రతిమలా గడపడానికి. ఠింఠాకరాళుడికి మరో మాట మాట్లాడే అవకాశమే రాలేదు.

***

కళావతి వెళ్ళిపోయాక బావురుమంటున్న ఇంట్లో కరాళుడికి ఏమి చేయడానికీ పాలుపోలేదు. ఎంతకీ తెగని ఏడుపు తప్ప మరోటేమీ మిగల్లేదు కరాళుడికి. ఏ గదిలోకి వెళ్ళినా కళావతి అక్కడున్నట్టూ అనిపించడం, ఆవిడ అడుగుల చప్పుడు వినిపించడం జరుగుతూనే ఉన్నాయి. కంచం ముందు తిండి లేదని కాదు కానీ ముద్ద దిగడం లేదు, ఒకప్పుడు కళావతితో పాటూ రోజూ సంతోషంగా ఇద్దరూ కల్సి భోజనం చేయడం గుర్తు వస్తూనే ఉంది. ఇంకపోతే పడకగదిలోకి వెళ్ళడానికే భయం. కళావతి లేని ఇల్లు శ్మశానంలాగా ఉంది. అసలు తనని స్వర్గానికి తీసుకెళ్ళమని కళావతిని అడిగినందుకూ, అక్కడ మేకని చూసినందుకూ, వెనక్కి వచ్చాక ఉజ్జయినీ వీధుల్లో ఆ మేకని తనముందు నాట్యం చేయమన్నందుకూ, దాన్ని తర్వాత కొట్టినందుకూ పశ్చాత్తాపం చెందుతూ అలా ఎడతెరిపిలేకుండా ఠింఠాకరాళుడి ఏడుపు దాదాపు వారం రోజులు సాగింది. అప్పటికి తననెప్పుడూ దగ్గిరుండి రక్షిస్తానని చెప్పిన మహాకాలుడు మనసులో మెదిలాడు.

మర్నాడు రాత్రి మహాకాలుడి గుడిలో ఆయన కాళ్లమీదపడ్డప్పుడు మహాకాలుడిచ్చిన సలహా – ఇంత జరిగాక అయినదానికి ఏడిస్తే ప్రయోజనం లేదు. ఏదో విధంగా కరాళుడు నాగపురం వెళ్ళి అక్కడి ఆలయం పునాదులతో కూలగొట్టే ఉపాయం ఆలోచించాలి. అయితే ఆ గుడిని కరాళుడు కానీ కూలగొట్టడానికి ప్రయత్నిస్తే రాజు నృశింహదేవుడు చంపి పాతర వేయిస్తాడు. ఆ ఆలయం కట్టి పది రోజులు కూడా కాలేదు. మరో దారి ఆలోచించాలి. ఇదంతా చెప్పాక మహాకాలుడు చివర్న అన్నాడు కరాళుడితో, “నీ ఆలోచనలూ, తెలివీ చూపించే సమయం ఆసన్నమైంది. నీ జీవితం సుఖంగా జరగడానికి నేను నీకు అన్నీ అమర్చి పెట్టాను మొదట్లో కానీ వీటినన్నింటినీ నువ్వు చేతులారా పోగొట్టుకున్నావు కనక ఇప్పుడు నీ చేతనైంది చేసి కళావతిని మళ్ళీ సంపాదించుకో.”

ఠింఠాకరాళుడు ఏడుపుతో సాధించేది ఏమీ లేదు కనక రెండు రోజులు దీర్ఘంగా ఆలోచించాడు ఏం చేయాలో. తాను ఉజ్జయినీ నగరంలో ఏడుస్తూ కూర్చుంటే కళావతి అలాగే శిలా ప్రతిమలా పడి ఉంటుంది. ఈ కొత్తగా కట్టిన ఆలయం కూల్చడం అనేది డబ్బుతో అయ్యే పని కాదు కనక మరొక దారి ఆలోచించాలి. ఆ గుడి చుట్టూ ఉన్న ప్రజలకి గుడి వల్ల అనర్ధం జరుగుతోంది అని చెప్పి వాళ్లచేతే గుడి పడగొట్టించడం ఓ పద్ధతి. కానీ రాజు నృశింహుడు ఆ ప్రజలని నమ్ముతాడా? అదీగాక ఆ ప్రజలే రాజుని గుడి కట్టించమని అడిగి ఉండొచ్చు. ఇప్పుడు తాను గుడి వల్ల అనర్ధం అంటే ముందు తనని తన్నడానికి బయల్దేరరూ? తల నెప్పెట్టేదాకా ఆలోచించిన కరాళుడికి ఓ ఊహ తట్టింది. దాన్ని అమల్లో పెట్టడానికి కళావతి ఇచ్చిన నగలూ, డబ్బూ దస్కం పట్టుకుని నాగపురం బయల్దేరాడు.

***

నాగపురం చేరిన కరాళుడు తనకు కళావతి ఇచ్చిన డబ్బుని, నగలని ఐదు భాగాలు చేసి ఒక్కో దిక్కున ఒక్కొక్కచోటా నాలుగు భాగాలనీ, అయిదో భాగాన్ని కొత్తగా కట్టిన గుడి ప్రాంగణంలో ఎవరికీ తెలియని చోట పాతిపెట్టాడు. ఆ తర్వాత నాలుగురోజులకి ఆ గుడికి దగ్గిరలోనే నది పక్కన ఓ గుడిసె కట్టుకుని సాధువుగా అవతరించాడు – ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు ఈ సాధువు. కృష్ణాజినాంబరం కట్టుకుని ఏవో మంత్రాలు ఉఛ్ఛరించడం తప్ప ఎవరినీ పలకరించడు. రోజుకి మూడుసార్లు నదిలో స్నానం చేయడం, రోజులో చాలాకాలం మౌనవ్రతంలోనూ, ధ్యానంలోనూ గడపడమే. జనం సాధువు దర్శనం కోసం రావడం మొదలైంది. మొదట్లో ఇద్దరు ముగ్గురుగా వచ్చిన జనం తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. అయినా మౌన సాధువు ఎవరితోనూ మాట్లాడలేదు.

ఈ విషయం నెలా నెలన్నరలో మెల్లిగా రాజుగారికి జేరింది. ఆయన సాధువుకి పట్టుబట్టలూ, భోజనం, పల్లకీ పంపి తన సభకి ఆహ్వానించాడు. సాధువు తన గుడిసె తప్ప మరో చోటుకి ఎక్కడకీ వెళ్లడుట అందువల్ల రాజుకి ఆశాభంగమైంది. మరోసారీ మరోసారీ పిల్చినా రాకపోయేసరికి రాజు నృశింహదేవుడే బయల్దేరి సాధువుని చూడ్డానికి నది దగ్గిర ఉన్న గుడిసె కి వచ్చాడు. రాజు వచ్చాక మాట్లాడకపోతే బాగుండదన్నట్టూ రెండు మూడు మాటలు అన్నాక రాజు ఏవో ధర్మసందేహాలు అడిగాడు. రాజు అడిగాడు సాధువు మితభాషిగా ఉండడానికీ కారణం.

సాధువు ఏదో సమాధానం చెప్పబోతూంటే ఈ లోపులే దూరంగా ఒక నక్క ఊళవేయడం వినిపించింది. దాన్ని చాలా శ్రద్ధగా విన్న సాధువు “అహా, ఆహా” అంటూ బిగ్గరగా నవ్వాడు అందరికీ వినిపించేలాగా.

అప్పటికే బాగా మితభాషి అని పేరు తెచ్చుకున్న సాధువు ఇలా నవ్వేసరికి రాజుగారికి మరింత కుతూహలం వచ్చి అడిగాడు, “ఏమిటలా నవ్వుతున్నారు నక్క కూత విన్నాక?”

“నాకు పశుపక్ష్యాదులు మాట్లాడేవన్నీ అర్ధం అవుతాయి కనక నక్క అరుపు విని నవ్వొచ్చింది. ఆ నక్క చెప్పేదేమిటంటే ఈ నగరంలో తూర్పు దిక్కున ఫలానా చోట కొంత బంగారం పాతిపెట్టి ఉందిట. నాలాంటి సాధువుకి బంగారం తుఛ్ఛమైనది. కానీ నువ్వు రాజువి కనక ఆ ధనం నీకు ఉపయోగపడొచ్చు, వెళ్ళి ఆ బంగారం తవ్వి తెచ్చుకో,” సాధువు సమాధానం చెప్పాడు.

సాధువు చెప్పినచోట బంగారం దొరకడంతో ఆయనమీద బాగా నమ్మకం పెరిగిన రాజు ఇప్పుడు ప్రతీవారం రావడం మొదలుపెట్టాడు సాధువుని చూడ్డానికి. రెండోవారంలో ఓ పక్షి అరుపు విన్నట్టూ, మూడోవారంలో ఓ కుక్క అరుపు విన్నట్టూ, నాలుగో వారంలో కప్ప బెకబెకలాడడం విన్నట్టూ నటించి సాధువు నాలుగు దిక్కుల్లో పాతిపెట్టి ఉన్న కళావతి నగలూ డబ్బూ దస్కం నాగపురం రాజు నృసింహదేవుడికి దక్కేలాగా చేసాడు. అయిదో వారంలో రాజు సాధువుని చూడబోయేసరికి సాధువు రాజు కొత్తగా కట్టించిన గుడిలో కళావతి శిల్పంగా మారిన స్థంభం దగ్గిర ఉన్నాడు ఏదో నిశితంగా పరికిస్తున్నట్టూ.

సాధువుగా అవతారం ఎత్తిన ఠింఠాకరాళుణ్ణి చూడగానే శిలా ప్రతిమగా మారిన కళావతి గుర్తించింది కానీ తాను ఇంద్రుడి శాపంతో ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్ల కరాళుడికి కలిగిన వైరాగ్యం, సాధువుగా మారడం అన్నీ గ్రహించి కళ్లలో నీరు కార్చింది. రాజు సాధువుని చూడ్డానికి వచ్చేసరికి ఆయనకి కనిపించిన దృశ్యంలో సాధువు గుడి స్థంభం మీద శిలా ప్రతిమ కేసి నిశితంగా చూస్తూంటే శిలా ప్రతిమ కన్నీరు కారుస్తోంది. ఏనాడూ ఇటువంటి వింత చూడని రాజు కంగారు పడి అడిగాడు దీని సంగతి.

సాధువు చాలా దుఃఖంలో ఉన్నట్టూ చెప్పాడు, “ఈ విషయం ఇక్కడ బహిరంగంగా మాట్లాడరాదు. ఇప్పటివరకూ చాలాసార్లు నువ్వు నన్ను నీ భవనానికి ఆహ్వానించావు కానీ నేను రాలేదు. ఇప్పుడు అక్కడకే పోదాం అక్కడ మిగతా విషయాలు రహస్యంగా చెప్తాను నీకు.”

మరో మాట లేకుండా పల్లకీలో రాజభవనానికి చేరారు ఇద్దరూ.

రహస్యమందిరంలో జేరాక రాజుకి చెప్పాడు సాధువు, “ఇన్నాళ్ళూ నువ్వు నన్ను చూడ్డానికి వస్తున్నావు కనక నీ క్షేమం కోసం, నీ అభివృద్ధికి పశుపక్ష్యాదులు నాకు నిఘూఢంగా చూపించిన నిధులు ఇస్తూ వచ్చాను. నీ క్షేమం కోరి ఈ రోజు నువ్వు కొత్తగా కట్టించిన ఆలయంలో ఏముందా, వాస్తు అదీ సరిపోయిందా అని చూడబోయాను. కానీ అక్కడ శిలాప్రతిమ ఏడుస్తూ చెప్పినది వినేసరికి మతిపోయింది. ఆవిడ చెప్పినది మన ఇద్దరికీ తప్ప మరొకరికి తెలియకూడదు. అందుకే నిన్ను రహస్య మందిరానికి రమ్మన్నాను.”

కంగారు ఎక్కువైన నృసింహదేవుడు అడిగాడు, “ఏమీ దాచకుండా చెప్పండి, ఆ శిలాప్రతిమ కన్నీరు వల్ల నాకు గానీ, రాజ కుటుంబానికి కానీ, నా రాజ్యానికి కానీ ఏమైనా అనర్ధం రాబోతోందా?”

“అనర్ధం అంటూ చిన్నగా అంటున్నావా? ఆ గుడిలో ఫలానా చోట మరింత విలువైన బంగారం దాచిపెట్టబడి ఉంది. అయితే ఆ ఆలయానికి వాస్తు ఎవరు పెట్టారో కానీ ఓ వారం రోజుల్లో నీకు దారుణమైన చావు రాబోతోంది. తనకి ఏ రాజు అయితే గుడి కట్టించాడో ఆ రాజు వారం రోజుల్లో చచ్చిపోతాడని తెలిసి ఆ శిలాప్రతిమ కన్నీరు కారుస్తోంది.”

రాజుకి ఇంతకుముందు నాలుగు సార్లు నిధి నిక్షేపాల గురించి సాధువు చెప్పిన ప్రతీ విషయం అక్షరాలా జరిగింది. ఈ నమ్మకం వల్లా, మరణ భయంతో, కంగారుతోనూ రాజు సాధువు కాళ్ళమీద పడి అడిగాడు, “మరి దీనికి విరుగుడు లేదా? ఏదో విధంగా మీరే దీన్నితప్పించలేరా? మీకు పశుపక్ష్యాదుల భాష కూడా తెలుసు. వాస్తు కావాలిస్తే మారుద్దాం. ఏదో ఒకటి చేయండి దయచేసి.”

కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం చేసాక సాధువు చెప్పాడు, “తప్పుడు వాస్తు, చెడ్డ ప్రదేశంలో కట్టిన ఆ ఆలయమే నీ చావుని చూపిస్తోంది. దీనికి ఒకటే విరుగుడు. కానీ నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు.”

“చావు తప్పుతుందంటే ఏం చేయడానికైనా సిద్ధమే. ఏమీ అనుమానపడకుండా చెప్పండి ఏం చేయాలో?”

“ఆ గుడిలో ఉన్న పూజావిగ్రహాన్ని బయటకి తీసి, ఆ గుడిని పునాదులతో సహా కూల్చేసి మరోచోట బాగా వాస్తు, మంచి ప్రదేశం కల్సి ఉన్నచోట మరో ఆలయం కట్టి మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రాణప్రతిష్టచేయడం తప్ప మరోమార్గం లేదు. ఆలయం తవ్వినప్పుడు దొరికే బంగారం కొత్త ఆలయం కట్టడానికి ఉపయోగించవచ్చు; ఆలయం కట్టడానికి సమయం తీసుకోవచ్చు కానీ వారంరోజుల లోపుల ఇప్పుడున్న ఆలయం పునాదులతో సహా కూల్చకపోతే నీ ప్రాణం పోవడం తధ్యం,” ఇంకేమీ చెప్పడానికి లేదన్నట్టూ సూచిస్తూ సాధువు లేచాడు వెళ్లడానికి.

***

సాధువు వారం రోజులలో అన్నాడు కానీ సరిగ్గా మూడు రోజులకి నృశింహదేవుడు కొత్తగా కట్టిన ఆలయాన్ని పునాదులతో సహా తవ్వించి ధ్వంసం చేయించడం సాధువు తన గుడిసెలోంచి గమనించాడు. గుడి ధ్వంసం అయ్యాక కళావతి శాపం పోయి ఆవిడ ఎప్పుడైతే ఉజ్జయిని నగరం వెళ్ళే దారి పట్టుకుందని గమనించాడో అప్పుడే సాధువు తన వేషం విప్పేసి కళావతిని అనుసరించి ఉజ్జయిని చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి కళావతిని తన కౌగిట్లో చేర్చి ఠింఠాకరాళుడు తాను ఆడిన నాటకం అంతా వివరించి చెప్పాడు - ఆవిడ తనకి ఇచ్చిన నగలని నగరంలో నాలుగు దిక్కులా ఎలా పాతిపెట్టినదీ, ఎలా రాజుకి నమ్మకం కలిగించి ఆలయం కూలగొట్టించినదీ అన్నీ కలిపి. ఇద్దరూ కలిసి మహాకాలుడికో నమస్కారం పెట్టుకుని నవ్వుకుంటూ సంతోషంగా రాత్రి గడిపాక మర్నాడు పొద్దున్నే కళావతి అలవాటు ప్రకారం ఇంద్రలోకానికి బయల్దేరింది.

స్వర్గంలో కళావతిని చూడగానే ఇంద్రుడికి కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. సభ అయిపోయాక పిలిచి అడిగాడు, “నీకు అత్యంత దారుణమైన శాపం ఇచ్చాను చాలాకాలం గుడిలో స్థంభంమీద శిలా ప్రతిమగా ఉండమని. ఆ శాపం ఎలా పోయింది? శాపం ఇచ్చి ఆరునెలలు కూడా తిరిగినట్టులేదే?”

కళావతి మొత్తం కధ - ఠింఠాకరాళుడికి మహాకాలుడి మీద ఉన్న భక్తీ, ఆయనని నమ్ముకుని కరాళుడు నాగపురం రాజు మీద ఉపయోగించిన యుక్తులూ, రాజుని ఎలా మోసం చేసి, ఆయన కొత్తగా కట్టించిన ఆలయం ఆయన చేత్తోనే ఎలా పునాదులతో సహా కూలగొట్టించాడో అన్నీ - పూసగుచ్చినట్టు చెప్పేసింది.

కధ అంతా విన్న ఇంద్రుడు విరగబడి నవ్వాడు ఠింఠాకరాళుడు చేసిన పనికి. అక్కడే ఉన్న బృహస్పతి కేసి చూసేసరికి ఆయన అన్నాడు, “ఈ జూదర్లు ఉన్నారు చూసావా, వాళ్ళంతే. మోసం చేయడంలో అతి నేర్పరులు. వాళ్లని ఎవరూ ఏమీ చేయలేరు.”

“ఆయన నాతో పెళ్ళికి ముందే జూదం మానేసి ఇప్పుడు మహాకాలుడి మీదే ఆధారపడ్డారండి అన్నింటికీ,” కళావతి అంది నవ్వుతూ.

మహాకాలుడి పేరు విన్నాక కొంచెం జంకిన ఇంద్రుడు చెప్పాడు, “ఎంతైనా మీ ఆయన యుక్తి బాగానే పారింది. ఇప్పట్నుండి మీ ఇద్దరికీ సంసారం బాగా సంతోషంగా ఉండేలా వరం ఇస్తున్నాను. దేనికీ లోటుండదు. ఆ జీవితం అయిపోగానే మళ్ళీ ఇంద్రలోకానికి వస్తావు. శుభం.”

సభలోంచి వెళ్లడానికి లేస్తూ కళావతి అంది ఇంద్రుడితో, “నేను మొదట్లో చెప్పాను కదా, భూమ్మీద ఉండే సంతోషం వేరు, అక్కడుండే సుఖాలకీ, మనకి ఇక్కడ ఉండే సుఖాలకీ వ్యత్యాసం ఉంది.”

“సరే ఆ సంగతి మరో సారి చూద్దాం,” కళావతి చెప్పినదానితో తాను ఒప్పుకున్నాడా లేదా అనే విషయం పూర్తిగా చెప్పకుండా ఇంద్రుడు మాట దాట వేసాడు.

***సమాప్తం***

Posted in September 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *