తెలుగులో రామాయణం అద్భుతంగా చిన్న పద్యాలతో రాసినది మొల్ల అనే కవయిత్రి. ఈవిడ కడప జిల్లా గోపవరం దగ్గిర జీవించినట్టు చెప్తారు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పినట్టు తెలుస్తోంది. శివ భక్తుడైన పోతనకి రాముడు కనిపించి చెప్పాక మహాభాగవతం రాసినట్టుగానే ఈవిడ కూడా శైవ భక్తురాలైనా రామాయణం రాసింది. మొల్ల రామాయణం లో రాముడు అతి శూర్యుడు, అరివీర భయంకరుడు. రాముడి కూడా ఉండేవారందరికీ ‘రాముడంటే ఏ పనైనా చేయగలడు, ధర్మం తప్పడు’ అనే భావం చిన్నప్పటినుండీ ఉంది. అందులోనూ రాముణ్ణి విడవకుండా ఉన్న లక్ష్మణుడికి రాముడంటే అదో రకమైన ఆరాధన.
విశ్వామిత్రుడి యాగం అయ్యాక రామలక్ష్మణులనిద్దర్నీ జనకుడి దగ్గిరకి తీసుకెళ్ళాడు ముని. ముందు మారీచ సుబాహులని కొట్టడం, జనకుడి దగ్గిరకి వెళ్ళే దారిలో అహల్య మానవరూపు దాల్చడం అవీ చూసాడు లక్ష్మణుడు. వీళ్ళిద్దరూ మామూలు మానవులు అనుకున్నా అప్పటికే రాముడు అంటే అతి భక్తి ఉన్నవాడు కనక ఇవన్నీ చూసాక లక్ష్మణుడికి మరింత విశదంగా తెల్సింది కాబోలు అన్న అంటే ఎవరో. విశ్వామిత్రుడు జనకుడి సభలో రాజకుమారులిద్దర్నీ పరిచయం చేసాక శివ ధనుస్సు ఎత్తగలడా అని అడిగితే విశ్వామిత్రుడు నోరు విప్పేలోపులే లక్ష్మణుడు చెప్పేసాట్ట ఆ ధనస్సు ఎలా ఉంటుందో చూడకుండానే – ‘మా అన్న ఎత్తి తీరుతాడు, రప్పించండి ఆ ధనస్సుని’ అని. ఆ ధనస్సు ఎటువంటిది? అనేకమంది బండిమీద తోసుకుంటూ తీసుకురావాల్సి వచ్చింది, అంత బరువైనది. అప్పటికే అనేకమంది ప్రయత్నం చేసి చేతులు ఎత్తేసి విరమించినది. విశ్వామిత్రుడు తనకి అస్త్రాస్త్ర సంపద ఇచ్చిన గురువు కనక ఆయన అనుమతి తీసుకుని రాముడు ఆ విల్లు ఎత్తడానికి ముందుకి అడుగు వేయబోతూంటే లక్ష్మణుడు ఏమంటున్నాడో చెప్పేదే ఈ నెల మొల్ల రాసిన పద్యం.
చ. కదలకుమీ ధరాతలమ, కాశ్యపిఁ బట్టు ఫణీంద్ర భూ విషా
స్పదులను బట్టు కూర్పమ రసాతల భోగి ఢులీ కులీశులన్
వదలక పట్టు ఘృష్టి ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచుఁ బట్టుఁడీ కరులు భూవరుఁ డీశుని చాప మెక్కిడున్. [మొల్ల రామాయణం 79]
ఎవరితో చెప్తున్నాడు ఇదంతా లక్ష్మణుడు? భూమినీ, దాన్ని మోస్తున్న అన్ని దిగ్గజాలతో. రాముడు విల్లు ఎత్తబోతున్నాడు. భూదేవీ కదలకు (కదలకుమీ ధరాతలమ), ఫణీంద్రా (ఆది శేషుడు) కాశ్యపి (భూమిని) ని పట్టుకో విడవకుండా. కూర్పమా (తాబేలు) ఈ ఆదిశేషుడు (విషాస్పదులన్) కదలకుండా పట్టుకో. రసాతలం లో ఉండి భూమిని కాపాడే భోగి, ఢులీ, కులీశులారా వదలక పట్టుకోండి. ఇంత చెప్పాక ఆదివరాహం (ఘృష్టి), కూర్మం (కచ్ఛప) వర్గాలన్నీ ఈ భూమి కదలకుండా (పొదువుచు పట్టుడీ) కూడా పట్టుకోండి అంటున్నాడు. ఎందుకయ్యా అలా పట్టుకోవడం అంటే శివధనస్సుని (ఈశుని చాపము) ఎక్కుపెట్టేది రాముడు (భూవరుడు). అప్పుడు ప్రళయాంతకమైన శబ్దం వచ్చి తీరుతుంది. భూమి బెదిరిపోకుండా ఉండడానికి, భూకంపం వచ్చి జనం పోకుండా ఉండడానికీ అందరూ కలిసి సిద్ధంగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడుట లక్ష్మణుడు. ఎంతటి నమ్మకమో చూసారా లక్ష్మణుడికి రాముడంటే?
ఈ పద్యంలో కొంత గూడార్ధం ఉందిట. ముఖే ముఖే సరస్వతీ కనక ఒక పద్యం లో అర్ధం మరొకరు ఇంకో విధంగా చెప్పడం చూస్తాం. మొదటగా చెప్పేది ‘కదలకుమీ ధరాతలమ’ అంటే సీతాదేవి భూమిలోంచి పుట్టింది కనక ‘అమ్మా రాముడు శివధనస్సు ఎత్తి నిన్ను గెలుస్తాడు, కాబోయే భర్త వీరుడు కనక, కళ్ళు అప్పగించి కదలకుండా ఆయన్నే చూడు సుమా’ అంటున్నాడుట. “కాశ్యపిఁ బట్టు ఫణీంద్ర” అనడంలో కూడా లక్ష్మణుడు శేషుడి అవతారం కనక సీత నువు దాటవద్దు అన్నా ముందు ముందు లక్ష్మణ రేఖ దాటుతుంది అందువల్ల అలా దాటకుండా చూడవయ్యా అని లక్ష్మణుడితో చెప్తోందిట మొల్ల. చివరిలో “పట్టుడీ కరులు” అనేది కూడా మరో విధంగా అర్ధం చేసుకోవచ్చు. కరులు అంటే ఏనుగులు అనీ, కోతులు అనే అర్ధం ఉంది. ముందు ముందు రావణ యుద్ధానికి కోతుల మూకతో కలుస్తాడు అని పరోక్షంగా చెపుతోందిట మొల్ల.
ఈ పద్యం చదువుతూంటే రాముడు ఎంత శూరుడో తెలుస్తుంది. వీరరసంతో తాసిన ఈ పద్యంలో రాముడు తప్పక శివధనస్సుని ఎత్తి సీతని వివాహం చేసుకుంటాడు, ఆ తర్వాత లక్ష్మణుడు (ఆదిశేషుడి అవతారం ఫణీంద్రుడు) ఆయన్ని కాపాడాలి అరణ్యవాసంలో అని చెప్పకనే చెపుతోంది మొల్ల అంటారు. శివుని విల్లు విరవడం అంటే శివుడి భక్తుడైన రావణుడి గర్వం అణిచివేయడం అనేది జరుగుతుందిట. అందువల్ల రాబోయే రామ రావణ యుద్ధంలో భూమి కదిలిపోయేంతటి అస్త్ర ప్రయోగాలు జరుగుతాయి. అందువల్లే మీరందరూ జాగ్రత్తగా పట్టుకోండి అంటోంది మొల్ల.