"నానా తిప్పలు"
ఆమధ్య తెలిసిన ఆయనకు ఫోన్ చేసి మీ ప్రయాణం ఎలా జరిగింది? క్షేమంగా ఇంటికి చేరారా అని ప్రశ్నిస్తే - "శాన్ ఫ్రాన్సిస్కో నుండి బయలుదేరాల్సిన విమానం ఆలస్యమయింది, ఆ విమానం దిగేసరికి, జె ఎఫ్ కె ఎయిర్పోర్ట్ నుండి నేను ఇండియాకు వెళ్ళే విమానం ఎగిరిపోయింది. దాంతో ఎయిర్పోర్ట్ లోనే ఆ రాత్రంతా జాగారం చేసి నానా తిప్పలు పడి, మరుసటి రోజు ఇంకో విమానం పట్టుకొని హైదరాబాదు చేరాను" అన్నాడు. ఆయనపై కాసింత సానుభూతి చూపించి, ఆనక ఈ నెల రచ్చబండ చర్చకు ముడి సరుకు గూర్చి ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది "నానా తిప్పలు" జాతీయం. ఏదైనా ఒక పని పూర్తి చేయడానికి లేదా జీవనం సాగించడానికి అనేక కష్టాలు, అష్టకష్టాలు ఎదుర్కొంటూ విపరీతంగా శ్రమించడాన్ని "నానా తిప్పలు పడటం" అంటారు కదా! ఈ నెల రచ్చబండ చర్చకు నానా తిప్పలు పడి "నానా తిప్పలు" జాతీయం పై చర్చించకుండా, సరదాగా చేద్దాం!
"మందు బాబు తిప్పలు":
మూడు ఏండ్ల క్రితం టీవీ 9 చానల్ లో ఒక వీడియో వచ్చింది - "బండి ఎక్కేందుకు నానా తిప్పలు పడ్డ మందుబాబు" అనే హెడ్డింగ్ తో. పూటుగా తాగేసిన మందుబాబును ఇంటికి చేర్చేందుకు ఒకతను మోటర్ సైకిలు పై తీసుకెళ్ళడానికి వస్తాడు. వెనుక ఎక్కికూర్చోవడానికి పలు విఫలయత్నాల తరువాత - మందు బాబు ఇట్లా కాదని లుంగీ బిగించి కట్టి "నానా తిప్పలు" పడి చివరకి బండి ఎక్కుతాడు - కానీ ఆ వెంటనే కింద పడిపోతాడు - అతగాడు పడటమే కాదు, మోటర్ సైకిలు చోదకుడితో పాటూ మొత్తం ఇద్దరూ, బండి కూడ కింద పడుతుంది. సదరు వీడియో చూసిన తరువాత నాకైతే మాత్రం అనిపించింది, ‘ఏది ఏమైనా మందు బాబు మత్తు దిగేంతవరకు వీళ్ళు ఈరోజు ఇంటికి చేరరు కాక చేరరు’ అని.
పోలీసుల తిప్పలు:
ఈనాడు పత్రికలో డిసెంబరు 6, 2025 న వచ్చిన ఒక కథనం ప్రకారం... చార్మినార్ సమీపంలో ఉన్న జియాగూడకు చెందిన విజయ్ అనే వంట మాస్టర్ కుమారుడు యశ్ (11 ఏండ్లు). యశ్ చిన్నతనంలోనే అతని తల్లి మరణించగా, తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. పినతల్లి బాగానే చూసుకుంటున్నా, తల్లి లేని లోటుతో యశ్ మానసిక వేదనకు గురయ్యాడు. హరియాణాలో ఉంటున్న తన నానమ్మ దగ్గరకు వెళ్తానని తండ్రితో గొడవపడేవాడు. నవంబర్ 24న, యశ్ తన స్నేహితుడైన సాయి (9 ఏండ్లు) తో కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రూ. 1200 నగదు, బట్టలు, స్కూల్ బ్యాగ్ తీసుకుని పారిపోయాడు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి రాత్రి నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ ఎక్కి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అతడి స్నేహితుడు సాయి భయపడి తిరిగి ఇంటికి వెళ్తాననడంతో, యశ్ అతడిని వదిలి ఒంటరిగా హరియాణా చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళాక తాపీగా తండ్రికి వీడియో కాల్ చేసి తాను నానమ్మ దగ్గరకు చేరినట్లు చెప్పాడు. మరోవైపు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఏడుస్తూ ఒంటరిగా ఉన్న సాయి ను ఆర్పీఎఫ్ పోలీసు సిబ్బంది గుర్తించి, అతడిని కాపాడి శిశుసదన్ లో ఉంచారు. వీరి కోసం అప్పటికే దుర్భిణీ వేసి గాలిస్తున్న చార్మినార్ పోలీసులు ఈ విషయం తెలిసి ఉరుకుల పరుగుల మీద ఢిల్లీకి వెళ్లి ఆ రెండు ప్రాంతాలలో ఉన్న ఇద్దరు పిల్లలను క్షేమంగా తిరిగి నగరానికి తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పి, మొత్తం ఎస్కేప్ ఎపిసోడ్ కు శుభం కార్డు వేసారట. నానా తిప్పలు పడి నానమ్మను చేరుకున్న చిన్న మనవడిని, ఢిల్లీ రైల్వే స్టేషన్లో దొరికిన అతడి స్నేహితుడిని "నానా తిప్పలు" పడి చార్మినార్ పోలీసులు ఎట్టకేలకు వారి వారి ఇండ్లకు చేర్చారని తెలుస్తుంది.
వరద తిప్పలు:
ఎన్ టీవీ లో సెప్టెంబర్ 3, 2024 న వచ్చిన ఒక కథనం ప్రకారం... విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక ప్రజలు తీవ్రమైన కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారట. వీరు ద్వంద్వ సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తుంది. కొండ కింద చూస్తే వరదనీరు రోడ్లను ముంచెత్తుతోంది, పైన చూస్తే వర్షాల మూలంగా కొండరాళ్లు జారి కింద వారి ఇంటిపై పడుతున్నాయి. వరదనీరు చుట్టుముట్టడంతో ప్రజలకు కనీసం తాగడానికి ఒక చుక్క మంచి నీరు కూడా దొరకడం లేదు. సీతార ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క బావి నుండి నీటిని తీసుకోవడానికి ప్రజలు బిందెలు, బకెట్లతో క్యూ కట్టారట. నీటి కోసం దూర ప్రాంతాల్లో నుండి వరదలో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఏతా వాతా వీరి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా తయారు అయ్యింది. అయినా "నానా తిప్పలు" పడి ఈ ప్రజలు ఒక వైపు కొండరాళ్లను తప్పించుకుంటూ, మరో వైపు వరద నీటిలో ప్రయాణించి ఏదో బావిలో బిందె మంచి నీరు తెచ్చుకున్నారని తెలుస్తుంది. అధికారులు మాత్రం కంట్రోల్ రూమ్ నుండి తాపీగా సమీక్ష నిర్వహించి కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై నీరు తగ్గేంతవరకు ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారట - అందరూ ఇంట్లో ఉంటే మరి ప్రజలకు తాగు నీరు ఎవరు అందిస్తారో?
ధృవీకరణ పత్రం తిప్పలు:
ఆమధ్య తెలిసిన ఒక పెద్దాయన ఆస్తి తాలూకు "ఈ సీ" ధృవీకరణ పత్రం కోసం ఏజెంట్ వద్దకు వెళ్ళాడని తెలిసింది. పని అయ్యిందా అని అడిగాను. "ఇంతకు మునుపు ఆస్తి పత్రాలు సదరు రిజిస్ట్రార్ ఆఫీసులోనే ఉండేవి. ఆ స్టాఫ్ కు పది, పరకో ఇచ్చి "ఈ సీ" పత్రం తెచ్చుకునేవాడిని. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో పెట్టారు, దాంతో మొత్తం సమాచారం రిజిస్ట్రార్ ఆఫీసు సర్వర్లలో ఉంచబడినదట. ఆ సర్వర్లు నిన్న ఎందుకో మొరాయించాయి" అన్నాడు. ఎండలో బయట నిల్చొని నానా తిప్పలు పడి ఆ పెద్దాయన మొత్తానికి "ఈ సీ" పత్రం పట్టుకొచ్చాడు అని అర్ధం అయ్యింది. కానీ నాకు ఒకటి అర్ధం కాలేదు - ఆన్లైన్లో పెట్టిన మన ఆస్తి తాలూకు "ఈ సీ" ధృవీకరణ పత్రానికి డబ్బు ఎందుకు చెల్లించాలి? ఆస్తి పన్ను కడుతున్నాము కదా? సరే పోనీ సర్వర్ మెయింటెనెన్స్ కు కట్టాములే అనుకుంటే, మరి సర్వర్లు ఎప్పుడు పనిచేస్తాయో, ఎప్పుడు పడకేస్తాయో తెలియదు. మరి "ఈ సీ" ధృవీకరణ పత్రం కోసం ప్రజలు నేరుగా కడుతున్న ఫీజు డబ్బు ఎటు వెళుతుంది చెప్మా అని మాత్రం అడక్కండి - అదో భేతాళ ప్రశ్న!
ఇలా చెప్పుకుంటూ పోతే "నానా తిప్పలు" జాతీయం పలు సందర్భాల్లో మనం వాడతాం. సందర్భం, కథనం బట్టి ఈ జాతీయం ప్రయోగం మన మోము పై చిన్న చిరునవ్వును చిందిస్తుంది. ఈ జాతీయానికి మరికొన్ని ఉదాహరణలు మనం నిత్య జీవితంలో... "నానా తిప్పలు పడితే మొత్తానికి ఒక వంద రూపాయలు అప్పు దొరికింది", "వాడు నన్ను నానా తిప్పలు పెట్టాడు", "నానా తిప్పలు పడి సరైన పత్రాలు లేకుండా ఏవో అడ్డ దారుల్లో అమెరికా చేరుకున్న వారు ఇప్పుడు కాళ్లకు, చేతులకు సంకెళ్లతో అమెరికా మిలటరీ విమానాలలో తిరిగి టపాలో వస్తున్నారు", వగైరా వగైరా... "నానా తిప్పలు" పడి ఇంత సమాచారం సేకరించి చర్చించిన ఘనమైన మన తెలుగు జాతీయం పై చర్చ చప్పగా ముగిస్తే బాగుండదు, అందుకని "ట్రంప్ ప్రేమాయణం" ప్రస్తావన తో ఈ నెల చర్చకు శుభం కార్డు వేద్దాం.
ట్రంప్ ప్రేమాయణం - పెళ్ళి తిప్పలు:
నవంబరు 7, 2024 — ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన భార్య మెలనియాల మధ్య సాగిన ప్రేమాయణం, వారి వివాహ బంధానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనం. 1998లో ఒక న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో 52 ఏళ్ల ట్రంప్ మొదటిసారిగా 28 ఏళ్ల స్లోవేనియా గ్లామర్ మోడల్ మెలనియాను చూసి 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' ఫీలయ్యారట. వారిద్దరి మధ్య 24 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ ట్రంప్ అస్సలు పట్టించుకోలేదు. అప్పటికే ఆయన ఒక పక్క వ్యాపారవేత్తగా, టీవీ స్టార్ గా ఉంటూనే తన వ్యక్తిగత వైవాహిక జీవితంలో గొడవలను ఎదుర్కొంటున్నారు. స్నేహితుల ద్వారా మెలనియా వివరాలు కూపీ లాగిన ట్రంప్, ఎట్టకేలకు ఆమెకు తనను పరిచయం చేసుకుని ఫోన్ నెంబర్ అడిగారట. అయితే, ఆ సమయంలో ట్రంప్ పక్కన 'సెలినా మిడెల్ ఫార్ట్' అనే మరో అమ్మాయి ఉండటంతో అరికాలి మంట నెత్తికెక్కిన మెలనియా తన ఫోన్ నెంబర్ ఇవ్వడానికి నిరాకరించింది. అయినా సరే ట్రంప్ పట్టువదలకుండా విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక 25 ఏళ్ల కుర్రాడిలా మెలనియా ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రంప్ ప్రత్యక్షమవుతూ, ఆమెను ఇంప్రెస్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించి చివరికి ఆమె ప్రేమను పొందారు. వారి ప్రేమలో గొడవలు, బుజ్జగింపులు, బ్రేకప్ లు, ప్యాచ్ అప్ లు అన్నీ జరిగాయట. చివరికి 2005లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2006లో వారికి ఒక కుమారుడు జన్మించాడు. మొత్తం మీద ఆమె ఫోన్ నెంబర్ కోసం ట్రంప్ మొదటిసారి "నానా తిప్పలు", పెళ్లి కోసం రెండోసారి "నానా తిప్పలు" పడ్డాడని, మొత్తంగా తన ప్రేమ విజయం సాధించారని తెలుస్తోంది.
ముగింపు:
చర్చ మొదలుపెట్టినప్పుడే చెప్పానుగదా, పాఠకులు నానా తిప్పలు పడి ఈ చర్చలో పాల్గొనాల్సిన పనిలేదు, సరదాగా చదవొచ్చు. ఈ చర్చ ఆసాంతం చదివిన పాఠకులు వారి జీవితంలో "నానా తిప్పలు" పడిన లేదా కనీసం వినిన సందర్భం కనీసం ఒకటైనా గుర్తుకు తెచ్చుకుంటారు అని నాకెందుకో బలంగా అనిపిస్తుంది. అటువంటి సందర్భం మీకు ఒక్కటైనా గుర్తుకువచ్చినా ఈ నెల చర్చ సఫలం అయినట్లే. చివరగా, పాఠకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ నెల రచ్చబండ అంశం "నానా తిప్పలు" పై మీ అభిప్రాయాలను తప్పకుండా క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, వచ్చే నెల మరో ఆసక్తికరమైన చర్చతో మళ్లీ కలుద్దాం మిత్రులారా!
నమస్కారములతో,
--మీ వెంకట్ నాగం.
నానా తిప్పలు నానా విధములుగా బహు బాగుగా చెప్పారు వెంకట గారు