Menu Close
డా.సి.వసుంధర
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

చెన్నయ అష్ట భాషా ప్రవీణుడు. ఇతని రచనలు: నారసింహ పురాణం – అహోబిల నరసింహునికి అంకితం. బాలభారతం - వచన కావ్యం. సౌరభ చరిత్రం, జక్కుల చరిత్ర - లలిత నవరసభరితం గా చెప్పాడు.

ఇతడు సాళువ నరసింహరాయల నుండి అగ్రహారాలు దానం పుచ్చుకొన్నాడు. ఇతనికి, నీతిలో వాచస్పతి వంటివాడు, విద్యలో చతురాననుడు అయినటువంటి కుమారుడున్నాడు. అతని పేరు నరసన్న.

చెన్నయమంత్రి రాసిన కావ్యాలేవీ దొరకలేదు. అయితే ఆయన వివరాలు మరోచోట లభించాయి. అది, హరిభాట్టు రచించిన నరసింహ పురాణాన్ని ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఆ గ్రంథాన్ని ప్రోలుగంటి వంశం వాడైన రంగన మంత్రికి అంకితం ఇవ్వడం వల్ల చెన్నయ మంత్రి వివరాలు తెలిశాయి. కావ్యాలు మాత్రం చెన్నయ మంత్రివి దొరకలేదు.

కులపతి వర్ణనలో చెన్నయ మంత్రి గూర్చి చెప్పిన పద్యాలను ఆరుద్ర అందించారు. ఈ చెన్నయ మంత్రి వ్రాసిన జక్కన కథగా వ్రాసిన సౌరభ చరిత్ర విష్ణుపురాణం లోనిది.

కథ: సౌరభుడు ఒక ముని. అతను నీటిలో నిలుచుని తపస్సు చేసుకొంటున్నప్పుడు నీటిలో మత్స్యరాజు అనుభవించే రాగాభోగాలు చూచి తాను కూడా సంసారం చెయ్యాలని, మంధాతను పిల్లనిమ్మని కోరగా అతను కాదన్నా చివరకు సౌరభుడు మాంధాత కుమార్తెలనందరినీ పెండ్లాడి సుఖంగా ఉంటాడు. ఈ కథను చెన్నమంత్రి నవరస భరితంగా యక్షగానంగా రాసాడు అని ఆరుద్ర తెల్పారు.

ఈ కథనే నూరు సంవత్సరాల తర్వాత వెన్నెలకంటి సూరన తన విష్ణుపురాణంలో రాశాడన్నారు ఆరుద్ర. ఈ సౌభరి శృంగారంలో శ్రీకృష్ణుని మించి పోయాడని తన వర్ణనలో సూరన వ్రాశాడని ఆరుద్ర సెలవిచ్చారు.

ఉదా: 50 మంది రాజకుమార్తెలకు సౌభరి 50 రాజప్రాసాదాలు కట్టించినట్లు సూరన వర్ణించాడు.

ప్రోలుగంటి చెన్నయ మంత్రి ఒక్కడేగాక ఇంకా చాలామంది యక్షగానాలు వినోదానికే గాక, సాంఘీక ప్రయోజనాలకు కూడా ప్రయోగించేవారని తెలుస్తున్నది అన్నారు ఆరుద్ర. ఈ విషయం మాచుపల్లి కైఫీయతుల వల్ల తెలుస్తున్నదని తెల్పి ఆ విషయం నాలుగు పేజీలలో ఆరుద్ర వివరించారు. అది క్లుప్తంగా ఇక్కడ తెలియజేస్తాను.

మాచుపల్లె గ్రామం సిద్ధవటం సీమలో ఉంది. సిద్ధవటానికి వాయవ్య భాగంలో రెండు పరుగుల దూరంలో ఇది ఉంది. పూర్వం నెల్లూరి చోళులలో ఒకడైన నల్లసిద్ధిరాజు వద్ద సరదారుడైన సంబెట కొండ్రాజు వంశీకుడు సంబెట వెంకట్రాజు ఈ ప్రాంతాలకు వచ్చి కొన్ని గామాలకు ప్రభుత్వం చేస్తూ ఉండేవాడు. ఈ వెంకటరాజుకే గురవరాజు అనే కుమారుడు పుట్టి, పరమ దుర్మార్గునిగా ప్రసిద్ధుడయ్యాడు. ఈ ప్రాంతంలోనే కాశీ రామేశ్వరాలకు పోయే మార్గాలు వెడతాయి. సంబెటవారు తమకు చుట్టుపట్ల వున్న సీమలలో కావలి సుంకం వసూలు చేస్తూ తాము అనుభవిస్తూ ఉండేవారు. సంబెట వారి వర్తమానాలు విని దేశమేలే విజయనగర సింహాసనాధీశ్వరులు చాలాసార్లు వాళ్ళను అదుపులో తేవాలని ప్రయత్నించారు. సంబెట గురవరాజు దుర్మార్గాలు మరీ మితిమీరితే ఆ సంగతులను సాంఘిక ప్రయోజనం గల నాట్య మేళం వారు లోకానికి చాటిన వైనాన్ని మాచుపల్లి కైఫీయత్తు ఈ విధంగా విశదం చేస్తూంది అని ఆరుద్ర వివరించారు.

గురవరాజు యొక్క దుర్మార్గాలు మితిమీరాయి. ఈ విషయాలన్నీ మాచుపల్లి కైఫీయత్తు లో భద్రపరచబడ్డాయి. ఈ విషయమంతా ఆరుద్ర యధాతధంగా చాలా వివరంగా వివరించాడు. మనం ఇక్కడ ఆ విషయాలను క్లుప్తంగా ప్రస్తావించుకొందాం.

రాయలసీమ ప్రభువు బుక్కరాయల కుమారుడు శ్రీ దేవరాయ మహారాజు కాలంలో గురవరాజు ఉండేవాడు. ఇతడు దుర్మార్గుడు. ప్రజలకు కఠిన శిక్ష వేసేవాడు. ప్రజల వద్ద ద్రవ్య ఆకర్షణ చేసేవాడు. డబ్బు ఇవ్వకపోతే ఆడవారిని తీసుకెళ్ళి వారి స్తనాలకు చిరతలు పట్టించేవాడు.

ఈ దుర్మార్గాన్ని గమనించిన కొందరు వేషాలు వేసి కీర్తనలు పాడే బ్రాహ్మణులు విజయనగర రాజు వద్దకు పోయి తాము అనుభవించిన కష్టాలకు కారకుడైన గురవరాజు వేషం ధరించి తమ కష్టాలను యక్షగాన రూపంలో ప్రదర్శించారు. అది చూచి రాజు గురవరాజును శిక్షించడం – ఇది ముక్తసరిగా కైఫీయత్తులలో ఉండే కథ.

దీనిని గూర్చి చెబుతూ ఆరుద్ర, ‘కూచిపూడి భాగవతుల ప్రశస్తి మన సాంఘీక చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ మాచుపల్లి కైఫీయత్తులలో కనపడుతుంది’ అన్నారు. తర్వాత కూచిపూడి అనగానే అందరికీ కృష్ణా జిల్లా దివిసీమలో ఉన్న కూచిపూడే జ్ఞాపకం వస్తుందని కాని ఆంధ్రలో మరికొన్ని వూర్లు కూచిపూడి పేరుతో ఉన్నాయని తెల్పి నెల్లూరు, గుంటూరు, తెనాలి దగ్గర కూడా కూచిపూడి పేరుతో ఊర్లు ఉన్నాయని తెల్పారు.

ఇకపోతే ఈనాడు కూచిపూడి (కృష్ణా జిల్లా) లో నాట్య విద్య ప్రఖ్యాతి గాంచినా దీని మొదలు ఆనాడు విజయనగర రాజు వద్ద వేషం కట్టి ప్రదర్శించిన యక్షగానం వారిదేనని ఆరుద్ర తెల్పారు. ఇప్పటికీ దివిసీమ, కూచిపూడి వారు తమ చరిత్రను చెప్పుకొనేటపుడు మాచుపల్లి కైఫీయత్తులను హెచ్చుగా ప్రస్తావిస్తూ ఉంటారు. వినుకొండ బెల్లంకొండ దగ్గర ఉన్న కూచిపూడినే వారు ప్రస్తుతిస్తారు.

అయితే కొండవీటి సీమలో పూర్వం ఒక గ్రామంగా కూచిపూడి అనేది లేదుగాని కసుబా నగరంగా కేంద్రంగా ఉండేది. కొండవీటి సీమలలోని సముతుల గురించి ఒక చాటు పద్యం కూడా ప్రచారంలో ఉండేది అని ఆరుద్ర చెబుతూ ఆ చాటుపద్యాన్ని అందించారు.

కొండవీటిసీమ కోర్కులు దీర్పంగ
దండి సముతులు పండ్రెండు రెండు
ఎలమితో జెప్పేను ఏదేది యంటివా
పాలడ్గు పులిపర్రు ప్రత్తిపాడు
సంతన రావూరు సరసను నూతక్కి
పొంతను చేబ్రోలు పొన్నునూరు
మంగళగిరి యను మరి మంచి మునుగోడు
రంగైన నాదెండ్ల రాయపూడి
దాచినధనంబు వంటిది కూచిపూడి
పంటలధికంబు గుంటూరు ప్రజలకెల్ల
పాడి బానలు గవిగుండు తాడికొడ
పరమ మల్లేశ శివలింగ! పార్వతీశ (చాటుపద్యమణిమంజరి 1 -760 పద్య)

దాచిన ధనం వంటి ఈ కొండవీటి సీమ కూచిపూడికి ప్రత్యేకంగా ఒక కైఫీయత్తు కూడా ఉంది. దీనిని మెకంజీ గుమాస్తాలు కాగితాల కెక్కింపజేశారు. మెకంజీ మాతృకల నుండి బ్రౌను పుట్టించిన స్థానిక చరిత్రల సంపుటాలలో ఈ కూచిపూడి కైఫీయత్తు కనబడుతుంది. కైఫీయత్తు మౌజే జంపని సంతు కూచిపూడి సర్కారు ముత్తుజానగరు తాలూకే చింతపల్లి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మంనె సుల్తాను వారి ఏలుబడిలో దీనిని గ్రంథస్తం చేశారు. గుంటూరు జిల్లాను పూర్వం ముత్తుజానగరు సర్కారు అనేవారు. ఇప్పుడు ఎల్లలు మారి వేరే జిల్లాలు ఏర్పడ్డాయి. అయినా ప్రాచీన చరిత్రగల కూచిపూడి గ్రామం తెనాలి తాలూకాలోనిదే అని ఆరుద్ర వివరించారు.

దీనికి సంబంధించిన ఒక శాసనం గూర్చి కూడా ఆరుద్ర తెల్పారు. కూచిపూడి కైఫీయత్తు పసుపర్తి వారు, వేదాంతం వారు కూచిపూడి కసుబా గడి లో ఉన్నట్లు తెలుస్తున్నదని అన్నారని ఆరుద్ర చెప్పారు.

చివరగా, సాంఘీక ప్రయోజనాన్ని సాధించిన ఈ యక్షగానాన్ని ఎవరు రచించారో తెలియదు కానీ, తెలుగులో ఇప్పటికి ప్రోలుగంటి చెన్నయ మంత్రి రాసిన సౌభరి చరిత్ర ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. అందువల్ల ప్రోలుగంటి చెన్నయ మంత్రి ప్రథమ యక్షగాన రచయిత అని ఆరుద్ర తెల్పారు.

Posted in September 2026, సమీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *