Menu Close
అక్షర నీరాజనం - గాన మురళీకృష్ణ!!
-- సముద్రాల హరికృష్ణ --

స నుండి స వరకు!
(శ్రీ బాలమురళీకృష్ణ గారి జయంతి, జులై 6 పురస్కరించుకొని!)

Balamuralikrishna

ఆముఖం:

జగాన తుల యెవ్వరు నీ షోడశ కళా కౌముదులకు
ఓ గానాంబర పూర్ణ శశి, కంఠాలంక్రృత క్రృష్ఢ వంశీ!!

అభినుతి!!

'స'
సాధనాబల మెంతటిదొ నీదు ముందటి పుట్టువుల,
హ్రృద్గతమయ్యె పాట!
అద్భుతముగ, బాలునిగ సభల నీ గాన లహరీ
సునాద వినోదము/
అందముగ, అశీతి వరకు సాగిన గీత సుగంగా
మనోహర వేగము/
హ్రృదంతర సీమల తాకిన గాన వరేణ్య, శ్రీ వాణీ
పుంభావ పుణ్యాక్రృతీ!

'రి'
రీతులెన్నొ,నూత్న రూపుల తీవె సాగు ప్రస్తారమ్ముల/
పూత రాగ రాగిణీ లాస్య సు దర్శన సమర్ధమ్ములు/
శ్రోత్రేంద్రియ పర్వ కందుక క్రీడలౌ స్వర యోగమ్ములు/
ఏ తపః ఫలములో చేతి కందె,సంగీతానంతభోగీ!

'గ'
గభీర 'ఆరభి'ని మహాదేవ సుతుకు ప్రణమిల్లి/
శోభిలు శివపద సేవ, 'షణ్ముఖప్రియ' న్చాల వేడి /
ఆ భానుకోటి తేజ 'కళ్యాణి' రూపము కారతులెత్తి/
'అభేరి' యనంతాస్య సుముఖి వైతి వందరు మెచ్చన్!!

'మ'
మత్తోల్లస,"కుంతలవరాళి' న్న్రృత్య న్మంజులము చేసి
ఉత్సహి,'కదనకుతూహల' మహార్భటుల చాటించి
ఆతత వైదుషి, అల్లనల, ఉరవళ్ళ మేళవించి
ఆ తిల్లానా లల్లితివి లయ విద్యా చతుర బ్రహ్మవై!!

'ప'
పారెడి తరంగము లష్టపదులు,భక్తి రంజనులు/
నోరార జనుల్పాడుకొన లీలగ నాలపించితివి/
ఆ రామదాసుల ఆర్తులు,యెంకి పదముల సౌరులు/
ఆ రమ్య లలిత గీతుల మ్రృదువులన్ని, మన్నికగన్!

'ద'
దక్షత, మేల్మి సంయోజనముల "వర్ణ" శిల్పముల తీర్చి/
వీకమున రాగ వర్థకుడ వైతి, ఔడవముల మీరి/
ఆకట్టుకొను,త్రిస్వర "సర్వశ్రీ","మహతీ"స్రృజనల!
ఆ కమలాసను రాణి వీటి గడప నలంకరించన్!

'ని'
నీ సరి లేరెవరని,మరి మరి పదము లెన్నైన
నే సరిగ చెప్పగ నేర్తునె,సామ నిగమ సారమె
నీ స్వాంతమున పాదుకొని వెల్గ,జనని పదాబ్జుల
యుష్మదమోఘ హ్రృద్భ్రుంగము, సుధలాని మైమరువన్!

'స' (తార షడ్జం)
సాకల్య రాగ శోభ వీవు, మేళరాగ కృతి కర్తవు,
అక్షర వాచస్పతివి,సమాహ్లాదక గానమూర్తివి
పెక్కులగు తాళవాద్య వేత్తవు,వాగ్గేయకర నేత
వాక్రృతి దాల్చిన సరస్వతీ మహదాశీ సుస్స్వరూపా!!

ముక్తాయింపు:

ఆ దేవి శ్రీవాణి దేమొ సర్వ శ్వేతత్వము,సతత వీణానందము!
నీదేమొ,సురమ్య వర్ణత్వమౌ సప్త స్వర నిరత గానాద్భుతము!
ఇదె గొనుమ వందన మాంధ్ర యశోవిస్తార కర, అగస్త్యరూపా!
సుధా మాధుర్య గళ,చుళుకీక్రృత సంగీతార్ణవ! మురళీక్రృష్ణా!!

***మంగళమ్***

Posted in July 2023, సాహిత్యం

1 Comment

  1. Dhupati. కృష్ణకుమారి.

    శ్రీ బాల మురళీ గారికి మీరు చేసిన స్వర నివాళి యందలి పద గుంభనం అధ్భుతం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!