శ్రీనాథుడు -జీవితం -కావ్య విశేషాలు
తనకు రాచకార్యంలో తోడ్పడిన శ్రీనాథుణ్ణి పెదకోమటి వేమారెడ్డి సన్మానించి తన విద్యాధికారిగా నియమించాడు. శ్రీనాథుడు విద్యాధికారిగా పద్దెనిమిది సంవత్సరాలు రాజభోగాలు అనుభవిస్తూ విద్యాగోష్టులు నిర్వహించడం, శాసనాలు వ్రాయడం, పండితులను పరీక్షించడం మొదలైన విద్యా సంబంధమైన విషయాలను దిగ్విజయంగా నిర్వహించాడు. శ్రీనాథుడు సంస్కృతాంధ్ర భాషలలో శాసనాలు రచించాడు. అవి దొరికాయి. ఇందులో తామ్ర, శిలా శాసనాలు ఉన్నాయి. వాటిని ఆరుద్ర ఒక పట్టికగా ఇచ్చారు. (స.ఆం.సా. పేజీ 693). అవి 12 శాసనాలు. ఇన్ని చేసినా శ్రీనాథుడు ఏమీ మిగుల్చుకోలేదు. ఆశించలేదు.
ఫిరంగి పుర శాసనంలో పెదకోమటి వేముడు కాశీ యాత్రకు వెళ్ళిన విషయం ఉంది.
శ్రీశైలే స్థిరమూలతా ...అన్న ఈ శాసనం శ్రీనాథుడే వ్రాశాడు. పెదకోమటి వేమారెడ్డి తీర్థలత (కాశీయాత్ర) శ్రీశైలంలో పుట్టి కుమారాచలం లో వృద్ధిచెంది, పంచారామాలలో, సింహాచలంలో పందిరల్లి, శ్రీకూర్మంలో, పురుషోత్తమం లోనూ పుష్పించి, కాశీ విశ్వనాథుని ఎదుట నిత్యనైవేద్య మైనదని ఆ శ్లోకార్థం.
తన ప్రభువుతో గూడా శ్రీనాథుడు కాశీకెళ్ళి ఉంటాడని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెప్పినట్లు ఆరుద్ర మాట. కాశీకెళ్ళే దారిలో శ్రీనాథుని చాటువులు, పద్యాలు ఉన్నాయన్నారు ఆరుద్ర. అవి సింహాచలంలో ఎక్కువగా ఉన్నాయన్నారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి వచ్చిన వివిధ జాతుల వారి సౌందర్యాదులను వర్ణించిన చాటువులు చాలా ఉన్నాయి.
“వీడిన కొప్పున జాజివిరులొప్ప గారాల చిట్టి కుంకుమ చుక్క బొట్టు చెదర...” అంటూ శృంగార శ్రీనాథుడు ఆశువుగా పద్యాలు చెప్పాడు.
అనేక అల్ల కల్లోలాలు రెడ్డి రాజ్యంలో ఏర్పడ్డాయి. శ్రీనాథుడు విద్యాధికారిగా కొనసాగినా ఇవి తప్పలేదు. చివరకు పద్మనాయక వంశీయుడైన లింగమనీడు కొండవీటిని జయించి, పెదకోమటి వేమారెడ్డి ని ఓడించి అతనికి బొమ్మ కట్టాడు. అంటే అతని బొమ్మను(పెదకోమటి వేమారెడ్డి బొమ్మను)తన ఎడమకాలి గండపెండేరానికి కట్టుకొన్నాడు.
తర్వాత పెదకోమటి వేమారెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు సమర్ధుడు కాక పోవడం వల్ల కొండవీటి రాజ్యం అంతరించింది. శ్రీనాథుని కి ఆశ్రయమిచ్చిన కొండవీడు బీడు వారింది. అందుకే శ్రీనాథుడు పలనాడు వెళ్లి ఉంటాడు అన్నారు ఆరుద్ర.
పల్నాడు వెనుకబడిన ప్రాంతం. రాజ ప్రాసాదాలలో విలాసాలలో మునిగి తేలిన శ్రీనాథుడు ఒక పురోహితుని ఇంట బస చేసి ఆ పరిసరాలను చూసి ఎవగించుకోని,
“దోసెడు కొంపలో బసుల ద్రొక్కిడి మంచము దూడ రేణమున్....అంటూ ఆశువుగా పద్యాలు చెప్పిన కవిసార్వభౌముడు శ్రీనాథుడు.
పల్నాడు వీరగాథలు విన్నాడు. బ్రహ్మ నాయుడు, బాల చంద్రుడు, కల్లు ప్రతిష్ట మొదలైనవి పల్లె వాళ్ళు ద్విపదలో పాడటం విని ఉత్తేజితుడై పల్నాటి వీర చరిత్రకు శ్రీకారం చుట్టాడు. పల్నాడులో అన్నానికి, వసతికి వాచిపోయి ఎన్నో ఆశు పద్యాలు చెప్పాడు.
“సిరి గల వానికి చెల్లును...పరమేశా గంగ విడుము పార్వతి చాలున్” అంటూ అక్కడి నీటి కొరతపై ఆశు పద్యం చెప్పారు.
అంగడి లేదు, వరి అన్నం లేదు, శుభ్రత లేదు అంటూ వాపోయిన శ్రీనాథుడు అక్కడి నుండి గోదావరి తీరం చేరుకొన్నాడు.
పల్నాటి వీర చరిత్ర ద్విపద కావ్యం
శ్రీనాథుడు దాక్షారామం వెళుతున్నప్పుడు సాంపరాయని తెలుగురాయలను కలుసుకోవడం జరిగింది. శ్రీకాకుళం లోని ఆంద్ర మహా విష్ణువుకు ‘తెలుగు రాయలు’ అనే పేరు ఉంది. ఇది మనుషులకే కాక ఊళ్లకు కూడా ఉందని తెలుగురాయని పాళెం మొదలైన గ్రామాలను ఆరుద్ర గుర్తు చేశారు.
శ్రీనాథుడు గుర్రం మీద వెళుతున్న సాంపరాయని కలుసుకొని కస్తూరి కావాలని కోరాడట. ఈ కస్తూరిని శ్రీనాథుడు కోరడం వార వనితల కోసం కాదు. దాక్షారామ భీమేశ్వరునికి దేవతాదుల సేవకోసమేనని కొందరి మాట.
శ్రీనాథుడు రెండపూడి అన్న మంత్రిని కలుసుకొన్నాడు. శ్రీనాథునికి మళ్ళీ గత ప్రాభవం గల్గించాలని అన్న మంత్రి తలంచి,
“వినిపించినాడవు వేమా భూపాలు కఖిల పురాణ....” అంటూ మొదలుపెట్టి “నాకు కృతి సేయుమొక ప్రబంధంబు...” అని అడుగగా శ్రీనాథుడు భీమఖండం అనే కృతి రాసి అన్న మంత్రికి అంకితమిచ్చాడు. ఇది స్కాంధ పురాణంలో లేదు. శ్రీనాథుని స్వకపోల కల్పితం. కాని కొందరు దీనిని అంగీకరించడం లేదని ఆరుద్ర కొంత వివరణ ఇచ్చారు.
భీమఖండం లో కథ కంటే వర్ణనలే ఎక్కువ. ఆరాశ్వాసల గ్రంథమిది. హర విలాసంలో లేనివి కొన్ని భీమఖండం లో ఉన్నాయి.
ద్రాక్షారామ శివుణ్ణి శ్రీనాథుడు శృంగార పురుషునిగా మార్చేశాడు. శివుడు పద్నాలుగు మహాయుగాల ముసలివాడైనా దాక్షారామ మహిమ శ్రీనాథుని గంటంలో యువకుడైనాడు శివుడు.
శ్రీనాథుని ఈ శృంగార వర్ణనలు, సానులపై పద్యాలు మొదలైన వాటివల్ల రాజమహేంద్రవరం లోని కవులు శ్రీనాథుని రచనలు నిరసించారు. దానికి శ్రీనాథుడు వారిని కుకవులు అంటూ భీమఖండం లో ఇలా వారి మాటలను నిరాకరించాడు.
“బోధ మల్పంబు గర్వ మభ్యున్నతంబు శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము....” అంటూ తన భాషా వైభవాన్ని గూర్చి “ నా కవిత్వంబు నిజాము కర్ణాట భాష” అన్నాడు. దీనివల్ల కొంత చర్చ జరిగింది. దీనిని గూర్చి ఆరుద్ర విస్తారంగా చర్చించి ఇలా అన్నారు. ఆరుద్ర మాటల లోని సారాంశం.-
శ్రీనాథుడు పాకనాటి వాడు. పాకనాడును ‘కర్నాడు’ అని కూడా పిలిచేవారు. శాతవాహనుల కాలంలో ఈ ప్రాంతంలో కర్ణిరాజుల ఏలుబడిలో ఉన్న ప్రాంతాలను ‘కర్ణినాడు’ అని అనేవారు.
శ్రీనాథుని కాలంలో కొంత పాకనాడు, కొంత కమ్మనాడు కలిసి కర్నాడు గా చలామణి అయ్యేదని చెప్పొచ్చునని ఆరుద్ర మాట. దీనినే శ్రీనాథుడు కర్ణాటక భాషగా చెప్పి ఉంటాడు అని ఆరుద్ర తేల్చి చెప్పారు.
రాజమహేంద్రవరం లో శ్రీనాథుడు తోటి కవుల నిరసనలను విని భరించలేక ఇలా అనుకొన్నాడు.
నికటమున నుండి శృతి పుట నిష్టూరముగ
నడరి కాకులు బిట్టా పెద్దరిచినట్లు ప్పు
డుడిగి రాయంచ యూరక యుంట వెస్స
సైపరాదేని నెందైన జనులు నొప్పు (భీమ -1-14)
అందుకే శ్రీనాథుడు కాకుల మధ్య ఉండలేక కర్నాట రాజ్యంలో తన ప్రతిభ రాణిస్తుందని విజయనగరానికి బయలుదేరాడు. మధ్యలో వినుకొండ, మోపూరు అనే రెండు గ్రామాలలో కొన్నాళ్ళ పాటు ఉండి విజయనగర రాజు దర్శనానికి కావలిసిన ఏర్పాట్లు చేసుకొన్నాడు. రాజుకు తనను, తన పాండిత్యాన్ని గూర్చి తెలియజెప్పే మిత్రుని కోసం ప్రయత్నించాడు. చివరకు సాధించాడు. ఆ మిత్రుడే వినుకొండ వల్లభరాయుడు. వల్లభరాయుడు ములికినాడు లోని మోపూరు మీద అధికారిగా ఉండేవాడు. ఇది కడపజిల్లా పులివెందుల తాలుకాలో ఉంది. ఇక్కడ జరిగే ఉత్సవాలలో శ్రీనాథుడు వల్లభరాయుని కలుసుకొని ఆయన మీద ఒక పద్యం వ్రాశాడు.