వాన దార నీకు అభిషేకమయ్యా
మట్టి పరిమళం నీకు దూపమయ్యా
రైతు నవ్వే నీకు దీపమయ్యా
మా మది స్మరణే నీకు నైవేద్యమయ్యా
మా పనే నీకు పూజయ్యా
నీ కరుణే మాకు పంటగా లభించు ప్రసాదమయ్యా
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
గ్రహం నీదే
అనుగ్రహం నీదే
ఆగ్రహం నీదే
నిగ్రహం నీదే
అన్ని గ్రహాలను గతితప్పించే గ్రహణం నీదే
అంతా నీదైనపుడు నాదేముంది బూది
చెబితె నవ్వొస్తది కానీ...
ఆ బూది కూడా నీదే...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివ...
అవసరముంటేనే ఆత్మీయతను చూపే
అర్భకులు కొందరయ్యా
అవసరం తీరాక అవతలోరి ఆదరణను ఆవిరి చేసే అధములు కొందరయ్యా
ఏది అవసరమో...ఏది అనవసరమో
నీ ఆటకు తెలియదయ్యా
నీవే మాయ... నీ ఆటే మాయ...
ఆ మాయలో మా బ్రతుకే గజిబిజి లోయ...
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివ...
మా అమ్మ చేసిన పిండిముద్దే నీ లింగాకారమైయ్యా
ఆ లింగంపై పడిన మా అమ్మ చేతి చాయలే విభూతి రేఖలయ్యా
పొయ్యే నీ మూడో కన్ను అతి సున్నిత ఆవేశమయ్యా
రొట్టే నీ ప్రాసాదమయ్యా
నీ ప్రసాదమును తినే నా దేహమే
నీ శివాలయమయ్యా
మాయచేస్తవు పూటకో మాయలో మెరుస్తుంటవయ్యా
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివ...
ఏవేవో రోగాలొస్తాయి
ఏవేవో మందులు మింగుతాము
ఎన్ని మందులు మింగిన మరణం రాకుండా నిన్ను గెలువగలమా
నిజం తెలిసికూడా దేహరక్షణకై
పడే పల్టీలు ఆపగలమా
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివ..
నేను ఏమిలేని విస్తరాకునయ్యా
అందుకే ఎగిరెగిరి పడుతున్నా...
నువ్వు అన్ని ఉన్న విస్తరాకువయ్యా
అణిగి మణిగి ఉంటవు
మనసు చాసి అడుగుతున్నా
నీ జ్ఞాన భిక్షలో ఓ ముద్ద నా పుర్రెలోకి వేయవా...?
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
భళా సదాశివా
నా యెదలో కూర్చుంటవు
ఏదేదో రాయిస్తవు
రాసింది ఏమైతదన్నా బెంగ కలిగిస్తవు
అచ్చువేసేటంత ఆస్తిలేదు
స్వర రాగం కూర్చెటంత సంపదలేదు
రాసింది ఏమైతదన్న చింత ఏమో పోతలేదు
ఏమి చేస్తవో నీ ఇష్టమయ్యా
నిన్నే నమ్ముకున్నా...
నీ భక్తికి నన్నే అమ్ముకున్నా...!
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
మేము చేసిన తప్పులేమిటో...?
ముంచుకొస్తున్న ఈ ముప్పులేమిటో...?
తప్పుకోవడానికి దారిలేనంతలా
దావాలనమై విపత్తులు విస్తరించెనయ్యా
విపత్తును విరుస్తవో...
విర్రవీగిన మనిషి అహమును విరుస్తావో... నీ ఇష్టమయ్యా
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
కడుపు మెతుకులివ్వలేదని నోటిని కుళ్ళుకున్నదయ్యా
నోరు ముద్ద అందివ్వలేదని చేతిని కసురుకున్నదయ్యా
కంచం ఖాళీతో చెయ్యి చిన్నబోయినదయ్యా
అయినా నీకేమీ పట్టదయ్యా...
ఔనులే నువ్వు దక్షిణామూర్తివి దక్షిణ అడిగితే
దక్షిణ దిక్కుకు రమ్మంటవు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివ...
నేల నువ్వయ్యా
నీరు నువ్వయ్యా
నిప్పు నువ్వయ్యా
నింగి నువ్వయ్యా
నింగిచూలి నువ్వయ్యా
అంతా నువ్వైనప్పుడు నేననే అహంకారం ఎవరయ్యా
దానినే మాయ అన్నావా...!
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివ...