Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

మన శరీరం లో జరిగే ప్రతి ప్రక్రియ ఎంతో విచిత్రమైనది. మనిషి మనుగడకు ప్రాణవాయువు ఎంతో ముఖ్యం అని మనందరికీ తెలుసు. మెదడుకు ఒక అరగంట ఆక్సిజన్ అందడం ఆగిపోతే మనిషి కోమాలోకి వెళ్ళిపోతాడు. ఈ మధ్యనే అటువంటి బాధాకరమైన సన్నివేశాన్ని నేను చూడటం జరిగింది. గుండె కొట్టుకోవడం మానితే తిరిగి పనిచేయించవచ్చు కానీ మనిషి కోమాలోకి వెళితే తిరిగి నార్మల్ స్థితికి రావడం అనేది వైద్య ప్రక్రియలతో అంత సులువుగా అయ్యే పని కాదు.

మన శరీరంలోపల దాదాపు 37-39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. మన లోపల ఉన్న రక్తం కానీ ఇతర అవయవాలు అన్నీ నిరంతరం సజీవంగానే పనిచేస్తుంటాయి. అదే రక్తాన్ని, అవయవాలను మన శరీరం నుండి బయటకు తీసుకొస్తే వాటిని శీతల వాతావరణం లో భద్రపరచడం జరుగుతుంది. లేకుంటే రక్తం పాడైపోతుంది. అలాగే మన శరీరంలోని ముఖ్య అవయవాలను వేరే వ్యక్తికి అమర్చడం జరుగుతుంది. అయితే ఆ ట్రాన్స్ ప్లాంటేషన్ అంతా కొద్ది సమయంలోనే జరిగిపోవాలి. లేకుంటే ఆ అవయవాలు పనికిరాకుండా పోతాయి. వీటిని పరిరక్షించే గుణం మన శరీరం లోనే ఉంటుంది. అందుకు ముఖ్య కారణం ప్రాణవాయువు. ఇంకా చెప్పాలంటే వైద్య పరిభాషలో ఒక ప్రత్యేక సిద్ధాంతం ఉంది. అది ఇక్కడ అప్రస్తుతం. చక్కటి ఆరోగ్యానికి అతి ముఖ్యమైన పాత్ర పోషించేది మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలు. మరి అటువంటి అవయవాలను సున్నితంగా కాపాడుకోవడం అనేది మన చేతులలోనే ఉంది. ఎక్కువ మోతాదులో మద్యం, మాంసాహారంతో తీసుకుంటే అది అన్ని అవయవాలకు హాని చేస్తుంది. మరి ఆ విషయంలో నియంత్రణ అనేది మన చేతిలోనే ఉన్నది కదా. అంటే మన ఆరోగ్యం మన చేతిలోనే కదా ఉన్నది. వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులను ముందుగానే గుర్తిస్తే వాటిని నియంత్రించేందుకు నేటి వైద్య విధానంలో ఎన్నో విధాలుగా అవకాశాలు ఉన్నాయి. దేనికైనా మన శరీరంలోని రోగనిరోధక శక్తి సదా చైతన్యంగా ఉండాలి.

ఇప్పుడు మరొక్క అంశం. ‘డబ్బులు సంపాదించడానికే సమయం అంతా సరిపోతుంది. ఇక పనులు ఎక్కడ చేస్తాము. అయినా పనులు చేయడానికి పనిమనుషులు ఉన్నారు కదా!’ నిజమే. అందరం ఆ విషయాన్ని అంగీకరిస్తాం. కానీ పనిమనిషి అనే కాన్సెప్ట్ అన్నీ దేశాలలో లేదు. అలాగే పని మనిషి ఒక్కరోజు రాకపోతే ఇంట్లో అన్నీ కార్యక్రమాలు అస్తవ్యస్తం కాకూడదు. తద్వారా ఇంటి సభ్యుల మధ్యన వచ్చే, విసుకుదల వలన ఎంతో కొంత అశాంతి ఏర్పడుతుంది. దానికి విరుగుడు మన పని మనం చేసుకోవడమే. అప్పుడు భౌతిక వ్యాయామం మరియు ఇల్లు కూడా శుభ్రమై అనారోగ్యానికి అడుగు దూరంగా వెళ్లిపోతాము. గాంధీ మహాత్ముని సూత్రాలను ఆదర్శంగా తీసుకుంటే సరి.

డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేం. మందు బిళ్ళలను మరియు డైటరీ సప్ప్లిమెంట్స్ కొనవచ్చు. ప్రశాంతతను కొనలేము. ఇంకా చెప్పాలంటే నా స్నేహితుడు అన్నట్లు పెద్ద లైబ్రరీ, దాని నిండా ఉన్న పుస్తకాలను కొనవచ్చు కానీ పరిజ్ఞానాన్ని  కొనలేము. మంచి పడకను సిద్ధం చేసుకోగలం కానీ నిద్రను కొనలేము. ఆరోగ్యం, పరిజ్ఞానం, నిద్ర అనే ప్రక్రియలు మనం సాధించుకోవాలి అందుకు మన శరీరం సహకరించి ముఖ్యంగా మన మెదడు చురుకుగా పనిచేయాలి. అందుకు సరైన ప్రశాంతత అవసరం. అది మనసుకు సంబంధించిన  విషయం. మన మనసును వీలైనంత తక్కువ వత్తిడిలో ఉంచితే మనకు మంచి జరుగుతుంది. చివరకు ఏంటంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది.

నిద్ర ప్రక్రియను నియంత్రించేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ (Melatonin) అనే ఒక హార్మోన్. చీకటి పడిన తరువాత మన మెదడుకు సంకేతాలు అంది మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా మనకు నిద్ర పోవాలనే భావన కలుగుతుంది. అయితే వయసు పై బడే కొద్దీ, జీవితంలో ఏర్పడుతున్న బరువు బాధ్యతలు, మానసిక ఆందోళనలు, ఆలోచనలు మనకు సరిగా నిద్రలేకుండా చేస్తాయి. అయితే నేటి కాలంలో సరైన నిద్రకు మనం నోచుకోవడం లేదు. అందుకు బలమైన ముఖ్య కారణం నేటి సెల్ ఫోన్ లు. వాటిని చూస్తున్నప్పుడు వెలువడుతున్న ఉద్గారిత వికిరణాల వలన మన శరీరంలో ఈ హర్మోన్ విడుదల అయ్యే విధానం మారుతుంది. అందుకే రాత్రి సమయంలో వీలైనంత తక్కువగా ఫోన్ వాడటం మంచిది. బహుశా అందుకేనేమో మన పెద్దవాళ్ళు చీకటి పడగానే నిద్రపోయి తెల్లవారుజామున నిద్రలేచే విధానాన్ని అనుసరించే వారు, అదే ఆరోగ్యం అని నమ్మేవారు.

మానవ శరీరం ఒక యంత్రం వంటిది. దానికి అందించే ముడిసరుకు, ఇంధనం యొక్క నాణ్యతను బట్టి ఆ యంత్రం యొక్క సామర్ధ్యం, అది అందించే ఔట్పుట్ ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటే, మనసు ఉల్లాసంగా ఉంటే, తద్వారా లభించే జీవన ప్రమాణం మెరుగుగా ఉంటుంది.

... సశేషం ...

Posted in December 2019, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!